nit
-
జేఈఈ మెయిన్‌కు దరఖాస్తుల జోరు
సాక్షి, అమరావతి: దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షకు ఈ ఏడాది కూడా దరఖాస్తుల జోరు కొనసాగింది. జేఈఈ మెయిన్–2025 జవనరి సెషన్ కోసం సుమారు 12 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. జవనరి 22 నుంచి 31వరకు తొలి సెషన్, ఏప్రిల్ 1 నుంచి 8 వరకు రెండో సెషన్ పరీక్షలకు షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. విద్యార్థులు జనవరి 19 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం జనవరి సెషన్‌కు అక్టోబర్ 28 దరఖాస్తుల విండో ప్రారంభమైనా... మొదటి రెండు వారాల్లో కేవలం 5.10లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. కొత్త విధానాలు, అర్హత ప్రమాణాల మార్పులు విద్యార్థులను గందరగోళానికి గురిచేసినట్లు నిపుణులు చెబుతున్నారు. దరఖాస్తు సమయంలో కొన్ని పత్రాలు ప్రత్యేకంగా అప్లోడ్ చేయాల్సి రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అయినా చివరికి ఈ నెల 22వ తేదీన గడువు ముగిసే నాటికి 12లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. గత ఏడాది కంటే దరఖాస్తులు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తున్నప్పటికీ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్టీఏ ప్రకటించాల్సి ఉంది.ఐచ్ఛిక ప్రశ్నలు, వయసు పరిమితి తొలగింపు..కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన జేఈఈ మెయిన్ పరీక్షల్లో సెక్షన్–బీలోని ఐచ్ఛిక ప్రశ్నల విధానాన్ని ఎన్టీఏ తొలగించింది. ఇప్పుడు సెక్షన్–బీలోని ప్రతి సబ్జెక్టులో పది ప్రశ్నలకు బదులు ఐదు ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. మరోవైపు న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ పద్ధతిని తీసుకొచ్చింది. అంటే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల మాదిరిగానే ప్రతి తప్పు సమాధానానికి మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది. ఎన్టీఏ కొత్తగా వయోపరిమితిని సైతం సడలించింది. 12వ తరగతి విద్యా అర్హత కలిగిన ఎవరైనా ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.టై బ్రేక్ రూల్స్ మార్పు...– జేఈఈ మెయిన్–2025లో ఒకే మార్కులు వచ్చినప్పుడు అభ్యర్థుల ర్యాంకుల టై బ్రేక్ రూల్స్‌ను ఎన్టీఏ సవరించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం పరీక్ష రాసేవారి వయసు, దరఖాస్తు సంఖ్యను ర్యాంకింగ్ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోరు.– విద్యార్థులు ఒకే మొత్తం స్కోర్‌ను సాధిస్తే సబ్జెక్టులలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు. – గణితంలో ఎక్కువ స్కోరు సాధించిన అభ్యర్థులు టై సమయంలో ఉన్నత ర్యాంక్ పొందుతారు.– గణితంలోను ఒకే మార్కులు వచ్చినప్పుడు ఫిజిక్స్‌లో ఎక్కువ స్కోర్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ కూడా ఒకే మార్కులు సాధిస్తే కెమిస్ట్రీ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.– వీటి ద్వారా టై సమస్య కొలిక్కి రాకపోతే అన్ని సబ్జెక్ట్‌లలో సరైన సమాధానాలకు, సరికాని సమాధానాల నిష్పత్తి తక్కువగా ఉన్న అభ్యర్థులకు ఉన్నత ర్యాంక్ కేటాయిస్తారు. వీటిల్లోను నిష్పత్తి టై అయితే గణితం, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో వరుసగా సరికాని సమాధానాల నిష్పత్తులను గుర్తిస్తారు. – ఈ అన్ని దశల తర్వాత కూడా టై మిగిలి ఉంటే అభ్యర్థులకు అదే ర్యాంక్ కేటాయిస్తారు. దేశ, విదేశాల్లో తగ్గిన పరీక్ష కేంద్రాల నగరాలు..దేశంలో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించే నగరాలను 300 నుంచి 284కి తగ్గించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పరీక్షను నిర్వహించే నగరాలను 24 నుంచి 14 కుదించారు. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్ వంటి దేశాల్లో ఎన్టీఏ పరీక్ష కేంద్రాలను తొలగించింది. కొత్తగా బహ్రెయిన్, జర్మనీ, ఇండోనేషియా, ఏయూఈలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 11 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను తొలగించడంతోపాటు మరికొన్ని నగరాల్లో సెంటర్లను తగ్గించారు. తెలంగాణాలో రెండు కొత్తగా రెండు నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.ఏపీలో పరీక్షా కేంద్రాలు ఇవే...అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం.ఏపీలో పరీక్ష కేంద్రాలు తొలగించిన పట్టణాలుఅమలాపురం, బొబ్బిలి, చీరాల, గుత్తి, గుడ్లవల్లేరు, మదనపల్లె, మార్కాపురం, పుట్టపర్తి, పుత్తూరు, తాడిపత్రి, తిరువూరు. -
ఏపీ నిట్‌లో 125 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో ఉద్యోగాల జాతర త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. అర్హులైనవారు అక్టోబరు 10లోపు దరఖాస్తులు సమర్పించాలి. కేంద్ర ఉన్నత విద్యా శాఖ విధానపరమైన నిర్ణయాలు, ఆర్థికపరమైన ఆమోదాలు, పరిపాలనా పరమైన ఆమోదాలు దాటి ఫ్యాకల్టీల భర్తీకి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు కలిపి మొత్తం 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–10కు సంబంధించి 48 పోస్టులను భర్తీ కానున్నాయి. వీటిలో అన్ రిజర్వ్డ్ కోటాలో 20, ఓబీసీలకు 13, ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, ఈడబ్ల్యూఎస్ కింద 5 కేటాయించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–11కు సంబంధించి భర్తీ చేయనున్న 20 పోస్టుల్లో అన్ రిజర్వ్‌డ్‌కు 9, ఓబీసీకి 5, ఎస్సీలకు 3, ఎస్టీలకు ఒకటి, ఈడబ్ల్యూఎస్‌కు 2 పోస్టులు కేటాయించారు. అసోసియేట్ ప్రొఫెసర్–13 ఏ2 కేటగిరీకి సంబంధించి 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అన్ రిజర్వ్‌డ్‌కు 12, ఓబీసీకి 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ఈడబ్ల్యూఎస్‌కు 3 పోస్టులను కేటాయించారు. ప్రొఫెసర్ 14ఏ గ్రేడ్‌కు సంబంధించి 7 పోస్టులను భర్తీ చేయనుండగా, వీటిలో అన్ రిజర్వుడ్‌కు 4, ఓబీసీకి ఒకటి, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి పోస్టులను రిజర్వు చేశారు. బయో టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సీఎస్ఈ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్, ఎంఎంఈ, స్కూల్ ఆఫ్ సైన్సెస్, ఫిజిక్స్, మ్యా«థ్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ విభాగాల్లో కొత్తగా తీసుకొనే ఫ్యాకల్టీలను నియమించనున్నారు. -
పాట్నా ఎన్ఐటీలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య
పాట్నా: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్ధిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) పాట్నాలో ఆత్మహత్యకు పాల్పడింది. బిహ్తాలో క్యాంపస్‌లోని శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. ఘటనా స్థలంలో సూసైడ్ లేఖ కూడా లభ్యమైనట్లు పోలీసులు శనివారం తెలిపారు.శుక్రవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో విద్యార్థిని హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించిన తోటి విద్యార్ధులు యాజమాన్యానికి తెలియజేశారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకుని విద్యార్ధినిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.మృతురాలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ అని, ఆమె కుటుంబసభ్యులకు సమాచారమిచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైందని, ఆ దిశగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే విద్యార్ధిని మృతికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని చెప్పారు. మరోవైపు విద్యార్థి మరణవార్త తెలియడంతో పెద్ద సంఖ్యలో ఇన్స్టిట్యూట్కు చెందిన విద్యార్థులు క్యాంపస్ వెలుపల ఆందోళన చేపట్టారు. ఇన్స్టిట్యూట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఏపీ నిట్.. ప్లేస్‌మెంట్స్‌లో హిట్
తాడేపల్లిగూడెం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటుతోంది. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నవారికి దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీల్లో లేఆఫ్‌లు కొనసాగుతున్నా.. ఏపీ నిట్ విద్యార్థులకు మాత్రం మంచి అవకాశాలు దక్కుతున్నాయి. మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలను సాధిస్తున్నారు. 2022 బ్యాచ్‌లో 98 శాతం, 2023లో 97 శాతం మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యారు. ఏపీ నిట్ ప్రారంభించిన దగ్గరి నుంచి ఇప్పటివరకు ఏడాదికి 300 మందికి తక్కువ కాకుండా ఉద్యోగాలు పొందడం విశేషం. త్వరలో 2023–24 సంవత్సరానికి సంబంధించి ఆరో బ్యాచ్ బయటకు రానుంది. 258 మందికి ఉద్యోగాలుక్యాంపస్ ఇంటర్వ్యూల కోసం ఏకంగా 127 కంపెనీలు నిట్ ప్రాంగణానికి వచ్చాయి. ఆరో బ్యాచ్ విద్యార్థుల్లో ప్లేస్‌మెంట్స్ కోసం 392 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు 258 మంది (65.82 శాతం)కి ఉద్యోగాలు లభించాయి. సరాసరి వేతనం రూ.7.15 లక్షలుగా ఉంది. బీటెక్ ఫైనలియర్ సీఎస్ఈ చదువుతున్న ఆదర్‡్ష, ఈసీఈ విద్యార్థి ఆకాష్‌కుమార్ సిన్హా అత్యధికంగా రూ.44.1 లక్షల వార్షిక ప్యాకేజీ పొందారు. వీరిని నివిధ కంపెనీ ఎంపిక చేసుకుంది. అలాగే సీఎస్ఈ విద్యార్థి సలాది వెంకట శశిభూషణ్.. పేపాల్ కంపెనీలో రూ.34.4 లక్షల ప్యాకేజీతో, సీఎస్ఈ బ్రాంచ్‌కే చెందిన స్వామి సక్సేనా జెడ్ఎస్ కేలర్‌లో రూ.26.5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించడం విశేషం. కాగా డిసెంబర్ వరకు ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ కొనసాగనుంది.480 సీట్ల భర్తీనిట్లో 2024–25 సంవత్సరానికి సంబంధించి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ మొదటి రౌండ్లో 480 సీట్లకు అలాట్మెంట్లు పూర్తయ్యాయని రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకరరెడ్డి గురువారం తెలిపారు. నిట్‌లో సీఈసీ, ఈఈఈ, ఈసీఈ బ్రాంచ్‌ల్లో 90 సీట్ల చొప్పున ఉన్నాయన్నారు. అలాగే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ బ్రాంచ్‌ల్లో 60 చొప్పున, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఎంఎంఈ బ్రాంచ్‌ల్లో 30 చొప్పున సీట్లు ఉన్నాయని వెల్లడించారు. మొత్తం 480 సీట్లలో 50 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులకు, మిగిలిన 50 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కౌన్సెలింగ్ ద్వారా కేటాయించామన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 24లోపు ఆన్లైన్ రిపోర్టింగ్‌తో పాటు ఫీజు చెల్లించాలని కోరారు. ఆగస్టు మొదటి వారంలో నిట్ ప్రాంగణానికి వచ్చి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. దీని కోసం నిట్‌లో ప్రత్యేక కేంద్రం పనిచేస్తోందన్నారు. -
మరో 4 వేల సీట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో ఇంజనీరింగ్ సీట్లు పెంచే అవకాశం ఉందని సమాచారం. 3 వేల నుంచి 4 వేల సీట్లు పెరిగే అవకాశం ఉందని ఐఐటీ డైరెక్టర్ ఒకరు తెలిపారు. సీట్లు పెరగడం వల్ల సీట్ల కటాఫ్‌లో మార్పు జరిగి చేరికల్లో ఎక్కువ మందికి చాన్స్ లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతో పాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అదనంగా నిధులూ అవసరమవుతాయి. దీంతో ఆన్లైన్ కోర్సుల నిర్వహణ ద్వారా ఐఐటీలు కొంతమేర నిధులు సమకూర్చుకునే ప్రతిపాదన ముందుకు వస్తోంది. కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ నేపథ్యంలో.. దేశంలో కంప్యూటర్ నేపథ్యం ఉన్న కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మంచి ప్యాకేజీల దృష్ట్యా రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఎన్ఐటీలు, ఐఐటీల్లోనూ కంప్యూటర్ ఆధారిత కోర్సులపై విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. జేఈఈలో అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్ష¯న్గా పెట్టుకుంటున్నారు. మరోవైపు నైపుణ్యంతో కూడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కొరత ఉందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ సదస్సులోనూ ఈ అభిప్రాయం వ్యక్తమైంది. ఐఐటీలు సైతం కంప్యూటర్ కోర్సుల డిమాండ్‌ను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఐటీలు, ఐఐటీల్లో సీట్లు పెంపు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బొంబయి ఫస్ట్..ఢిల్లీ, మద్రాస్ నెక్స్ట్ దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో 15 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో బొంబయి ఐఐటీకి ప్రతి ఏటా డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఈ ఐఐటీని జేఈఈ అడ్వాన్స్‌డు ర్యాంకు పొందిన వాళ్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, ఖరగ్‌పూర్, మద్రాస్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఐఐటీ ఉంటోంది. గత ఏడాది ముంబై ఐఐటీలో ఓపె¯న్ కేటగిరీలో బాలురైతే 67, బాలికలైతే 291వ ర్యాంకు వరకు సీటు కేటాయింపు జరిగింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకు సీటు దక్కింది. ఇక విద్యార్థులు అంతగా ప్రాధాన్యత ఇవ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో భిలాయ్ ఐఐటీ ఉంది. ఈ నేపథ్యంలో సీట్లు పెరిగితే మరింత మంది విద్యార్థులకు అవకాశం దక్కనుంది. ఎన్ఐటీల్లోనూ అవకాశాలు దేశవ్యాప్తంగా ఐఐటీ సీట్లు పెరిగితే ఎన్ఐటీల్లోనూ విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఐఐటీల్లో సీట్లు పెరగడం వల్ల మెరుగైన ర్యాంకులు పొందినవారు ఐఐటీలో చేరుతారు. మరోవైపు ఎన్ఐటీల్లోనూ సీట్లు పెరిగే వీలుంది. కాబట్టి కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని, ఎక్కువమందికి సీట్లు లభించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2022లో వరంగల్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో 1996 ర్యాంకు వరకు సీటు వస్తే, 2023లో బాలురకు 3115 ర్యాంకు వరకు సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2024లో 4 వేల ర్యాంకు వరకు సీటు వచ్చే వీలుందంటున్నారు. తిరుచిరాపల్లి ఎన్ఐటీలో బాలురకు 2022లో 996 ర్యాంకుతోనే సీట్లు ఆగిపోయాయి. గత ఏడాది మాత్రం బాలురకు 1509 ర్యాంకు దాకా సీటు వచ్చింది. ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యతగా కంప్యూటర్ సైన్స్‌నే ఎంచుకున్నారు. రెండో ప్రాధాన్యతగా కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం విశేషం. గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకు బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్‌కు మాత్రం ఇదే ఐఐటీలో 58 వేల ర్యాంకు వరకు ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్‌గా ఉంది. బయో టెక్నాలజీలో 48 వేల వరకు సీటు వచ్చింది. -
తీవ్ర ఆందోళనలు.. శ్రీనగర్ నిట్ మూసివేత, ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ శ్రీనగర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని (ఎన్ఐటీ) అధికారులు మూసివేశారు. ఓ విద్యార్థి మతపరమైన అంశంపై సోషల్ మీడియాలో ఓ పోస్టు చేయడంతో నిరసనగా కొందరు విద్యార్థులు ఆందోళనగు దిగారు. దీంతో ఇరువర్గాల విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఆందోళనలు ఇతర విద్యాసంస్థలకు కూడా వ్యాపించాయి. అప్రమత్తమైన ఎన్ఐటీ అధికారులు విద్యార్ధులకు శీతాకాల సెలవులను ముందుగానే ప్రకటించారు. గురువారం నుంచే సెలవులు అమల్లోకి వస్తామని యూనివర్సిటీ డీన్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టూడెంట్స్ అందరిని తక్షణమే క్యాంపస్, హాస్టళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. నిట్ వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. కశ్మీర్‌లోని ఇతర డిగ్రీ కాలేజీలు కూడా శనివారం నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. డిసెంబర్ 20లోగా పరీక్షలు ఉండగా,.. వాటిని వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షలను సెలవుల అనంతరం నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే ఉన్నట్టుండి హాస్టళ్లను ఖాళీ చేయాలని ఆదేశించడంతో ఎన్ఐటీలో చదువుతున్న దాదాపు 300 మంది తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీనగర్ నుంచి అత్యవసరంగా బయలుదేరేందుకు విమానాలు, రైలు సదుపాయం లేకపోవడంతో తమను ఆదుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. మరోవైపు స్థానికేతర నిట్వి ద్యార్థి సోషల్ మీడియాలో దైవదూషణతో కూడిన పోస్ట్ చేయడంతో మంగళవారం ఈ వివాదం చెలరేగింది. ఇది ఇన్స్టిట్యూట్లో భారీ నిరసనలకు దారితీసింది. వందలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అభ్యంతరకరమైన పోస్టు చేసి ఇరువర్గాల మధ్య వివాదానికి కారణమైన యూట్యూబ్ వీడియోను పోస్టు చేసిన విద్యార్థిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు శ్రీనగర్ పోలీసులు తెలిపారు. -
తరం తల్లడిల్లుతోంది..!
చిల్లా వాసు, ఏపీ సెంట్రల్ డెస్క్ బాపట్లకు చెందిన చెన్నుపాటి యశ్వంత్ చాలా తెలివైన విద్యార్థి. గతేడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించాడు. ప్రతిష్టాత్మక ఐఐటీ గాంధీనగర్ (గుజరాత్)లో కంప్యూటర్ సైన్సులో సీటు వచ్చింది. అయితే చాలా దూరం కావడంతో జాతీయ స్థాయిలో మరో ప్రముఖ విద్యా సంస్థ ఎన్ఐటీ కాలికట్లో బీటెక్ కంప్యూటర్ సైన్సులో చేరాడు. తల్లిదండ్రులు, బంధువులు ఎంతో సంతోషించారు. యశ్వంత్‌కు ఉజ్వల భవిష్యత్ ఖాయమని, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ఉద్యోగం వచ్చేస్తుందని సంబరపడ్డారు. అయితే ఈ ఆనందం వారికి ఎంతో కాలం నిలవలేదు. ఆరు నెలలకే యశ్వంత్ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎన్ఐటీ కాలికట్ లాంటి ప్రముఖ విద్యా సంస్థలో సీటు సాధించి ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటని అందరూ నివ్వెరపోయారు. ...ఒక్క యశ్వంత్ మాత్రమే కాదు.. ఇలా ఎంతో మంది విద్యార్థులు ప్రముఖ విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) వంటి వాటిలో సీట్లు సాధించి కూడా అర్ధంతరంగా ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపరుస్తోంది. కేంద్ర విద్యా శాఖ లెక్కల ప్రకారం.. 2018 నుంచి ఈ ఏడాది వరకు 33 మంది విద్యార్థులు ఐఐటీల్లో ఆత్మహత్య చేసుకున్నారు. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 2018 నుంచి ఇప్పటివరకు 98 మంది విద్యార్థులు చనిపోతే వీరిలో 33 మంది ఐఐటీల విద్యార్థులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 2014–21లో ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో 122 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం.. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. భారతదేశంలో 2017 నుంచి విద్యార్థుల ఆత్మహత్యల మరణాలు 32.15% పెరిగాయి. మరోవైపు కోచింగ్ ఇన్స్టిట్యూట్ల కర్మాగారంగా, కోచింగ్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. సీటు ఎంత కష్టమంటే.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఐఐటీలు. వీటి తర్వాత స్థానం ఎన్ఐటీలది. ఇంజనీరింగ్ విద్యకు పేరుగాంచిన ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం ఏటా నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్‌ని ఈ ఏడాది దేశవ్యాప్తంగా 11 లక్షలకుపైగా రాశారు. వీరిలో దాదాపు 2.5 లక్షల మందిని తదుపరి పరీక్ష అయిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేశారు. దేశంలో ఉన్న 23 ఐఐటీల్లో ఈ ఏడాదికి 17,385 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే.. 11 లక్షల మంది పరీక్ష రాస్తే చివరకు ఐఐటీల్లో ప్రవేశించేది 17,385 మంది మాత్రమే. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినా సీట్లు రానివారు, జేఈఈ మెయిన్‌లో ర్యాంకులు వచ్చినవారు ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర జాతీయ విద్యా సంస్థల్లో చేరుతున్నారు. జేఈఈ కోసం ఆరో తరగతి నుంచే ఐఐటీ ఒలింపియాడ్, కాన్సెప్ట్ స్కూళ్లలో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇందుకు లక్షల రూపాయలు ధారపోస్తున్నారు. ఇలా ఆరో తరగతి నుంచి ఇంటర్మిడియెట్ వరకు ఏడేళ్లపాటు కృషి చేస్తుంటే చివరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి ఐఐటీల్లో చేరుతున్నారు. ఎందుకిలా.. ఓవైపు అకడమిక్ ఎగ్జామ్స్, మరోవైపు కాంపిటీటివ్ ఎగ్జామ్స్.. ప్రాజెక్టు వర్క్, థీసిస్,ప్రాక్టికల్స్ కోసం సొంతంగా సిద్ధం కావాల్సి రావడం. సొంత రాష్ట్రానికి చాలా దూరంగా వేరే రాష్ట్రాల్లో సీటు రావడం.. భాషలు, ఆహారం, వాతావరణం అలవాటుపడలేకపోవడం గతంలో ఎంత సాధించినా.. ఐఐటీలు, ఎన్ఐటీలలో అసలు సిసలు పోటీ ప్రారంభమవడం. గతంలో బట్టీ పట్టేస్తే సరిపోయేది.. ఇపుడు సృజనాత్మకత అవసరం.. ఇక్కడ మేథస్సుకే పని. విద్యార్థులకు ఇష్టంలేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద కోర్సును ఎంపిక చేసుకోవడం. ఏం చేయాలి? విద్యాసంస్థలలో మానసిక ఆరోగ్య సేవలను మెరుగుపరచాలి. చాలా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఐఐఎంల్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఉన్నాయి. వాటిని విద్యార్థులు ఉపయోగించుకోవాలి. ఒత్తిడిని నివారించడానికి బిజినెస్ క్లబ్బులు, ఫొటోగ్రఫీ క్లబ్బు, కల్చరల్ క్లబ్బు, యోగా క్లబ్బు, మ్యూజిక్ క్లబ్బులు ఉన్నాయి. తమ ఆసక్తికి అనుగుణంగా విద్యార్థులు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. తల్లిదండ్రుల ధోరణి కూడా మారాలి. పిల్లల చదువులకు బాగా డబ్బు ఖర్చు పెట్టామనే ఉద్దేశంతో ఒత్తిడి పెంచడం, ఇతరులతో పోల్చి తిట్టడం వంటివి చేయకూడదు. స్కూల్, కళాశాల స్థాయిల్లోనే బట్టీ పట్టే చదువులకు స్వస్తి పలకాలి. పిల్లలు సృజనాత్మకంగా ఆలోచించుకుని నేర్చుకునేలా చేయాలి. నిత్యం యోగా, ధ్యానం చేయించడంతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా చేయాలి. విద్యార్థులు సోషల్ మీడియా సైట్లు, సైబర్ బెదిరింపుల బారిన పడకుండా చూడాలి. కొద్ది రోజులే ఇబ్బంది.. మాది బాపట్ల జిల్లా. నేను ఎన్ఐటీ జంషెడ్పూర్ లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫస్టియర్ చదువుతున్నాను. మొదట్లో నాకు భాషా పరంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే ఇంటికి చాలా దూరంలో పరాయి రాష్ట్రంలో ఉండాల్సి రావడం కూడా కొంచెం సమస్యగా మారింది. అయితే ఆ బెరుకును ఇన్స్టిట్యూట్లో ఉన్న కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది పోగొట్టారు. బోధన పరంగా సంప్రదాయ విధానానికి, ఎన్ఐటీల్లో విద్యకు తేడా ఉంది. ఇక్కడ బోధన చర్చ, విశ్లేషణ.. సంపూర్ణ అవగాహన అనే రీతిలో సాగుతోంది. కొంత అదనపు సమాచారాన్ని మా అంతట మేమే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. – ఎం. సుశ్వాంత్, బీటెక్ కంప్యూటర్ సైన్స్,థర్డ్ ఇయర్, ఎన్ఐటీ, జంషెడ్పూర్ కొంత సమయం పడుతోంది.. ఇప్పుడు 8వ తరగతి నుంచే జేఈఈకి సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచే విద్యార్థులపై ఒత్తిడి మొదలవుతోంది. ఇంటర్మిడియెట్ వరకు టీచర్ పాఠం చెప్పడం.. బోర్డుపైన రాయడం.. నోట్సు చెప్పడం.. తర్వాత దాన్ని బట్టీ పట్టడం వంటి సంప్రదాయ విధానాలకు అలవాటు పడిన విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీల్లో కొత్త విధానాలను అలవాటు పడటానికి సమయం పడుతోంది. ఒక్కసారిగా ఇంటికి దూరం కావడం, వేరే ఎక్కడో ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు రావడం వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో అంతగా స్కిల్స్ లేనివారే ఒత్తిడి బారిన పడుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, యోగా వంటివాటి వైపు విద్యార్థులను ప్రోత్సహిస్తే ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. ఆ దిశగా చర్యలు చేపట్టాలి. – ఎంఎన్ రావు, ఐఐటీ కోచింగ్ నిపుణులు, హైదరాబాద్ ప్రాథమిక దశలోనే నైపుణ్యాలు పెంపొందించాలి.. కేంద్ర విద్యా శాఖ ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించుకునేలా చర్యలు చేపట్టాలి. అన్ని రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించి విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. జేఈఈ రాసేవారిలో ఎక్కువ మంది సౌత్ ఇండియా వారే. వీరిలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటున్నారు. ఇంటర్‌లోగంటల తరబడి చదివి జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల్లో ర్యాంకులు తెచ్చుకుంటున్న విద్యార్థులకు ఐఐటీల్లో అసలు పరీక్ష మొదలవుతోంది. అక్కడ ప్రొఫెసర్లు చెప్పిన కాన్సెప్‌్టతో విద్యార్థులే సొంతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యాలు లేనివారే ఒత్తిడికి గురవుతున్నారు. కొత్త విధానానికి అలవాటుపడలేనివారు మొదటి సెమిస్టర్ పరీక్షల్లో విఫలమవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సబ్జెక్టుల్లో బ్యాక్‌లాగ్స్ ఉంటున్నాయి. దీంతో ఒత్తిడికి గురవుతున్నారు. – కె.లలిత్ కుమార్, డైరెక్టర్, అభీష్ట ఎడ్యుగ్రామ్ లిమిటెడ్ -
‘జోసా’లో సీట్ల జోష్.. ఐఐటీ, ఎన్ఐటీలలో భారీగా పెరిగిన సీట్ల సంఖ్య
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయస్థాయి విద్యాసంస్థలలో సీట్ల సంఖ్య భారీగా పెరగడంతో విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్యావకాశాలు మరింత మెరుగవుతున్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలతో పాటు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే జీఎఫ్టీఐలలో 56,900ల వరకు సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలలో సీట్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక కసరత్తును చేపట్టింది. జూన్ 19 నుంచి ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్ల భర్తీ ప్రక్రియను చేపట్టనుంది. ఐదేళ్లలో 18వేలకు పైగా పెరిగిన సీట్లు గడచిన ఐదేళ్లలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతుండడం, యువతకు ఉపాధి మార్గాలు అత్యధికంగా అందులోనే లభిస్తుండడం వంటి కారణాలతో సాంకేతిక విద్యకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 2019కు ముందువరకు ఈ సంస్థల్లో సీట్ల సంఖ్య నామమాత్రంగానే ఉండడంతో ఉన్నత ప్రమాణాలుగల సాంకేతిక నిపుణుల అందుబాటూ అంతంతమాత్రంగానే ఉండేది. ఈ విద్యకోసం ఏటా దాదాపు 8లక్షల మంది విద్యార్థులు వివిధ దేశాలకు వెళ్లేవారు. ఇందుకు లక్షలాది రూపాయలను వారు వెచ్చించాల్సి వచ్చేది. దీన్ని నివారించి దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను వారికి అందుబాటులోకి తెచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. 2024 నాటికి ఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల సంఖ్యను పెంచడంతో పాటు సీట్ల సంఖ్యను 50% మేర పెంచేలా చర్యలు తీసుకుంది. అలాగే, 20 ప్రముఖ ఐఐటీ, ఇతర సంస్థలను ఇని స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్సు (ఐఓఈ)లుగా తీర్చిదిద్ది అత్య«దిక నిధులు కేటాయించింది. సంస్థలు, సీట్ల సంఖ్యను పెంచిన కేంద్రం ఇదిలా ఉండగా.. డీపీ సింగ్ ఇచ్చిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఐఐటీలు, ఎన్ఐటీలు ఇతర సంస్థలు, సీట్ల సంఖ్యను 2020లో ఒక్కసారిగా పెంచింది. 2019లో దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీల్లో, జీఎఫ్టీఐలలో 38,704 సీట్లు ఉండగా దాన్ని 2020లో ఒకేసారి 50,822కు పెంచింది. వివిధ రాష్ట్రాల్లో కొత్త విద్యాసంస్థల ఏర్పాటుతో పాటు అప్పటికే ఉన్న ఐఐటీ, ఎన్ఐటీల్లో సదుపాయాలను మెరుగుపరచి సీట్ల సంఖ్యను పెంచింది. ఆ తరువాత కూడా ఏటేటా అయా సంస్థల్లో రెండేసి వేల చొప్పున సీట్లను పెంచుకునేలా చేసింది. 2021లో 52,453 సీట్లు, 2022లో 54,477 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2024 నాటికి 50 శాతం మేర సీట్లు పెంచాలన్న లక్ష్యం మేరకు 2023–24లో కూడా సీట్ల సంఖ్య పెరిగి 56,900 వరకు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈసారీ జోసా కటాఫ్ స్కోర్.. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) చేపడుతుంది. జేఈఈ మెయిన్, అడ్వాన్సుడ్‌లో అత్యధిక స్కోరుతో మెరిట్ ర్యాంకులు సాధించిన వారికి వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 2023 ప్రవేశాలకు సంబంధించి జేఈఈ మెయిన్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, జనవరి, ఏప్రిల్ నెలల్లో పూర్తిచేసి ఇటీవల తుది ర్యాంకులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్సుడ్‌ను నిర్వహించనున్నారు. అడ్వాన్సుడ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తులను మే 7 వరకు స్వీకరిస్తారు. జూన్ 4న జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష జరుగుతుంది. ఈ ఫలితాలు జూన్ 18న విడుదలవుతాయి. అనంతరం జూన్ 19 నుంచి జోసా రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఈసారి కూడా గతంలో మాదిరిగానే ఆరు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకు జోసా కటాఫ్ ర్యాంకులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మహిళలకు 20 శాతం కోటా.. ఇక ఐఐటీల్లో మహిళల చేరికలు నామమాత్రంగా ఉండడంతో వారి సంఖ్యను పెంచేందుకు వీలుగా అన్ని ఐఐటీల్లో 2018–19 నుంచి 20% మేర అదనపు కోటాను పెంచి సూపర్ న్యూమరరీ సీట్లను కేంద్రం ఏర్పాటుచేయించింది. మూడేళ్లపాటు దీన్ని తప్పనిసరిగా అన్ని సంస్థల్లో కేంద్రం కొనసాగించింది. దీంతో 2021 నాటికే ప్రముఖ ఐఐటీల్లో మహిళల చేరికలు 20 శాతానికి పైగా పెరిగాయి. తరువాత మహిళలకు సూపర్ న్యూమరరీ సీట్లపై ఆయా ఐఐటీలే నిర్ణయం తీసుకునేలా చేసింది. -
NIT Warangal: నిట్‌లో వసంతోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న కళారూపాలు (ఫొటోలు)
-
‘జేఈఈ’ సెషన్–2కు అభ్యర్థుల తాకిడి
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్–2023 సెకండ్ సెషన్‌కు అభ్యర్థుల తాకిడి విపరీతంగా పెరగనుంది. జనవరిలో నిర్వహించిన మొదటి సెషన్ పరీక్షలకన్నా రెండో సెషన్‌కు ఎక్కువమంది హాజరుకానున్నారని ఆయా విద్యా సంస్థల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. జనవరి సెషన్ సమయంలో ఇంటర్ పరీక్షల సన్నద్ధతతో పాటు ప్రాక్టికల్ పరీక్షలు కూడా ఉండడంతో తొలిసెషన్ కన్నా రెండో సెషన్‌నే ఎక్కువ మంది ప్రాధాన్యతగా తీసుకున్నారు. అయితే, ఈసారి తొలిసెషన్ పరీక్షలలో కూడా గతంలో కన్నా రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు జరిగిన తొలిసెషన్ కంప్యూటర్ ఆధారిత (కంప్యూటర్ బేస్డ్ టెస్టు–సీబీటీ) పరీక్షకు మొత్తం 8,60,064 మంది పేపర్–1కు.. 46,465 మంది పేపర్–2కు రిజిస్టరయ్యారు. వీరిలో పేపర్–1కి 8,23,967 (95.80 శాతం) మంది.. పేపర్–2కి 95 శాతానికి పైగా హాజరయ్యారు. వచ్చేనెల 6 నుంచి రెండో సెషన్ పరీక్షలు ఇక జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసింది. సెకండ్ సెషన్ నిర్వహించే పట్టణాలకు సంబంధించిన సిటీ స్లిప్‌లను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఏప్రిల్ మొదటి వారం ఆరంభంలో అభ్యర్థుల అడ్మిట్ కార్డులను ఎన్టీయే విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే.. తొలి సెషన్ పరీక్షల సమయంలో ఇంటర్మీడియెట్, సీబీఎస్ఈ ప్లస్2కు సంబంధించిన ప్రాక్టికల్స్ నేపథ్యంలో విద్యార్థుల నుంచి పరీక్షల షెడ్యూల్లో మార్పుల కోసం అనేక వినతులు ఎన్టీయేకు అందాయి. అదే సమయంలో కొందరు విద్యార్థులు ఉన్నత న్యాయస్థానంలో కేసులూ దాఖలు చేశారు. అయితే, పరీక్షల వాయిదాకు కోర్టు అంగీకరించలేదు. దేశవ్యాప్తంగా 574 పరీక్ష కేంద్రాలు.. ఇంటర్మీడియెట్ పరీక్షల సన్నద్ధత సమయంలోనే జేఈఈ తొలి సెషన్లో 8.6 లక్షల మందికిగాను 8.22 లక్షల మంది హాజరయ్యారు. రెండో సెషన్ ప్రారంభమయ్యే నాటికి ఇంటర్ పరీక్షలు పూర్తికానున్న నేపథ్యంలో ఇంకా ఎక్కువమంది హాజరయ్యే అవకాశం ఉంటుందని ఆయా కాలేజీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. తొలి సెషన్లో పాల్గొన్న వారితో పాటు కొత్తగా మరింత మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా 290 పట్టణాల్లోని 574 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఏపీలోని 25 పట్టణాల్లో జరుగుతుంది. తుది ఫలితాలు ఏప్రిల్ 30 లోపు ఇక జేఈఈ మెయిన్ తుది ఫలితాలు ఏప్రిల్ 30లోపు వెలువడనున్నాయి. ఏప్రిల్ 30 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. మెయిన్‌లో అర్హత సాధించిన తొలి 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌లో దరఖాస్తుకు అవకాశముంటుంది. రెండు సెషన్లలో సాధించిన మార్కుల్లో ఎక్కువ మార్కులను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తారు. తొలిసెషన్లో దేశవ్యాప్తంగా 100 స్కోర్ పాయింట్లు సాధించిన విద్యార్థులు 20 మంది ఉన్నారు. 100 స్కోర్ పాయింట్లతో పాటు అత్యధిక స్కోర్ పాయింట్లు సాధించిన విద్యార్థుల్లో సగం మంది తెలుగువారే. బాలికల్లో టాప్ స్కోరు పాయింట్లను సాధించిన వారిలోనూ తెలుగు అమ్మాయిలే ఉన్నారు. -
JEE Mains 2023 Result: జేఈఈ మెయిన్ తొలిసెషన్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ తొలివిడత పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. ఎన్టీఏ వెబ్సైట్లో ఫలితాలను ఉంచారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీవరకు జరిగిన ఈ పరీక్షలకు 9 లక్షల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో పేపర్–1 (బీఈ, బీటెక్) పరీక్షకు 8.6 లక్షల మంది, పేపర్–2 (బీఆర్క్, బీప్లానింగ్) పరీక్షకు 46 వేల మంది హాజరయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. దాదాపు 95.8 శాతం మంది పరీక్షకు హాజరవడం ఇదే తొలిసారని చెబుతున్నారు. జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నందున తొలిసెషన్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. జేఈఈ తొలిసెషన్ పరీక్షల ప్రాథమిక కీని ఎన్టీఏ ఫిబ్రవరి 1వ తేదీనే విడుదల చేయగా, ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీవరకు అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించింది. ఏప్రిల్ 6 నుంచి జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఎన్టీఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండోవిడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. మార్చి 7వ తేదీవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సెకండ్ సెషన్‌కు సంబంధించిన అప్లికేషన్ ఫారం " https:// jeemain. nta. nic. in' వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని ఎన్టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షల సిటీ స్లిప్‌లను మార్చి 3వ వారంలో విడుదల చేయనున్నారు. మార్చి చివరి వారంలో రెండోసెషన్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేయనుంది. -
వేల సంఖ్యలో ఉద్యోగాల కోత.. అక్కడ మాత్రం జాబ్ ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయ్!
టెక్నికల్ విద్య, బోధన విషయంలో ఐఐటీలు, ఎన్ఐటీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. వాస్తవ ధృక్పథంతో ఈ విద్యాసంస్థలు పాటించే ప్రమాణాలు, విద్యార్థులకు అందించే నైపుణ్యాలు, జాబ్ రెడీ స్కిల్స్ విద్యార్థుల కెరీర్‌కు సోపానాలుగా మారుతున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఈ ఇన్స్టిట్యూట్ల విద్యార్థులు సంస్థలకు హాట్ ఫేవరెట్స్‌గా నిలుస్తున్నారు. భారీగా ప్యాకేజ్ ► ఐఐటీలు, ఎన్ఐటీ క్యాంపస్ డ్రైవ్స్‌లో ఈ ఏడాది రూ.కోటికిపైగా వార్షిక ప్యాకేజ్‌తో ఆఫర్లు ఖరారు కావడం విశేషం. ముఖ్యంగా ఫస్ట్ జనరేషన్ ఇన్స్టిట్యూట్లుగా గుర్తింపు ΄పొందిన ఐఐటీ–ఖరగ్‌పూర్,ఢిల్లీ, ముంబై, కాన్పూర్, చెన్నై వంటి క్యాంపస్‌ల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ► ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 2023 బ్యాచ్‌కు సంబంధించి ప్లేస్మెంట్ ప్రక్రియ తొలి దశలో అత్యధిక వార్షిక వేతనం రూ.2.68 కోట్లుగా నమోదైంది. ఈ క్యాంపస్‌లో తొలి దశ డ్రైవ్స్‌లో 1600 మందికి ఆఫర్లు లభించాయి. రూ.50 లక్షలు కనిష్ట వార్షిక వేతనంగా నమోదైంది. 16 మందికి అంతర్జాతీయ ఆఫర్లు అందాయి. ► ఐఐటీ కాన్పూర్‌లో రూ.1.9 కోట్ల వార్షిక ప్యాకేజ్‌తో ఆఫర్ లభించింది. ఇలా మొత్తం 33 మంది విద్యార్థులకు రూ.కోటికి పైగా ΄్యాకేజ్ ఖరారైంది. మొత్తంగా చూస్తే 947మంది విద్యార్థులకు ఆఫర్లు ఖరారు కాగా, వాటిలో 74 ఇంటర్నేషనల్ ఆఫర్లు ఉండడం గమనార్హం. ► ఐఐటీ ఢిల్లీలో 1300కు పైగా ఆఫర్లు ఖరారవగా, 50 మంది విద్యార్థులకు రూ.కోటికి పైగా వార్షిక ΄్యాకేజ్ లభించింది. ఈ క్యాంపస్‌లో గరిష్ట వేతనం ఏకంగా రూ.నాలుగు కోట్లుగా నమోదవడం విశేషం. అదే విధంగా 30 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ఆఫర్లు లభించాయి. గత ఏడాదితో ΄ోల్చితే ఈ ఏడాది ఆఫర్లలో 20 శాతం పెరుగుదల కనిపించింది. ► ఐఐటీ చెన్నైలో రిక్రూట్మెంట్ డ్రైవ్ తొలి రోజే 445 మంది విద్యార్థులకు ఆఫర్లు ఖరారవగా.. వారిలో 25 మందికి రూ.కోటికి పైగా వార్షిక వేతనం లభించింది. అంతేకాకుండా మొత్తం 15 మంది విద్యార్థులకు నాలుగు సంస్థల నుంచి ఇంటర్నేషనల్ ఆఫర్స్ దక్కినట్లు ఐఐటీ చెన్నై క్యాంపస్ ప్లేస్మెంట్ వర్గాలు తెలి΄ాయి. ► ఐఐటీ–ముంబై క్యాంపస్ డ్రైవ్స్‌లో ఇప్పటి వరకు 1500 మందికి ఆఫర్లు ఖరారయ్యాయి. వీటిలో 71 ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఉండగా.. 63 మంది వీటికి సమ్మతి తెలి΄ారు. అదే విధంగా 25 మంది విద్యార్థులకు రూ.కోటికి పైగా వార్షిక వేతనం ఖరారైంది. ఈ క్యాంపస్ తొలి దశ డ్రైవ్స్ ముగిసే సమయానికి అత్యధిక వార్షిక వేతనం రూ.4 కోట్లుగా నమోదైంది. ► ఐఐటీ–రూర్కీలో గరిష్ట వార్షిక వేతనం రూ.1.06 కోట్లుగా నమోదు కాగా, పది మంది విద్యార్థులకు రూ.80 లక్షలకు పైగా వేతనం లభించినట్లు రూర్కీ ప్లేస్‌మెంట్స్æ సెల్ వర్గాలు తెలి΄ాయి. ► ఐఐటీ హైదరాబాద్‌లో తొలి దశ ప్లేస్‌మెంట్స్‌లో 474 మంది విద్యార్థులకు 508 ఆఫర్లు లభించాయి. గరిష్ట వేతనం రూ.63.78 లక్షలుగా నమోదైంది. 54 ఇంటర్నేషనల్ ఆఫర్లు ఉన్నాయి. ఐఐటీ–హైదరాబాద్‌లో ఏఐ బ్రాంచ్ తొలి బ్యాచ్‌లో 82 శాతం మందికి ఆఫర్లు దక్కాయి. ఈ క్యాంపస్‌లో సగటు వార్షిక వేతనం రూ.19.49 లక్షలుగా నమోదైంది. ► ఐఐటీ–గువహటిలో సైతం తొలి దశ క్యాంపస్ డ్రైవ్స్‌లో గరిష్టంగా రూ.2.46 కోట్లతో ఇంటర్నేషనల్ ఆఫర్, రూ.1.1 కోటితో డొమెస్టిక్ ఆఫర్ ఖరారైంది. ఎన్ఐటీలదీ అదే బాట ► ఐఐటీల తర్వాత దేశంలో ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌గా పేరొందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) క్యాంపస్‌లలో సైతం ఈ ఏడాది భారీగా ఆఫర్స్ లభించాయి. ► తెలుగు రాష్ట్రాల్లోని ఎన్ఐటీ–వరంగల్‌లో రూ.88 లక్షల గరిష్ట వేతనంతో ఆఫర్ లభించింది. ఈ క్యాంపస్‌లో మొత్తం వేయి మంది విద్యార్థులకు ఆఫర్లు ఖరారు కాగా.. సగటు వార్షిక వేతనం రూ.19.9 లక్షలుగా నమోదైంది. ► ఎన్ఐటీ హమీర్‌పూర్‌లో గతేడాది కంటే 39 శాతం అధికంగా సగటు వార్షిక వేతనం లభించింది. సగటు వార్షిక వేతనం రూ.12.84 లక్షలుగా, గరిష్ట వార్షిక వేతనం రూ. 52 లక్షలుగా నిలిచింది. ► ఎన్ఐటీ జంషెడ్‌పూర్‌లో అయిదుగురు విద్యార్థులకు రూ.80 లక్షల వార్షిక వేతనంతో ఇంటర్నేషనల్ ఆఫర్స్ లభించాయి. ► ఎన్ఐటీ కాలికట్లో సగటు వార్షిక వేతనం రూ.23 లక్షలుగా ఉంది. ► ఎన్ఐటీ పాట్నా క్యాంపస్‌లోనూ గరిష్ట వేతనం రూ.52 లక్షలుగా, సగటు వేతనం రూ.16.51 లక్షలుగా నమోదైంది. ► ఇతర ఎన్ఐటీల్లోనూ ఇదే తరహాలో గతేడాది కంటే పది నుంచి 20 శాతం అధికంగా ఆఫర్లు లభించడంతో΄పాటు, వేతనాల్లోనూ పది శాతానికిపైగా పెరుగుదల నమోదైంది. టాప్ రిక్రూటర్స్ వీరే ఐఐటీలు, ఎన్ఐటీల్లో టాప్ రిక్రూటింగ్ సంస్థలను పరిగణనలోకి తీసుకుంటే.. క్వాల్ కామ్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, గూగుల్, బార్క్లేస్, ఎస్ఏపీ ల్యాబ్స్, సిటీ బ్యాంక్, వెల్ ఫార్గో, మైక్రోసాఫ్ట్, బీసీజీ, బెయిన్ అండ్ కో సంస్థలు ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఇవ్వడంలో ముందంజలో ఉన్నాయి. డొమెస్టిక్ ఆఫర్స్ పరంగా ఉబెర్, హనీవెల్, మైక్రాన్ టెక్నాలజీ, ఓఎన్జీసీ, ఫ్లిప్‌కార్ట్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఎస్టీఎం మైక్రోఎలక్ట్రికల్స్ వంటి సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి. డిమాండింగ్ జాబ్ ప్రొఫైల్స్ కోర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అండ్ ్ర΄ోగ్రామర్స్, డేటా అనలిస్ట్స్, యుఎక్స్ డిజైనర్, ్ర΄÷డక్ట్ డిజైనర్, ఫుల్‌స్టాక్ ఇంజనీర్ జాబ్ ్ర΄÷ఫైల్స్‌లో అధిక సంఖ్యలో నియామకాలు జరిగాయి. డేటా అనలిస్ట్ జోరు ► ఈసారి ఐఐటీ, ఎన్ఐటీల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో డేటా అనలిస్ట్ ప్రొఫైల్ జోరు కొనసాగింది. ముఖ్యంగా కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సెక్టార్‌లోని సంస్థలు ఈ నియామకాలు చేపట్టాయి. బీఎఫ్ఎస్ఐ, కన్సల్టింగ్ సంస్థలు క్లయింట్స్, వినియోగదారులను పెంచుకునే వ్యూహంతో అడుగులు వేస్తున్నాయి. దీంతో డేటా అనలిస్ట్ జాబ్స్‌కు డిమాండ్ కనిపించింది. ► ఐటీ మొదలు ఆన్లైన్ టెక్నాలజీస్ ఆధారంగా సేవలందిస్తున్న అన్ని రంగాల్లోని సంస్థలు సాఫ్ట్వేర్స్ ్ర΄ోగ్రామింగ్, డిజైనింగ్‌కు ్ర΄ాధాన్యమిస్తుండడంతో.. కోడింగ్ విభాగంలో జాబ్ ప్రొఫైల్స్‌కు కూడా డిమాండ్ కనిపించింది. ఎస్పీఓల్లోనూ వృద్ధి ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఈ ఏడాది సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్స్‌లోనూ వృద్ధి కనిపించింది. దాదాపు అన్ని క్యాంపస్‌లలో నూటికి 80 శాతం మందికి సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్స్ లభించాయి. గరిష్టంగా రెండు నెలల కాలానికి ఆయా సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు ఇచ్చే సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్స్‌లో స్టయిఫండ్ మొత్తాలు కూడా ఆకర్షణీయంగా నమోదయ్యాయి. కనిష్టంగా రూ.50 లక్షలు, గరిష్టంగా రూ.80 లక్షలు, సగటున రూ.30 లక్షల స్టయిఫండ్‌తో పలు సంస్థలు విద్యార్థులకు ఇంటర్న్ ట్రైనీగా పని చేసేందుకు సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్లు ఖరారు చేశాయి. రెండు, మూడు రౌండ్లలో ఎంపిక ఐఐటీలు, ఎన్ఐటీల్లో క్యాంపస్ డ్రైవ్స్‌లో పాల్గొన్న సంస్థలు రెండు, మూడు రౌండ్లలో ఎంపిక ప్రక్రియ నిర్వహించాయి. తొలుత రిటెన్ టెస్ట్, ఆ తర్వాత హెచ్ఆర్ రౌండ్, చివరగా టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూలు చేపట్టి.. ప్రతిభ ఆధారంగా ఆఫర్లు ఖరారు చేశాయి. కోడింగ్‌కే ప్రాధాన్యం సంస్థలు విద్యార్థుల్లోని కోడింగ్ నైపుణ్యాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. కంపెనీలు రిటెన్ టెస్ట్‌లు, టెక్నికల్ రౌండ్స్‌లో కోడింగ్ సంబంధిత నైపుణ్యాలను ఎక్కువగా పరిశీలించినట్లు ఆయా క్యాంపస్‌ల ప్లేస్మెంట్ వర్గాలు పేర్కొన్నాయి. కోర్ ఇంజనీరింగ్, సర్క్యూట్ బ్రాంచ్‌లకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌పై విద్యార్థులకు ఉన్న నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలి΄ారు. మార్చి నాటికి నూరుశాతం క్యాంపస్ డ్రైవ్స్ ప్రతి ఏటా డిసెంబర్లో ్ర΄ారంభమై.. మరుసటి ఏడాది మార్చి వరకు కొనసాగుతాయి. ప్రస్తుతం అన్ని క్యాంపస్‌లలో తొలి దశ ముగిసింది. ఇందులో దాదాపు 80 శాతం మందికి ఆఫర్లు లభించాయి. మార్చి నాటికి నూటికి నూరు శాతం మందికి ఆఫర్లు లభిస్తాయని ఐఐటీల క్యాంపస్ ప్లేస్మెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. స్వీయ అన్వేషణ దిశగా ఇప్పటికే పలు సంస్థలు లే అఫ్లు కొనసాగిస్తున్నప్పటికీ.. వాటి కార్యకలా΄ాల నిర్వహణకు మానవ వనరుల అవసరం ఏర్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఫ్రెషర్స్‌ను నియమించుకుని తమ విధానాలు, సాంకేతికతలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చే అవకాశముందంటున్నారు. టైర్–2 ఇన్‌స్టిట్యూట్స్‌కు చెందిన విద్యార్థులు మాత్రం ఉద్యోగ సాధనలో క్యాంపస్ డ్రైవ్స్పైనే ఆశలు పెట్టుకోకుండా.. స్వీయ అన్వేషణ దిశగానూ అడుగులు వేయాలని సూచిస్తున్నారు. సంస్థలు కోరుకుంటున్న కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ వంటి నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుని.. జాబ్ మార్కెట్లో ΄ోటీకి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. ముఖ్యాంశాలు ► ఐఐటీలు, నిట్‌ల్లో 2023 బ్యాచ్‌కు ముగిసిన తొలి దశ క్యాంపస్ డ్రైవ్స్. ► ఐఐటీ–ఢిల్లీలో రూ.4 కోట్ల గరిష్ట వార్షిక వేతనంతో ఆఫర్. ప్రతి క్యాంపస్‌లోనూ గరిష్టంగా రూ.కోటికి పైగా వేతనం నమోదు. ► సగటు వార్షిక వేతనం రూ.36 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నమోదు. ► గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 15 నుంచి 20 శాతం పెరుగుదల. ► కోడింగ్, ఏఐ–ఎంఎల్, ఐఓటీ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్న సంస్థలు. -
మెయిన్స్ షెడ్యూల్‌పై మళ్లీ సందిగ్థం
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2023 నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జేఈఈ–2023కి సంబంధించి షెడ్యూల్ అంటూ సామాజిక మాధ్యమాల్లో పలు తేదీలు ప్రచారం అవుతుండడంతో వారు గందరగోళానికి గురవుతున్నారు. వాస్తవానికి జేఈఈ మెయిన్స్‌ను గతంలో ఒక్కసారే నిర్వహించేవారు. ఒకపక్క బోర్డు పరీక్షలకు తయారవ్వడం, మరోపక్క మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన పరిస్థితుల్లో పలువురు విద్యార్థులు తొట్రుపాటుతో తక్కువ మార్కులతో అవకాశాలు కోల్పోతున్నారు. దీనివల్ల ఐఐటీ వంటి జాతీయ విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులు మరో ఏడాదిపాటు ఆగాల్సి వచ్చేది. ఈ కారణాలతో ఏడాదికి రెండుసార్లు నిర్వహించేలా మార్పు చేశారు. జనవరి, మార్చి ఆఖరు లేదా ఏప్రిల్‌లో నిర్వహించేవారు. జనవరి సెషన్‌కు సంబంధించి నవంబర్‌కు ముందే ఎన్టీఏ షెడ్యూల్ విడుదల చేసేది. కానీ, ఈసారి నవంబర్ మూడో వారంలోకి ప్రవేశిస్తున్నా ఇప్పటివరకు ఎన్టీఏ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. మరోవైపు.. జేఈఈ పరీక్షలు ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతాయని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ బోర్డు సహా పలు రాష్ట్రాల బోర్డులు, సీబీఎస్ఈ పరీక్షలు కూడా ఇంచుమించు అదే సమయంలో జరుగుతుంటాయని, దీనివల్ల తాము ఇబ్బందికి గురవుతామని విద్యార్థులు విన్నవిస్తున్నారు. జేఈఈ పరీక్షలకు సంబంధించి ఎన్టీఏ ఒక స్పష్టతనిస్తే ప్రణాళిక ప్రకారం సిద్ధంకావడానికి వీలుంటుందంటున్నారు. గత ఏడాది తీవ్ర గందరగోళం.. కరోనాతో రెండేళ్ల పాటు జేఈఈ పరీక్షల్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడినా 2022లో కోవిడ్ తగ్గుముఖం పట్టినందున అన్నీ సకాలంలో జరుగుతాయని విద్యార్థులు భావించారు. కానీ, జేఈఈ నిర్వహణ సంస్థ అయిన ఎన్టీఏ పలుమార్లు షెడ్యూళ్లు మార్పుచేసి విద్యార్థులను, బోర్డులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. జేఈఈ మెయిన్స్–2022 షెడ్యూల్‌ను 2021 నవంబర్, డిసెంబర్ నాటికే విడుదల చేయాలి. జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలను చేపట్టాలి. కానీ, ఎన్టీఏ ఐదు రాష్ట్రాల ఎన్నికల సాకుతో 2022 మార్చి వరకు షెడ్యూల్, నోటిఫికేషన్‌పై ఎలాంటి ప్రకటనా చేయలేదు. చివరకు మార్చి 1న నోటిఫికేషన్ ప్రకటించి అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. అలాగే, తొలి సెషన్ పరీక్షల తేదీల విషయంలో ఆయా రాష్ట్రాల బోర్డు పబ్లిక్ పరీక్షలను పరిగణనలోకి తీసుకోకుండా ఏప్రిల్ 16–21 వరకు, మే 24–29 వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయని తేదీలను ప్రకటించింది. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సహ అనేక రాష్ట్రాల ఇంటర్మీడియెట్, ప్లస్ 2 తరగతుల పరీక్షలు అవే తేదీల్లో నిర్వహించేలా అంతకుముందే ప్రకటించినా వాటిని పట్టించుకోలేదు. జేఈఈ పరీక్షలను అవే తేదీల్లో ఎన్టీఏ షెడ్యూల్ ఇవ్వడంతో ఆయా రాష్ట్రాలు తమ బోర్డుల పరీక్షా తేదీలను ఆ ఏడాది ఏప్రిల్ 22 తరువాత ఉండేలా మార్పులుచేసుకున్నాయి. కానీ, ఎన్టీఏ మళ్లీ జేఈఈ షెడ్యూల్‌ను మార్పుచేసింది. దీంతో ఆయా ఇంటర్ బోర్డులు మళ్లీ మార్పు చేసుకున్నాయి. ఆ తర్వాత ఎన్టీఏ మూడోసారి మళ్లీ షెడ్యూల్‌ను మార్పుచేసింది. 2022 జూన్, జులైలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించి ఆయా రాష్ట్రాల బోర్డులను సమస్యల్లోకి నెట్టింది. ఇలా జేఈఈ మెయిన్–2022 పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం చేయడంతో ఫలితాల విడుదలపైనా దాని ప్రభావం పడింది. మెయిన్స్ తుది ఫలితాలను ఆగస్టు 5 లేదా 6కల్లా ఎన్టీఏ విడుదల చేయాల్సి ఉంది. వీటిలో ఉత్తీర్ణులైన టాప్ 2.5 లక్షల మందిని అడ్వాన్సుకు అనుమతిస్తారు. కానీ, చివరి నిమిషం వరకు మెయిన్స్ ఫలితాలపై గందరగోళానికి గురిచేసింది. ఈసారి అలాంటి గందరగోళానికి లేకుండా పరీక్షలపై స్పష్టతనివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. -
ఐఐటీ సీట్లు మొత్తం భర్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐ టీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఆరు దశల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) సీట్ల కేటాయింపు చేపట్టింది. విద్యార్థులు వ్యక్తిగత లాగిన్ ద్వారా ఏ సంస్థలో, ఏ బ్రాంచ్‌లో సీటు వచ్చిందనేది తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. ఐఐటీల్లో దాదాపు సీట్ల కేటాయింపు పూర్తయినప్పటికీ, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టి, మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసే వీలుంది. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌కు దాదాపు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 8 లక్షల మందికిపైగా పరీక్ష రాశారు. ఇందులో ఐఐటీ సీటు కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 2.5 లక్షల మంది అర్హులైనప్పటికీ పరీక్ష రాసింది మాత్రం కేవలం1.60 లక్షల మందే ఉన్నారు. వీరిలో 42 వేల మంది అర్హులుగా ప్రకటించారు. జేఈఈ మెయిన్స్ ర్యాంకు ఆధారంగా ఎన్ఐటీ, ఐఐటీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో సీట్లు కేటాయించారు. ఆ సంస్థల్లో 54,477 ఇంజనీరింగ్ సీట్లు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్ఐటీల్లో 54477 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. వీరిలో 2,971 సీట్లు మహిళలకు సూపర్ న్యూమరరీ పోస్టులుగా కేటాయించారు. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఈసారి 16,598 సీట్ల లభ్యత ఉంది. ఇందులో మహిళ లకు 1,567 సీట్లున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఐఐటీల్లో మొత్తంగా 500 సీట్ల వరకూ పెరిగాయి. కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో ఈ పెంపు అనివార్యమైంది. ఎన్ఐటీలో 23, 994 సీట్లు ఉంటే, ఇందులో మహిళలకు 749 సీట్లున్నాయి. ట్రిపుల్ ఐటీల్లో 7,126 ఇంజనీరింగ్ సీట్లు (మహిళలకు 625), జీఎఫ్ఐ టీల్లో 6,759 (మహిళలకు 30) సీట్లున్నాయి. -
NIT Tadepalligudem: క్యాంపస్ ప్లేస్మెంట్లో నిట్ విద్యార్థుల సత్తా
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): క్యాంపస్ ప్లేస్మెంట్లలో నిట్ 2018–22 బ్యాచ్ విద్యార్థుల్లో 97.19 శాతం మంది ఉద్యోగాలు సాధించారు. సీఎస్ఈ విద్యార్థిని సూరపరాజు సాయి కీర్తన అమెజాన్‌లో రూ. 47.3 లక్షల వేతనం పొందగా.. ఈఈఈ విద్యార్థిని ఊర్వశి డాంగ్ అమెజాన్‌లో రూ. 47.3 లక్షల వేతనం అందుకోనున్నారు. సీఎస్ఈ విద్యార్థి కేతన్ బన్సాల్ స్కైలార్క్ ల్యాబ్స్‌లో రూ. 37.8 లక్షల వేతనం, అదే గ్రూపునకు చెందిన గాదె అశ్రితరెడ్డి అమెజాన్‌లో రూ.37 లక్షల వేతనంతో ఉద్యోగం పొందారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ప్రత్యేక కృషితో మంచి వేతనాలతో ఉద్యోగాలు సాధించారు. దేశంలోని 31 నిట్‌లలో క్యాంపస్ ప్లేస్మెంట్ విషయంలో ఏపీ నిట్ సత్తా చాటింది. ఈ బ్యాచ్‌లో 511 మంది 262 కంపెనీలు జరిపిన ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలు పొందారు. (క్లిక్ చేయండి: ఒకేసారి డబుల్ డిగ్రీలు.. యూజీసీ మార్గదర్శకాలు ఇవే..) -
హ్యాకర్ల కంట పడకుండా సమాచార ప్రసారం!
కాజీపేట అర్బన్: ప్రతి రంగంలోనూ సమాచార ప్రసారం, దాని భద్రత ఎంతో కీలకం. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీలతో ఈ సమాచారం హ్యాకర్ల చేతిలో పడుతోంది. హ్యాకర్లు ఆ సమాచారంతో తప్పుడు పనులకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆన్లైన్లో సురక్షితంగా సమాచారాన్ని ప్రసారం చేసేందుకు, తప్పుడు సమాచారాన్ని తొలగించి రక్షణ కల్పించేందుకు వీలయ్యే సరికొత్త అల్గారిథమ్‌ను వరంగల్ నిట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ సురేశ్‌బాబు పేర్ల అభివృద్ధి చేశారు. ‘మోడల్ టు ఎన్హాన్స్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్ ద ఫాల్ట్ టాలరెన్స్’అంశంపై పరిశోధన చేసి రూపొందించిన ఈ అల్గారిథమ్‌కు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు కూడా పొందినట్టు ఆయన వెల్లడించారు. గతంలో దేశంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ నెట్‌వర్క్‌లలో హ్యాకర్లు చొరబడి విద్యుత్ సరఫరాను స్తంభింప జేసిన ఘటనల నేపథ్యంలో ప్రత్యేక అల్గారిథమ్ రూపొందించినట్టు తెలిపారు. అన్ని రంగాల్లో వినియోగించవచ్చు ‘‘పవర్‌గ్రిడ్, టెలీ కమ్యూనికేషన్స్‌తోపాటు అన్ని రంగాల్లో సమాచారాన్ని పూర్తి రక్షణతో ప్రసారం చేసేందుకు నేను రూపొందించిన అల్గారిథమ్‌ను వినియోగించవచ్చు. ఇది సమాచార ప్రసారంలో హ్యాకర్లను గుర్తించి ఆ సమాచారం అందుకోకుండా ఆపుతుంది. సరైన వ్యక్తులను గుర్తించి సమాచారాన్ని ప్రసారం చేసేందుకు తోడ్పడుతుంది..’’అని సురేశ్‌బాబు తెలిపారు. -
జేఈఈ మెయిన్ ఫలితాలపై ఉత్కంఠ
సాక్షి, అమరావతి: ఇటు మెయిన్ తుది ఫలితాలు రాలేదు కానీ.. అటు అడ్వాన్స్డ్ పరీక్షల రిజిస్ట్రేషన్లు మాత్రం అప్పుడే మొదలయ్యాయి. జేఈఈ మెయిన్ షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఎన్టీఏ విద్యార్ధులను గందరగోళానికి గురి చేస్తోంది. ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి జేఈఈ మెయిన్ 2022 తుది ఫలితాల వెల్లడిలో చోటు చేసుకుంటున్న జాప్యంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శనివారం నాటికే మెయిన్ రెండో సెషన్ ఫలితాలు వెలువడాల్సినా ఆదివారం రాత్రి వరకు కూడా విడుదల కాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆగస్టు 7 నుంచి 11వ తేదీ వరకు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల రిజిస్ట్రేషన్‌కు ముంబై ఐఐటీ షెడ్యూల్ జారీ చేయడమే కాకుండా పోర్టల్ అందుబాటులోకి తేవడం ఈ ఆందోళనను మరింత పెంచుతోంది. మెయిన్ తుది ఫలితాలపై స్పష్టమైన తేదీ, సమయాన్ని ప్రకటించాలని రెండు రోజులుగా విద్యార్థులు సామాజిక మాధ్యమాలు, ఎన్టీఏ హెల్ప్‌లైన్ కేంద్రాల ద్వారా విన్నవిస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ కీలో ఆరు ప్రశ్నలు డ్రాప్ శుక్రవారం రాత్రికే విడుదల కావాల్సిన జేఈఈ మెయిన్ 2వ సెషన్ పరీక్ష ఫైనల్ కీ ఆదివారం మధ్యాహ్నానికి కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేయలేదు. రెండో సెషన్ ఫైనల్ కీలో ఆరు ప్రశ్నలను ఎన్టీఏ డ్రాప్ చేసింది. ఆయా ప్రశ్నలకు ఒకటికి మించి సరైన సమాధానాలు ఉండడంతో వాటన్నిటినీ డ్రాప్ చేస్తున్నట్లు పేర్కొంది. అయితే తాము ఇచ్చిన సమాధానాల సంఖ్యకు, రెస్పాన్స్ షీట్లలోని సంఖ్యకు వ్యత్యాసం ఉండడంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై పలువురు ఎన్టీఏకు నేరుగా, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా విన్నపాలు పంపుతున్నారు. సాంకేతిక కారణాలతో ఫలితాల విడుదలలో సమస్యలు నెలకొన్నట్లు కోచింగ్ సెంటర్ల ప్రతినిధులు పేర్కొంటున్నారు. కాగా మెయిన్స్ రెండో సెషన్ ప్రొవిజినల్ ఆన్సర్ కీని ఆగస్టు 3వ తేదీన ఎన్టీఏ విడుదల చేసింది. దీంతోపాటు విద్యార్థుల రికార్డెడ్ రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేసినా వాటిలోనూ పొరపాట్లు దొర్లాయంటున్నారు. తొలిసెషన్ ప్రొవిజనల్ కీ తప్పుల తడక జూన్‌లో నిర్వహించిన తొలిసెషన్‌కు సంబంధించిన ప్రాథమిక కీని ఎన్టీఏ జూలై 3వ తేదీన ప్రకటించింది. ఇందులో కొన్ని తేదీల్లో పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇచ్చిన కీ తప్పుల తడకగా ఉంది. ఒక విభాగం కీ వేరొక విభాగానికి జతచేయడంతో గందరగోళానికి గురయ్యారు. 130 నుంచి 200 మార్కులు వస్తాయనుకున్న విద్యార్థులకు 60 మార్కులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎన్టీఏకు విన్నపాలు వెల్లువెత్తాయి. అనంతరం ఎన్టీఏ ప్రాథమిక కీలో దొర్లిన పొరపాట్లను సవరించి మళ్లీ ప్రకటించింది. అడ్వాన్స్డ్ షెడ్యూల్ జారీ జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను ఆగస్టు 5 లేదా 6వ తేదీకల్లా ఎన్టీఏ విడుదల చేయాల్సి ఉంది. ఇందులో ఉత్తీర్ణులైన టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్సుకు అనుమతిస్తారు. జేఈఈ అడ్వాన్సుడ్‌కు ఆగస్టు 7 నుంచి 11వ తేదీవరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ పరీక్షల నిర్వహణ సంస్థ ఐఐటీ ముంబై షెడ్యూల్ జారీ చేయడమే కాకుండా ఆదివారం నుంచి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ల పోర్టల్ కూడా అందుబాటులోకి తెచ్చింది. మూడో విడతకు విన్నపాలు మరికొందరైతే ఎన్టీఏ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ రెండు సెషన్ల సమయంలో వరదలు, వర్షాల వల్ల సరిగా రాయలేకపోయామని, పరీక్షలకు హాజరు కాలేకపోయామని అందువల్ల మరో సెషన్ పరీక్షలకు అవకాశమివ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఆదినుంచి అయోమయమే.. జేఈఈ మెయిన్స్ 2022 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను 2021 నవంబర్ – డిసెంబర్ నాటికే విడుదల చేయాలి. జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి అనంతరం నెల వ్యవధిలో పరీక్షలు చేపట్టాలి. కానీ ఎన్టీఏ మార్చి వరకు షెడ్యూల్, నోటిఫికేషన్‌పై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల పేరుతో షెడ్యూల్ ప్రకటించకుండా నాన్చింది. చివరకు మార్చి 1న నోటిఫికేషన్ ఇచ్చి అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షలను నాలుగు సెషన్లలో నిర్వహించగా ఈదఫా రెండు సెషన్లకే పరిమితం చేసింది. గతంలో న్యూమరికల్ ప్రశ్నల విభాగంలో మైనస్ మార్కులు లేవు. ఈసారి మాత్రం అన్ని విభాగాలకూ మైనస్ మార్కులను ప్రకటించింది. తొలి సెషన్ పరీక్షల తేదీలపై ఆయా రాష్ట్రాల బోర్డుల పబ్లిక్ పరీక్షలను పరిగణలోకి తీసుకోకుండా ఏప్రిల్ 16 నుంచి 21వ తేదీ వరకు తొలిసెషన్, మే 24 నుంచి 29వ తేదీవరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. అయితే ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఇంటర్, ప్లస్ 2 తరగతుల పరీక్షలు అవే తేదీల్లో నిర్వహించేలా అప్పటికే షెడ్యూల్ విడుదలయ్యాయి. జేఈఈ పరీక్షలను కూడా అదే సమయంలో నిర్వహించేలా ఎన్టీఏ షెడ్యూల్ ఇవ్వడంతో ఆయా రాష్ట్రాలు తమ బోర్డుల పరీక్షా తేదీల్లో మార్పులు చేసుకున్నాయి. అలా బోర్డులు మార్పులు చేసిన తరువాత ఎన్టీఏ మళ్లీ జేఈఈ షెడ్యూల్‌ను సవరించి ఏప్రిల్ 21 నుంచి మే 4వ తేదీవరకు పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. దీంతో ఆయా ఇంటర్ బోర్డులు తమ పరీక్షల షెడ్యూళ్లను మళ్లీ మార్పు చేసుకోవాల్సి వచ్చింది. ఇలా అవి మార్పులు చేశాక ఎన్టీఏ మూడోసారి మళ్లీ జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను మార్చింది. జూన్ 20 నుంచి 29 వరకు తొలి సెషన్, జూలై 21 నుంచి 30 వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఆ పరీక్షలను కూడా షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేదు. తొలిసెషన్ను జూన్ 24 నుంచి, రెండో సెషన్‌ను జులై 25 నుంచి చేపట్టింది. -
6న జేఈఈ మెయిన్ తుది ఫలితాలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 తుది ఫలితాలు ఈ నెల 6న వెలువడనున్నాయి. అభ్యర్థుల స్కోరుతోపాటు ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను జూలై 25 నుంచి 30 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 6.29 లక్షల మంది హాజరయ్యారు. కంప్యూటరాధారితంగా నిర్వహించిన ఈ పరీక్షల ప్రాథమిక కీని ఎన్టీఏ బుధవారం రాత్రి విడుదల చేసింది. ఈ ప్రాథమిక కీపై అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఈ నెల 5 (శుక్రవారం) సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేయడానికి అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఒక్కొక్క ప్రశ్నకు ఇచ్చిన కీపై ఆధారాలతో రూ.200 చొప్పున ఫీజు చెల్లించి చాలెంజ్ చేయొచ్చని వెల్లడించింది. పేపర్–1.. బీఈ, బీటెక్, పేపర్ 2ఏ.. బీఆర్క్, పేపర్ 2బీ.. బీప్లానింగ్ పరీక్షల ప్రాథమిక కీలను వేర్వేరుగా ఎన్టీఏ https://jeemain.nta.nic.in లో పొందుపరిచింది. ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థులు తమ అభ్యంతరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వీటిని నిపుణుల కమిటీతో పరిశీలన చేయించి ఎన్టీఏ తుది నిర్ణయం తీసుకోనుంది. అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు సరైనవి అయితే ప్రాథమిక కీని సవరించి తుది కీని విడుదల చేస్తుంది. కాగా తుది కీ అనంతరం ఈ నెల 5 అర్ధరాత్రి లేదా 6న జేఈఈ మెయిన్ స్కోరు, ర్యాంకుల వారీగా తుది ఫలితాలను విడుదల చేయనుంది. 7 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు కాగా జేఈఈ మెయిన్‌లో టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ అభ్యర్థులు ఈ నెల 7 నుంచి 11లోపు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 28న అడ్వాన్స్డ్ పేపర్–1 పరీక్షను ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, పేపర్–2ను మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ తుది ఫలితాలను సెప్టెంబర్ 11న ప్రకటించనున్నారు. -
ఐఐటీ, ఎన్ఐటీల్లోనూ మిగులు సీట్లు
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లోనూ ఏటా సీట్లు మిగిలిపోతున్నాయి. ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థులు నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించలేకపోవడంతో సీట్లు మిగిలిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని కేటగిరీల్లో అర్హుల కొరతతోనూ సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయని పేర్కొంటున్నారు. మరోవైపు చేరినవారిలోనూ కొంతమంది వేర్వేరు కారణాలతో మధ్యలో చదువు మానుకుంటున్నారు. దీనివల్ల కూడా ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు ఖాళీ అవుతున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ), పీహెచ్డీ విభాగాల్లో గత రెండు, మూడేళ్లుగా మిగిలిపోతున్న సీట్లను గమనిస్తే ఈ అంశం స్పష్టమవుతోందని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా మిగిలిపోతున్న సీట్లు.. కొన్ని కేటగిరీల్లో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులు లేకపోతుండడంతో గత కొన్నేళ్లుగా సీట్లు మిగిలిపోతున్నాయి. దేశంలో 23 ఐఐటీల్లో వివిధ బ్రాంచ్‌లకు సంబంధించి బీఈ, బీటెక్, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో వేలాది సీట్లు మిగిలిపోతున్నాయి. ఐఐటీల్లో 2020–21లో 5,484 సీట్లు మిగిలిపోయాయి. వీటిలో 476 సీట్లు బీటెక్లోనివే. ఇక పీజీ కోర్సుల్లో 3,229 సీట్లు, పీహెచ్డీ కోర్సుల్లో 1,779 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఇక 2021–22 విద్యాసంవత్సరంలోనూ 5,296 సీట్లు మిగిలిపోయినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. యూజీలో 361 సీట్లు, పీజీలో 3,083 సీట్లు, పీహెచ్‌డీలో 1,852 ఖాళీగా ఉండిపోయాయి. ఎన్ఐటీల్లోనూ మిగులు.. ఇక ఎన్ఐటీల్లోనూ పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. మొత్తం 31 ఎన్ఐటీల్లో 2020–21లో 3,741 సీట్లు, 2021–22లో 5,012గా ఉన్నాయి. యూజీ కోర్సుల్లో కంటే పీజీ కోర్సుల్లో ఎక్కువ సీట్లు మిగిలిపోతున్నాయి. 2021లో 2,487 మిగలగా 2021–22లో ఈ సంఖ్య 3,413కి చేరింది. అభ్యర్థులు జేఈఈ మెయిన్‌లో నిర్ణీత అర్హత మార్కులు సాధించలేకపోవడమే సీట్లు మిగిలిపోవడానికి కారణమని కేంద్రం గతంలోనే తేల్చింది. జాతీయ విద్యాసంస్థల్లోకి ప్రవేశించాలంటే నిర్ణీత పరీక్షల్లో అభ్యర్థులు అర్హత మార్కులను సాధించాల్సిందే. ముఖ్యంగా వివిధ రిజర్వేషన్ల కేటగిరీల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. 2022–23కి సీట్ల అందుబాటు ఇలా.. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి జేఈఈ మెయిన్ తొలి విడతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవలే పూర్తి చేసింది. ఇక రెండో విడత పరీక్షలు జూలై 21 నుంచి 30 వరకు జరగనున్నాయి. అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఆగస్టు 28న ఐఐటీ బాంబే నిర్వహించనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 7 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. సెప్టెంబర్ 11న అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల కానున్నాయి. అనంతరం జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ద్వారా ఐఐటీలు, ఎన్ఐటీలు తదితర విద్యాసంస్థల్లో సీట్లను అర్హులైన అభ్యర్థులకు కేటాయించనుంది. ఈసారి యూజీ ప్రథమ సంవత్సరానికి ఐఐటీల్లో 16,234, ఎన్ఐటీల్లో 23,997 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 110 జాతీయ విద్యాసంస్థలు దేశంలో ఐఐటీలు సహ వివిధ కేటగిరీల్లో 110 జాతీయ విద్యాసంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, కేంద్ర ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్నవే. 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ఐఐఐటీలు, 1 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 7 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లు (ఐఐఎస్ఈఆర్లు), 29 కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల్లో వివిధ విభాగాల వారీగా 50,882 సీట్లు ఉన్నాయి. వీటిలో ఐఐటీలు, ఎన్ఐటీలకు విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వీటిలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌కు ఏటా 10 లక్షల మందికి పైగా హాజరవుతున్నారు. వీరిలో నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించినవారిలో 2.5 లక్షల మందికి అడ్వాన్స్డ్ నిర్వహిస్తున్నారు. ఇందులోనూ నిర్దేశిత అర్హత మార్కులు సాధించి టాప్‌లో నిలిచినవారిని ఐఐటీలకు ఎంపిక చేస్తున్నారు. మిగిలినవారికి ఎన్ఐటీల్లో సీట్లు కేటాయిస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకారం.. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్), దివ్యాంగులు ఇలా ఆయా కేటగిరీల్లో సీట్లు కేటాయింపు జరుగుతోంది. -
జేఈఈ సెకండ్ సెషన్‌పై కన్ను
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్స్)–2022 సెకండ్ సెషన్‌కు అభ్యర్థుల సంఖ్య మరింత పెరగనుంది. మొదటి సెషన్ పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 9 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆ తొలి సెషన్ ఫైనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం విడుదల చేసింది. తొలి సెషన్ పేపర్లలోని ప్రశ్నల స్థాయి ఒకింత క్లిష్టంగా, ఆధునికంగా (మోడరేట్) ఉండి విద్యార్థులను అయోమయానికి గురి చేశాయి. ప్రశ్నలకు ఇచ్చిన బహుళైచ్ఛిక సమాధానాలన్నీ ఇంచుమించు ఒకేలా.. సరైన సమాధానాలుగా స్ఫురించేలా ఇచ్చారు. దీంతో అభ్యర్థులు కొంత తికమక పడ్డారు. ఈసారి అన్ని విభాగాల్లోనూ నెగిటివ్ మార్కులను అమలు చేస్తున్న నేపథ్యంలో పొరపాటున తప్పుడు సమాధానామిచ్చే విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో న్యూమరికల్ ప్రశ్నలకు నెగిటివ్ మార్కులుండేవి కావు. ఇప్పుడు అన్ని విభాగాలకూ నెగిటివ్ మార్కులున్న నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులకు మార్కుల స్కోరులో తగ్గుదల ఉందని కార్పొరేట్ జూనియర్ కాలేజీలు, కోచింగ్ సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. సెకండ్ సెషన్‌పైనే అభ్యర్థుల దృష్టి ఇలాంటి పరిస్థితుల కారణంగా మొదటి సెషన్లో పరీక్షలు రాసిన విద్యార్థులు తిరిగి సెకండ్ సెషన్ పరీక్షలలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. తొలిసెషన్ పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థి రెండో సెషన్‌కు మళ్లీ రిజిస్ట్రేన్ చేసుకుంటున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఎన్టీఏ పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. రెండో సెషన్‌కు దరఖాస్తు ప్రక్రియను జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు తొలుత ప్రకటించింది. ఆ తరువాత విద్యార్థుల నుంచి వచ్చిన విన్నపాల మేరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు జూలై 2 నుంచి మళ్లీ అవకాశం కల్పించింది. మొదటి విడత పరీక్షల ఫైనల్ కీ విడుదల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించింది. తాజాగా బుధవారం ఎన్టీఏ మరో పబ్లిక్ నోటీస్‌ను విడుదల చేస్తూ జూలై 9వ తేదీవరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం ఇచ్చింది. ఆ రోజు రాత్రి 11.50 నిముషాల వరకు ఆన్లైన్ ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల సమర్పణను కొనసాగించవచ్చని సూచించింది. ఇలా ఉండగా జేఈఈ సెకండ్ సెషన్ పరీక్షలు జులై 21 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలలో కూడా పాల్గొని తమ మార్కుల స్కోరును పెంచుకోవాలనే ఉద్దేశంతో అభ్యర్థులు ఉన్నారు. ఈసారి రెండు సెషన్లలోనే జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తుండడంతో ఇదే తుది అవకాశంగా పట్టుదలతో పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. -
జేఈఈ మెయిన్–2022 నిబంధనల్లో మార్పులు.. నెగెటివ్ మార్కులతో జాగ్రత్త!
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 నిబంధనల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మార్పు చేసినందున విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జేఈఈ మెయిన్‌లో అన్ని సెక్షన్ల ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్‌ను అమలు చేయనున్నామని ఎన్టీఏ ఇంతకు ముందే ప్రకటించి ఉన్నందున అభ్యర్థులు సరైన సమాధానాలను మాత్రమే గుర్తించాలని, తప్పుడు సమాధానాలు గుర్తిస్తే మార్కుల్లో కోత పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. గతంలో సెక్షన్–ఎ లోని బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలకు మాత్రమే నెగెటివ్ మార్కులుండేవి. ఈసారి సెక్షన్–బి లోని న్యూమరికల్ వేల్యూ ప్రశ్నలకు కూడా నెగెటివ్ మార్కులుంటాయని ఎన్టీఏ స్పష్టం చేసింది. బీఈ, బీటెక్‌తో పాటు బీఆర్క్‌కు సంబంధించిన పేపర్ 2ఏలోని సెక్షన్–బిలో ప్రతి ప్రశ్నకూ నెగెటివ్ మార్కు ఉంటుంది. ప్రశ్నల్లో విద్యార్థులకు చాయిస్ కరోనా కారణంగా కాలేజీలు ఆలస్యంగా తెరచుకోవడంతో 2021–22 విద్యా సంవత్సరంలోనూ పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు సిలబస్‌ను కుదించాయి. అయితే ఎన్టీఏ సిలబస్ కుదించలేదు. అయితే విద్యార్థులకు ఉపశమనంగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. పేపర్1, పేపర్ 2ఏ, 2బీ విభాగాల్లో పార్టు1లలోని ప్రశ్నల్లో చాయిస్‌ను ఇచ్చింది. ఆయా విభాగాల్లో తమకు వచ్చిన ప్రశ్నలకు విద్యార్థులు జవాబు ఇవ్వవచ్చు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా ఉంటాయి. ప్రాంతీయ భాషా ప్రశ్న పత్రాలు ఆయా రాష్ట్రాల్లో మాత్రమే అందిస్తారు. ఏపీ, తెలంగాణల్లో ఇంగ్లిష్ తో పాటు తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రాలు ఇస్తారు. టై బ్రేకర్ నిబంధనల్లోనూ మార్పు ఈసారి టై బ్రేకర్ నిబంధనల్లోనూ మార్పులు జరిగాయి. సమానమైన స్కోరు సాధించిన వారి విషయంలో వయసును కూడా ప్రమాణంగా తీసుకోవాలని నిర్ణయించింది. 2021లో ఈ పద్ధతిని రద్దు చేసిన ఎన్టీఏ మళ్లీ అమల్లోకి తెచ్చింది. సమాన మార్కులు వచ్చిన విద్యార్థులుంటే మొదట స్కోర్ల వారీగా వరుసగా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అనంతరం తప్పుడు సమాధానాల నిష్పత్తిని అవే సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తారు. అప్పటికీ సమాన స్థాయిలో ఉంటే వయసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ సాధ్యం కాకుంటే ముందస్తు దరఖాస్తుదారులకు ప్రాధాన్యం ఇస్తారు. ఏపీ నుంచి 1.60 లక్షల మంది హాజరు జేఈఈ మెయిన్‌ను 2021లో నాలుగు విడతలుగా నిర్వహించగా ఈసారి రెండు విడతలకే పరిమితం చేశారు. తొలి విడత ఈనెల 20 నుంచి 29 వరకు, మలివిడత జూలై 21 నుంచి 30 వరకు జరుగుతుంది. ఈనెల 1 నుంచి ప్రారంభమైన మలివిడత దరఖాస్తు ప్రక్రియ 30వ తేదీతో ముగియనుంది. తొలి విడతకు దేశవ్యాప్తంగా 11 లక్షల మంది వరకు హాజరవుతారని భావిస్తున్నారు. ఏపీ నుంచి 1.60 లక్షల మంది మెయిన్ రాసే అవకాశం ఉంది. చిరునామా ఆధారంగా పరీక్ష కేంద్రం కేటాయింపు ఈసారి అభ్యర్థి చిరునామాను అనుసరించి మాత్రమే సమీపంలోని పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవడానికి అవకాశమిచ్చిన ఎన్టీఏ.. వాటిలో ఒకదానిని కేటాయిస్తుంది. గతంలో ఇతర రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలను కూడా ఎంపిక చేసుకొనే విధానముండేది. అయితే 2021 మెయిన్‌లో కొందరు అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకొని అక్రమాలకు పాల్పడడం, మాస్ కాపీయింగ్ జరగడంతో సీబీఐ విచారణ, అరెస్టులు కూడా చోటుచేసుకున్నందున ఈసారి ఆ విధానాన్ని మార్చారు. పరీక్ష కేంద్రాల సంఖ్యను 334 నుంచి 514కు ఎన్టీఏ పెంచింది. ఆంధ్రప్రదేశ్‌లో 29 పరీక్ష కేంద్రాల్లో ఈ జేఈఈ మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలు ఇవీ అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం -
వరంగల్ నిట్‌లో ఘనంగా స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు (ఫొటోలు)
-
జేఈఈ మెయిన్ రెండో సెషన్ యథాతథం
సాక్షి, అమరావతి: ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్– 2022–23 సెకండ్ సెషన్ షెడ్యూల్ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. ముందుగా ప్రకటించినట్టే మే 24 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలు జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ఏటీ) తెలిపింది. జూలై 3న జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహిస్తామని ఐఐటీ బాంబే పేర్కొన్నప్పటికీ మెయిన్ సెకండ్ సెషన్ తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్ మొదటి సెషన్‌ను ముందు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే వివిధ బోర్డుల పరీక్షల తేదీలతో అవి క్లాష్ అవుతుండడంతో ఆ తేదీలను ఎన్టీఏ మార్చింది. ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు మెయిన్ మొదటి సెషన్ పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెకండ్ సెషన్ తేదీల్లో కూడా మార్పులు ఉండొచ్చని విద్యార్థుల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఏ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. జేఈఈ మెయిన్‌లో క్వాలిఫై అయిన టాప్ 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులు. కాగా జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఆన్లైన్ దరఖాస్తులో వివరాలు సవరించుకోవడానికి ఈసారి అవకాశం లేనందున విద్యార్థులు ముందే తగు జాగ్రత్తలు పాటించాలని ఎన్టీఏ సూచించింది. న్యూమరికల్ ప్రశ్నలకూ నెగెటివ్ మార్కులు జేఈఈ మెయిన్‌లోని పేపర్–2 సెక్షన్ బీలో న్యూమరికల్ ప్రశ్నలకు గతంలో నెగెటివ్ మార్కులు ఉండేవి కావు. అయితే ఈసారి వాటికి కూడా ఎన్టీఏ నెగెటివ్ మార్కులను ప్రకటించింది. ప్రతి తప్పు సమాధానానికి ఒక్కో మార్కు కోత పడనుంది. ఈ విషయాన్ని కూడా విద్యార్థులు పరిగణనలోకి తీసుకొని సమాధానాలు రాసేటప్పుడు జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. -
‘మెయిన్’కు తగ్గిపోతున్నారు!
సాక్షి, అమరావతి: జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్‌కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది. విద్యాసంస్థల సంఖ్య, సీట్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఈ పరీక్షలకు నమోదయ్యే విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగకపోవడం విశేషం. గత పదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. లక్ష నుంచి లక్షన్నర వరకు తగ్గుదల 2012లో 12.20 లక్షల మంది, 2014లో 13.56 లక్షల మంది అభ్యర్థులు మెయిన్‌కు నమోదుకాగా 2021లో ఆ సంఖ్య 10.48 లక్షలకు తగ్గిపోయింది. 2018 వరకు మెయిన్స్ పరీక్షను ఏడాదికి ఒకసారే నిర్వహించేవారు. ఈ విధానంవల్ల విద్యార్థులు అటు ఇంటర్ పరీక్షలు, ఆ తర్వాత మెయిన్ పరీక్షలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారు. పైగా ఈ సీట్ల సాధన కోసం అభ్యర్థులు లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకోవడంవల్ల ఏడాదిపాటు నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2019 నుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహించే విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ, 2021లో కరోనావల్ల నాలుగుసార్లు నిర్వహించారు. అయితే.. 2021లో మినహా అంతకు ముందు సంవత్సరాల్లో మెయిన్‌కు నమోదైన విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2012లో 12.20 లక్షల మంది నమోదు కాగా.. 2013లో ఆ సంఖ్య 12.82 లక్షలకు పెరిగింది. 2014లో 13,56,805కు చేరింది. ఆ తర్వాత 2015 నుంచి విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తోంది. 2015లో 13.04,495 మందికి తగ్గగా 2016కు వచ్చేసరికి 11,94,938కి.. 2017లో 11,86,454 మందికి పడిపోయింది. కానీ, 2018లో మాత్రం 12.59 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ 2019నుంచి రెండుసార్లు నిర్వహించేలా జేఈఈ విధానాన్ని మార్చినప్పటికీ అభ్యర్థుల సంఖ్య పెరగకపోగా తగ్గడం విశేషం. 2019లో 9,35,741 మంది, 2020లో 9,21,261 మంది, 2021లో 10,48,012 మంది నమోదయ్యారు. సీట్లు పెరిగినా పెరగని అభ్యర్థుల సంఖ్య దేశంలో 2016 నాటికి మొత్తం ఐఐటీలు (23), ఎన్ఐటీలు (31), ఐఐఐటీలు (26), జీఎఫ్‌ఐటీ (18)లలో 28,000 సీట్లు ఉండగా అవి 2021 నాటికి 37,952కు పెరిగాయి. ఐఐటీలలో 2016–17లో 10,572 సీట్లు ఉండగా ప్రస్తుతం 16,053కు చేరాయి. పైగా ఐఐటీల్లో మహిళల సంఖ్యను పెంచేందుకు వారికోసం ఆయా సంస్థల్లో సూపర్ న్యూమరరీ కింద 20 శాతం మేర సీట్లు అదనంగా కేటాయిస్తోంది. హాజరవుతున్న వారూ తగ్గుముఖం మరోవైపు.. మెయిన్‌కు రిజిస్టర్ అవుతున్న వారి సంఖ్యతో పోలిస్తే పరీక్ష రాస్తున్న వారి సంఖ్య మరింత తక్కువగా ఉంటోంది. లక్ష మందికి పైగా హాజరవ్వడంలేదు. ► 2021లో నాలుగు సెషన్లలో జేఈఈ మెయిన్‌ను నిర్వహించగా దేశవ్యాప్తంగా మొత్తం 10,48,012 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 9,39,008 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ► 2020లో 9,21,261 మంది నమోదు చేసుకోగా 8,69,010 మంది హాజరయ్యారు. ► 2019లో 9,35,741 మందికి గాను 8,81,096 మంది రాశారు. ► 2018లో 12.59 లక్షల మంది నమోదు కాగా 10.50 లక్షల మందే పరీక్షకు హాజరయ్యారు. ► 2017లో 11,86,454 మందిలో 10.20 లక్షల మంది.. ► 2016లో 11,94,938కి గాను 11 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. ► ఇక 2015లో 13,04,495 మందికిగాను 12.34 లక్షల మంది రాశారు. జేఈఈకి ప్రత్యేకంగా తర్ఫీదు కావలసి ఉండడం, ఐఐటీలు సహ ఇతర సంస్థలు ఎక్కడో దూరంగా ఉండడం, పైగా ఆయా సంస్థలలో ఫీజులను భరించే స్థోమత లేకపోవడంతో ఎక్కువమంది విద్యార్థులు స్థానికంగా ఉండే ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. -
నీట్ పీజీ కటాఫ్‌లో...15 పర్సంటైల్ తగ్గింపు
న్యూఢిల్లీ: పీజీ మెడికల్ సీట్ల ఖాళీల భర్తీకి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2021 నీట్–పీజీలో అన్ని కేటగిరీల్లోనూ కటాఫ్‌ను 15 పర్సంటైల్ మేరకు తగ్గించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌ను ఆదేశించింది. ఎన్బీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మినూ బాజ్‌పాయ్‌కి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) సభ్య కార్యదర్శి బి.శ్రీనివాస్ ఈ మేరకు లేఖ రాశారు. అన్ని అంశాలనూ చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆ మేరకు క్వాలిఫయింగ్ కటాఫ్ జనరల్ కేటగిరీకి 35వ పర్సెంటైల్‌కు, ఫిజికలీ హాండీక్యాప్డ్ (జనరల్)కు 30కి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వుడ్ కేటగిరీలకు 25 పర్సెంటైల్‌కు తగ్గించాలని పేర్కొన్నారు. ఆలిండియా, రాష్ట్రాల కోటాల్లో రెండేసి రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత కూడా దాదాపు 8,000 సీట్లు మిగిలిపోనున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ మెడికల్ కమిషన్‌తో విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ‘‘దీనివల్ల సీట్ల వృథాకు అడ్డుకట్ట పడుతుంది. తాజా నిర్ణయం వల్ల కనీసం మరో 25 వేల మంది అభ్యర్థులు ప్రస్తుత కౌన్సెలింగ్‌లో మాప్ రౌండ్లో పాల్గొనగలరు’’ అని చెప్పారు. (చదవండి: భారత్‌లో చదువుతామంటూ...‘ఉక్రెయిన్’ విద్యార్థుల పిటిషన్)