coraption
-
అసమర్థ ఉద్యోగులను పంపేయండి
న్యూఢిల్లీ: ముప్పయ్యేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులందరి సర్వీసు రికార్డులను మదింపు చేయాలని, అసమర్థ, అవినీతి అధికారులకు ముందస్తు రిటైర్మెంటు ఇచ్చి ఇంటికి పంపేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కేంద్ర సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1972 కింద 56 (జె), 56 (ఐ), 48 (1)(బి) నిబంధనల ప్రకారం... ఉద్యోగి పనితీరును పరిశీలించి ప్రజాప్రయోజనాల దృష్ట్యా అతనికి రిటైర్మెంట్ ఇచ్చి పంపే సంపూర్ణ హక్కు సంబంధిత పై అధికారికి ఉంటుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ముందస్తు రిటైర్మెంట్ ‘శిక్ష’కాదని వివరించింది. ఉద్యోగి 50 లేదా 55 ఏళ్లకు చేరుకున్నాక, 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నాక... ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఎప్పుడైనా సదరు ఉద్యోగిని ఇంటికి పంపించవచ్చని పేర్కొంది. ఉద్యోగుల సామర్థ్యాన్ని అంచనా వేసి వారిని సర్వీసులో కొనసాగించడంపై ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ అవుతుంటాయని, ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల విషయంలో మరింత స్పష్టత ఇవ్వడానికి, అమలులో ఏకరూపత తేవడానికి తాజా ఆదేశాలు జారీచేశామని సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. రిటైర్ చేయదలచుకున్న ఉద్యోగికి మూడు నెలల నోటీసు ఇవ్వాలని, అలాకాని పక్షంలో మూడునెలల వేతనం ఇచ్చి పంపాలని తెలిపింది. 50 లేదా 55 ఏళ్లకు చేరుకుంటున్న, 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకోబోతున్న ఉద్యోగులందరి వివరాలతో కూడిన రిజిస్టర్‌ను ప్రతిశాఖలో నిర్వహించాలని, ఏడాదికి నాలుగుసార్లు ఈ జాబితాను మదింపు చేయాలని ఆదేశించింది. డిజిటల్ లాకర్లోకి పెన్షన్ ఆర్డర్ రిటైరయ్యే ఉద్యోగులకు పెన్షన్‌కు సంబంధించిన పత్రాల కోసం నిరీక్షించే బాధ తప్పనుంది. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీవో)ను ఎలక్ట్రానిక్ రూపంలో ఇకపై నేరుగా ఉద్యోగుల డిజిటల్ లాకర్‌కు పంపనున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం వెల్లడించారు. పెన్షన్ ప్రక్రియలో ఇక ఆలస్యానికి తావుండదని, అలాగే పెన్షన్ ఆర్డర్ పత్రాలను పోగొట్టుకునే ప్రమాదం ఉండదని మంత్రి తెలిపారు. పౌరులు తమకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలన్నింటినీ ఎలక్ట్రానిక్ రూపంలో దాచుకోవడానికి డిజిటల్ లాకర్ ఉపకరిస్తుంది. -
కళ్లు బైర్లు కమ్మే అవినీతి, అక్రమాలు
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో చోటుచేసుకున్న అనేక అవినీతి అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగుచూస్తున్నాయి. అమరావతి భూ కుంభకోణం నుంచి కార్మికుల సొమ్మును కాజేసిన పచ్చ నేతల అవినీతి బండారం బయటపడుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. ఇష్టారాజ్యంగా దోచుకున్న సొమ్ము నేడు బహిర్గతమవుతోంది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈఎస్ఐ స్కాంలో మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఎట్టకేలకు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ. 988.77 కోట్ల విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారుగా రూ.150 కోట్లపైన అవినీతి అక్రమాలు జరిగినట్లు ఏసీబీ తేల్చింది. దీంతో ఈఎస్ఐ స్కాం మరోసారి తెరపైకి వచ్చింది. సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) డైరెక్టర్లుగా డాక్టర్ బీ.రవికుమార్, సీ.కే.రమేష్‌కుమార్, డాక్టర్ జీ.విజయ్‌కుమార్ వ్యవహరించారు. వారి ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషథాలు, వైద్య ఉపకరణాలు, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు, ల్యాబ్ కిట్స్, ఫర్నీచర్ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రూ.975.79 కోట్ల రూపాయల మేర కొనుగోలు జరిగాయి. అయితే ఈ ప్రక్రియలో యథేచ్ఛగా నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన డ్రగ్ ప్రొక్యూర్మెంట్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. మరోవైపు ఆ కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఓపెన్ టెండర్లు కూడా పిలవలేదు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. (నకిలీ బిల్లులతో అచ్చెన్నాయుడు స్కాం) ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, డయాగ్నస్టిక్ కేంద్రాలలో చోటు చేసుకున్న అవకతవకలు, అక్రమాలు – ముఖ్యమైన పాయింట్స్: విజిలెన్సు విచారణలో బయటపడ్డ అంశాలు నాన్ రేటు కాంట్రాక్ట్ సంస్థలకు సంబంధించి దాఖలైన కొటేషన్లన్నీ నకిలీవి అని విచారణలో గుర్తించారు. కొటేషన్లు, వాటి కవర్లపై చేతి రాతలన్నీ ఒకేలా ఉన్నాయి. అవి డెరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ (డీఐఎంఎస్) సిబ్బందివిగా తేల్చారు. వాటిని తామే రాసినట్లు డీఐఎంఎస్‌కు చెందిన ఫార్మసిస్ట్ కె.ధనలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ ఇ.రమేష్‌బాబు అంగీకరించారు. ఆ కొటేషన్ల ఆధారంగా ఈఎస్ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషధాలు సర్జికల్ ఐటెమ్స్, ల్యాబ్ కిట్లు, ల్యాబ్ ఎక్విప్మెంట్, ఫర్నీచర్ కొనుగోలుకు డైరెక్టర్లు కొనుగోళ్లు ఆర్డర్లు జారీ చేశారు. తమకు అనుకూలమైన కంపెనీకే ఆర్డర్ ఇచ్చేలా ఆ విధంగా నకిలీ కొటేషన్లు సృష్టించారు. పరిమితికి మించి ఔషధాల కొనుగోలు ఆ డైరెక్టర్ల హయాంలో మందులు, ఔషధాల కొనుగోలు కోసం రూ.293.51 కోట్లు కేటాయించగా, యథేచ్ఛగా ఆ పరిమితిని మించి రేట్ కాంట్రాక్ట్, నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఏకంగా రూ.698.36 కోట్ల విలువైన మందుల, ఔషధాలు కొనుగోలు చేశారు. నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థలకు ప్రయోజనం కలిగించేందుకు నిబంధనలను తుంగలో తొక్కారు. నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి మందులు, ఔషధాలు కొనుగోలు చేసిన తీరులో జరిగిన అక్రమాలు చూస్తే, కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి నెలకొంది. (టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్) అదనంగా చెల్లింపులు ర్యాన్‌డమ్‌గా చేసిన తనిఖీలో పర్చేజ్ ఇన్వాయిస్ ప్రైజ్, సేల్ ఇన్వాయిస్ ప్రైజ్ మధ్య చాలా తేడా ఉన్నట్లు గుర్తించారు. రాశి ఫార్మా, వీరేశ్ ఫార్మాల నుంచి రూ.15.93 కోట్ల విలువైన మందులు, ఔషధాలు కొనుగోలు చేశారు. ఆ మేరకు ఐఎంఎస్ డైరెక్టర్లు పర్చేజ్ ఆర్డర్లు జారీ చేశారు. అయితే ఆ రెండు నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల ఇన్వాయిస్ ప్రైజ్ ప్రకారం ఆ మందులు, ఔషథాల అసలు ధర రూ.8.52 కోట్లు మాత్రమే. దానికి 20శాతం మార్జిన్ (లాభం) వేసుకుంటే ఆ ధర రూ.10.22 కోట్లు అవుతుంది. కానీ ఐఎంఎస్ డైరెక్టర్లు మాత్రం ఏకంగా రూ.15.93 కోట్లు చెల్లించారు. ఆ విధంగా కేవలం ఆ రెండు సంస్థలకు మాత్రమే రూ.5.70 కోట్లు అదనంగా చెల్లించారు. ఆ విధంగా అనేక నాన్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఐఎంఎస్ డైరెక్టర్లు ఇష్టారాజ్యంగా అధిక ధరలు చెల్లించి మందులు, ఔషథాలు కొనుగోలు చేశారు. నిబంధనలు బేఖాతరు.. అధిక ధరలకు కొనుగోలు నిబంధనల ప్రకారం రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి మాత్రమే అత్యధికంగా కొనుగోళ్లు జరపాల్సి ఉన్నప్పటికీ ఐఎంఎస్ డైరెక్టర్లు మాత్రం ఎక్కడా వాటిని పట్టించుకోలేదు. అన్నింటినీ తుంగలో తొక్కి అత్యధిక కొనుగోళ్లు నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచే జరిపారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారు. ఆ విధంగా 2014–15 నుంచి 2018–19 వరకు 5 ఏళ్లలో ఐఎంఎస్ డైరెక్టర్లు నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి రూ.89.58 కోట్ల విలువైన మందులు, ఔషథాలు కొనుగోలు చేశారు. అయితే అవే ఔషధాలు రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి కొనుగోల చేసి ఉంటే కేవలం రూ.38.56 కోట్లకు వచ్చేవి. కానీ ఆ సంస్థలకు పర్చేజ్ ఆర్డర్ ఇవ్వకుండా నాన్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి మందులు, ఔషథాలు కొనుగోలు చేయడం ద్వారా రూ.51.02 కోట్లు అదనంగా చెల్లించారు. ఇది ఏకంగా 132 శాతం అధికం. ఆ విధంగా నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థలకు 2014–15లో 131.80 శాతం, 2015–16లో 159.40 శాతం, 2016–17లో 136.27 శాతం, 2017–18లో 198.66 శాతం, 2018–19లో 80.04 శాతం అధికంగా చెల్లించారు. అలా గత 5 ఏళ్లలో సగటున 132.30 శాతం అధికంగా చెల్లించారు. అనవసర కొనుగోళ్లు.. తమ వారికే ఆర్డర్లు అవసరాలకు మించి కొనుగోలు చేయడం వల్ల వాటిలో చాలా వరకు నిరుపయోగంగాను ఉండిపోయాయి. ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలలో గత ఏడాది కాలంగా రూ.232.32 కోట్ల విలువైన ఔషధాలు, సర్జికల్ ఐటెమ్స్ నిరుపయోగంగా ఉన్నట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలో గుర్తించారు. ఐఎంఎస్ డైరెక్టర్లు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిన నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల్లో జెర్కాన్ ఎంటర్ప్రైజెస్ రావిల రవితేజస్వికి చెందినది కాగా, ఆమె డిఐఎంఎస్ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌కు చెందిన ఫార్మసిస్టు కె.ధనలక్ష్మి కోడలు. అందుకే ఆ సంస్థకు ఐఎంఎస్ డైరెక్టర్లు ఉదారంగా పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. డాక్టర్ సీ.కే.రమేష్‌కుమార్, డాక్టర్ జి.విజయకుమార్ ఇద్దరూ జెర్కాన్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఏకంగా రూ.9.50 కోట్ల పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చారు. ఆ విధంగా ఆ సంస్థకు ఆర్థిక ప్రయోజనం కల్పించారు. ఔషధాలు డాక్టర్ సీ.కే.రమేష్‌కుమార్ ఐఎంఎస్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థలు.. విజయనగరానికి చెందిన ఎస్కేపీ ఎంటర్ప్రైజెస్, నర్సారావుపేటకు చెందిన సీతారామ్ ఫార్మాస్యూటికల్స్ నుంచి రూ.5.71 కోట్ల విలువైన ఔషధాలు కొనుగోలు చేశారు. ల్యాబ్ కిట్స్ వాస్తవానికి ల్యాబ్ కిట్స్‌ను హెమోక్యూ, బయోరాడ్, సీమెన్స్ వంటి ప్రొప్రైటరీ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ, ఐఎంఎస్ డైరెక్టర్లు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ కూడా యథేచ్ఛగా నియమావళి ఉల్లంఘించి నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి ల్యాబ్ కిట్స్ కొనుగోలు చేశారు. లెజెండ్ ఎంటర్ప్రైజెస్, అవాంతర్ పర్ఫార్మెన్సెస్ ఇండియా లిమిటెడ్, ఓమ్ని మెడి వంటి నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి నామినేషన్ పద్ధతిలో రూ.237 కోట్ల విలువైన ల్యాబ్ కిట్స్ కొనుగోలు చేశారు. ఆ విధంగా ఆయా సంస్థలకు 36 శాతం అధిక ధరలు చెల్లించారు. సర్జికల్ ఐటెమ్స్.. ఫర్నీచర్ కొనుగోలు ఇక్కడ కూడా ఐఎంఎస్ డైరెక్టర్లు బహిరంగ టెండర్లు పిలవకుండా నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి రూ.47.77 కోట్ల విలువైన సర్జికల్ ఉపకరణాలు కొనుగోలు చేశారు. దీంతో పాటు ఏ ఇండెంట్ లేకుండా మరో రూ.8.06 కోట్ల విలువైన సర్జికల్ ఐటెమ్స్ కూడా సేకరించారు. ఫర్నీచర్ కొనుగోలులో కూడా ఐఎంఎస్ డైరెక్టర్లు నిబంధనలు పాటించలేదు. ఎక్కడా బహిరంగ టెండర్లు పిలవకుండా రూ.6.62 కోట్ల విలువైన ఫర్నీచర్ కొనుగోలు చేశారు. వారు చెల్లించిన ధరతో, మార్కెట్లో వాస్తవ ధరలను ఇదమిద్ధంగా పోల్చి చూసిన అధికారులు షాక్ అయ్యారు. ఫర్నీచర్ కొనుగోలులో ఐఎంఎస్ డైరెక్టర్లు 70 శాతం ఎక్కువ ధర చెల్లించినట్లు గుర్తించారు. అచ్చెన్నాయుడు – టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ టెలి హెల్త్ సంస్థకు మాత్రమే కాంట్రాక్ట్ పనులు అప్పగించాలని నాడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కె.అచ్చెన్నాయుడు స్వయంగా ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీ.కే.రమేష్‌కుమార్‌కు లేఖ రాశారు. దీంతో ఏ టెండర్ పిలవకుండానే నామినేషన్ పద్ధతిలో ఆయన, టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కాంట్రాక్ట్ పనులు అప్పగించారు. టోల్‌ఫ్రీ సర్వీసులు, ఈసీజీ సర్వీసులకు సంబంధించి ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీ.కే.రమేష్‌కుమార్ ఆ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదర్చుకున్నారు. ఇదీ కాంట్రాక్ట్ రేటు వివిధ అవసరాలతో పాటు, సహాయం కోరుతూ టోల్ ఫ్రీ సర్వీసుకు రోగులు చేసే ప్రతి కాల్‌కు (ఆ కాల్ అటెండ్ చేయకపోయినా సరే) నెలకు రూ.1.80, రోగులకు చేసే ప్రతి ఈసీజీకి రూ.480 చొప్పున చెల్లించేలా డాక్టర్ రమేష్‌కుమార్ ఆ సంస్థతో ఎంఓయూ చేసుకున్నారు. ఆ విధంగా ఎలాంటి విచారణ లేకుండా దాఖలు చేసిన అన్ని బిల్లులను టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెల్లించినట్లు విజిలెన్సు దర్యాప్తులో గుర్తించారు. అర్హత లేని వారితో పరీక్షలు అయితే ఇక్కడ కూడా టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిబంధనలు ఉల్లంఘించింది. ఎంఓయూ ప్రకారం వైద్య పరీక్షల కోసం డీఎం కార్డియాలజిస్టులను నియమించుకోవాల్సి ఉన్నప్పటికీ, పీజీ డిప్లొమా క్లినికల్ కార్డియాలజిస్టులను ఏర్పాటు చేసుకుని పని కానిచ్చారు. ప్రతి వైద్య పరీక్షకు పక్కాగా బిల్లులు పొందారు. టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు బిల్లులు కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం ఐఎంఎస్ డైరెక్టర్లు డాక్టర్ సీ.కే.విజయకుమార్, డాక్టర్ జి.విజయకుమార్ ఇద్దరూ టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు టోల్‌ఫ్రీ సర్వీస్‌కు గానూ రూ.4.15 కోట్లు, ఈసీజీ పరీక్షలకు సంబంధించి రూ.3.81 కోట్లు చెల్లించారు. ఎస్టీపీ–జలం ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రిలో మురుగునీటి పారిశుద్ధ్య కేంద్రం (ఎస్పీటీ) ఏర్పాటు కోసం ఎలాంటి టెండర్లు పిలవకుండానే అప్పుడు ఐఎంఎస్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ సీ.కే.రమేష్‌కుమార్, జలం ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు రూ.1.94 కోట్ల మొత్తానికి వర్క్ ఆర్డర్ ఇచ్చారు. ఇందు కోసం కనీసం ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకోలేదు. దీంతో పాటు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లోని ఎస్పీటీలు, కర్నూలు జిల్లా అదోనిలోని డయాగ్నస్టిక్ కేంద్రంలో ఉన్న ఎస్పీటీ.. అలా మొత్తం నాలుగు ఎస్‌పీటీల వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్ కూడా డాక్టర్ రమేష్‌కుమార్, జలం ఎన్విరాన్మెంట్ సంస్థకు రూ.3.49 కోట్లకు అప్పగించారు. వాస్తవానికి ఆ కేంద్రాలేవీ పని చేసే స్థితిలో లేవు. అదోనిలో తొలుత ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ కేంద్రాన్ని 2 కిలోమీటర్ల దూరంలో మరో చోటకు తరలించారు. రెండేళ్ల క్రితం ఆ కేంద్రాన్ని తరలించినా, తొలుత డయాగ్నస్టిక్ కేంద్రం ఏర్పాటు చేసిన ప్రదేశం వద్ద ఉన్న ఎస్‌పీటీకి వార్షిక నిర్వహణ వ్యయం చెల్లిస్తూనే ఉన్నారు. ఇంఛార్జ్ సివిల్ సర్జెన్ ఇస్తున్న ఒక సర్టిఫికెట్‌ను ఆధారంగా చేసుకుని ఐఎంఎస్ డైరెక్టర్లు ఆ బిల్లు చెల్లిస్తున్నారు. బయోమెట్రిక్ ఉపకరణాలు హైదరాబాద్‌కు చెందిర ప్రొడిగీ కంప్యూటర్స్–ల్యాప్టాప్స్ సంస్థ డిఐఎంఎస్‌కు 100 బయోమెట్రిక్ ఉపకరణాలు సరఫరా చేసింది. అప్పుడు ఐఎంఎస్ డైరెక్టర్‌గా డాక్టర్ సీ.కే.రమేష్‌కుమార్ ఉన్నారు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ, డాక్టర్ రమేష్‌కుమార్ ఒక్కో బయోమెట్రిక్ ఉపకరణానికి ఏకంగా రూ.70,670 చెల్లించారు. వాస్తవానికి మార్కెట్లో ఒక్కో బయోమెట్రిక్ ఉపకరణం ధర కేవలం రూ.16,992 మాత్రమే. అయినా ఓపెన్ టెండర్లకు వెళ్లకుండా నామినేషన్ పద్ధతిలో ప్రొడిగీ కంప్యూటర్స్ నుంచి 100 బయోమెట్రిక్ ఉపకరణాలు కొనుగోలు చేసిన డాక్టర్ రమేష్‌కుమార్, అందుకోసం రూ.53.67 లక్షలు అదనంగా చెల్లించారు. వాటిలో చాలా వరకు యంత్రాలు పని చేయడం లేదని విజిలెన్సు అధికారులు దర్యాప్తు సమయంలో గుర్తించారు. -
పైసలిస్తేనే పాస్‌బుక్
నర్సంపేట: ఈ సంఘటన మరువకముందే నర్సంపేట డివిజన్ పరిధిలోని ఓ మండల తహసీల్దార్ తతంగం బయట పడింది. ధరణి వెబ్సైట్ ద్వారా రైతులకు పట్టాదార్ పుస్తకాలు ఇవ్వాలంటే పైసలు ముట్టాల్సిందేనని, తనకు ప్రతిరోజు మండల వీఆర్వోలంతా కలసి రోజుకు 10 వేలు ముట్టజెప్పాలని హూకుం జారీ చేసినట్లు సమాచారం. దీంతో బెంబేలెత్తిన వీఆర్వోలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వద్దకు చేరుకుని గోడు వెల్లబోసుకున్నారు. అవసరాన్ని ఆసరాగా చేసుకొని.. రైతుల భూ రికార్డులను ప్రక్షాళన చేసి రైతులందరికీ ఉచితంగా పట్టాదార్ పాసు పుస్తకాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేళ్ల క్రితం బృహత్తర పథకాన్ని తీసుకువచ్చారు. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించారు. ఎన్నికలు ముగిశాయి. గ్రామాల్లో ఇంకా చాలా మంది రైతులకు పట్టాదారు పుస్తకాలు అందించాల్సి ఉంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అందరికి పట్టాలు ఇవ్వడం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధరణి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి రెండు నెలలవుతోంది. పట్టాలు లేని రైతులంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అదనుగా భావించి సదరు తహసీల్దార్ రోజువారీగా రూ.10వేలు ఇచ్చి పనులు చేయించుకోండని గత కొన్ని రోజులుగా వీఆర్వోలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. అటు రైతులను డబ్బులు అడగలేక.. ఇటూ తహసీల్దార్‌కు ఇవ్వలేక.. వీఆర్వోలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదే మండలంలోని కొన్ని గ్రామాల రైతులు నేరుగా అనేకసార్లు గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు విన్నవించారు. కార్యాలయం ఎదుట రాస్తారోకోలు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు సైతం ట్విట్టర్ ద్వారా ఓ రైతు పోస్టు చేసినట్లు తెలిసింది. అయినా ఫలితం లేదు.. ఇదిలా ఉండగా సదరు తహసీల్దార్ తన సొంతంగా గ్రామాల్లో ఏజెంట్లను పెట్టుకుని డబ్బులు ఇ చ్చిన వారి ఫైళ్లు మాత్రమే క్లియర్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. రైతులకు ఎలాంటి డబ్బులు లేకుండా పట్టా పుస్తకాలు ఇవ్వాలని ము ఖ్యమంత్రి ఖరాఖండిగా చెప్పినా రెవెన్యూ అధికా రుల తీరులో మార్పు రాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి లంచాలు తీసుకునే అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు సకాలంలో ధరణి వెబ్సైట్ ద్వారా పాస్‌బుక్‌లు అందించాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం.. పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నరన్న విషయం ఇప్పటికయితే నా దృష్టికి రాలేదు. రాత పూర్వకంగా ఫిర్యాదులు వస్తే విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ధరణి వెబ్సైట్ ద్వార పట్టా పుస్తకాలు అందించే క్రమంలో ఎలాంటి అవినీతికి తావులేదు. అవినీతి జరిగితే సహించేది లేదు.. – రవి, నర్సంపేట, ఆర్డీఓ -
ఆ ఆరోపణలు కేసు పెట్టదగినవే
న్యూఢిల్లీ: అవినీతి కేసులో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దుచేయాలన్న ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించింది. ఈ వ్యవహారంలో అస్థానాతో పాటు ఇతర అధికారులపై వచ్చిన ఆరోపణలు కేసు పెట్టదగినవేనని ఢిల్లీ కోర్టుకు తెలిపింది. అస్థానా పిటిషన్‌పై అభిప్రాయం తెలపాలని కోర్టు ఆదేశించగా సీబీఐ గురువారం ఈ మేరకు బదులిచ్చింది. ఇంకా చార్జిషీట్ దాఖలుచేయలేదని, విచారణ పూర్తయ్యే సరికి చాలా విషయాలు బయటికి వస్తాయని తెలిపింది. అస్థానా, సీబీఐ డీఎస్పీ దేవేంద్రకుమార్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్‌ల పిటిషన్లను జస్టిస్ నజ్మీ వాజిరి బెంచ్ విచారణకు చేపట్టింది. ఈ దశలో అనవసర సందేహాలొద్దు.. ‘అవినీతి సంబంధ కేసుల్లో నమోదైన ఎఫ్ఐఆర్ను రిట్ పిటిషన్ ద్వారా సవాలుచేసినప్పుడు, ఆ ఎఫ్ఐఆర్లోని ఆరోపణల్లో కేసు పెట్టదగినవి ఉన్నాయా? లేవా? అన్న విషయాన్ని పరిశీలించాలి. ఈ దశలో కేసుతో సంబంధంలేని విషయాలు, సందేహాల్ని లేవనెత్తకూడదు. ఇక ప్రస్తుత కేసులో వచ్చిన ఆరోపణలు కేసుపెట్టదగినవే అని తేలడంతోనే ఎఫ్ఐఆర్ నమోదుచేసి విచారణ ప్రారంభించాం. కొత్త బృందం దర్యాప్తును ప్రారంభించి, కీలక పత్రాలను పరిశీలిస్తోంది. తదుపరి దశలో సవివర అఫిడవిట్ దాఖలుచేస్తాం’ అని సీబీఐ పేర్కొంది. కాగా, అస్థానాపై విచారణ చేపట్టకుండా యథాతథ స్థితిని కోర్టు నవంబర్ 14 వరకు పొడిగించింది. -
మంత్రుల అవినీతిని బయటపెట్టండి
న్యూఢిల్లీ: 2014–17 మధ్యకాలంలో కేంద్ర మంత్రులపై వచ్చిన అవినీతి ఫిర్యాదులను, వారిపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని ముఖ్య సమాచార కమిషనర్ ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఆదేశించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సంజీవ్ చతుర్వేది పిటిషన్ మేరకు సమాచార కమిషనర్ రాధాకృష్ణ మాధుర్ పీఎంవోకు పైవిధంగా సూచించారు. మోదీ ప్రధాని అయిన తరువాత విదేశాల నుంచి రప్పించిన నల్లడబ్బుపై పూర్తి సమాచారం ఇవ్వాలని, రప్పించిన నల్లధనం దేశప్రజల బ్యాంకు ఖాతాల్లో ఎంత డిపాజిట్ చేశారో కూడా వెల్లడించాలని ఆయన పీఎంవోను ఆదేశించారు. సంజీవ్ చతుర్వేది గతంలోనే సమాచార హక్కు చట్టం కింద ప్రధాన మంత్రి కార్యాలయానికి పై విషయాలపై దరఖాస్తు చేసుకున్నారు. అయితే నల్లధనం ‘సమాచారం’ కిందకు రాదని ఆయన దరఖాస్తును ప్రధాని కార్యాలయ వర్గాలు తిరస్కరించాయి. అయితే సమాచార కమిషనర్ ఈ వాదనను కొట్టిపారేశారు. దరఖాస్తుదారుడు తప్పుగా దరఖాస్తు చేశారనడంలో వాస్తవం లేదని, పీఎంవో వాదన సరికాదని ఆయన తేల్చిచెప్పారు. -
పాఠశాలల సామగ్రి ఏమైంది?
బెజ్జూర్(సిర్పూర్) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ పాఠశాలకు ఏటా రూ.10 వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్నాయి. ఈ నిధులతో పాఠశాలలో రికార్డులు భద్రపర్చేందుకు బీరువా, మూడు కుర్చీలు, చాక్‌పీస్, వాటర్‌ఫిల్టర్, తదితర సామగ్రిని కొనుగొలు చేయాల్సి ఉంటుంది. కాని సామగ్రి కొనకుండా ఈ నిధులను గతేడాది మార్చిలోనే డ్రా చేసినట్లు సమాచారం. పాఠశాలలు ప్రారంభమై 14 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు సామగ్రి లేకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బెజ్జూర్ మండలంలో 49 పాఠశాలకు సంబంధించి రూ.4.90 లక్షలు మంజూరు కాగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, చైర్మన్లు కలిసి నిధులు డ్రా చేసినట్లు తెలుస్తోంది. నిధులు డ్రా అయి దాదాపు మూడు నెలలు గడుస్తున్నా సామగ్రి కొనుగోలు చేయకపోవడంతో అప్పట్లో దీనిపై ‘సాక్షి’ మెయిన్‌లో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన రాష్ట్ర అధికారులు పాఠశాలలను తనిఖీలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయులు కొంత నాసిరకం సామగ్రి కొనుగోలు చేసి ఎమ్మార్సీ కార్యాలయంలో భద్రపర్చి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. జిల్లా అధికారులను ఎంఈవో రమేశ్ ముందుగానే కలిసి మాట్లాడుకున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. విచారణకు వచ్చిన జిల్లా అధికారులు సైతం నామమాత్రంగా విచారణ చేపట్టారనే ఆరోపణలు వచ్చాయి. 46 పాఠశాలల రికార్డులను తనిఖీ చేయాల్సి ఉండగా కేవలం 22 పాఠశాలల రికార్డులను మాత్రమే తనిఖీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. 50 పాఠశాలలకుగాను కేవలం 12 మంది ఉపాధ్యాయులు ఉండగా, నలుగురు రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులు మాత్రమే అన్ని పాఠశాలలకు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. సల్గుపల్లి పాఠశాల హెచ్ఎం తిరుపతికి19 పాఠశాలలకు, బారెగూడ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రవికి 18, పెంచికల్‌పేట ఉర్దూ పాఠశాల హెచ్ఎంకు 12, కొండపల్లి పాఠశాల హెచ్ఎం 7 పాఠశాలలకు ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. వీరు సామగ్రి కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాల అభివృద్ధి నిధులను డ్రా చేసిన ప్రధానోపాధ్యాయులు ఇంతవరకు సామగ్రి కొనుగోలు చేయకపోవడం పలు అనుమానాలు తావిస్తోంది. దీంతో సామగ్రి కొనుగోలు కోసం వచ్చిన నిధులు ఏమాయ్యయని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై సలుగుపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతిని సంప్రందించగా బెజ్జూర్ ఎంఈవో కార్యాలయంలో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో నిధులు డ్రా చేయాలని మౌఖికంగా ఆదేశించడంతో డ్రా చేసి ఎంఈవోకే ఇచ్చామని తెలిపారు . బెజ్జూర్ ఎంఈవో రమేశ్‌బాబును సంప్రదించగా వారం రోజుల్లో పాఠశాలలకు సామగ్రి సరఫరా చేస్తామని తెలిపారు. సామగ్రి సరఫరా చేయని పక్షంలో నిధులను యాజమాన్య కమిటీ ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. -
ఏసీబీకి చిక్కిన బిల్లు కలెక్టర్
పిఠాపురం టౌన్: కొత్తగా నిర్మించిన పై అంతస్తుకు తక్కువ పన్ను వేసినందుకు బదులుగా రూ.ఆరు వేలు లంచం తీసుకుంటూ బిల్లు కలెక్టర్ నాగరాజు మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన గొల్లపల్లి కన్నయ్య 2016లో పిఠాపురంలోని వైఎస్సార్ గార్డెన్లో ఇటీవల ఇల్లు కొనుగోలు చేశాడు. అప్పట్లో అర్ధసంవత్సరానికి రూ.1600 పన్ను చెల్లించేవాడు. అనంతరం అదే ఇంటిపై అంతస్తు నిర్మించాడు. దీనికి కూడా పన్ను విధించాలని సంబంధిత మున్సిపల్ రెవెన్యూ అధికారులను కోరారు. ఆ మేరకు ఇంటి కొలతలు తీసుకున్న అనంతరం బిల్లు కలెక్టర్ నాగరాజు కన్నయ్యతో మాట్లాడుతూ కొలతల ప్రకారం రూ.3400 పన్ను వేయాల్సి వస్తుందని రూ.ఎనిమిది వేలు లంచం ఇస్తే పన్ను తగ్గిస్తానని చెప్పాడు. దాంతో రూ.ఆరు వేలు ఇస్తానని పన్ను తగ్గించి వేయాలని కన్నయ్య బిల్లు కలెక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మేరకు పన్ను తగ్గించి రూ.2020లు వేయగా దాని ప్రకారం కన్నయ్య చెల్లించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా లంచం సొమ్ములు ఇవ్వలేదని బిల్లు కలెక్టర్ నాగరాజు కన్నయ్య మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయానని ప్రాధేయపడ్డాడు. అయినా వినకుండా నాగరాజు కన్నయ్యకు ఫోన్‌చేసి బెదిరించేవాడు. తన పై అధికారులు డబ్బులు అడుగుతున్నారని లేదంటే పన్ను పెంచేస్తానని హెచ్చరించడంతో కన్నయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్ నేతృత్వంలో మంగళవారం మధ్యాహ్నం పథకం ప్రకారం మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసి కన్నయ్య నుంచి రూ.6వేలు లంచాన్ని బిల్లు కలెక్టర్ నాగరాజు తీసుకుంటుండగా ప్రత్యక్షంగా పట్టుకున్నారు. రసాయన పరీక్షల ద్వారా బిల్లు కలెక్టర్ లంచం తీసుకున్నట్టు నిర్ధారించిన ఏసీబీ అధికారులు బిల్లుకలెక్టర్ను అదుపులోకి తీసుకుని మున్సిపల్ కమిషనర్ .రామ్మోహన్ నుంచి వివరాలు సేకరించారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించిన ఏసీబీ డీఎస్పీ సుధాకర్ తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. -
అవినీతి రోగానికి ఏసీబీ చికిత్స
సింగరేణి మెడికల్ బోర్డు అక్రమాల్లో కార్మిక నాయకులు, అధికారులు..? తెలంగాణ సర్కారు గుప్పిట నివేదిక..! గుర్తింపు ఎన్నికల ముందు బయటపెట్టే అవకాశం మంచిర్యాల సిటీ(ఆదిలాబాద్) : సింగరేణి మెడికల్ బోర్డుకు పట్టిన అవినీతి రోగానికి రాష్ట్ర ఏసీబీ తనదైన శైలిలో చికిత్స చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బోర్డులోని కొంతమంది అవినీతి, అక్రమాలకు పాల్పడడం వల్ల అనేక మంది కార్మికులు తీవ్రంగా నష్టపోయిన విషయం లె లిసిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు అదేశించింది. ఏసీబీ ఇచ్చిన నివేదికలో పలు కార్మిక సంఘాలకు చెందిన అగ్రనాయకులతో పాటు కొంతమంది సింగరేణి ఉన్నతాధికారులు, వైద్యాధికారులు ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు ఆ వివరాలన్నీ గుప్పిట పట్టుకున్న సర్కారు కొద్ది రోజుల్లో జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో వాటిని బయటపెట్టే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా కేవలం తప్పులతో దొరికిన నాయకులను టార్గెట్‌గా చేసుకుని ఎన్నికల్లో లబ్ధిపొందడానికి అధికార పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. కార్యకర్తల వద్దే నొక్కేశారు జీవితకాలం సంఘానికి సభ్యత్వం చెల్లించారు. జెండాలు మోశారు. ఉద్యమంలో ముందు నిలబడి పోలీసు కేసుల్లో ఇరుక్కున్నారు. జైలుపాలయ్యారు. ఆర్థికంగా నష్టపోయారు. ఇలా 25 నుంచి 30 ఏళ్లపాటు బొగ్గుబాయిలో పనిచేసి సంఘానికి అండగా నిలిచిన వారెందరో ఉన్నారు. తన కొడుక్కో, అల్లుడికో వారసత్వపు ఉద్యోగం పెట్టించడానికి మెడికల్ అన్‌ఫిట్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు. ఇంతకాలం చాకరీ చేశాం.. నాయకులు కనికరించకపోతారా అని ఆశపడితే.. ఒక్కో కార్యకర్త నుంచి రూ.4లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితుల ద్వారా తెలిసింది. పని ఏమైంది నాయకా అంటే తప్పించుకు తిరుగుతున్నారని, కనీసం ఇచ్చిన పైసలైనా ఇమ్మంటే ‘నేనేం చేయాలె నా పైన ఉన్నోడికి ఇచ్చిన.. అక్కడి నుంచి వచ్చినప్పుడే నీకిస్తా.. అప్పటిదాకా నా ఇంటికి రాకు’ అంటూ దబాయిస్తున్నారని కొందరు వాపోయారు. నాయకులే టార్గెట్ పలు కార్మిక సంఘాలకు చెందిన కొందరు నాయకులు మెడికల్ అన్‌ఫిట్ కోసం కార్మికుల నుంచి భారీగా వసూలు చేసి మోసం చేశారని ఏసీబీ విచారణలో తేలినట్లు సమాచారం. ఇందులో ప్రతిపక్ష సంఘాలలోని ముఖ్య నాయకులతో పాటు అధికార పార్టీకి చెందిన కార్మిక సంఘం నాయకుల్లో కొందరి భాగస్వామ్యం ఉన్నట్లు తెలిసింది. రానున్న ఎన్నికల్లో ఏసీబీ నివేదికను అస్త్రంగా ఉపయోగించుకుంటే సొంతవారు కూడా బలయ్యే అవకాశం ఉంది. అయితే వారిని కాపాడుకోవడానికి అందరినీ ఎన్నికల సమయం నాటికి ఏసీబీకి అప్పగించి, కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకువస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఏసీబీ నివేదికలో వాస్తవాలు ఉన్నప్పటికీ కార్మిక వర్గంలో తన సంఘంపై వచ్చిన వ్యతిరేకతను పోగొట్టడానికి, వివిధ సంఘాలకు చెందిన నాయకులు చేసిన అవినీతిని ముందుకు తీసుకువస్తే కార్మికుల నుంచి సానుభూతి పొందవచ్చని అధకార పార్టీ అలోచనగా తెలుస్తోంది. ఆత్మరక్షణలో అక్రమార్కులు మెడికల్ అన్‌ఫిట్ చేయిస్తానని కార్మికుల నుంచి వసూలు చేసిన నాయకులు ఆత్మరక్షణలో పడ్డారు. ఓ ప్రతిపక్ష సంఘానికి చెందిన సీనియర్ నాయకుడు ఈ గండం నుంచి తప్పించమని దక్షిణ తెలంగాణకు చెందిన అధికార పార్టీ మంత్రితో ప్రాదేయపడుతున్నట్లు విశ్వనీయవర్గాల ద్వారా తెలిసింది. అయితే ఆ నాయకుడిని చేరదీసి బయట పడేస్తే తన పదవికే ముప్పు వస్తుందనే ఆలోచనలో సదరు మంత్రి ఉన్నట్టు సమాచారం. బయట పడే అవకాశం లేనప్పటికీ ఎన్నికల నాటికి చెప్పినట్టు నడుచుకుంటే ఇబ్బంది లేకుండా చూస్తామనే హామీ కోసం ఆ నాయకుడు ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల నాటికి ఎవరు ఎక్కడ ఉంటారో, ఏ సంఘంలో ఉంటారో వేచి చూడాల్సిందే.