ఏపీ నిట్‌.. ప్లేస్‌మెంట్స్‌లో హిట్‌ | So far 258 people have jobs in AP NIT | Sakshi
Sakshi News home page

ఏపీ నిట్‌.. ప్లేస్‌మెంట్స్‌లో హిట్‌

Jun 21 2024 5:16 AM | Updated on Jun 21 2024 5:17 AM

So far 258 people have jobs in AP NIT

ఈ ఏడాదిలో ఇప్పటివరకు 258 మందికి ఉద్యోగాలు

బయట లేఆఫ్‌లు ఉన్నా దిగ్గజ కంపెనీల్లో ఆఫర్లు

సరాసరి వేతనం సంవత్సరానికి రూ.7.15 లక్షలు

ఇద్దరు విద్యార్థులకు అత్యధికంగా రూ.44.1 లక్షల ప్యాకేజీ

తాడేపల్లిగూడెం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటుతోంది. ఇక్కడ ఇంజనీరింగ్‌ పూర్తి చేసుకున్నవారికి దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. 

ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో లేఆఫ్‌లు కొనసాగుతున్నా.. ఏపీ నిట్‌ విద్యార్థులకు మాత్రం మంచి అవకాశాలు దక్కుతున్నాయి. మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలను సాధిస్తున్నారు. 2022 బ్యాచ్‌లో 98 శాతం, 2023లో 97 శాతం మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యారు. ఏపీ నిట్‌ ప్రారంభించిన దగ్గరి నుంచి ఇప్పటివరకు ఏడాదికి 300 మందికి తక్కువ కాకుండా ఉద్యోగాలు పొందడం విశేషం. త్వరలో 2023–24 సంవత్సరానికి సంబంధించి ఆరో బ్యాచ్‌ బయటకు రానుంది. 

258 మందికి ఉద్యోగాలు
క్యాంపస్‌ ఇంటర్వ్యూల కోసం ఏకంగా 127 కంపెనీలు నిట్‌ ప్రాంగణానికి వచ్చాయి. ఆరో బ్యాచ్‌ విద్యార్థుల్లో ప్లేస్‌మెంట్స్‌ కోసం 392 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు 258 మంది (65.82 శాతం)కి ఉద్యోగాలు లభించాయి. సరాసరి వేతనం రూ.7.15 లక్షలుగా ఉంది. బీటెక్‌ ఫైనలియర్‌ సీఎస్‌ఈ చదువుతున్న ఆదర్‌‡్ష, ఈసీఈ విద్యార్థి ఆకాష్‌కుమార్‌ సిన్హా అత్యధికంగా రూ.44.1 లక్షల వార్షిక ప్యాకేజీ పొందారు. 

వీరిని నివిధ కంపెనీ ఎంపిక చేసుకుంది. అలాగే సీఎస్‌ఈ విద్యార్థి సలాది వెంకట శశిభూషణ్‌.. పేపాల్‌ కంపెనీలో రూ.34.4 లక్షల ప్యాకేజీతో, సీఎస్‌ఈ బ్రాంచ్‌కే చెందిన స్వామి సక్సేనా జెడ్‌ఎస్‌ కేలర్‌లో రూ.26.5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించడం విశేషం. కాగా డిసెంబర్‌ వరకు ప్లేస్‌మెంట్స్‌ ప్రక్రియ కొనసాగనుంది.

480 సీట్ల భర్తీ
నిట్‌లో 2024–25 సంవత్సరానికి సంబంధించి జాయింట్‌ సీట్‌ అలొ­కేషన్‌ అథారిటీ (జోసా) నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌ మొదటి రౌండ్‌లో 480 సీట్లకు అలాట్‌మెంట్లు పూర్తయ్యాయని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పి.దినేష్‌ శంకరరెడ్డి గురువారం తెలిపారు. నిట్‌లో సీఈసీ, ఈఈఈ, ఈసీఈ బ్రాంచ్‌ల్లో 90 సీట్ల చొప్పున ఉన్నాయన్నారు. 

అలాగే సివిల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ బ్రాంచ్‌ల్లో 60 చొప్పున, కెమికల్‌ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఎంఎంఈ బ్రాంచ్‌ల్లో 30 చొప్పున సీట్లు ఉన్నాయని వెల్లడించారు. మొత్తం 480 సీట్లలో 50 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులకు, మిగిలిన 50 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ద్వారా కేటాయించామన్నారు. 

సీట్లు పొందిన విద్యార్థులు జూన్‌ 24లోపు ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌తో పాటు ఫీజు చెల్లించాలని కోరారు. ఆగస్టు మొదటి వారంలో నిట్‌ ప్రాంగణానికి వచ్చి తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్‌లను వెరిఫికేషన్‌ చేయించుకోవాలని సూచించారు. దీని కోసం నిట్‌లో ప్రత్యేక కేంద్రం పనిచేస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement