సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్–2021కు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుందని పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ పేర్కొంది. వాస్తవానికి దరఖాస్తు ప్రక్రియ ఆదివారం నుంచే ప్రారంభం కావలసి ఉంది. కానీ ఈ పరీక్షకు అర్హత అయిన జేఈఈ మెయిన్–2021 ఫలితాలు వెలువడక పోవడంతో దరఖాస్తు ప్రక్రియను ఒక రోజు వాయిదా వేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజును సెప్టెంబర్ 20 వరకు చెల్లించవచ్చు.
సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు అడ్మిట్ కార్డులు సంబంధిత వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అక్టోబర్ 3వ తేదీన జరగనుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష ఉంటుంది. వాస్తవానికి ఈ పరీక్ష జూలై 3న నిర్వహించాల్సి ఉండగా, కరోనా కారణంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ఆలస్యం కావడంతో అక్టోబర్ 3కు వాయిదా పడింది. అభ్యర్థులకు వారి రెస్పాన్స్ షీట్లు అక్టోబర్ 5వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 10న ప్రాథమిక కీని విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అభ్యర్థుల అభిప్రాయాలను ఆధారాలతో సహా అక్టోబర్ 11వ తేదీ వరకు సమర్పించవచ్చు.
అక్టోబర్ 18న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు
ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కోరుకొనే అభ్యర్థులు సంబంధిత ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష (ఏఏటీ)కు అక్టోబర్ 15, 16 తేదీల్లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ పరీక్ష అక్టోబర్ 18న నిర్వహిస్తారు. ఏఏటీ ఫలితాలను అక్టోబర్ 22న విడుదల చేస్తారు. ఐఐటీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రాల లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేస్తుండడంతోపాటు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఫలితాల ప్రకటన ఆలస్యమవుతూ వచ్చింది. జేఈఈ మెయిన్స్‌లో మెరిట్ సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులు. ఆదివారం అర్ధరాత్రి లేదా సోమవారం ఉదయానికి జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment