JEE advance exams
-
నేడు JEE అడ్వాన్స్ డ్-2023 పరీక్ష
-
జేఈఈ మెయిన్‌కు రెండుసార్లే చాన్స్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ మెయిన్‌ను ఇక నుంచి రెండుసార్లు మాత్రమే నిర్వహించనున్నారు. ఈ ఏడాది (2022) నుంచి ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే జేఈఈ మెయిన్‌ను జరపాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జేఈఈ మెయిన్‌కి హాజరయ్యేందుకు విద్యార్థులకు రెండు చాన్సులు మాత్రమే ఉంటాయి. గతేడాది కరోనా నేపథ్యంలో మెయిన్ పరీక్షను నాలుగుసార్లు నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా విద్యార్థులకు నాలుగుసార్లు పరీక్ష రాసుకునే అవకాశం కల్పించారు. గతేడాది అస్తవ్యస్తం.. జేఈఈ మెయిన్‌ను గతేడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలలో నిర్వహించాలని ముందు నిర్ణయించారు. అయితే.. కోవిడ్‌తో ఏప్రిల్, మే నెలల పరీక్షలు సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో కానీ పూర్తి కాలేదు. గతేడాది దేశవ్యాప్తంగా దాదాపు 26 లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. మల్టీసెషన్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో జేఈఈ మెయిన్‌ను నిర్వహించారు. అయితే ఈ నాలుగు చాన్సుల విధానంలో కొన్ని లోపాలు తలెత్తిన సంగతి తెలిసిందే. మొదటి చాన్సులో ప్రతిభ చూపని అభ్యర్థులు చివరి దశ పరీక్షలో అధిక మార్కులు సాధించడం గమనార్హం. గతేడాది నాలుగుసార్లు నిర్వహించిన పరీక్ష స్కోరుల్లో అత్యుత్తమమైన దాన్ని అభ్యర్థి తుది స్కోర్‌గా ఎన్టీఏ పరిగణించింది. దాని ఆధారంగానే ర్యాంకులను ప్రకటించింది. ఇలా నాలుగుసార్లు రాసుకునే అవకాశం కల్పించడం వల్ల కొంతమంది విద్యార్థులు గణనీయంగా లబ్ధి పొందారు. ఈసారి త్వరగా ప్రవేశాలు.. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. గతేడాది కరోనాతో వివిధ బోర్డుల 12వ తరగతి పరీక్షలను చాలా ఆలస్యంగా నిర్వహించారు. ఈ ఏడాది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షలు సకాలంలో అంటే.. ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ (ఐఎస్సీ) పరీక్షలను ఏప్రిల్ చివరి వారం నుంచి నిర్వహించనున్నారు. దీంతో ఈసారి జేఈఈ మెయిన్‌ను రెండుసార్లకే పరిమితం చేయాలని ఎన్టీఏ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ షెడ్యూల్ ఫిబ్రవరి నెలాఖరులోగా విడుదల కానుంది. అనంతరం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. -
ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి సంబంధించి ఆదివారం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2021 ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 1.5 లక్షల మంది హాజరయ్యారు. ఏపీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న 15 వేల మందిలో 90 శాతం మంది పరీక్షకు హాజరైనట్టు ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 30 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఐఐటీ ఖరగ్‌పూర్ జేఈఈ అడ్వాన్స్డ్–2021 నిర్వహించింది. 15న ఫైనల్ కీ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు సంబంధిత వెబ్సైట్లో ఈనెల 5నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ప్రాథమిక కీ ప్రకటించనున్నారు. 10, 11 తేదీల్లో ప్రాథమిక కీపై అభ్యర్థులు వారి అభ్యంతరాలను ఆధారాలతో సహా ఆన్లైన్ ద్వారా సమర్పించడానికి అవకాశం ఉంటుంది. అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం అనంతరం అక్టోబర్ 15న ఫైనల్ కీ, తుది ఫలితాలను ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేయనుంది. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) అక్టోబర్ 18న నిర్వహిస్తారు. వీటి ఫలితాలను అక్టోబర్ 22న విడుదల చేస్తారు. 16 నుంచి కౌన్సెలింగ్ దేశంలోని 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ఐఐఐటీలు, 29 ఇతర గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాల కోసం జేఈఈ కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. జేఈఈ అడ్వాన్స్డ్ తుది ఫలితాలు, ర్యాంకులు విడుదలైన అనంతరం జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఈ ప్రక్రియను ప్రారంభిస్తుంది. జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌లో మెరిట్ సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో ఇచ్చే వెబ్ ఆప్షన్లను అనుసరించి వారి ర్యాంక్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రశ్నల తీరిలా.. జేఈఈ అడ్వాన్స్‌లో ప్రశ్నలు మోడరేట్‌గా అడిగినట్టు పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో సరిసమాన ప్రాధాన్యతలో ప్రశ్నలు వచ్చినట్టు పలు కోచింగ్ కేంద్రాల నిపుణులు విశ్లేషించారు. గతానికీ.. ఇప్పటికీ ప్యాట్రన్‌లో స్వల్పంగా మార్పు చేశారని, ప్రతి విభాగంలో 19 ప్రశ్నలు చొప్పున 57 ప్రశ్నలను 180 మార్కులకు ఇచ్చారని వివరించారు. ఆయా సబ్జెక్టులలో నాలుగు సెక్షన్లుగా ప్రశ్నలు పొందుపరిచారని, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో ఇంటర్మీడియెట్ రెండేళ్లకు సంబంధించిన టాపిక్‌లను కవర్ చేస్తూ ప్రశ్నలు అడగ్గా, ఫిజిక్సులో ఇంటర్ ఫస్టియర్ చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని విజయవాడకు చెందిన ప్రముఖ కోచింగ్ సెంటర్ అధ్యాపకులు వివరించారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌తో పోల్చుకుంటే మేథమెటిక్స్ ప్రశ్నలు ఒకింత కఠినంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కెమిస్ట్రీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలు ఎన్సీఈఆర్టీలో ఉన్న వాటిని యథాతథంగా అడిగారని వివరించారు. ఫిజిక్స్‌లో ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్, రొటేషన్ అంశాలతో పాటు మోడ్రన్ ఫిజిక్స్ అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. మ్యాథమెటిక్స్‌లో మేట్రిక్స్, డిటర్మినెంట్స్, ఫంక్షన్స్, కంటిన్యుటీ, డిఫరెన్షియలబిలిటీ, 3డీ జియోమెట్రీ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ట్రిగ్నోమెట్రీ నుంచి కొన్ని గమ్మత్తయిన ప్రశ్నలు అడిగారని అభ్యర్థులు పేర్కొన్నారు. -
నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2021కు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుందని పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ పేర్కొంది. వాస్తవానికి దరఖాస్తు ప్రక్రియ ఆదివారం నుంచే ప్రారంభం కావలసి ఉంది. కానీ ఈ పరీక్షకు అర్హత అయిన జేఈఈ మెయిన్–2021 ఫలితాలు వెలువడక పోవడంతో దరఖాస్తు ప్రక్రియను ఒక రోజు వాయిదా వేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజును సెప్టెంబర్ 20 వరకు చెల్లించవచ్చు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు అడ్మిట్ కార్డులు సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష అక్టోబర్ 3వ తేదీన జరగనుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష ఉంటుంది. వాస్తవానికి ఈ పరీక్ష జూలై 3న నిర్వహించాల్సి ఉండగా, కరోనా కారణంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ఆలస్యం కావడంతో అక్టోబర్ 3కు వాయిదా పడింది. అభ్యర్థులకు వారి రెస్పాన్స్ షీట్లు అక్టోబర్ 5వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 10న ప్రాథమిక కీని విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అభ్యర్థుల అభిప్రాయాలను ఆధారాలతో సహా అక్టోబర్ 11వ తేదీ వరకు సమర్పించవచ్చు. అక్టోబర్ 18న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కోరుకొనే అభ్యర్థులు సంబంధిత ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష (ఏఏటీ)కు అక్టోబర్ 15, 16 తేదీల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ పరీక్ష అక్టోబర్ 18న నిర్వహిస్తారు. ఏఏటీ ఫలితాలను అక్టోబర్ 22న విడుదల చేస్తారు. ఐఐటీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రాల లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేస్తుండడంతోపాటు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఫలితాల ప్రకటన ఆలస్యమవుతూ వచ్చింది. జేఈఈ మెయిన్స్‌లో మెరిట్ సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులు. ఆదివారం అర్ధరాత్రి లేదా సోమవారం ఉదయానికి జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడే అవకాశముంది. -
ఆగస్టు 23న జేఈఈ–అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్షను ఆగస్టు 23వ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. మే 17న జరగాల్సిన ఈ పరీక్ష లాక్డౌన్ వల్ల వాయిదా పడింది. జేఈఈ–మెయిన్స్ పరీక్షలను జూలై 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు పూర్తయ్యాక 10–15 రోజుల్లో ఫలితాలను వెల్లడించనున్నారు. టాప్ మార్కులు సాధించిన 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కల్పించనున్నారు. ఆ దరఖాస్తులకు నాలుగైదు రోజుల సమయం ఇస్తారు. ఆగస్టు 23న పరీక్ష నిర్వహించి వీలైనంత త్వరగా ఫలితాలను వెల్లడించనున్నారు. ఆ తరువాత జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనుంది. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఇంజనీరింగ్ తరగతులను ప్రారంభించేలా ఇటీవల ఏఐసీటీఈ అకడమిక్ షెడ్యూల్ ప్రకటించింది. ‘పీఎం రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్’లో సవరణలు దేశంలో పరిశోధనలను మరింతగా ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్‌లో పలు సవరణలు చేసినట్లు రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు. ఈ ఫెలోషిప్ పొందడానికి అవసరమైన నిర్దేశిత గేట్ స్కోర్ తగ్గించినట్లు పేర్కొన్నారు. దీన్ని 750 నుంచి 650కి తగ్గినట్లు స్పష్టం చేశారు. అలాగే లేటరల్ ఎంట్రీ అనే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. పీఎంఆర్ఎఫ్ అనుమతి పొందిన విద్యాసంస్థల్లో పీహెచ్డీ చేస్తున్న అభ్యర్థులు ఈ ఫెలోషిప్ కోసం లేటరల్ ఎంట్రీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. -
ఆగస్ట్ 23న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల తేదీ ఖరారు అయింది. ఆగస్ట్ 23న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జెఈఈ (మెయిన్) పరీక్ష జూలై 18 నుంచి 23 వరకు జరుగుతుందని, మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నీట్ పరీక్ష జూలై 26 న జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. కాగా ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థలైన జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో ప్రవేశాల కోసం గత జనవరిలో మెుదటి విడత జేఈఈ మెయిన్‌ను నిర్వహించింది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌తో ఏప్రిల్ 5 నుంచి 11 వరకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ను కేంద్రం ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులు 6 రోజులే
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కోసం మే 1వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు జేఈఈ నిర్వహణ సంస్థ అయిన ఐఐటీ ఢిల్లీ వెల్లడించింది. అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులను 6 రోజులే స్వీకరించేలా షెడ్యూల్‌ను ఖరారు చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను శుక్రవారం వెబ్సైట్లో అందు బాటులో ఉంచింది. మే 1 నుంచి 6 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో(jeeadv.ac.in) దరఖాస్తు చేసు కోవచ్చని అందులో పేర్కొంది. ఫీజు చెల్లింపునకు 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది. మే 17న అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తామని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్–2 పరీక్ష ఉంటుందని పేర్కొంది. వికలాంగులకు గంట అదనంగా సమయం ఇస్తామని, జూన్ 8న ఈ పరీక్షల ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించింది. ఈసారి జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. అందులో ఓపెన్ కేటగిరీలో 1,01,250 మందిని (అందులో వికలాంగులు 5,063 మంది), ఈడబ్లు్యఎస్‌లో 25 వేల మందిని (వికలాంగులు 1,250 మంది), ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌లో 67,500 మందిని (వికలాంగులు 3,375 మంది), ఎస్సీల్లో 37,500 మందిని (వికలాంగులు 1,875 మందిని), ఎస్టీల్లో 18,750 మందిని (వికలాంగులు 938 మంది) పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక 2020–21 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో కనీసంగా 20 శాతం (2,676) సూపర్ న్యూమరీ సీట్లను మహిళలకు కేటాయించేలా ఐఐటీల కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని వెల్లడించింది. గత ఏడాది అందుబాటులో ఉన్న మొత్తం సీట్లకు అదనంగా ఈ సీట్లను కేటాయించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, నిజమాబాద్, వరంగల్‌లో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈనెల 27న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించేందుకు ఐఐటీ రూర్కీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 2.45లక్షల మందికి అర్హత కల్పించినా కేవలం 1.80 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్డ్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 35 వేలమంది అర్హత సాధించిన అడ్వాన్స్‌డ్‌కు కేవలం 18 వేలమంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో తెలంగాణ నుంచి 8,450 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఈ పరీక్షను సోమవారం రెండు విడతల్లో పరీక్ష నిర్వహించేలా ఐఐటీ రూర్కీ చర్యలు చేపట్టింది. ఉదయం 9 గంటల నుంచి మధాహ్నం 12 గంటల వరకు పేపర్–1 పరీక్షను, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్– 2 పరీక్షను నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజమాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్ష సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించరని, విద్యార్థులు వీలైనంత ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. విద్యార్థులు తమ వెంట పెన్నులు, పెన్సిళ్లు, హాల్‌టికెట్లు, ఐడీ కార్డు తెచ్చుకోవాలని పేర్కొంది. ఇక ఈ పరీక్ష ఫలితాలను/ర్యాంకులను వచ్చే నెల 14న విడుదల చేస్తామని ప్రకటించింది. ఇదీ అడ్వాన్స్డ్ షెడ్యూలు - 27–5–2019: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష - 29–5–2019 నుంచి 1–6–2019 వరకు: అభ్యర్థులకు వారి రెస్పాన్స్‌షీట్లు పంపిణీ - 4–6–2019: వెబ్సైట్లో అందుబాటులోకి ‘కీ’ - 4–6–2019 నుంచి 5–6–2019 వరకు: ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణ - 14–6–2019 ఉదయం 10 గంటలకు: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెల్లడి - 14–6–2019 నుంచి 15–6–2019 వరకు: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ - 17–6–2019: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు - 21–6–2019 సాయంత్రం: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు ఫలితాలు -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ తేదీల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు మరోసారి మారనున్నాయి. ఇప్పటికే పరీక్ష తేదీలను మార్పు చేసిన ఇంటర్ బోర్డు మరోసారి మార్పు చేసేందుకు కసరత్తు చేస్తోంది. మొదట్లో మే 15 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలు జారీ చేసిన బోర్డు.. ఫలితాల్లో పొరపాట్ల కారణంగా ఈ నెల 25 నుంచి పరీక్షలు నిర్వహించేలా షెడ్యూ లు జారీ చేసింది. అయితే ఈ నెల 26న బిట్సాట్ పరీక్ష ఉండటం, 27న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఉండటంతో తల్లిదండ్రుల నుంచి పరీక్ష తేదీలు మార్పు చేయాలని విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో మళ్లీ పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తామని బోర్డు ప్రకటించింది. త్వరలోనే మార్పు చేసిన తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. మరోవైపు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 2తో ముగియనుండగా, దానిని ఈ నెల 4 వరకు పొడిగించింది. -
సంకల్పానికి తోడైన నాన్న సహకారం
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించిన రావూరి లోహిత్ సక్సెస్ స్టోరీ.. మా స్వస్థలం చిత్తూరు జిల్లా, పుత్తూరు. నాన్న సురేశ్ ఎయిర్‌ఫోర్స్‌లో జూనియర్ వారంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేశారు. అమ్మ సుధారాణి నగరి మండలం తడుకుపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. అమ్మానాన్న ఇద్దరూ విద్యావంతులు కావడంతో ఐఐటీలో సీటు సాధించాలనే నా లక్ష్యానికి ఎంతో తోడ్పాటును అందిచ్చారు. చిన్నప్పటి నుంచే: చిన్ననాటి నాకు నుంచే ఇంజనీరింగ్ చదవాలనే కోరిక ఉండేది. ఆ సంకల్పానికి నాన్న సహకారం తోడైంది. ఆయన ఉద్యోగ రీత్యా అధికశాతం ఉత్తరాది రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించారు. ఆ క్రమంలో అక్కడ ఉండే ఐఐటీలు, కోచింగ్ సెంటర్ల గురించి సమాచారం సేకరించేవారు. దాని ఆధారంగా ఐఐటీల్లో సీటు సాధించాలంటే..ఏం చదవాలి? ఎలా చదవాలి? వంటి అంశాలపై ప్రాథమికంగా అవగాహన కల్పించారు.దాంతో పాఠశాల స్థాయిలోనే ఐఐటీల్లో సీటు సాధించే విషయంలో ఒక స్పష్టత వచ్చింది. ఐఐటీ లక్ష్యంగా ఆరో తరగతి నుంచే కష్టపడటం ప్రారంభించాను. ఐఐటీ-ఫౌండేషన్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్‌లో చేరా. దాంతో జేఈఈకి అవసరమైన బేసిక్స్,ఫండమెంటల్స్‌పై పట్టు లభించింది. ఇది ప్రాథమి కంగా జేఈఈలో విజయానికి ఎంతో దోహదం చేసింది. పూర్తి స్థాయిలో: జేఈఈలో ర్యాంకు కోసం ఇంటర్మీడియెట్ నుంచి పూర్తిస్థాయిలో ప్రిపరేషన్‌కు ఉపక్రమించాను. ప్రతిరోజు సగటున 10-11 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాను. క్లిష్టమైన అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సందేహాలను ఫ్యాకల్టీల సహాయంతో నివృత్తి చేసుకున్నా. దాంతో సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్‌ను నిర్ణీత సమయంలో పూర్తి చేయగలిగాను. అన్నిటికంటే ఫిజికల్ కెమిస్ట్రీ కొంత కష్టంగా అనిపించేది. ఇందుకోసం పరీక్షకు నెలరోజుల సమయంలో అన్ని సబ్జెక్ట్‌ల కంటే కొద్దిగా ఎక్కువగా దీనికి ప్రాధాన్యతనిచ్చాను. తద్వారా ఈ సమస్యను తేలికగా అధిగమించాను. రివిజన్ + ప్రాక్టీస్ టెస్ట్స్: నేను చదివిన కాలేజీలో జేఈఈ కోచింగ్ కోసం ప్రత్యేక స్టడీ ప్లాన్ అమలు చేసేవారు. ఆ స్టడీ ప్లాన్‌ను అనుసరించడం వల్ల ఇంటర్ సిలబస్ ముందుగానే పూర్తయి.. ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల సిలబస్ పునశ్చరణకు తగిన సమయం లభించింది. ఈ సమయంలోనే అన్ని అంశాల రివిజన్‌తోపాటు ప్రాక్టీస్ టెస్ట్‌లు, మోడల్ టెస్టులకు హాజరయ్యే వాడిని. వాటి ఫలితాల ఆధారంగా ఎప్పటికప్పుడు లోపాలు తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటూ ప్రిపరేషన్ సాగించాను. ప్రాక్టికల్ అప్రోచ్‌తో: సబ్జెక్టులను ప్రాక్టికల్, అప్లికేషన్ అప్రోచ్‌తో చదవాలి. జేఈఈ-అడ్వాన్స్డ్ విషయంలో చాలా మంది విద్యార్థులకు కెమిస్ట్రీ క్లిష్టంగా అనిపిస్తుంది. కాబట్టి థియరీ సబ్జెక్ట్లనైనా ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌తో చదవాలి. కేవలం చదవడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రాక్టీస్ చేయడం అలవర్చుకోవాలి. నేను ఇదే ఫార్ములాను అనుసరించి క్లిష్టంగా అనిపించిన ఫిజికల్ కెమిస్ట్రీలోని అంశాలపైనా అవగాహన పెంపొందించుకున్నాను. ప్రిపరేషన్ సమయంలో ఒక అంశాన్ని చదివేటప్పుడు దానికి అనుసంధానంగా ఉండే మిగతా అంశాలపై కూడా అవగాహన ఏర్పరచుకోవాలి. తద్వారా తదుపరి దశల్లో ప్రిపరేషన్ చాలా సులభమవుతుంది. ముఖ్యంగా ఫిజిక్స్ విషయంలో ఈ తరహా ప్రిపరేషన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. షార్ట్‌కట్ మెథడ్స్‌తో: ప్రిపరేషన్ సమయంలో స్వల్ప కాలంలో సమస్యలను సాధించేలా.. ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి సొంతంగా షార్ట్‌కట్ మెథడ్స్, మెమరీ టిప్స్ పాటించాను. చదివిన ప్రతి అంశానికి సంబంధించి ముఖ్యాంశాలతో సొంత నోట్స్ రాసుకోవడం, కీలకమైన కాన్సెప్ట్‌లు, ఫార్ములాలు గుర్తుండేలా షార్ట్‌కట్ మెథడ్స్‌ను అనుసరించాను. రోబోటిక్స్‌లో రీసెర్చ్: ఐఐటీ-ముంబైలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌లో చేరడమే తక్షణ లక్ష్యం. ఆ కోర్సు పూర్తయ్యాక రోబోటిక్స్‌లో పరిశోధన చేయడమే భవిష్యత్తు ఆశయం. వీలుకాకపోతే ఐఐఎంలో ఎంబీఏ చేస్తా. కష్టంగా భావించకుండా.. ఇష్టంగా: ఔత్సాహిక విద్యార్థులు ‘జేఈఈలో ర్యాంకు సాధించడం అంత సులువు కాదు’.. అనే భయాన్ని వీడాలి. కష్టమైన సబ్జెక్ట్లపై ఇష్టం పెంచుకుంటే.. తేలికగానే సమస్యను అధిగమించొచ్చు. మొత్తం ప్రిపరేషన్ ప్రక్రియలో ఒత్తిడికి గురయ్యే సందర్భాలు ఎదురవడం సహజం. అలాంటప్పుడు కొద్దిసేపు మానసిక ఉల్లాసాన్ని కలిగించే అంశాలపై దృష్టి సారించాలి. నేను ఒత్తిడికి గురైన సందర్భంలో క్రికెట్ ఆడటం, సైన్స్ ఫిక్షన్ నవలలు చదివాను. అకడెమిక్ ప్రొఫైల్ 2012లో పదో తరగతి ఉత్తీర్ణత (9.8 జీపీఏ) 2014లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత (981 మార్కులు) ఎంసెట్-2014లో 127వ ర్యాంకు బిట్‌శాట్-214 స్కోర్: 403 జేఈఈ-మెయిన్ మార్కులు: 316 జేఈఈ అడ్వాన్స్డ్ మార్కులు: 317 2013లో కేవైపీవై ఎస్ఏ విభాగంలో మెంటార్‌షిప్‌నకు ఎంపిక -
25న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఈనెల 25న నిర్వహించనున్నట్లు నిర్వాహక సంస్థలు ప్రకటించాయి. ఈనెల 9 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) అవకాశం కల్పించాయి. ఈసారి పరీక్షను ముంబై, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాసు, రూర్కీ ఐఐటీలు సంయుక్తంగా నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఈనెల 25న ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టాయి. ఐఐటీలో చేరాలంటే జేఈఈ-అడ్వాన్స్డ్ పరీక్షలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. జేఈఈ-మెయిన్ పరీక్షలో తొలి 1,50,000లోపు ర్యాంకు వారే జేఈఈ-అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ అడ్వాన్స్డ్ పరీక్షలో కేటగిరీ వారీగా అభ్యర్థులు సాధించిన జాతీయస్థాయి ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. అయితే వీరంతా ఆయా రాష్ట్రాల బోర్డులు నిర్వహించిన 12వ తరగతిలో టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలి.