జేఈఈ మెయిన్ పరీక్ష కేంద్రాల్లో భారీగా కోత
సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు 2016 ఏప్రిల్ 3వ తేదీన ఆఫ్‌లైన్‌లో, 9, 10 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించతలపెట్టిన జేఈఈ మెయిన్ పరీక్ష కేంద్రాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) భారీగా తగ్గించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా 2015 జేఈఈ మెయిన్ పరీక్ష సందర్భంగా ఏర్పాటు చేసిన కేంద్రాలతో పోల్చితే 2016 పరీక్షకు ఏర్పాటు చేసే కేంద్రాల సంఖ్యను సగానికంటే ఎక్కువ కోత పెట్టింది. 2015 పరీక్షకు దేశవ్యాప్తంగా 283 కేంద్రాలను ఏర్పాటు చేయగా, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే పరీక్ష నిర్వహణ కేంద్రాలను 132కు తగ్గించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత పరీక్షకు 28 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 2016లో నిర్వహించే పరీక్షకు 7 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. దీంతో రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులకు పరీక్ష సమయంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను 12 లక్షల నుంచి 13 లక్షలమంది వరకు రాస్తారని అధికారులు అంచనా వేస్తుండగా, తెలుగు రాష్ట్రాల్లో సుమారు 2 లక్షల వరకు రాస్తారని తెలుస్తోంది.
ఈసారి మరిన్ని ఇబ్బందులు..
గత మూడేళ్లలో రెండు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 15 నుంచి 28 వరకు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తేనే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులకు ఈసారి పరీక్ష సమయంలో అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. సీబీఎస్‌ఈ ఆఫ్‌లైన్ పరీక్ష కేంద్రాల కంటే ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఎక్కువగా తగ్గించింది.
2015 జేఈఈ మెయిన్ పరీక్ష కోసం తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్‌లలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణకు కేంద్రాలు ఏర్పాటు చేయగా, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌లలో ఆఫ్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే అభ్యర్థులు ఎక్కువ శాతం ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష రాస్తుండటంతో ఆఫ్‌లైన్ పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచాలని తల్లిదండ్రులు ఏటా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కాని 2016 పరీక్షకు కూడా సీబీఎస్‌ఈ ఆ మూడు పట్టణాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ఒక్క కేంద్రాన్ని కూడా పెంచలేదు. పైగా ఈసారి కరీంనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలను కూడా ఇవ్వలేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 2015 జేఈఈ మెయిన్ పరీక్షకు 22 పట్టణాల్లో (అనంతపూర్, బాపట్ల, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కంచికచర్ల, కర్నూలు, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం) ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, గుంటూరు, తిరుపతిలో మాత్రమే ఆఫ్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక 2016 జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ పరీక్షకు కేంద్రాలను నాలుగు పట్టణాలకే పరిమితం చేసింది. రెండు పట్టణాల్లో ఆఫ్‌లైన్ పరీక్షలను పెంచింది. ఏపీలోని గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణంలలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.
బసకూ ఇక్కట్లే!
వివిధ పట్టణాల్లో ఎక్కువ మొత్తంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన సమయంలోనే ఆయా ప్రాంతాల్లోని హోటళ్లు, లాడ్జీలన్నీ నిండిపోయేవి. రెండు రోజుల ముందే లాడ్జీల్లో వసతి దొరకని పరిస్థితులు ఎదురయ్యాయి. కేంద్రాలను కుదించడంతో ఈసారి పరీక్ష సమయంలో మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. నాలుగైదు రోజుల ముందు వెళ్లినా లాడ్జీల్లో రూములు దొరుకుతాయా? లేదా? అన్న ఆందోళన అప్పుడే తల్లిదండ్రుల్లో మొదలైంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సీబీఎస్‌ఈ స్పందించి పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు.