
గౌహతి: విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన కొందరు అధ్యాపకులు తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన ఒక ప్రొఫెసర్ బాగోతం మరువకముందే, అస్సాంలోని సిల్చార్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇదే తరహా వేధింపుల వార్తల్లో నిలిచారు. సిల్చార్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(National Institute of Technology) (నిట్)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కోటేశ్వర్ రాజు ధేనుకొండ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు డాక్టర్ కోటేశ్వర్ రాజును అరెస్ట్ చేశారు. అతనిని నిట్ నుంచి కూడా సస్పెండ్ చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుమల్ మహత్తా తెలిపారు. బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు దాఖలు చేసిన వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా అతనిని ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణంలో అరెస్టు చేశారు. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ(Bachelor of Technology) విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై చర్య తీసుకోవాలని విద్యార్థులు రాత్రంతా నిరసన తెలిపారు. బాధితురాలి ఫిర్యాదులోని వివరాల ప్రకారం ప్రొఫెసర్ ఆమెను తన చాంబర్‌కు పిలిచి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఈ నేపధ్యంలో బాధితురాలు ఇన్‌స్టిట్యూట్ అధికారులకు రాసిన లిఖితపూర్వక ఫిర్యాదులో.. ప్రొఫెసర్ తనకు వచ్చిన తక్కువ గ్రేడ్‌ల గురించి చర్చించేందుకు, చాంబర్‌కు పిలిచారని, ఆ తరువాత తనను అనుచితంగా తాకాడని ఆమె పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు గురించి తెలియగానే నిందితుడు దాక్కునేందుకు ప్రయత్నించాడని పోలీసు అధికారి తెలిపారు. అతని మొబైల్ ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేసి, అతనిని, అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆ తర్వాత అతనిని భారత శిక్షాస్మృతి (బీఎస్‌ఎన్) లోని వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: చైనా దురాక్రమణను భారత్ అంగీకరించబోదు: కేంద్రం స్పష్టం
Comments
Please login to add a commentAdd a comment