ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌  | JEE Advanced Ended calmly | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 

Published Mon, Oct 4 2021 3:44 AM | Last Updated on Mon, Oct 4 2021 3:44 AM

JEE Advanced Ended calmly - Sakshi

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి సంబంధించి ఆదివారం నిర్వహించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌–2021 ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పేపర్‌–1, మధ్యాహ్నం పేపర్‌–2 పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 1.5 లక్షల మంది హాజరయ్యారు. ఏపీ నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 15 వేల మందిలో 90 శాతం మంది పరీక్షకు హాజరైనట్టు ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 30 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2021 నిర్వహించింది. 

15న ఫైనల్‌ కీ 
అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లు సంబంధిత వెబ్‌సైట్‌లో ఈనెల 5నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ప్రాథమిక కీ ప్రకటించనున్నారు. 10, 11 తేదీల్లో ప్రాథమిక కీపై అభ్యర్థులు వారి అభ్యంతరాలను ఆధారాలతో సహా ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించడానికి అవకాశం ఉంటుంది. అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం అనంతరం అక్టోబర్‌ 15న ఫైనల్‌ కీ, తుది ఫలితాలను ఐఐటీ ఖరగ్‌పూర్‌ విడుదల చేయనుంది. ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఏఏటీ) అక్టోబర్‌ 18న నిర్వహిస్తారు. వీటి ఫలితాలను అక్టోబర్‌ 22న విడుదల చేస్తారు. 

16 నుంచి కౌన్సెలింగ్‌ 
దేశంలోని 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 26 ఐఐఐటీలు, 29 ఇతర గవర్నమెంట్‌ ఫండెడ్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్లలో ప్రవేశాల కోసం జేఈఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభం కానుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తుది ఫలితాలు, ర్యాంకులు విడుదలైన అనంతరం జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) ఈ ప్రక్రియను ప్రారంభిస్తుంది. జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో ఇచ్చే వెబ్‌ ఆప్షన్లను అనుసరించి వారి ర్యాంక్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.  

ప్రశ్నల తీరిలా.. 
జేఈఈ అడ్వాన్స్‌లో ప్రశ్నలు మోడరేట్‌గా అడిగినట్టు పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో సరిసమాన ప్రాధాన్యతలో ప్రశ్నలు వచ్చినట్టు పలు కోచింగ్‌ కేంద్రాల నిపుణులు విశ్లేషించారు. గతానికీ.. ఇప్పటికీ ప్యాట్రన్‌లో స్వల్పంగా మార్పు చేశారని, ప్రతి విభాగంలో 19 ప్రశ్నలు చొప్పున 57 ప్రశ్నలను 180 మార్కులకు ఇచ్చారని వివరించారు. ఆయా సబ్జెక్టులలో నాలుగు సెక్షన్లుగా ప్రశ్నలు పొందుపరిచారని,  కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో ఇంటర్మీడియెట్‌ రెండేళ్లకు సంబంధించిన టాపిక్‌లను కవర్‌ చేస్తూ ప్రశ్నలు అడగ్గా, ఫిజిక్సులో ఇంటర్‌ ఫస్టియర్‌ చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని విజయవాడకు చెందిన ప్రముఖ కోచింగ్‌ సెంటర్‌ అధ్యాపకులు వివరించారు.

కెమిస్ట్రీ, ఫిజిక్స్‌తో పోల్చుకుంటే మేథమెటిక్స్‌ ప్రశ్నలు ఒకింత కఠినంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కెమిస్ట్రీలో ఇనార్గానిక్‌ కెమిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలు ఎన్‌సీఈఆర్టీలో ఉన్న వాటిని యథాతథంగా అడిగారని వివరించారు. ఫిజిక్స్‌లో ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్, రొటేషన్‌ అంశాలతో పాటు మోడ్రన్‌ ఫిజిక్స్‌ అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. మ్యాథమెటిక్స్‌లో మేట్రిక్స్, డిటర్మినెంట్స్, ఫంక్షన్స్, కంటిన్యుటీ, డిఫరెన్షియలబిలిటీ, 3డీ జియోమెట్రీ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ట్రిగ్నోమెట్రీ నుంచి కొన్ని గమ్మత్తయిన ప్రశ్నలు అడిగారని అభ్యర్థులు పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement