‘అబ్బాయిలతో తిరగడం ఆపలేదో.. ఇంటికే ఇక’
కోజికోడ్: తమ క్యాంపస్లోని విద్యార్థినులకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ-సీ) కాలికట్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఏ అమ్మాయి కూడా అబ్బాయితో తిరుగుతూ కనిపించవొద్దని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు క్యాంపస్ లేడీస్ హాస్టల్ వార్డెన్ నోటీసులను అంటించింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ లింగ వివక్షకు గురి చేస్తున్నారంటూ ఆమె చర్యను ఖండించారు.
కొంతమంది ప్రొఫెసర్లు కూడా ఈ నోటీసులు చూసి అవాక్కయ్యారు. ఆ నోటీసులో ఎస్ భువనేశ్వరీ అనే వార్డెన్ పేరిట చెప్పారంటే.. ’క్యాంపస్ లోని రెండు వసతి గృహాల ప్రాంగణాల్లో అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి తిరుగుతున్నట్లు తెలిసింది. మాకు ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందాయి. ఇక నుంచి ఏ అమ్మాయి అయినా అబ్బాయితో కలిసి ఇక్కడ తిరుగుతున్నట్లు తెలిసిందో వారిపై సస్పెన్షన్ వేటుగానీ, హాస్టల్ నుంచి వెళ్లగొట్టే చర్యలుగానీ తీసుకోవడం జరుగుతుంది జాగ్రత్త’ అంటూ పేర్కొన్నారు. అయితే, ప్రత్యేకంగా అమ్మాయిలను మాత్రమే ఉద్దేశించి చెప్పడంపై అక్కడి వాళ్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.