నర్సంపేట: ఈ సంఘటన మరువకముందే నర్సంపేట డివిజన్ పరిధిలోని ఓ మండల తహసీల్దార్ తతంగం బయట పడింది. ధరణి వెబ్‌సైట్ ద్వారా రైతులకు పట్టాదార్ పుస్తకాలు ఇవ్వాలంటే పైసలు ముట్టాల్సిందేనని, తనకు ప్రతిరోజు మండల వీఆర్వోలంతా కలసి రోజుకు 10 వేలు ముట్టజెప్పాలని హూకుం జారీ చేసినట్లు సమాచారం. దీంతో బెంబేలెత్తిన వీఆర్వోలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వద్దకు చేరుకుని గోడు వెల్లబోసుకున్నారు.
అవసరాన్ని ఆసరాగా చేసుకొని..
రైతుల భూ రికార్డులను ప్రక్షాళన చేసి రైతులందరికీ ఉచితంగా పట్టాదార్ పాసు పుస్తకాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేళ్ల క్రితం బృహత్తర పథకాన్ని తీసుకువచ్చారు. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించారు. ఎన్నికలు ముగిశాయి. గ్రామాల్లో ఇంకా చాలా మంది రైతులకు పట్టాదారు పుస్తకాలు అందించాల్సి ఉంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అందరికి పట్టాలు ఇవ్వడం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధరణి వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చి రెండు నెలలవుతోంది. పట్టాలు లేని రైతులంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఇదే అదనుగా భావించి సదరు తహసీల్దార్ రోజువారీగా రూ.10వేలు ఇచ్చి పనులు చేయించుకోండని గత కొన్ని రోజులుగా వీఆర్వోలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. అటు రైతులను డబ్బులు అడగలేక.. ఇటూ తహసీల్దార్‌కు ఇవ్వలేక.. వీఆర్వోలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదే మండలంలోని కొన్ని గ్రామాల రైతులు నేరుగా అనేకసార్లు గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు విన్నవించారు.
కార్యాలయం ఎదుట రాస్తారోకోలు చేశారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు సైతం ట్విట్టర్ ద్వారా ఓ రైతు పోస్టు చేసినట్లు తెలిసింది. అయినా ఫలితం లేదు.. ఇదిలా ఉండగా సదరు తహసీల్దార్ తన సొంతంగా గ్రామాల్లో ఏజెంట్లను పెట్టుకుని డబ్బులు ఇ చ్చిన వారి ఫైళ్లు మాత్రమే క్లియర్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. రైతులకు ఎలాంటి డబ్బులు లేకుండా పట్టా పుస్తకాలు ఇవ్వాలని ము ఖ్యమంత్రి ఖరాఖండిగా చెప్పినా రెవెన్యూ అధికా రుల తీరులో మార్పు రాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి లంచాలు తీసుకునే అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు సకాలంలో ధరణి వెబ్‌సైట్ ద్వారా పాస్‌బుక్‌లు అందించాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం..
పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నరన్న విషయం ఇప్పటికయితే నా దృష్టికి రాలేదు. రాత పూర్వకంగా ఫిర్యాదులు వస్తే విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ధరణి వెబ్‌సైట్ ద్వార పట్టా పుస్తకాలు అందించే క్రమంలో ఎలాంటి అవినీతికి తావులేదు. అవినీతి జరిగితే సహించేది లేదు.. – రవి, నర్సంపేట, ఆర్డీఓ
Comments
Please login to add a commentAdd a comment