Online Apply
-
ఇక ఆన్లైన్లోనే.. ఆ సర్టిఫికెట్లు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు మాన్యువల్‌గా రెవెన్యూవర్గాలు జారీ చేస్తున్న 9 రకాల సర్టీఫికెట్లు ఇక నుంచి ఆన్లైన్లోనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో విద్య, ఉద్యోగార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలకు తోడు రెవెన్యూ సంబంధిత రికార్డులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు మీసేవ ద్వారానే ఆన్లైన్లో ఇస్తున్నారు. అయితే, ఈ సర్టీఫికెట్లు ఏడాదిలోపు రెండోసారి తీసుకుంటే మాత్రం మాన్యువల్‌గా తహసీల్దార్ కార్యాలయాలే ఇస్తున్నాయి. ఇప్పుడు ఏడాదిలోపు తీసుకున్నప్పటికీ ఆన్లైన్లో ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్యాప్ సర్టీఫికెట్, పేరు మారి్పడి పత్రం, స్థానికత నిర్ధారణ, క్రీమీలేయర్–నాన్క్రీమీలేయర్, మార్కెట్‌వాల్యూ సర్టీఫైడ్కాపీ, ఖాస్రా, సెస్లా పహాణీలు, ఆర్వోఆర్–ఐబీ రికార్డులు ఇక నుంచి మీసేవకేంద్రాల ద్వారా ఇవ్వాలనుకుంటున్నామని, ఇందుకు సంబంధించిన సమాచారం, సర్టీఫికెట్ ఫార్మాట్లను తమకు పంపాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేశారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే ఈ సమాచారం ఆధారంగా ముందుకెళ్లాలని సీసీఎల్ఏ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ సర్టీఫికెట్ల కోసం మీసేవకేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే, అక్కడి నుంచే వాటిని జారీ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. -
సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు ఇకపై ఆన్లైన్లోనే
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో వ్యవహరించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్‌సైట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం సచివాలయంలో ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫారసు లేఖ జత చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో సంబంధిత దరఖాస్తుదారుల బ్యాంక్ ఖాతా నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. సంబంధిత ఆస్పత్రులకు ఆన్లైన్లోనే పంపించి నిర్ధారించుకున్న తర్వాత అన్ని వివరాలు సరిగ్గా ఉంటే దరఖాస్తును ఆమోదించి చెక్‌ను సిద్ధం చేస్తారు. చెక్‌పై తప్పనిసరిగా దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతా నంబర్ ముద్రిస్తారు. (దీనివల్ల చెక్ పక్కదారి పట్టే అవకాశం ఉండదు) ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్‌లను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు. ఈ నెల 15వ తేదీ తర్వాత సీఎంఆర్ఎఫ్ ధరఖాస్తులను ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. https//cmrf.telangana.gov.in/ సైట్లో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది. -
మైనర్ పాస్‌పోర్ట్ అప్లై చేయాలా.. సింపుల్ ప్రాసెస్ ఇదే!
ఆధునిక కాలంలో చాలా మంది విదేశాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతుంటారు. భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. ఆఖరికి పిల్లలను తీసుకెళ్లాలన్నా తప్పకుండా మైనర్ పాస్‌పోర్ట్ తీసుకోవాల్సిందే. ఈ కథనంలో మైనర్ పాస్‌పోర్ట్ ఎలా తీసుకోవాలి? దానికవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏవి అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పిల్లల కోసం పాస్‌పోర్ట్ పొందాలనుకునేవారు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న 7 నుంచి 15 రోజుల లోపల ఇంటికి వస్తుంది. మైనర్ పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్.. జనన ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్) ఆధార్ కార్డ్ లేదా తల్లిదండ్రుల అడ్రస్ ప్రూఫ్ తల్లిదండ్రుల పాస్పోర్ట్స్ (అందుబాటులో ఉంటే) తల్లిదండ్రుల జాతీయతకు సంబంధించిన ప్రూఫ్ (పిల్లలు భారతదేశం వెలుపల జన్మించినట్లయితే) ఇదీ చదవండి: పద్మజ కుమారి పర్మార్.. రాజవంశంలో పుట్టింది మరి.. అలాంటి బుద్ధులే వస్తాయి! ఆన్లైన్లో అప్లై చేయడం ఎలా.. మైనర్ పాస్‌పోర్ట్ సేవా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి, లాగిన్ ఐడీ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. అప్లికేషన్ ఫారమ్ పూర్తిగా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఆ తరువాత దానికయ్యే అమోంట్ చెల్లించాల్సి ఉంటుంది. అమౌంట్ చెల్లించిన తరువాత పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయాలి. మీరు అపాయింట్మెంట్ సమయంలో అప్లికేషన్ ఫారమ్, ఫీజు చెల్లించిన రసీదు వంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. అపాయింట్మెంట్ రోజు మీ బిడ్డను పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి తీసుకెళ్లాలి. పాస్‌పోర్ట్ అధికారి మీ అప్లికేషన్ & డాక్యుమెంట్లను పరీక్షించి అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్దారించుకుంటాడు. ఆ తరువాత పాస్‌పోర్ట్ ప్రాసెస్ జరుగుతుంది. అప్లికేషన్స్ సబ్మిట్ చేసిన తరువాత మీకు అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ లభిస్తుంది. దీని ద్వారా పాస్‌పోర్ట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ సిద్దమైన తరువాత మీరు వ్యక్తిగతంగా తెచ్చుకోవచ్చు, లేదా మీ చిరునామాకు డెలివరీ చేసుకోవచ్చు. -
కార్డులెస్.. లైసెన్స్
వాహనంపై వెళుతున్నప్పుడు ఎక్కడో ఒకచోట విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ లేదా రవాణాశాఖ అధికారులు ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ చూపించు అని అడుగుతుంటారు. ఆ సమయంలో పత్రాలు అందుబాటులో లేని వాళ్లు సార్ ఇంట్లో పెట్టి వచ్చాననో, మర్చిపోయాననో చెప్పి అక్కడి నుంచి బయటపడుతుంటాం. కానీ ఇక నుంచి ఆ ఇబ్బంది లేదు. డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీకి రవాణాశాఖ నూతన విధానాన్ని తీసుకొచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ వంటివి మన ఫోన్లోనే భద్రపరుచుకుని, తనిఖీల సమయంలో చూపించే వెసులుబాటు కలి్పంచింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల ఆర్సీల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రవాణాశాఖ ఇటీవల వరకు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి లైసెన్స్‌లు జారీ చేసేది. టూ వీలర్, ఫోర్ వీలర్, హెవీ వెహికల్ లైసెన్స్‌లు.. ఇలా పలురకాల లైసెన్స్‌లను మంజూరు చేసేది. ఇందుకోసం రవాణా శాఖ ప్రత్యేకంగా తయారు చేసిన కార్డులను ప్రింట్ చేసి లైసెన్స్ కార్డులుగా ఇప్పటి వరకు ఇస్తూ వచ్చింది. దీని కోసం పోస్టల్ చార్జీలు, లైసెన్స్ ఫీజు కింద రూ.235 వరకు చెల్లించాల్సి ఉండేది. అయితే ప్రస్తుతం రవాణాశాఖ ఈ విధానానికి స్వస్తి పలికింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త విధానాన్ని ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం కార్డు లెస్ డ్రైవింగ్ లైసెన్స్‌లను మంజూరు చేస్తున్నారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వాహనదారుడికి అన్ని డ్రైవింగ్ టెస్టులు నిర్వహించిన తరువాత లైసెన్స్‌ను మంజూరు చేస్తారు. అయితే నూతన విధానంలో ఎలాంటి కార్డులు ఇవ్వకుండా కేవలం ఆన్లైన్లో రవాణాశాఖ మంజూరు చేసిన లైసెన్స్ పత్రాలను వాహనదారుడి ఫోన్‌కు పంపుతారు. ఆ పత్రాలను వాహనదారుడే నేరుగా ప్రింట్ తీసుకోవచ్చు లేదా తన ఫోన్లోనే భద్రపరుచుకోవచ్చు. అధికారులు అడిగినప్పుడు ఫోన్లోనే తన డ్రైవింగ్ లైసెన్స్‌ను చూపే అవకాశాన్ని కలి్పంచారు. ఈ విధానంలో లైసెన్స్ కోసం వాహనదారుడు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దేశంలో ఎక్కడైనా తనిఖీకి వీలు దేశం మొత్తం ఒకే డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలా కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానాన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలా వద్దా అనే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా నూతన డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ లైసెన్స్ పత్రాలను మన ఫోన్లో, డిజి లాకర్‌లోనూ భద్రపరుచుకోవచ్చు. రవాణాశాఖ మంజూరు చేసే ఈ పత్రాలను దేశంలో ఎక్కడైనా తనిఖీల సమయంలో అధికారులకు చూపించవచ్చు. సదరు అధికారికి ఏదైనా సందేహం ఉంటే వెంటనే ఆన్లైన్లో చెక్ చేస్తే సదరు వాహనదారుడికి సంబంధించి పూర్తి సమాచారం ఉంటుంది. పాత విధానంలో ఈ సదుపాయం ఉండేది కాదు. వాహనదారుడి వివరాలు తెలుసుకోవడం, లైసెన్స్ సరైనదా కాదా అని పరిశీలించడం కాస్త కష్టతరంగా ఉండేది. కానీ నూతన విధానంలో తనిఖీ అధికారులు వాహనదారుడి పూర్తి సమాచారం క్షణాల్లో పొందవచ్చు. ఈ విధానం తనిఖీలకు సులభతరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌కి కార్డులు ఉండవు నూతన విధానంలో లైసెన్స్‌ల మంజూరు చేసిన తరువాత ఎలాంటి ప్రింటెడ్ కార్డులు ఇవ్వరు. కేవలం ఆన్లైన్లో మాత్రమే లైసెన్స్ పత్రాలను పంపుతారు. వీటిని వాహనదారుడు ప్రింట్ తీసుకుని తన వద్ద ఉంచుకోవచ్చు. అలాగే ఫోన్లో కూడా భద్రపరుచుకోవచ్చు. అధికారుల తనిఖీల సమయంలో ఈ పత్రాలను చూపితే సరిపోతుంది. – ఎస్కే ఎండీ రఫి, ఎంవీఐ, కందుకూరు -
సగానికిపైగా తగ్గిన దరఖాస్తులు
భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాల నోటిఫికేషన్‌కు ఆన్లైన్లో దరఖాస్తు గడువు ముగిసింది. దరఖాస్తు గడు వు పెంచినా ఈ ఏడాది ఆన్లైన్లో ఎక్కువగా దరఖాస్తు చేసుకోలేదు. ఈ ఏడాది 1,404 జనరల్ సీట్లు, 96 ప్రత్యేక సీట్లు, 105 గ్లోబల్ సీట్లకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. మొత్తం 1,605 సీట్లకుగాను కేవలం 13,538 దరఖాస్తులు వచ్చినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ సతీశ్‌కుమార్ తెలిపారు. జూలై 3న మెరిట్జాబితాను విడుదలచేసి ఎంపికైన విద్యార్థులకు జూలై 7 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తగ్గిన దరఖాస్తులు: నాలుగేళ్లుగా 20 వేలకుపైగానే ట్రిపుల్‌ఐటీలో దరఖాస్తులు రాగా, ఈ ఏడాది సగానికి తగ్గిపోయాయి. బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు కోసం వేలాదిమంది పోటీపడేవారు. ప్రారంభం నుంచే ఇక్కడ తీవ్రమైన పోటీ ఉండేది. ఈ ఏడాది అనుకోని విధంగా దరఖాస్తులు తగ్గిపోయాయి. వరుస ఘటనలే కారణమా.. రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ దర ఖాస్తుల నోటిఫికేషన్ వెలు వడిన సమయంలోనే ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో తల్లిదండ్రులు ఇక్కడ చదివించేందుకు అంతగా ఆసక్తి కనబరచడంలేదు. నిబంధనలపేరిట ట్రిపుల్‌ఐటీని రహస్య క్యాంపస్‌గా తయారు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిశీలన వేగవంతం బాసర ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల చదువు కోసం ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. దరఖాస్తుల ప్రక్రియ వేగవంతంచేసేందుకు 60 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తికానుంది. – ప్రొఫెసర్ వెంకటరమణ, ఇన్చార్జి వీసీ -
‘ఆధార్ కార్డు’లో అడ్రస్ మార్పు మరింత ఈజీ
న్యూఢిల్లీ: ఆధార్ కార్డులో చిరునామాను మార్చుకోవడం మరింత సులభతరంగా మారింది. ఇంటిపెద్ద(హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ) అంగీకారంతో ఆధార్ పోర్టల్‌లో (ఆన్లైన్లో) చిరునామా సులువుగా మార్చుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్త విధానంలో ఇంటి పెద్దతో సంబంధాన్ని ధ్రువీకరించే ఏదైనా పత్రం సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, మార్కుల షీట్, మ్యారేజ్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు తదితర ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించవచ్చు. కానీ, ఇందులో ఇంటిపెద్ద పేరు, దరఖాస్తుదారుడి పేరు, వారిద్దరి మధ్య సంబంధం గురించి తప్పనిసరిగా ఉండాలి. ఆన్లైన్లో ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ ద్వారా అడ్రస్ మారుతుంది. ఇంటిపెద్ద ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిలేషన్‌షిప్‌ను నిర్ధారించే డాక్యుమెంట్ లేకపోతే ఇంటిపెద్ద సెల్ఫ్–డిక్లరేషన్ సమర్పించవచ్చు. ఇది యూఐడీఏఐ నిర్దేశించిన ఫార్మాట్లో ఉండాలి. ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవడానికి తగిన ధ్రువపత్రాలు లేని వారికి ఈ కొత్త విధానంతో ఏంతో ప్రయోజనం చేకూరుతుందని యూఐడీఏఐ తెలియజేసింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినవారికి సైతం ఉపయోగకరమని వివరించింది. ఇదీ చదవండి: ఢిల్లీ దారుణం: వెలుగులోకి మరిన్ని నివ్వెరపరిచే నిజాలు -
‘మీ సేవ’లో దరఖాస్తు చేసుకున్నా.. జీహెచ్ఎంసీకి వెళ్లాల్సిందేనట..!
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట సర్కిల్లోని సైదాబాద్‌కు చెందిన ఓ బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. రాబోయే మార్చిలో పబ్లిక్ పరీక్షలకు అతను హాజరు కావాల్సి ఉంది. స్కూల్ యాజమాన్యం ఇచ్చిన సంబంధిత ఫారమ్‌లో పూర్తి వివరాలు నింపి జత చేయాల్సిన సర్టిఫికెట్లు బడిలో సమర్పించాడు. విద్యార్థి బర్త్ సర్టిఫికెట్లో తల్లి పేరు ఫారమ్‌లో తప్పుగా పేర్కొనడంతో స్కూల్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. బర్త్ సర్టిఫికెట్లో తల్లి పేరు సరిచేసుకొని సమర్పించాలని సూచించారు. బాలుడి తల్లిదండ్రులు జీహెచ్ఎంసీ కార్యాలయంలో సంప్రదించగా, మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఇంట్లో మరో సంతానం బర్త్ సరిఫికెట్‌లో తల్లిపేరు సరిగా ఉంటే సదరు బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్ జతచేసి మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిచేస్తారని తెలిపారు. మీ–సేవలో ఇచ్చిన డిక్లరేషన్ ఫారమ్‌లో ఇద్దరు గెజిటెడ్ అధికారుల సంతకాలు పెట్టించడంతో పాటు, నోటరీ, విద్యార్థి తల్లి ఆధార్, పాన్‌కార్డు, తమ్ముడి బర్త్ సర్టిఫికెట్ సైతం జత చేస్తూ మీ సేవ కేంద్రం ద్వారా జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేశారు. వారం రోజులైనా దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నట్లు మీ–సేవలో పేర్కొన్నారు. దరఖాస్తు పరిష్కారానికి ఏం చేయాలని అడిగితే.. మేం చేసేదేమీ లేదని, జీహెచ్ఎంసీ నుంచి ఫోన్ రాలేదా? ఆని ప్రశ్నించారు. రాలేదని తెలపగా తామేం చేయలేమన్నారు. తెలిసిన వారి ద్వారా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సంబంధిత ఉన్నతాధికారిని సంప్రదించగా.. ఆన్లైన్లో పరిశీలించి దరఖాస్తు రిజెక్ట్ అయినట్లు తెలిపారు. కనీసం రిజెక్ట్ అయిన విషయం కానీ.. ఎందుకు రిజెక్ట్ చేశారో కానీ మొబైల్‌కు సమాచారం అందలేదు. సదరు ఉన్నతాధికారి సంబంధిత సర్కిల్ అధికారులను ఫోన్లో వివరణ కోరగా, దరఖాస్తుతో జత చేసిన జిరాక్స్‌ల ఒరిజినల్స్ కావాలని తెలిపారు. దాంతో విస్తుపోయిన అధికారి ఎందుకని ప్రశ్నిస్తే.. ఇటీవల కొందరు ఫోర్జరీ పత్రాలిస్తున్నందున.. తాము పరిశీలన కోసం ఒరిజినల్స్ కోరుతున్నామని తెలిపారు. కనీసం ఒరిజినల్స్ తేవాల్సిందిగా దరఖాస్తుదారుకు సమాచారం ఇచ్చారా అంటే లేదని చెప్పారు. మరి వారికెలా తెలుస్తుంది..? అంటే సమాధానం లేదు. ఇలా ఉంది జీహెచ్ఎంసీ, మీ–సేవల పని తీరు. చదవండి: Banjara Hills: కళ్లల్లో కారంకొట్టి బ్యాగ్ లాక్కొని ఉడాయింపు.. ట్విస్ట్ ఏంటంటే! స్కాన్ కాపీలు పంపినా.. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకే ప్రభుత్వం అన్ని సర్వీసుల్ని ఆన్లైన్ ద్వారా అందిస్తోంది. అందులో భాగంగానే బర్త్ సర్టిఫికెట్ల కోసం.. సవరణల కోసం సైతం ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. అవసరమైన ఒరిజినల్ పత్రాలు మీ సేవలో స్కాన్ చేసి, సంబంధిత కార్యాలయాలకు పంపుతారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఒరిజినల్స్వే స్కాన్ చేసి ఆన్లైన్లో పంపినప్పుడు మళ్లీ ఒరిజినల్స్ కావాలనడం.. అది సైతం కనీసం సమాచారం తెలపకపోవడం వెనక మతలబేమిటన్నది అంతుచిక్కడం లేదు. పైసల కోసమే.. జీహెచ్ఎంసీ వ్యవహారాలు తెలిసిన వారు అది పైసల కోసమని చెబుతున్నారు. సర్టిఫికెట్ల అవసరం ఉన్నవారూ ఎలాగూ వారి పనికోసం నానా తంటాలు పడతారు. అలా తిరిగి తిరిగి తమ వద్దకే వస్తారు కాబట్టి.. అప్పుడు లేనిపోని కొర్రీలు పెట్టి.. ఇతరత్రా భయపెడతారని, అడిగినంత ఇచ్చుకుంటే మాత్రం పని చేస్తారని పేర్కొన్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అవకతవకలు జరుగుతున్నాయని, అవినీతికి పాల్పడుతున్నారనే ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వం ఒక విధంగా అవినీతిని కట్టడి చేయాలనుకుంటే.. అవినీతికి అలవాటు పడ్డవారు మరో విధంగా ఇలా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తనిఖీలు లేకనే.. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సర్కిల్ కార్యాలయాలను కనీసం తనిఖీలు చేయకపోవడం.. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్టించుకోకపోవడంతో సర్కిళ్లు, జోనల్ కార్యాలయాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఎన్ని సార్లు మొత్తుకున్నా వారికి చీమకుట్టినట్లయినా ఉండటం లేదు. ప్రజల ఈ ఇబ్బందులను సంబంధిత ఉన్నతాధికారి దృష్టికి తేగా, ఇకపై అలా జరగకుండా చూస్తామని మొక్కుబడి సమాధానమిచ్చారు. అంతేకాదు.. డబ్బులడిగినట్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతారట. జీహెచ్ఎంసీ సిబ్బందికి, మీ సేవ కేంద్రాల సిబ్బందికి మధ్య పరస్పర సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. మీ సేవలో దరఖాస్తు చేసినప్పుడే.. పని పూర్తయ్యేందుకు జీహెచ్ఎంసీలో కలవాల్సిన వారి గురించి చెబుతారని సమాచారం. ఇదీ.. జీహెచ్ఎంసీ.. మీ సేవ తంతు. -
తీరు మారింది, లోన్ల కోసం బ్యాంకులు చుట్టూ తిరగడం మానేశారు
న్యూఢిల్లీ: రుణం తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్లడం, పేపర్లకు పేపర్లు నింపి సంతకాలు చేయడం వంటి సాంప్రదాయక ‘ఆఫ్‌లైన్’ విధానాలకు రుణ గ్రహీతలు క్రమంగా దూరం అవుతున్నారు. రుణం పొందేందుకు ఆఫ్‌లైన్ ద్వారా కాకుండా ఆన్‌లైన్‌కు మొగ్గుచూపే కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రత్యేకించి మిలీనియల్స్ (1977 నుంచి 1995 మధ్య జన్మించిన వారు) ఈ విషయంలో ముందు ఉంటున్నారు. పలు సంవత్సరాల నుంచీ మొదలైన ఈ వైఖరి కోవిడ్–19 సవాళ్లతో మరింత వేగం పుంజుకుంది. డిజిటల్ సేవలు విస్తరించడం కూడా ఈ విషయంలో కలిసి వస్తున్న ఒక అంశం. ఆయా అంశాలపై ఆర్థిక సంస్థ– హోమ్ క్రెడిట్ ఇండియా నిర్వహించిన వార్షిక సర్వే ’హౌ ఇండియా బారోస్’ (హెచ్ఐబీ) తెలిపిన అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి... ►దాదాపు 40 శాతం మంది రుణగ్రహీతలు రుణాలు తీసుకోవడానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై సుముఖత వ్యక్తం చేశారు. ఇటీవల వరకూ ఇది కేవలం 15 శాతంగా ఉండేది. ►హైదరాబాద్‌సహా ఢిల్లీ, జైపూర్, బెంగళూరు, భోపాల్, ముంబై, కోల్‌కతా, పాట్నా, రాంచీల్లో ఈ అధ్యయనం జరిగింది. 21–45 సంవత్సరాల వయస్సు మధ్య వయస్సువారు 1,200 మంది (హోమ్ క్రెడిట్ కస్టమర్లు) సర్వేలో పాల్గొన్నారు. వీరందరూ నెలకు రూ. 30,000 కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్నారు. ►గత సంవత్సరంతో పోల్చితే 2021లో గృహ వ్యయాల కోసం తీసుకునే రుణాలు గణనీయంగా తగ్గాయి. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం దీనికి కారణం. రుణ గ్రహీత అవసరాల ఆధారిత రుణం నుండి కోరిక ఆధారిత రుణాల వైపు మొగ్గుచూపడం పెరుగుతుండడం కనిపిస్తోంది. ►మొత్తం రుణ గ్రహీతల్లో 28 శాతం మంది వ్యాపారం ఏర్పాటు లేదా విస్తరణకు సంబంధించి రుణాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత చిన్న రుణాలు తీసుకునే వారు 26 శాతం మంది ఉన్నారు. వీటిలో అధికంగా రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, కండీషనర్లు, కన్జూమర్ డ్యూరబుల్స్ కొనుగోళ్లు ఉన్నాయి. మిగిలిన వాటిలో గృహ పునరుద్ధరణ, కొత్త నిర్మాణం (13 శాతం), వైద్య అత్యవసర పరిస్థితి (2 శాతం), వాహన రుణం (9 శాతం), వివాహం (3 శాతం), విద్యా రుణం (2 శాతం), పెట్టుబడులు, మునుపటి రుణం చెల్లింపుల (1 శాతం) వంటివి ఉన్నాయి. ►ప్రాంతీయంగా చూస్తే, బెంగుళూరు, హైదరాబాద్ కరోనా మహమ్మారి సవాళ్ల నుండి వేగంగా కోలుకుంటున్నాయి. హైదరాబాద్‌లో 41 శాతం (సర్వేలో పాల్గొన్న వారిలో) మంది వ్యాపార పునరుద్ధరణ కోసం రుణాలు తీసుకున్నారు. బెంగళూరు విషయానికి వస్తే, కొనుగోలు కోసం రుణం తీసుకున్న వారు 42 శాతం మంది ఉన్నారు. ►ఇంటర్నెట్ సౌలభ్యం అందుతున్న ప్రజల విషయానికి వస్తే, బిహార్, జార్ఖండ్‌లు వరుసగా 24 శాతం, 29 శాతంతో చివరి స్థానంలో ఉన్నాయి. కాగా పాట్నా, రాంచీలలో మొబైల్ ఫోన్ల వినియోగం పరంగా డిజిటల్ అక్షరాస్యత వరుసగా 64 శాతం మరియు 65 శాతంగా నమోదైంది. చదవండి: దేశంలో క్రిప్టో చట్టబద్ధత ఖాయం! -
నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2021కు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుందని పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ పేర్కొంది. వాస్తవానికి దరఖాస్తు ప్రక్రియ ఆదివారం నుంచే ప్రారంభం కావలసి ఉంది. కానీ ఈ పరీక్షకు అర్హత అయిన జేఈఈ మెయిన్–2021 ఫలితాలు వెలువడక పోవడంతో దరఖాస్తు ప్రక్రియను ఒక రోజు వాయిదా వేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజును సెప్టెంబర్ 20 వరకు చెల్లించవచ్చు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు అడ్మిట్ కార్డులు సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష అక్టోబర్ 3వ తేదీన జరగనుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష ఉంటుంది. వాస్తవానికి ఈ పరీక్ష జూలై 3న నిర్వహించాల్సి ఉండగా, కరోనా కారణంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ఆలస్యం కావడంతో అక్టోబర్ 3కు వాయిదా పడింది. అభ్యర్థులకు వారి రెస్పాన్స్ షీట్లు అక్టోబర్ 5వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 10న ప్రాథమిక కీని విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అభ్యర్థుల అభిప్రాయాలను ఆధారాలతో సహా అక్టోబర్ 11వ తేదీ వరకు సమర్పించవచ్చు. అక్టోబర్ 18న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కోరుకొనే అభ్యర్థులు సంబంధిత ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష (ఏఏటీ)కు అక్టోబర్ 15, 16 తేదీల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ పరీక్ష అక్టోబర్ 18న నిర్వహిస్తారు. ఏఏటీ ఫలితాలను అక్టోబర్ 22న విడుదల చేస్తారు. ఐఐటీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రాల లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేస్తుండడంతోపాటు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఫలితాల ప్రకటన ఆలస్యమవుతూ వచ్చింది. జేఈఈ మెయిన్స్‌లో మెరిట్ సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులు. ఆదివారం అర్ధరాత్రి లేదా సోమవారం ఉదయానికి జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడే అవకాశముంది. -
మీ ఆధార్ కార్డు ఒరిజినలేనా? ఇలా చెక్ చేస్కోండి
నకిలీ వ్యవహారాలు మామూలు జనాలకు పెద్ద ఇబ్బందులే తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతీదానికి ముడిపడి ఉన్న ఆధార్ విషయంలోనూ ఫేక్ కుంభకోణాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఆధార్ తీసుకుంటున్నవాళ్లు, లేదంటే మధ్యవర్తి ద్వారా కార్డులు సంపాదించుకుంటున్న వాళ్లు.. తమ 12 డిజిట్ నెంబర్లను ఆధార్ నెంబర్‌గా ఫిక్స్ అయిపోయి అన్నిచోట్లా సమర్పిస్తుంటారు. అయితే ఈ విషయంలో యూఐడీఏఐ ప్రజల కోసం ఓ అలర్ట్‌ను జారీ చేసింది. Aadhar Card Alert: ఆధార్‌ను ఎక్కడైనా సమర్పించే ముందు అసలేనా? నకిలీనా? ఒక్కసారి తనిఖీ చేస్కోమని చెప్తోంది. లేకుంటే ఇబ్బందులు తప్పవని చెబుతోంది. ఇందుకోసం resident.uidai.gov.in/verify లింక్‌కు వెళ్లాలి. ఆపై కార్డుపై ఉన్న 12 అంకెల డిజిట్‌ను ఎంటర్ చేయాలి. కింద ఉన్న సెక్యూరిటీ కోడ్ లేదంటే క్యాప్చాను క్లిక్ చేసి వెరిఫై కొట్టాలి. అప్పుడు ఆ ఆధార్ నెంబర్ ఒరిజినలేనా? అసలు ఉందా? అనే వివరాలు కనిపిస్తాయి. చాలామంది ఆధార్ అప్డేట్స్, మార్పుల విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. కానీ, చిన్న చిన్న మార్పులు, సవరణల కోసం ఆన్లైన్లోనే వెసులుబాటు కల్పిస్తోంది యూఐడీఏఐ. ఇక అప్డేషన్, మొత్తంగా మార్పుల కోసం మాత్రం తప్పనిసరిగా ఎన్రోల్మెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. ► ఆధార్ కార్డ్‌పై అడ్రస్ సవరణ కోసం ఆన్లైన్లో వెసులుబాటు కల్పించింది యూఐడీఏఐ ► అడ్రస్ మార్పు కోసం ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ అంటే.. దగ్గర్లోని ఆధార్ సెంటర్ ఈ సౌకర్యం కల్పిస్తోంది. సవరించడం ఎలాగో తెలుసా? ► ఫొటో మార్చుకోవడానికి కూడా రీజియన్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిమిషాల్లో ఫొటో మార్చుకోవచ్చు ఇలా ► ఆధార్ కార్డు మీద పేరును రెండు సార్లు మార్చుకోవడానికి వీలుంటుంది. ► డేట్ ఆఫ్ బర్త్, జెండర్(ఆడ/మగ/ట్రాన్స్‌జెండర్) ఒక్కసారే మారతాయి. పుట్టినతేదీ మార్చుకోవాలా? ► జెండర్ మార్పునకు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. ► మొబైల్ నెంబర్‌కు తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి. లేదంటే మార్పులేవీ జరగవు. క్లిక్ చేయండి: ఇంట్లో నుండే ఆధార్ అప్డేట్ చేసుకోండి ఇలా! ► ఒకవేళ మొబైల్ నెంబర్ వేరే వాళ్లది ఉన్నా.. పాత నెంబర్‌ను మార్చుకోవాలనుకున్నా అప్డేట్ చేసుకోవచ్చు. స్థానిక పోస్ట్ మ్యాన్ లేదా పోస్టు మాస్టర్ కు ఫోన్ చేసి కోరితే ఇంటికే వచ్చి ఈ సేవలు అందిస్తారు. అయితే ప్రధాన పట్టణాల్లో మాత్రమే ఇది అమలు అవుతుండడం విశేషం. గ్రామీణ ప్రాంతాల వాళ్లు మాత్రం మండల కేంద్రాలకు ‘క్యూ’ కట్టాల్సి వస్తోంది. ► సెల్ఫ్ సర్వీస్ అప్డేట్ పోర్టల్ ద్వారా (SSUP) https://ssup.uidai.gov.in/ssup/ లింక్ క్లిక్ చేసి సంబంధిత స్కాన్ డాక్యుమెంట్లు సమర్పించి చిన్న చిన్న మార్పులు చేసుకునే వీలు మాత్రమే. సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ద్వారా యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు. ► ముఖ్యమైన విషయం ఏంటంటే.. పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్నెంబర్, ఈ-మెయిల్, ఫింగర్ ఫ్రింట్స్, ఐరిస్, ఫొటోగ్రాఫ్.. ఇలాంటి వివరాల అప్డేషన్ కోసం పర్మినెంట్ ఎన్రోల్మెంట్ సెంటర్‌ను సంప్రదించాల్సిందే. ► సంబంధిత ఫామ్స్ అన్నీ యూఐడీఏఐ వెబ్సైట్లోనే దొరుకుతాయి కూడా. ఒకవేళ పొరపాటున పరిమితులు మించిపోతే ఎలా?.. ఆ టైంలో ఆధార్ ఎన్రోల్మెంట్ లేదంటే అప్డేట్ సెంటర్‌ను సంప్రదించడం ఉత్తమం. అక్కడ తప్పిదానికి గల కారణాలు, వివరణలు, పొరపాట్ల సవరణకు సంబంధించిన వివరాలు, సరైన ప్రూవ్స్ సేకరిస్తారు( సంబంధిత ఫామ్స్ ద్వారా). ఆ వివరాలన్నింటిని హెల్ప్ డెస్క్‌కు పంపిస్తారు. అవసరం అయితే ఆఫీసులకు పిలుస్తారు. ఆపై వెరిఫికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. అవసరం అనుకుంటే అదనపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అప్పుడు అప్డేట్ లేదంటే మార్పులకు జెన్యూన్ రీజన్ అని తెలిస్తేనే.. ఆ రిక్వెస్ట్‌ను టెక్ సెంటర్‌కు ప్రాసెసింగ్/రీప్రాసెసింగ్ పంపిస్తారు. ఈ ప్రాసెస్ సాగడానికి కచ్చితంగా ఎన్నిరోజులు పడుతుందనేది చెప్పలేం. ఒక్కోసారి ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోయినా ఆగిపోవచ్చు!. -
ఇంజనీరింగ్ సీటు ఇలా..
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ధ్రువ పత్రాల పరిశీలన కోసం సహాయ కేంద్రానికి వెళ్లడం మినహా మిగతావన్నీ ఇంట్లోంచే ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి తెలిపింది. స్లాట్ బుకింగ్ మొదలు కాలేజీలో చేరే వరకూ విద్యార్థులు ఏం చేయాలనే వివరాలను వెబ్సైట్లో ఉంచింది. ముందు ఇలా చేయండి ►ఈ నెల 30వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. వచ్చే నెల 9వ తేదీ వరకూ ఎంసెట్ అర్హత పొందిన అభ్యర్థులు ‘ ్టట్ఛ్చఝఛ్ఛ్టి. nజీఛి. జీn’ పేజీకి లాగిన్ అవ్వాలి. అక్కడ రిజిస్ట్రేషన్ కాలమ్‌లోకి వెళ్లాలి. ఎంసెట్ హాల్ టికెట్, పుట్టిన తేదీ, ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష హాల్‌టికెట్ నంబర్‌ను నిర్ణీత కాలమ్స్‌లో నింపాలి. ఇందులోనే ఆధార్ సంఖ్య, మొబైల్ నంబర్, కుల ధ్రువీకరణ పత్రం నంబర్ ఇవ్వాలి. ఇచ్చిన మొబైల్ నంబర్ చివరి వరకూ ఉంటుంది. మార్చడం కుదరదు. ►ప్రాథమిక సమాచారం పొందుపరిచిన తర్వాత రూ. 1,200 (ఎస్సీ, ఎస్టీలు రూ. 600) ఫీజు ఆన్లైన్ ద్వారానే చెల్లించాలి. అప్పుడు మీ పేరుతో అకౌంట్ క్రియేట్ అవుతుంది. దీని ద్వారా సర్టిఫికెట్ పరిశీలన తేదీని, దగ్గర్లోని కేంద్రాన్ని, సమయాన్ని ఎంపిక చేసుకోవాలి. దీంతో మొదటి మెట్టు పూర్తవుతుంది. స్లాట్ బుకింగ్‌ను ఈ నెల 30 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకూ చేసుకోవచ్చు. పరిశీలనకు ఏయే సర్టిఫికెట్లు కావాలి? ►మీరు ఎంచుకున్న సహాయ కేంద్రానికి టీఎస్ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్, ఎస్సెస్సీ తత్సమాన మార్కుల మెమో, ఇంటర్ మెమో, ఆరు నుంచి ఇంటర్ వరకూ స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాలి. ఇవన్నీ ఒరిజినల్స్‌తోపాటు మూడు సెట్ల జిరాక్స్ కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలి. ►సర్టిఫికెట్ల పరిశీలన వచ్చే నెల 9 నుంచి 11వ తేదీ వరకూ కొనసాగుతుంది. సహాయ కేంద్రంలో పరిశీలన అనంతరం సంబంధిత అధికారి ధ్రువీకరించినట్టు రసీదు ఇస్తారు. ఆప్షన్ వేళ కంగారొద్దు... ►వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అభ్యర్థి రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత తిరిగి టీఎస్ఎంసెట్ పేజీకి మీ యూజర్ ఐడీ ద్వారా లాగిన్ అవ్వాలి. అప్పుడు ఆప్షన్స్‌ను ఎంపిక చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల వివరాలు ఎంసెట్ వెబ్ పోర్టల్‌లోనే ఉంటాయి. ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉందో తెలుస్తుంది. ఆ కాలేజీ కోడ్ పక్కనే ఉంటుంది. జిల్లాలవారీగా కాలేజీల వివరాలూ ఉంటాయి. అభ్యర్థి ఎంపిక చేసుకొనే కోర్సు, కాలేజీ కోడ్ ముందుగా రాసుకొని ఆ తర్వాత వెబ్‌లో క్లిక్ చేస్తే కంగారు పడాల్సిన అవసరం ఉండదు. వరుస క్రమంలో ప్రాధాన్యతను ఎంపిక చేసుకున్న తర్వాత డేటాను సబ్మిట్ చేయాలి. ►ఆప్షన్స్‌ను ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు. ఈ వెసులుబాటు సెప్టెంబర్ 13 రాత్రి వరకూ ఉంటుంది. రాత్రి 12 తర్వాత సైట్ ఫ్రీజ్ అవుతుంది. ఇక ఎలాంటి మార్పుకు అవకాశం ఉండదు. 15న సీటు ఖరారు... ►సెప్టెంబర్ 15వ తేదీన తొలిదశ సీట్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్థి తన ఐడీకి లాగిన్ అయి సీటు వచ్చిందా లేదా? చూసుకోవచ్చు. సీటొస్తే కేటాయింపు ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో పేర్కొన్న ఫీజును అదే నెల 20వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. సీటు రాని పక్షంలో మళ్లీ రెండో దశ వెబ్ ఆప్షన్‌కు వెళ్లొచ్చు. ఈసారి ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు. అన్ని దశల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాతే అభ్యర్థి కాలేజీకి వెళ్లి ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇదీ షెడ్యూల్.. స్లాట్ బుకింగ్: 30–8–21 నుంచి 9–9–21 ధ్రువపత్రాల పరిశీలన: 4 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్స్: 4 నుంచి 13 వరకు తొలి దశ సీట్ల కేటాయింపు: 15–9–21 సెల్ఫ్ రిపోర్టింగ్: 20–9–21 -
ఆన్లైన్లో నిమిషాల్లోనే రుణాలు
కేవలం కొన్ని నిమిషాలు వెచ్చిస్తే చాలు... ఆన్ లైన్లో అప్పటికప్పుడు కోరినంత రుణాన్ని (పర్సనల్ లోన్ ) పొందే ఆప్షన్లు నేడు ఎన్నో. అవసరానికి అరువు లభిస్తుంది కదా అని సరైన విచారణలు చేసుకోకపోతే ఆ తర్వాత విచారించాల్సి వస్తుంది. ఇన్ స్టంట్ పర్సనల్ లోన్ ఒక్క క్లిక్‌తో అంటూ మీ మెయిల్ బాక్స్‌కి వచ్చే సందేశాలను చూసే ఉంటారు. ఆ సమయంలో డబ్బు అవసరాలు ఉన్న వారు అయితే ఆ అవకాశాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. నేటి తరం యువత ఆన్లైన్లో సునాయాసంగా లభించే ఇన్ స్టంట్ రుణాల పట్ల ఎంతో ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకుంటే ఉన్న చోట నుంచి కదలక్కర్లేదు. డాక్యుమెంట్లు పట్టుకుని రుణం కోసం తిరగాల్సిన శ్రమ కూడా ఇందులో ఉండదు. రుణానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అంతా స్మార్ట్‌ఫోన్ నుంచే పూర్తి చేసుకోవచ్చు. రోజుల నుంచి, నెలల వ్యవధిలో తీసుకున్న రుణాన్ని తీర్చి వేయవచ్చు. కానీ, వీటి విషయంలో తగినంత సమాచారాన్ని తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిదన్నది నిపుణుల సూచన. పెద్దగా కష్టం లేకుండానే... ‘‘సులభంగా, తక్షణమే రుణాలు కోరుకునే వారికి ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎక్కువ పేపర్ పని లేకుండా, తిరగాల్సిన శ్రమ ఇందులో ఉండదు’’అని మైలోన్ కేర్ డాట్ ఇన్ వ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్‌గుప్తా తెలిపారు. కొన్ని సంస్థలు క్రెడిట్ హిస్టరీ లేని వారికి కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తుండడం గమనార్హం. ‘‘ఇన్స్టంట్ ఆన్ లైన్ రుణాలు వేగంగా ప్రాసెస్ చేసి జారీ చేసేవి. దీంతో అర్హతల నిబంధనలు మరింత సులభంగా ఉంటున్నాయి. అప్పటి వరకు ఎటువంటి రుణాలు తీసుకోని కొత్త వారికి క్రెడిట్ హిస్టరీ కూడా ఏర్పడడం లేదు’’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్‌శెట్టి తెలిపారు. పరిశీలించిన తర్వాతే... ఆన్ లైన్ లో ఎంతో సులభంగా, సౌకర్యంగా రుణం లభిస్తుంటే ఎవరైనా కాదనగలరా..? కానీ, ఒక్క క్లిక్‌తో రుణం తీసుకోకుండా, దానికి ముందు చూడాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. రుణం ఎటువంటిది అయినా కానీ, దానిపై వడ్డీ, ఇతర చార్జీలను తీసు కునే వారు భరించాల్సి ఉంటుంది. తీసుకునే మొత్తాన్ని తాము సకాలంలో తిరిగి చెల్లించగలమా..? అన్న పరిశీలన కూడా అవసరం. ‘‘మీకు అవసరం ఉన్నంత వరకే రుణం తీసుకోవాలి. అంతేకానీ, అర్హత ఉన్నంత తీసుకోరాదు. తిరిగి చెల్లించే ప్రణాళిక కూడా మీ వద్ద ఉండాలి. సకాలంలో ఈఎంఐలు కూడా చెల్లించడం ఎంతో ముఖ్యం. ఆలస్యపు చెల్లింపులు, సకాలంలో చెల్లించకపోవడాలు, పరిష్కారాలు అన్నీ కూడా క్రెడిట్ స్కోరును దెబ్బతీసేందుకు కారణమవుతాయి. దీంతో భవిష్యత్తులో రుణం పొందడం కష్టంగా మారుతుంది’’ అని ఆదిల్ శెట్టి వివరించారు. భిన్న చార్జీలు ఆన్లైన్లో వేగంగా రుణం తీసుకునే హడావుడిలో ఈఎంఐకు అదనంగా చెల్లించాల్సిన చార్జీల గురించి కొందరు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఆన్లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌లు రిజిస్ట్రేషన్ ఫీజు లేదా ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంటాయి. రుణంతోపాటు కలిపి వీటిని రుణగ్రహీతల నుంచే వసూలు చేస్తాయి. ఈ చార్జీలపై అవగాహన లేకపోతే రుణం తీసుకోవడానికి ముందుగా సంబంధిత సంస్థను అడిగి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. మెయిల్ బాక్స్‌లో లేదా మొబైల్‌కు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చిన లోన్ ఆఫర్‌ను చూసి తొందరపడిపోకుండా, అది మంచి ఆఫర్ అవునో, కాదో విచారించుకోవడం ఎంతో అవసరం. కొన్ని సందర్భాల్లో మంచి ఆఫర్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ‘‘ఇన్ స్టంట్ రుణాలు కూడా ఇతర రుణాల మాదిరే. వీటిని తీసుకునే ముందు తగినంత అధ్యయనం, రుణ నిబంధనలు, వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స ప్రీమియం, ముందస్తు చెల్లింపులపై పెనాల్టీ వంటి చార్జీలను ఇతర సంస్థలతో పోల్చి చూసుకోవాలి’’ అని గౌరవ్‌గుప్తా సూచించారు. రుణం తీసుకుంటే, ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఈఎంఐ రూపంలో చెల్లించేందుకు చట్టబద్ధంగా కట్టుబడినట్టేనని గుర్తించాలి. అంతేకాదు, తిరిగి మీ చెల్లింపుల సామర్థ్యం ఆ మేరకు లాక్ అయినట్టు భావించాలి. ఉదాహరణకు ప్రతీ నెలా ఈఎంఐ రూపంలో మీరు రూ.20,000 చెల్లించగలరని అనుకుంటే, అప్పటికే కొంత రుణం తీసుకుని రూ.4,000 చెల్లిస్తుంటే, అప్పుడు మీ మిగిలిన చెల్లింపుల సామర్థ్యం రూ.16,000గానే అనుకోవాలి. అవసరం లేకపోతే... నిజమైన అవసరం లేకపోయినా కొన్ని సందర్భాల్లో సంపన్న అవసరాల కోసం రుణాలు తీసుకునే వారూ ఉన్నారు. కానీ, దీని వల్ల వైద్య చికిత్సల వంటి అత్యవసర సందర్భాల్లో రుణానికి ఇబ్బందులు ఎదురుకావచ్చు. ‘‘వివేకంతో రుణాలు తీసుకోవడం ఆస్తులు సమకూర్చుకోవడానికి సాయపడొచ్చు. సకాలంలో చెల్లించడం వల్ల క్రెడిట్ స్కోరును కూడా పెంచుకోవచ్చు. సకాలంలో చెల్లింపులు చేయకపోతే విధించే పెనాల్టీలు భారీగా ఉంటాయి. మీ ఆదాయంలో రుణ ఈఎంఐ 25–40 శాతం మించకుండా చూసుకోవడం మంచిది. ఇంతకు మించితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ఆదిల్ శెట్టి సూచించారు. చాలా సందర్భాల్లో రుణాలిచ్చే సంస్థలు ముందుగా రుణాన్ని తీర్చివేస్తే భారీ చార్జీల విధింపు వంటి షరతులు పెడుతున్నాయి. ఇలాంటి షరుతులు రుణాన్ని ఖరీదుగా మార్చేస్తాయని తెలుసుకోవాలి. కొన్ని సంస్థలు అయితే ముందుగా ఓ నిర్ణీత కాలం వరకు రుణాన్ని తీర్చివేసేందుకు కూడా అనుమతించడం లేదు. ఈ తరహా ప్రతికూల షరతులు రుణ ఒప్పందంలో ఉన్నాయా, లేవా అన్న నిర్ధారణ రుణం తీసుకోవడానికి ముందు తెలుసుకోవాలి. -
పైసలిస్తేనే పాస్‌బుక్
నర్సంపేట: ఈ సంఘటన మరువకముందే నర్సంపేట డివిజన్ పరిధిలోని ఓ మండల తహసీల్దార్ తతంగం బయట పడింది. ధరణి వెబ్సైట్ ద్వారా రైతులకు పట్టాదార్ పుస్తకాలు ఇవ్వాలంటే పైసలు ముట్టాల్సిందేనని, తనకు ప్రతిరోజు మండల వీఆర్వోలంతా కలసి రోజుకు 10 వేలు ముట్టజెప్పాలని హూకుం జారీ చేసినట్లు సమాచారం. దీంతో బెంబేలెత్తిన వీఆర్వోలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వద్దకు చేరుకుని గోడు వెల్లబోసుకున్నారు. అవసరాన్ని ఆసరాగా చేసుకొని.. రైతుల భూ రికార్డులను ప్రక్షాళన చేసి రైతులందరికీ ఉచితంగా పట్టాదార్ పాసు పుస్తకాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండేళ్ల క్రితం బృహత్తర పథకాన్ని తీసుకువచ్చారు. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించారు. ఎన్నికలు ముగిశాయి. గ్రామాల్లో ఇంకా చాలా మంది రైతులకు పట్టాదారు పుస్తకాలు అందించాల్సి ఉంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అందరికి పట్టాలు ఇవ్వడం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధరణి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి రెండు నెలలవుతోంది. పట్టాలు లేని రైతులంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అదనుగా భావించి సదరు తహసీల్దార్ రోజువారీగా రూ.10వేలు ఇచ్చి పనులు చేయించుకోండని గత కొన్ని రోజులుగా వీఆర్వోలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. అటు రైతులను డబ్బులు అడగలేక.. ఇటూ తహసీల్దార్‌కు ఇవ్వలేక.. వీఆర్వోలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదే మండలంలోని కొన్ని గ్రామాల రైతులు నేరుగా అనేకసార్లు గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు విన్నవించారు. కార్యాలయం ఎదుట రాస్తారోకోలు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు సైతం ట్విట్టర్ ద్వారా ఓ రైతు పోస్టు చేసినట్లు తెలిసింది. అయినా ఫలితం లేదు.. ఇదిలా ఉండగా సదరు తహసీల్దార్ తన సొంతంగా గ్రామాల్లో ఏజెంట్లను పెట్టుకుని డబ్బులు ఇ చ్చిన వారి ఫైళ్లు మాత్రమే క్లియర్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. రైతులకు ఎలాంటి డబ్బులు లేకుండా పట్టా పుస్తకాలు ఇవ్వాలని ము ఖ్యమంత్రి ఖరాఖండిగా చెప్పినా రెవెన్యూ అధికా రుల తీరులో మార్పు రాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి లంచాలు తీసుకునే అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు సకాలంలో ధరణి వెబ్సైట్ ద్వారా పాస్‌బుక్‌లు అందించాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం.. పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నరన్న విషయం ఇప్పటికయితే నా దృష్టికి రాలేదు. రాత పూర్వకంగా ఫిర్యాదులు వస్తే విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ధరణి వెబ్సైట్ ద్వార పట్టా పుస్తకాలు అందించే క్రమంలో ఎలాంటి అవినీతికి తావులేదు. అవినీతి జరిగితే సహించేది లేదు.. – రవి, నర్సంపేట, ఆర్డీఓ -
గడువు.. మూడు రోజులే!
నల్గొండ : ఓటుహక్కు నమోదుకు ఇక.. మూడు రోజులే గడువు ఉంది. నిర్ణీత సమయంలోగా నమోదు చేసుకోకపోతే విలువైన ఓటు హక్కుకు దూరమవుతారు. ఎన్నికల సంఘం 2018 జనవరి 1 నాటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ నెల 10న రెండవ ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేసింది. కానీ, జిల్లాలో యువత ఓటరుగా నమోదు చేసుకోవడానికి పెద్దగా స్పందించలేదు. దీంతో అధికార యంత్రాంగం ఓటుహక్కు నమోదుపై పట్టణాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ నెల 15,16 తేదీల్లో పోలింగ్ బూత్‌లలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిం చింది. ఏడు వేల పైచిలుకు కొత్త ఓటర్లుగా నమో దు చేసుకున్నారు. కొంతమంది ఆన్లైన్లో, మరి కొంత మంది అధికారుల వద్ద నమోదు చేసుకుం టున్నారు. ఈ నెల 25 వరకు మాత్రమే ఓటుహ క్కు నమోదుకు గడువు విధించారు. ఈలోగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడూ తమ ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. నేడు ఇంటింటికీ సర్వే.. ఓటు నమోదుకు మూడు రోజులు మాత్రమే గడువు ఉండడంతో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదివారం ఇంటింటికి సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికల అధికారులు, గ్రామాల ప్రత్యేక అధికారులు.. మహిళా స్వయం సహాయక సంఘాలతో సమావేశం నిర్వహించి వారి ద్వారా ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం సర్వే నిర్వహించనున్నారు. ఓటరు జాబితాను ఇంటింటికీ తీసుకెళ్లి అందులో వారి ఓటు ఉందా..లేదా చూడడంతోపాటు ఆ ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకుల పేర్లు నమోదు చేయనున్నారు. అన్ని గ్రామాల్లో ఉదయంనుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ..మూడురోజులే... ఓటు నమోదుకు మూడు రోజులు మాత్రమే అవకాశం ఉన్నందున అధికారులు కూడా పెద్దఎత్తున కళాశాలల్లో క్యాంపులు నిర్వహంచి ఓటు నమోదు చేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. శుక్రవారం డీఆర్డీఏ ఆధ్వర్యంలో పట్టణంలో జేసీ నేతృత్వంలో ఓటు నమోదుపై ర్యాలీ తీశారు. ఈ మూడు రోజులపాటు పెద్దఎత్తున కొత్త ఓట్ల నమోదు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. మరిచారో ...అంతే .. ఓటు..పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇంతటి విలువైన ఆయుధాన్ని కొన్ని సందర్భాల్లో చాలామంది వినియోగించుకోలేక పోతున్నారు. మా ఓటు ఉంది కదా అని ఊరుకుంటున్నారు. తీరా ఎన్నికల రోజు ఓటు వేసేందుకు వెళ్తే.. గల్లంతు అయ్యిందని తెలియడంతో ఇబ్బంది పడుతున్నారు. ముందస్తుగానే ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందా.. లేదా.. «ఏదైనా పేర్లు తప్పులు దొర్లాయా చూసుకోవాల్సి అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కొత్త ఓట్ల నమోదు.. జిల్లాలో ఇప్పటివరకు 7,989 మంది కొత్తగా ఓటుహక్కుకు నమోదు చేసుకున్నారు. 4,247మందికి ఓట్ల తొలగింపు నోటీసులు పంపనున్నారు. 1891మంది తమ ఓటర్ల జాబితాలో తన పేరు, ఇంటి ఆడ్రస్లలో తప్పులు దొర్లడంతో వాటిని సరిచేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక బూత్‌నుంచి మరో బూత్‌కు ఓటు బదలాయించాలని 3,440 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఓటు నమోదు చేసుకోవాలి నకిరేకల్ : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓ టు నమోదు చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ మెంచు రమేష్ అన్నారు. నకిరేకల్‌లో మండల సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాలతో శనివారం నిర్వహించిన ఓటరు నమోదు అవగాహన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఈనెల 23న జిల్లా వ్యాప్తంగా గడప గడపకు ఓటర్ నమో దు కార్యక్రమం చేపట్టే విధంగా కలెక్టర్ ప్రణా ళిక రూపొందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు చురుగ్గా పాలొ ్గనాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య కోఆర్డినేటర్ పి.ప్రభాకర్, సిసిలు, వీఓఏలు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. -
జేఈఈ అభ్యర్థులకు ‘ఆన్లైన్’ కష్టాలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీలు) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించి తొలిసారిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ద్వారా నిర్వహించనున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)– మెయిన్ విద్యార్థులకు అగ్నిపరీక్షలా మారుతోంది. ఈ పరీక్షను ఇక నుంచి కేవలం ఆన్లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లోనే నిర్వహించనుండడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. జేఈఈ మెయిన్‌కు దేశవ్యాప్తంగా 12 నుంచి 14 లక్షల మంది హాజరవుతారని అంచనా. గతేడాది వరకు పరీక్షను ఆఫ్‌లైన్ (పేపర్, పెన్ను విధానం)తోపాటు ఆన్లైన్లో నిర్వహించే వారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేని విద్యార్థులు ఆఫ్‌లైన్ పరీక్షకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈసారి ఆఫ్‌లైన్‌ను రద్దు చేసి ఆన్లైన్లో మాత్రమే పరీక్ష నిర్వహించనున్నారు. దీంతో కంప్యూటర్‌పై అవగాహన లేని వారు ఆన్లైన్లో పరీక్ష ఎలా రాయాలని ఆందోళనలో ఉన్నారు. కంప్యూటర్లే లేవు రాష్ట్రంలో 1100 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 2700 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్మీడియెట్ సెకండియర్ విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో 2 లక్షల మంది ఉండగా.. ప్రైవేటు కాలేజీల్లో దాదాపు 4 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరిలో అత్యధిక శాతం మంది జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్నారు. వీరికి ఆన్లైన్ టెస్టులపై శిక్షణ ఇవ్వడానికి కళాశాలల్లో కంప్యూటర్లు లేవు. దీంతో విద్యార్థులకు మాక్ ఆన్లైన్ టెస్టులపై శిక్షణ అందడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే వారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులే కావడంతో వారికి ఆన్లైన్ పరీక్ష మరింత గడ్డుగా మారనుంది. ప్రైవేటు కాలేజీల్లోనూ విద్యార్థులతో బట్టీ పట్టించడమే తప్ప ఆన్లైన్లో జరిగే పరీక్షలను ఎలా ఎదుర్కొనాలో శిక్షణ ఇవ్వడం లేదు. రఫ్ వర్క్ చేసుకుంటూ ఆన్లైన్లో గుర్తించడం కష్టమే జేఈఈ మెయిన్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లలో ఇచ్చే ప్రశ్నలకు ఎంతో లోతుగా ఆలోచిస్తే కానీ సరైన సమాధానాలు గుర్తించడం కష్టం. వీటికి సంబంధించి రఫ్ వర్క్‌కే ఎంతో సమయం పడుతుంది. కంప్యూటర్ స్క్రీన్‌పై ఆయా ప్రశ్నలను చదివి, ఆప్షన్లను పరిశీలించి మరోపక్క బయట అందుకు సంబంధించిన రఫ్ వర్క్ పూర్తిచేసి సమాధానాన్ని గుర్తించడంలో తీవ్ర తడబాటుకు గురయ్యే ప్రమాదముంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. పైగా జేఈఈ మెయిన్‌లో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ మాత్రం తప్పుగా టిక్ చేసినా మార్కుల్లో కోతపడే ప్రమాదముందని విద్యార్థులు భయపడుతున్నారు. టీపీసీలు ఏర్పాటు చేసినా అదే పరిస్థితి మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థుల శిక్షణ కోసం దేశవ్యాప్తంగా టెస్టు ప్రాక్టీస్ సెంటర్స్ (టీపీసీ)లను ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ ప్రకటించింది. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్టీఏ.ఏసీ.ఐఎన్’ వెబ్సైట్లో సెప్టెంబర్ 8 నుంచి వీటిని యాక్టివ్‌లోకి తెచ్చింది. ఈ సెంటర్లు శనివారం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు, ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు, తిరిగి 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అలాగే ఎన్టీఏ స్టూడెంట్ యాప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా టెస్టు ప్రాక్టీస్‌లో పాల్గొనవచ్చు. అయితే కళాశాలల విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో వారు మాక్ టెస్టులకు ఎలా ప్రిపేర్ అవుతారనేది ప్రశ్నగా మారింది. ఇప్పటివరకు టీపీసీలపై విద్యార్థులకు కాలేజీలు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. అటు మాక్ టెస్టులకు అవకాశం లేక, ఇటు టీపీసీ కేంద్రాల్లోనూ తర్ఫీదులేక తమ పిల్లలు నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ నమోదు’పై సానుకూలత
సాక్షి, న్యూఢిల్లీ : ఎఫ్ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక) నమోదుకు సంబంధించి కీలక ముందడుగు పడనుంది. ఘటనపై ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అంశంపై కేంద్ర హోం శాఖ.. లా కమిషన్ సలహా కోరింది. దీనిపై స్పందించిన లా కమిషన్ ఎఫ్ఐఆర్ నమోదుకు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినా సరిపోతుందని తెలిపింది. అయితే, ఆన్లైన్ విధానంలో ఫిర్యాదు స్వీకరణ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా ఇతరుల పరువుకు భంగం కలిగించేందుకు ఈ విధానాన్ని కొందరు దుర్వినియోగం చేసే వీలుందని పేర్కొంది. ఆన్లైన్లో ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసే అంశం సాధ్యాసాధ్యాలపై చర్చిస్తామని తెలిపింది. ఒకవేళ ఈ-ఎఫ్ఐఆర్కు అనుమతిస్తే దాని అమలుకు సంబంధించి ఒక చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ జరగాలని న్యాయశాఖ మాజీ సెక్రటరీ ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, 2013లో లలితా కుమారి వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మధ్య కేసులో సుప్రీం కోర్టు.. సీఆర్పీసీలోని సెక్షన్ 154 ప్రకారం తీవ్రమైన, ప్రాథమిక విచారణ అవసరంలేని నేరాల్లో ఎఫ్ఐఆర్ నమోదు తప్పనిసరి అని పేర్కొంది. సీఆర్పీసీలోని సెక్షన్ 154 కు సవరణలు చేస్తే ఈ-ఎఫ్ఐఆర్కు మార్గం సుగమం అవుతుందని గత జనవరిలో జరిగిన సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. ఈ సమావేశ సూచనల ప్రాతిపదికగా హోంశాఖ.. లా కమిషన్ సలహా కోరింది. ‘బాధితులు నేరుగా వెళ్లి పోలీసులని ఆశ్రయించి ఘటన గురించి వివరించడం కష్టమైన పనే. ఆన్లైన్లో ఫిర్యాదు చేయడం చాలా సులభం. కానీ, పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తులు లేదా బాధితులు మాతో అబద్ధం చెప్పడానికి సంశయిస్తారు. నేరుగా ఫిర్యాదు స్వీకరించడం వల్ల ఫిర్యాదుదారుడి వైఖరి తెలుసుకునే వీలుంటుంద’ని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఉపయోగకరమే.. కానీ..! హోంశాఖ అభిప్రాయాలను మానవ హక్కుల కార్యకర్త కవితా కృష్ణన్ స్వాగతించారు. ఎంతోమందికి ‘ఆన్లైన్లో ఫిర్యాదు’ విధానం మేలు చేకూరుస్తుందని అన్నారు. అయితే, బాధితుల దగ్గరనుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకున్న అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు కావాలని ఆలస్యం చేయొచ్చని వ్యాఖ్యానించారు. పేదప్రజలకు ఆన్లైన్ సేవలు పొందడం ఇబ్బందిగా మారొచ్చని అన్నారు. -
ఇక పోస్టాఫీసుల్లో ఆధార్ నమోదు
సాక్షి, పెదవాల్తేరు(విశాఖతూర్పు) : పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గత నెల 15వ తేదీన సీతమ్మధార దరి పీఅండ్‌టీ కాలనీలో గల పోస్టాఫీసులో ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు. దఫదఫాలుగా విశాఖ డివిజన్ పరిధిలోని 36 పోస్టాఫీసుల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో కొత్తగా ఆధార్ నమోదు చేసుకునేవారు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరంలేదు. ఇక ఆధార్ కార్డులో పేర్లు, చిరునామా, వయసు తదితర వివరాల్లో సవరణలకు మాత్రం రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్‌కార్డు సాధారణ పోస్టు ద్వారా 15 రోజులలో ఇంటికొస్తుందని విశాఖ డివిజన్ తపాలాశాఖ సీనియర్ సూపరింటెండెంట్ హరిప్రసాద్‌శర్మ మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. ఆధార్ నమోదు ఇలా... ఇప్పటివరకు ఎక్కడా ఆధార్ కార్డు లేనివారు తమకు సమీపంలో గల పోస్టాఫీసులో చిరునామా ధృవీకరణపత్రంతో వెళ్లాల్సి ఉంటుంది. గ్యాస్‌బుక్, బ్యాంక్ పాస్‌బుక్, పాసుపోర్టు, డ్రైవింగ్లైసెన్సు, ఓటర్‌గుర్తింపు కార్డు, విద్యుత్‌బిల్లు, వంటి ఏదో ఒక ధృవీకరణపత్రం సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు అక్కడే బయోమెట్రిక్ విధానంలో ఫొటో తీసి, ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తారు. ఇక సవరణల కోసం అవసరమైన ధృవీకరణపత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నమోదు చేసే పోస్టాఫీసులివే... వెలంపేట, రైల్వేస్టేషన్ వద్ద గల ప్రధాన పోస్టాఫీసులు, అక్కయ్యపాలెం (శ్రీనగర్), ఆంధ్రా యూనివర్సిటీ, డాబాగార్డెన్స్, ద్వారకానగర్ (డైమండ్‌పార్కు), డెయిరీఫారం, హెచ్‌బీకాలనీ, మధురవాడ, మహారాణిపేట (కలెక్టరేట్), ఎంవీపీకాలనీ, సాలిగ్రామపురం, ద్వారకాబస్‌స్టేషన్, పోర్టు, బీహెచ్‌పీవీ, భీమునిపట్నం, చిట్టివలస, గాజువాక, గాంధీగ్రాం, గోపాలపట్నం, ఇండస్ట్రియల్ఎస్టేట్, కంచరపాలెం, మల్కాపురం, మర్రిపాలెం, ఎన్ఏడికొత్తరోడ్డు, పెదగంట్యాడ, సింహాచలం, ఉక్కునగరం, విశాఖ నేవల్‌బేస్, విశాఖస్టీల్‌ప్లాంట్, విశాలాక్షినగర్ ప్రాంతాలలోని పోస్టాఫీసుల్లో ఆధార్ నమోదు కేంద్రాలు రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేస్తాయి. -
అంగన్వాడీల్లో కొలువులు
ఆసిఫాబాద్: జిల్లాలో ఏళ్ల తరబడి సిబ్బంది ఖాళీలతో అరకొరగా ఉన్న అంగన్వాడీల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. నియామకాల కోసం ప్రకటన విడుదల చేసింది. దీంతో జిల్లా పరిధిలోని స్థానిక మహిళలకు ఇటు ఉద్యోగంతో పాటు, అటు గ్రామీణ ప్రాంతా ల్లోని అంగన్వాడీ, మినీ అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు సేవలు మరింత పకడ్బందీగా అందనున్నాయి. గతంలో జిల్లా ఎంపిక కమిటీలో ప్రజాప్రతినిధులు ఉండగా ప్రస్తుతం పూర్తిగా అధికార యంత్రాంగమే ఉండనుంది.అంతేకాక ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్లోనే జరగనుంది. జిల్లాలో మొత్తం 834 అంగన్వాడీ కేంద్రాలు, 139 మినీ అంగన్వాడీలు ఉన్నాయి. వీటి పరిధిలో అంగన్వాడీలు, మినీ అంగన్వాడీలు, హెల్పర్స్ విభాగాల్లో మొత్తం 231 పోస్టులు భర్తీ కానున్నాయి. అర్హతలు దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పని సరిగా స్థానికంగా నివసించే వారు అయి ఉండాలి. పదోతరగతి ఉత్తీర్ణత కలిగి uమొదటిపేజీ తరువాయి ఉండాలి. వయస్సు 18 నుంచి 35 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన వాటికి వారే అర్హులు. ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక అభ్యర్థులే అర్హులు. పాక్షికంగా వినికిడి శక్తి ఉన్న వారు, ఇతరుల సాయం లేకుండా విధులు నిర్వహించగలిగేవారు దివ్యాంగులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతా ఆన్లైన్లోనే ఈ పోస్టుల భర్తీ అంతా ఆన్లైన్లోనే జరగనుంది. మొదట అభ్యర్థులు జ్టి్ట వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు ఆన్లైన్లో సమర్పించాలి. దరఖాస్తు చేసిన అభ్యర్థినీల ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 17 నుంచి 24 మధ్య జరుగుతుంది. ఇందులో నోటిఫికేషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం స్థానికత, పుట్టిన తేది, విద్యార్హత, కుల, ఆదాయ, ఆధార్ తదితర అన్ని సర్టిఫికెట్లు సరిగా ఉన్నవి లేనివి జిల్లా శిశు సంక్షేమ అధికారులు పరిశీలిస్తారు. ఒక వేళ ఆన్లైన్లో దరఖాస్తుకు, అభ్యర్థినీల వద్ద ఉన్న ధ్రువీకరణ పత్రాలకు తేడా ఉంటే ఆ దరఖాస్తును తిరస్కరిస్తారు. అనంతరం పరిశీలించిన దరఖాస్తులను ఉన్నతాధికారులకు నివేదిస్తారు. అప్పుడు అర్హుల తుది జాబితా ఆన్లైన్లో సిద్ధమవుతుంది. ఎంపికకు జిల్లా కమిటీ గతంలో స్థానిక ప్రజాప్రతినిధులకు జిల్లా సెలెక్షన్ కమిటీలో స్థానం ఉండగా ప్రస్తుతం అంతా అధికారులే ఉండనున్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, ఐటీడీఏ పరి«ధిలోని అంగన్వాడీలకు పీవో, సభ్యులుగా జిల్లా వైద్యాధికారి, జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి, సంబంధిత ప్రాజెక్టు పరిధిలోని ఆర్డీవో ఉంటారు. ఆన్లైన్లో తుది జాబితా ప్రకారం ముందుగానే ప్రకటించిన తేది మేరకు ఈ కమిటీ నేతృత్వంలో నియామకాల కోసం ఇంటర్వ్యూలు జరుగుతాయి. అర్హులందరి పదో తరగతిలో సాధించిన మార్కులను ప్రాతిపదికన తీసుకుంటారు. రిజర్వేషన్లు ప్రకారం ఎంపిక ఉంటుంది. ఒకే అంగన్వాడీ కేంద్రంలో ఇద్దరు అభ్యర్థినీలకు ఒకే కులం, సమ మార్కులు వస్తే వయస్సును పరిగణలోకి తీసుకుంటారు. అంటే వయస్సు అధికంగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంపిక అయిన అభ్యర్థుల వివరాలు అన్ని అంగన్వాడీ ప్రాజెక్టు ఆఫీసు, కలెక్టరేట్, జిల్లా ఐసీడీఎస్ పీడీ కార్యాలయం నందు అందుబాటులో ఉంచుతారు. -
ఇక ఈపీఎఫ్‌లో ఆన్లైన్ క్లెయిమ్‌లు
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్ట్ 15 నుంచి తమ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మళ్లించనున్నట్టు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పేర్కొంది. రూ 10 లక్షలు మించిన పీఎఫ్ విత్‌డ్రాయల్స్‌కు విధిగా ఆన్లైన్లోనే క్లెయిమ్ చేయాలని స్పష్టం చేసింది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కింద రూ 5 లక్షలు దాటిన విత్‌డ్రాయల్స్‌కు ఆన్లైన్ క్లెయిమ్‌లను అనివార్యం చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం నాటికి పూర్తిగా ఆన్లైన్ సేవలు అందించాలని ఈపీఎఫ్ఓ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఈపీఎఫ్ఓ కార్యాలయాలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. నూతన మార్పులకు అనుగుణంగా రాబోయే రెండు నెలల్లో కాగితరహిత సేవలపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. వాణిజ్య సంస్థలు, కంపెనీలు తమ ఉద్యోగుల పీఎఫ్ క్లెయిమ్‌లను విధిగా ఆన్లైన్లోనే చేపట్టాలని పేర్కొంది. అన్ని ఈ-కోర్టు కేసులనూ ఎలక్ర్టానిక్ ఫైలింగ్ ప్రక్రియలోనే ప్రాసెస్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తమ కార్యాలయాల్లో అవసరమైన మౌలిక వసతులను ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తేనుంది. -
ఈ- రిజిస్ట్రేషన్‌లో ‘ట్రేడ్ లెసైన్స్’ పొందండిలా..
మహానగరంలో ఏ వ్యాపారం చేయాలన్నా తప్పకుండా లెసైన్స్ ఉండాల్సిందే. వ్యాపార అనుమతి పత్రాన్ని (ట్రేడ్ లెసైన్స్) గతంలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి నిబంధనలకు అనుగుణంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయం జారీ చేసేది. అయితే, లెసైన్స్ జారీలో పారదర్శకత, త్వరితంగా ధృవీకరణ పత్రాలు మంజూరు, వ్యాపారులకు సౌకర్యంగా ఉండేందుకు ‘ఆన్లైన్’లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే ప్రొవిజనల్ లెసైన్స్ పొందే వీలుండడం ఈ విధానం ప్రత్యేకత. ట్రేడ్ లెసైన్స్ కోసం ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి? ఏయే పత్రాలు జతచేయాలి? తదితర విషయాలు మీ కోసం.. రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోవాలి.. ⇒ గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కొన్ని సేవలను ఈ- రిజిస్ట్రేషన్ విధానంతో అందిస్తున్నారు. ⇒ ఈ సేవలను పొందాలంటే ముందుగా మనం సంబంధిత సైట్లో రిజిస్టర్ అవ్వాలి. ⇒ ఇందుకు http://eghmc.ghmc.gov.in/ సైట్లో సిటిజన్ లాగిన్ కాలమ్‌లో ‘రిజిస్టర్ యువర్ సెల్ఫ్’ను క్లిక్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ ఫామ్‌లో మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబరు, చిరునామా, పిన్‌కోడ్, ఈ- మెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ⇒ తరువాత ‘సబ్మిట్’ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఈ- మెయిల్‌కు, ఫోన్‌కు పాస్వర్డ్ వస్తుంది. ⇒ మీ మొబైల్ ఫోన్ నంబరు మీకు యూజర్ నేమ్‌గా ఉంటుంది. స్కాన్ చేసి ఉంచుకోవాల్సిన పత్రాలు.. ⇒ రెంటల్ డీడ్, ప్రాపర్టీ టాక్స్ రసీదు, బిల్డింగ్ ప్లాన్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు పీడీఎఫ్ ఫార్మట్‌లో ఉంచుకోవాలి. ⇒ పైన పేర్కొన్న పత్రాల పరిమాణం ‘1 ఎంబీ’కి మించకూడదు. దరఖాస్తు విధానం ఇలా... ⇒ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చిన తరువాత లాగిన్ అవ్వండి. ⇒ ఇక్కడి విండోలో ‘ట్రేడ్ లెసైన్స్’ ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ⇒ స్క్రీన్‌పై కనిపిస్తున్న ‘ట్రాన్సాక్షన్’ ఆప్షన్లో సబ్ ఆప్షన్‌గా ఉన్న ‘అప్లై ఫర్ న్యూ ట్రేడ్ లెసైన్స్’ను ఎంచుకోవాలి. ఇప్పుడు మీకు దరఖాస్తు ఫామ్ వస్తుంది. ⇒ ఈ దరఖాస్తును నింపిన తర్వాత ‘సబ్మిట్’ చేస్తే మీకు దరఖాస్తు నంబరుతో ‘ఎకనాలెడ్జ్మెంట్- ప్రొవిజినల్ డిమాండ్ నోటీస్’ వస్తుంది. ⇒ ఇందులో మీరు చెల్లించాల్సిన రుసుం ఎంతో తెలియపరుస్తారు. ⇒ ఈ రుసుంను ‘మీ-సేవ’లో గానీ, ఇదే సైట్లో ‘ఆన్లైన్ పేమెంట్’ గాని చేయవచ్చు. ⇒ తరువాత మీకు రుసుం రసీదు, ప్రొవిజనల్ లెసైన్స్ జారీ చేస్తారు. ⇒ దరఖాస్తు అనంతరం ఎకనాలెడ్జ్మెంట్ పత్రాలు మీ ఈ-మెయిల్‌కు వచ్చేస్తాయి. ⇒ సంబంధిత అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో దరఖాస్తులో మీరు పేర్కొన్న అంశాలు సరైనవి అని తేలిన అనంతరం మీకు ‘ట్రేడ్ లెసైన్స్’ మంజూరు చేస్తారు. దరఖాస్తు పరిశీలన గురించి.. ⇒ ఇదే సైట్లో ‘రిపోర్ట్స్’ ఆప్షన్లో ‘అప్లికేషన్ స్టేటస్’ను క్లిక్ చేయాలి. ⇒ ఇక్కడ బై డిఫాల్ట్‌గా మీ దరఖాస్తు నంబర్ కనిపిస్తుంది. ⇒ దాని స్టేటస్ కూడా కాలమ్‌లో చివర కనిపిస్తుంది. ⇒ మీకు మరిన్ని వివరాలు కావాలంటే సంబంధిత దరఖాస్తును క్లిక్ చేసి ‘వ్యూ డీటేల్స్’ను క్లిక్ చేస్తే దరఖాస్తు వివరాలు ప్రత్యక్షమవుతాయి. నోట్ : దరఖాస్తులో ‘*’ గుర్తున్న వాటిని కచ్చితంగా పూరించాలి. ఫోన్ నంబరు, ఈ-మెయిల్, చిరునామా కరెక్ట్‌గా ఇవ్వాలి. భవిష్యత్తులో సమాచారం పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్లింత్ ఏరియాను కరెక్ట్‌గా నమోదు చేయాలి.