సాక్షి, అమరావతి: ఆహార పదార్థాలు ఎక్కువ కాలం తాజాగా ఉంచే నానో టెక్నాలజీ ప్యాకింగ్‌ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్–ఏపీ) అభివృద్ధి చేసింది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ప్యాకింగ్‌లోని ఆహారం ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటుందని ప్రకటించింది. ఇందుకు సంబంధించి నిట్ బయో టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలోని ఇంటర్ డిసిప్లినరీ బృందం చేస్తున్న పరిశోధనల వివరాలను ఆయన వెల్లడించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్యాకింగ్ మెటీరియల్ స్థానంలో నానోపార్టికల్ సామగ్రితో ప్యాకింగ్ చేసినట్టయితే పదార్థాలు ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయన్నారు.
ఈ ప్యాకింగ్‌లో ఆహారం, రంగు, రుచి, వాసనతో పాటు నాణ్యత చెక్కు చెదరదన్నారు. నానో టెక్నాలజీ రోజురోజుకు ఎంతో అభివృద్ధి సాధిస్తోందని, వివిధ రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారని, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆహార పదార్థాల ప్యాకింగ్‌తో పాటు వ్యవసాయం సహా ఇతర రంగాల్లో వినియోగిస్తే నిల్వ సామర్థ్యం ఎంతో పెరుగుతుందన్నారు. నానో పార్టికల్ ఆధారిత ప్యాకింగ్ పదార్థాలు సంప్రదాయ, నాన్–బయోడిగ్రేడబుల్ ప్యాకింగ్ కంటే ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తాయన్నారు.
ప్యాక్ చేసిన పదార్థాలలో ఏవైనా వ్యాధి కారకాలు, పురుగు మందుల అవశేషాలు, అలర్జీ కారకాలు, రసాయనాలు ఉంటే సెన్సార్ల ద్వారా గుర్తించవచ్చన్నారు. ఆహార జీవిత కాలాన్ని పెంచేందుకు అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను ప్యాకింగ్‌లోని నానో సెన్సార్లు విడుదల చేస్తాయని, దీనివల్ల ఆహారం పారవేసే పరిస్థితి రాదని, ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని డాక్టర్ జగన్‌మోహన్‌రావు వివరించారు. నానో ప్యాకింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన పరిశోధన బృందాన్ని ఏపీ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సీఎస్‌పీ రావు అభినందించారు.
ఎప్పుడైనా తాజాగా తినేలా
Published Wed, Dec 8 2021 3:29 AM | Last Updated on Wed, Dec 8 2021 5:54 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment