ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో మరో 15వేల సీట్లు | IITs plan to introduce new courses online | Sakshi
Sakshi News home page

ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో మరో 15వేల సీట్లు

Published Thu, Feb 13 2025 5:07 AM | Last Updated on Thu, Feb 13 2025 5:07 AM

IITs plan to introduce new courses online

ఆన్‌లైన్‌ విధానంలో కొత్త కోర్సులు తెచ్చే యోచనలో ఐఐటీలు

కేంద్ర ప్రభుత్వానికి విద్యాసంస్థల ప్రతిపాదనలు

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఉన్న ఇండి­యన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) కాలేజీల్లో ఇంజ­నీరింగ్‌ సీట్లు పెరిగే అవకాశం ఉంది.ప్రాథమిక అంచనా ప్రకారం 15 వేల (ఐఐటీ­ల్లో 5 వేలు, ఎన్‌ఐటీల్లో 10 వేలు) సీట్లు పెంచాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చాయి. దీంతోపాటు ఆన్‌లైన్‌ విధానంలో కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఐఐటీ­లు యోచిస్తు­న్నాయి. 

కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్‌ మేరకు సీట్లు పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు, ఎన్‌ఐటీలు గత ఏడాది కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్‌ కోర్సులనే మొదటి ఆప్షన్‌గా పెట్టుకుంటున్నారు. దాదా­పు 1.45 లక్షల మంది ఈ బ్రాంచ్‌లనే కౌన్సెలింగ్‌లో మొదటి ఐచ్ఛి­కంగా ఎంచుకున్నారు. 

సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతో­పాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధా­న్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అదనంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐఐటీలు కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొ­న్నాయి. వీటికి కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలో నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు. 

ఇదే జరిగితే ఐఐటీల్లో ఈ ఏడాది ఏఐ/ఎంఎల్‌ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌/మిషన్‌ లెర్నింగ్‌), డేటా సైన్స్‌ తదితర కంప్యూటర్‌ కోర్సుల్లో కనీసం 4 వేల సీట్లు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఐఐటీల్లో మొత్తం 17 వేల సీట్లు ఉన్నాయి.

సీటు అక్కడే కావాలి...
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు పొందిన వారు బాంబే–ఐఐటీపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల సీట్ల పెంపునకు కేంద్రం అంగీకరిస్తే బాంబే–ఐఐటీకి మొదటి ప్రాధాన్యమిచ్చే వీలుంది. ఆ తర్వాత ఢిల్లీ, కాన్పూర్, మద్రాస్‌ ఐఐటీలకు ప్రాధాన్యమిస్తున్నారు. వీటి తర్వాత స్థానంలో హైదరాబాద్‌ ఐఐటీ నిలిచింది. బాంబే ఐఐటీలో ఓపెన్‌ కేటగిరీలో బాలురు 67, బాలికలు 291వ ర్యాంకుతో క్రితంసారి సీటు కేటాయింపు ముగిసింది. 

మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకూ సీటు దక్కింది. అయితే, విద్యార్థులు అంతగా ప్రాధాన్యమి వ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో బిలాల్‌ ఐఐటీ ఉంది. ఇలాంటి ఐఐటీల్లో సీట్లు పెంచడం అవసరం లేదని భావిస్తున్నారు.

ఎన్‌ఐటీల్లో...
ఐఐటీల్లో సీట్ల పెంపు నేపథ్యంలో ఎన్‌ఐటీల్లో ఈసారి కటాఫ్‌ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్‌ ఎ¯న్‌ఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌కు అంతకుముందు 1996 ర్యాంకు వరకూ సీటు వస్తే, 2024లో బాలురకు 3115 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2025లో 4 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే అవకాశముంది.

తమిళనాడు తిరుచిరాపల్లి ట్రిపుల్‌ఐటీలో బాలురకు గత ఏడాది 996 ర్యాంకుతోనే సీట్లు ఆగిపోగా, ఈ ఏడాది మాత్రం బాలురకు 1,509 ర్యాంకు దాకా సీటు వచ్చింది. ఎన్‌ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యంగా కంప్యూటర్‌ సైన్స్‌ను ఎంచుకోగా, రెండో ప్రాధాన్యత కూడా 80 శాతం ఇదే బ్రాంచ్‌ ఉండటం విశేషం. 

మొత్తం మీద గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకూ బాలికల విభాగంలో సిక్కిం ఎన్‌ఐటీలో సీఎస్‌సీ సీట్లు వచ్చాయి. మెకానికల్‌కు మాత్రం 58 వేల ర్యాంకు వరకూ ఓపెన్‌ కేటగిరీ సీట్లకు కటాఫ్‌గా ఉంది. బయోటెక్నాలజీకి 48 వేల వరకూ సీటు వచ్చింది. ఈసారి సీట్లు పెరిగితే ఈ కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement