mandal offices
-
కరుణించని ‘ధరణి’
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి’ వెబ్సైట్ రైతులకు చుక్కలు చూపుతోంది. ఏడాదికాలంగా మండల కార్యాలయాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నా.. పాస్ పుస్తకాలు అందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన అనంతరం భూ రికార్డుల సమగ్ర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టింది. రెవెన్యూ రికార్డులన్నింటినీ ఆన్లైన్లోనే అప్డేట్ చేసేలా ఈ సాఫ్ట్వేర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్‌తో అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. రికార్డుల సవరణకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో ప్రతి పనికి కాళ్లరిగేలా తిరిగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కరెక్షన్, ఎడిట్ ఆప్షన్‌ను తహసీల్దార్లకు ఇవ్వకుండా ఆర్డీవో, జేసీల అనుమతి తీసుకున్నాకే లాగిన్ కావాల్సిరావడంతో కాలయాపన జరుగుతోంది. ముఖ్యంగా ధరణి రాకతో రికార్డులను సవరించే బాధ్యత నుంచి తహసీల్దార్లను ప్రభుత్వం తప్పించింది. చిన్న సవరణలకు కూడా వెసులుబాటు ఇవ్వకపోవడం.. మండల కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతుండటం వారిని ఇరకాటంలో పడేస్తోంది. పగటి పూట బంద్.. 2017లో భూరికార్డుల ప్రక్షాళనతో రెవెన్యూ వ్యవస్థలో సరికొత్త విప్లవానికి కేసీఆర్ సర్కారు నాంది పలికింది. అంగుళం భూమికి సైతం హక్కుదారెవరనేది తేల్చేలా భూ రికార్డుల సమగ్ర నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధరణి వెబ్సైట్ ప్రవేశపెట్టింది. ఈ పోర్టల్ కార్యరూపం దాల్చిన తర్వాత రోజుకో కొత్త సాంకేతిక సమస్యలు పుట్టుకురావడం రెవెన్యూ అధికారులకు తలనొప్పి తెప్పిస్తోంది. ధరణి పగటి పూట మొరాయిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో రికార్డులను ఆన్లైన్లో నమోదు చేస్తుండటంతో సర్వర్ డౌన్ అవుతోంది. దీంతో పగలు సాఫ్ట్వేర్ పడకేస్తుండటంతో, రాత్రి వేళల్లో పనులు చేయాల్సివస్తోంది. కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి తెచ్చే ముందు.. సాంకేతిక సమస్యలను సరిచూసుకోవాల్సివుంటుంది. కానీ, ధరణిని కార్యరూపంలోకి తెచ్చిన తర్వాత లోపాలను సరిదిద్దుతుండడం వల్ల రైతులకు నిరీక్షణ తప్పట్లేదు. ఇవీ సాంకేతిక సమస్యలు.. ►ఒకే సేల్‌డీడ్‌పై ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసిన భూమికి సంబంధించి మ్యూటేషన్ చేయించుకునేందుకు గతంలో మీ–సేవలో దరఖాస్తు చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడలా చేస్తే దరఖాస్తు తిరస్కరణకు గురవుతోంది. ఇరువురు వేర్వేరు దరఖాసులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ నిబంధన తెలియక మ్యూటేషన్లు, పాస్ పుస్తకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ►సర్వే నంబర్ల పునరుద్ధరణ ఆప్షన్ తహసీల్దార్‌కు లేదు. రివోక్ ఆప్షన్‌కు జేసీకి నివేదించాల్సి వస్తోంది. ►పూర్తయిన మ్యూటేషన్లకు కేవైసీ తప్పనిసరిగా మారింది. పట్టాదారు విధిగా బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు అందించాలి. కొందరి వేలిముద్రలు అరిగిపోతే డిజిటల్ సంతకం చేయడం కుదరట్లేదు. దీంతో మ్యూటేషన్లు నిలిచిపోతున్నాయి. ►భూ ప్రక్షాళన సమయంలో కాస్రా పహణీ విస్తీర్ణంతో సరిపోలకపోయినా హడావుడిగా వివరాలు నమోదు చేయడం ప్రస్తుతం సమస్యగా మారింది. తాజాగా ఆ వివరాలు కాస్రాతో సరిపోలని కారణంగా మ్యూటేషన్లు కావట్లేదు. ►సర్వర్ పగటిపూట పనిచేయట్లేదు. ►ఒక పట్టాదారు ఒకే సమయంలో ముగ్గురికి భూమిని విక్రయిస్తే, ఆ భూమికి సంబంధించి మ్యూటేషన్లు ఒకేసారి చేయడం వీలు కావట్లేదు. ఒకరికి పూర్తయిన తర్వాతే మరొకరివి చేయాల్సి వస్తోంది. దీంతో ఒక్కో దరఖాస్తు మధ్య కనీసం 20 రోజుల సమయం పడుతోంది. ►భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ఆధార్ వివరాలను సమర్పించని రైతుల ఆధార్ నంబర్ ఇప్పుడు నమోదు చేయాలంటే ఆర్డీవో అనుమతి తీసుకోవాల్సివస్తోంది. ఏడాదిగా చక్కర్లు నాకు ఐదెకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన అనంతరం జారీ చేసిన పాస్ బుక్కులో మూడెకరాలు మాత్రమే నమోదు చేశారు. మిగిలిన రెండెకరాలు నమోదు చేయించుకునేందుకు ఏడాదిగా తిరుగుతున్నా.. సర్వర్ డౌన్, ఆన్లైన్ పనిచేయట్లేదని చెబుతున్నారు. – జంగారెడ్డి, అగర్మియాగూడ, కందుకూరు మండలం, రంగారెడ్డిజిల్లా. చెప్పులరిగేలా తిరుగుతున్నా.. మొండిగౌరెల్లి గ్రామంలో 2017లో సర్వేనంబరు 106, 109లో 3–16 ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. ఈ భూమి ఆన్లైన్లో నమోదు కోసం నాలుగు నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టు తిరుగుతున్నా. తహశీల్దార్‌ను కలసి భూ రికార్డులు సమర్పించా. కానీ నేటికి ఆన్లైన్లో నమోదు కాకపోగా.. తనకు భూమి అమ్మిన రైతుకే పట్టాదారు పాసుపుస్తకం వచ్చింది. రైతుబంధు సాయం కూడా అతడికే ఇస్తున్నారు. – కొలను రమాదేవి, మొండిగౌరెల్లి, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా -
పైసలిస్తేనే పాస్‌బుక్
నర్సంపేట: ఈ సంఘటన మరువకముందే నర్సంపేట డివిజన్ పరిధిలోని ఓ మండల తహసీల్దార్ తతంగం బయట పడింది. ధరణి వెబ్సైట్ ద్వారా రైతులకు పట్టాదార్ పుస్తకాలు ఇవ్వాలంటే పైసలు ముట్టాల్సిందేనని, తనకు ప్రతిరోజు మండల వీఆర్వోలంతా కలసి రోజుకు 10 వేలు ముట్టజెప్పాలని హూకుం జారీ చేసినట్లు సమాచారం. దీంతో బెంబేలెత్తిన వీఆర్వోలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వద్దకు చేరుకుని గోడు వెల్లబోసుకున్నారు. అవసరాన్ని ఆసరాగా చేసుకొని.. రైతుల భూ రికార్డులను ప్రక్షాళన చేసి రైతులందరికీ ఉచితంగా పట్టాదార్ పాసు పుస్తకాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేళ్ల క్రితం బృహత్తర పథకాన్ని తీసుకువచ్చారు. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించారు. ఎన్నికలు ముగిశాయి. గ్రామాల్లో ఇంకా చాలా మంది రైతులకు పట్టాదారు పుస్తకాలు అందించాల్సి ఉంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అందరికి పట్టాలు ఇవ్వడం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధరణి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి రెండు నెలలవుతోంది. పట్టాలు లేని రైతులంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అదనుగా భావించి సదరు తహసీల్దార్ రోజువారీగా రూ.10వేలు ఇచ్చి పనులు చేయించుకోండని గత కొన్ని రోజులుగా వీఆర్వోలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. అటు రైతులను డబ్బులు అడగలేక.. ఇటూ తహసీల్దార్‌కు ఇవ్వలేక.. వీఆర్వోలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదే మండలంలోని కొన్ని గ్రామాల రైతులు నేరుగా అనేకసార్లు గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు విన్నవించారు. కార్యాలయం ఎదుట రాస్తారోకోలు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు సైతం ట్విట్టర్ ద్వారా ఓ రైతు పోస్టు చేసినట్లు తెలిసింది. అయినా ఫలితం లేదు.. ఇదిలా ఉండగా సదరు తహసీల్దార్ తన సొంతంగా గ్రామాల్లో ఏజెంట్లను పెట్టుకుని డబ్బులు ఇ చ్చిన వారి ఫైళ్లు మాత్రమే క్లియర్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. రైతులకు ఎలాంటి డబ్బులు లేకుండా పట్టా పుస్తకాలు ఇవ్వాలని ము ఖ్యమంత్రి ఖరాఖండిగా చెప్పినా రెవెన్యూ అధికా రుల తీరులో మార్పు రాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి లంచాలు తీసుకునే అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు సకాలంలో ధరణి వెబ్సైట్ ద్వారా పాస్‌బుక్‌లు అందించాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం.. పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నరన్న విషయం ఇప్పటికయితే నా దృష్టికి రాలేదు. రాత పూర్వకంగా ఫిర్యాదులు వస్తే విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ధరణి వెబ్సైట్ ద్వార పట్టా పుస్తకాలు అందించే క్రమంలో ఎలాంటి అవినీతికి తావులేదు. అవినీతి జరిగితే సహించేది లేదు.. – రవి, నర్సంపేట, ఆర్డీఓ -
ఏసీబీ పంజా!
ఊట్కూర్ (మక్తల్): మండల తహసీల్దార్ కార్యాలయ చరిత్రలో మొదటిసారిగా ఏసీబీ అధికారులు పంజా విసిరారు. పట్టా మార్పిడికి లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ.. రూ.10 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంఘటన శుక్రవారం కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ కథనం ప్రకారం.. మండలంలోని పెద్దజట్రం గ్రామానికి చెందిన కొండారెడ్డి పేరుపై పెద్దజట్రం శివారులో 13 ఎకరాల భూమి ఉంది. ఆయనకు కుమారుడు చెన్నారెడ్డి, కూతురు శ్రీదేవి ఉన్నారు. అయితే కూతురు వివాహ సమయంలో 6 ఎకరాల భూమిని ఆమె పేరుపైన మార్పిడి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై భాగ పరిష్కారంలో బాగంగా తన అక్క శ్రీదేవి పేరుపైన 6 ఎకరాల భూమిని పేరు మార్పు చేయాలని కోరుతూ చెన్నారెడ్డి గత రెండు నెలల క్రితం ఆర్ఐ సతీష్‌కుమార్‌రెడ్డికి దరఖాస్తు చేశాడు. ఆయన పేరు మార్పిడి చేయడానికి కుదరదని, పట్టాదారు బతికి ఉన్నందున సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దానపత్రం కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. అయితే చెన్నారెడ్డి మళ్లీ ఆర్ఐని కలిసి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డబ్బులు అధికంగా అవుతాయని ఇక్కడే పేరు మార్చి ఇవ్వాలని కోరడంతో రూ.10 వేలు లంచం ఇస్తే మారుస్తానని ఒప్పందం కుదిరింది. ఈ విషయమై చెన్నారెడ్డి గత నెల 16 తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించడాడు. వారి ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న టీకొట్టు దగ్గర చెన్నారెడ్డి ఆర్ఐ సతీష్‌కుమార్‌రెడ్డికి రూ.10 వేల నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్ఐని శనివారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు పేర్కొన్నారు. ఆర్ఐ ఇంట్లో సోదాలు ఊట్కూరులో ఆర్ఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు మరోవైపు నర్వ మండలం కు మార్‌లింగంపల్లిలోని ఆర్ఐ సతీష్‌కుమార్‌రెడ్డి ఇం ట్లోనూ ఏసీబీ సీఐలు వెంకట్, రఘుబాబు ఏకకాల ంలో సోదాలు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేర కు ఆర్ఐపై ఏసీబీ యాక్ట్ 7ఎ, 7బీ సెక్షన్ల కింద కేసు లు నమోదు చేశామని డీఎస్పీ పేర్కొన్నారు. దాడు ల్లో సీఐ లింగస్వామి, కమల్‌కుమార్ పాల్గొన్నారు. మొదటిసారి దాడులు ఊట్కూర్ తహసీల్దార్ కార్యాలయంపై మొదటి సారి ఏసీబీ దాడులు జరిగినట్లు తహసీల్దార్ తిరుపతయ్య తెలిపారు. కిందిస్థాయి అధికారులు డబ్బు లు అడుగుతున్నట్లు ఇప్పటి వరకు తనకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఏసీబీ దాడులు జరిగా యని తెలియడంతో స్థానికులు అధిక సంఖ్యలో కార్యాలయానికి తరలివచ్చారు. లంచం అడిగితే సమాచారమివ్వండి ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు వివిధ పనుల నిమిత్తం లంచం అడిగితే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాయాల్లో అవినీతిని అరికట్టేందుకు టోల్‌ఫ్రీ నం.1064 ఏర్పాటు చేశామన్నారు. బాధితులు సెల్ నం.94913 05609కు గాని లేకపోతే మహబూబ్‌నగర్‌లోని ఏసీబీ కార్యాలయంలో గాని నేరుగా సంప్రదించవచ్చన్నారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. -
ఓటోత్సాహం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటు విలువపై యువత చైతన్యమైంది. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు హక్కు పొందేందుకు యువతీ యువకులు పోటీపడ్డారు. ఆరు నెలల్లోనే రెండు లక్షలకుపైగా యువత నూతన ఓటర్లుగా నమోదు కావడం విశేషం. ఎన్నికల విభాగం తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితా ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 31 వరకు కొత్తగా 2.05 లక్షల మంది ఓటు హక్కు పొందారు. ఇందులో 90 శాతం మంది 18 ఏళ్లు నిండి 19వ ఏట అడుగు పెట్టినవారేనని అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఓటును మార్చుకున్నట్లు వివరిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో పట్టణ ప్రాంత, మార్చిలో గ్రామీణ ప్రాంత ఓటర్ల తుది జాబితాలు విడుదలయ్యాయి. ఆ సమయంలో జిల్లా ఓటర్లు 24.50 లక్షలు. ఆ తర్వాత చాలా మంది ఓటరుగా నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ శాఖలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఓటు విలువపై విస్తృతంగా చైతన్యం కల్పించాలి. ఓటరుగా నమోదు చేసుకునేందుకు కళాశాలల్లో ప్రత్యేక క్యాంపులను సైతం నిర్వహించారు. వీటి ఫలితం గానే కొత్తగా ఓటు హక్కు పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజా ముసాయిదా జాబితా ప్రకారం జిల్లా ఓటర్లు 26.56 లక్షలు. అభ్యంతరాల స్వీకరణ.. ఓటరు ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు, ఫిర్యాదులకు అవకాశం కల్పించారు. ముసాయిదా ప్రతులను అన్ని గ్రామ పంచాయతీ, తహసీల్దార్ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ని (ఆర్డీఓ) నోటీస్ బోర్డుల్లో అందుబాటులో ఉంచేందుకు యంత్రాంగం ఏర్పా ట్లు చేస్తోంది. కలెక్టరేట్ నుంచి ప్రతులను ఆయా ప్రాంతాలకు చేర్చేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 31వ తేదీ వరకు అభ్యంతరాలు తెలిపేందుకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత నవంబర్ 30 నాటికి వాటిని పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన తుది జాబితా విడుదల చేయనున్నారు. ఈ మధ్యలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడితే తుది జాబితా విడుదల తేదీ మారనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 45 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ సమయంలోనే తుది జాబితాను విడుదల చేస్తారని పేర్కొన్నారు. నమోదుకు మరోసారి అవకాశం.. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులంతా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలో ఓటు హక్కు పొందాలంటే జిల్లా పరిధిలో ఏదేని ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి. ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. పుట్టిన తేదీ, నివాస చిరునామా ఉంటే సరిపోతుంది. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో సంప్రదించి ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. లేదంటే మీ–సేవ ద్వారాగాని ఓటు హక్కు పొందవచ్చు. అక్టోబర్ 31వ తేదీ వరకు అభ్యంతరాలు తెలిపేందుకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత నవంబర్ 30 నాటికి వాటిని పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన తుది జాబితా విడుదల చేయనున్నారు. ఈ మధ్యలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడితే తుది జాబితా విడుదల తేదీ మారనున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
రిజిస్ట్రేషన్ @ తహసీల్
ఇచ్చోడ(బోథ్) : తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 19 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద మూడు మండలాలను ఎంపిక చేసింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్, మంచిర్యాల జిల్లా నెన్నెల, నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల విధానం అమలుకు రంగం సిద్ధమైంది. భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్‌ను రైతులకు చేరువ చేయడంలో భాగంగా మండలంలోనే రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని తహసీల్దార్లకు అప్పగించింది. స్థానిక తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ వ్యవహారాలను నిర్వహించనున్నారు. జూన్ 2 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సబ్ రిజస్ట్రార్ కార్యాలయాలు లేని అన్ని మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయనున్నారు. భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లకు అప్పగించేందుకు రిజిస్ట్రేషన్ చట్టం 1908 ప్రకారం జీవో ఎంఎస్ 94, 95ను ప్రభుత్వం గత ఐదు రోజుల క్రితం విడుదల చేసింది. దీంతో మూడు మండలాల్లో శనివారం నుంచి రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఎనిమిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎనిమిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్ జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్, ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా మంచిర్యాల, లక్సెట్టిపేటలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయలు ఉన్నాయి. ప్రతీ సంవత్సరం భూముల క్రయవిక్రయాలతోపాటు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు, వివాహ నమోదు, గిఫ్ట్‌డీడ్, భాగస్వామ్య ఒప్పందాలు, ఇçళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్లతోపాటు మరో 20 రకాల సేవలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందిస్తున్నారు. ఈ శాఖ ద్వారా ప్రతీ సంవత్సరం ప్రభుత్వానికి దాదాపుగా రూ.120 కోట్ల నుంచి రూ.180 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆలస్యం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల క్రయవిక్రయాలు, ఆస్తుల మార్పిడితోపాటు పలు సేవల్లో ఆలస్యం జరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. భూముల రిజిస్ట్రేషన్లలో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎలాంటి ప్రమాణాలు పాటించకపోవడం, పాసుపుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవడం, ఒక్కోసారి భూములు విక్రయించిన వారు తిరిగి రెండోసారి విక్రయించడం, ఒకే సర్వే నంబర్‌కు రెండు మూడు సార్లు ఇద్దరు, ముగ్గురుకి విక్రయించడం, సర్వే నంబర్లో ఉన్న విస్తీర్ణం కంటే రిజిస్ట్రేషన్లలో అధికంగా రికార్డు చేయడం, రిజిస్ట్రేషన్లలో భూముల సరిహద్దుల్లో ఎలాంటి ప్రామాణికాన్ని చూడకపోవడం, రైతులు చెప్పిన విధంగా ఆన్లైన్లో నమోదు చేయడంతో గ్రామాల్లో అనేక భూ వివాదాలు రెవెన్యూ ఆధికారులుకు సవాల్‌గా మారాయి. ప్రభుత్వం ప్రతిష్టాకత్మంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో పలు సంఘటనలు వెలుగు చూశాయి. వీటన్నింటినీ అరికట్టేందుకు ప్రభుత్వం తహసీల్ కార్యాలయలో రిజిస్ట్రేషన్ విధానం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నేడు ధరణి వెబ్సైట్ ప్రారంభం రైతులకు భూముల వివరాలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం ఈ నెల 19న ధరణి వెబ్సైట్ ప్రారంభానికి సిద్ధం చేసింది. భూ రికార్డుల నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు రైతులకు అందుబాటులో ఉండేవిధంగా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ వెబ్సైట్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రికార్డులను రెవెన్యూ శాఖ పొందుపర్చనుంది. తహసీల్ కార్యాలయలో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే భూముల, ఆస్తుల క్రయవిక్రయాల వివరాలు వెబ్సైట్లో నమోదు చేసే విధంగా ఈ వెబ్సైట్ రూపుదిద్దుకుందని అధికారులు చెబుతున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న తహసీల్ కార్యాలయాల్లో నూతన భవనాలు నిర్మించకుండానే ఓ గదిలో ఈ సేవలు ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అరకొర వసతుల మధ్య రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తుండడంతో రెవెన్యూ శాఖ అధికారులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అసలే సిబ్బంది కొరతను ఎదుర్కొంటుండుగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల విధానం తహసీల్ కార్యాలయంలో అమలకు నిర్ణయించడంతో రెవెన్యూ సిబ్బందికి సవాల్‌గా మారుతోంది. -
తహసీల్దార్లకు పోస్టింగ్
అనంతపురం అర్బన్: తహసీల్దార్లుగా ఇటీవల పదోన్నతి పొందిన వారికి పోస్టింగ్ ఇస్తూ కలెక్టర్ వీరపాండియన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శీలా జయరామప్పను కేఆర్సీ (కోనేరు రంగరావు కమిటీ) విభాగం తహసీల్దారుగా నియమించారు. అలాగే అనిల్‌కుమార్‌ను ఉరవకొండ తహసీల్దారుగా, రామశేఖర్‌ను రొద్దం తహసీల్దారుగా నిమించారు. పదోన్నతులు కల్పించే క్రమంలో జిల్లాకు చెందిన రామాంజినేయరెడ్డి, నారాయణలను చిత్తూరు జిల్లాకు కేటాయించారు. అయితే వీరిద్దరినీ తిరిగి జిల్లాకే కేటాయిస్తూ సీసీఎల్ఏ ఉత్తర్వులను జారీ చేసింది. వీరికి కూడా త్వరలో పోస్టింగ్స్ ఇస్తామని అధికార వర్గాలు తెలిపాయి.