Nanotechnology
-
ఎప్పుడైనా తాజాగా తినేలా
సాక్షి, అమరావతి: ఆహార పదార్థాలు ఎక్కువ కాలం తాజాగా ఉంచే నానో టెక్నాలజీ ప్యాకింగ్‌ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్–ఏపీ) అభివృద్ధి చేసింది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ప్యాకింగ్‌లోని ఆహారం ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటుందని ప్రకటించింది. ఇందుకు సంబంధించి నిట్ బయో టెక్నాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.జగన్మోహన్రావు ఆధ్వర్యంలోని ఇంటర్ డిసిప్లినరీ బృందం చేస్తున్న పరిశోధనల వివరాలను ఆయన వెల్లడించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్యాకింగ్ మెటీరియల్ స్థానంలో నానోపార్టికల్ సామగ్రితో ప్యాకింగ్ చేసినట్టయితే పదార్థాలు ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయన్నారు. ఈ ప్యాకింగ్‌లో ఆహారం, రంగు, రుచి, వాసనతో పాటు నాణ్యత చెక్కు చెదరదన్నారు. నానో టెక్నాలజీ రోజురోజుకు ఎంతో అభివృద్ధి సాధిస్తోందని, వివిధ రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారని, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆహార పదార్థాల ప్యాకింగ్‌తో పాటు వ్యవసాయం సహా ఇతర రంగాల్లో వినియోగిస్తే నిల్వ సామర్థ్యం ఎంతో పెరుగుతుందన్నారు. నానో పార్టికల్ ఆధారిత ప్యాకింగ్ పదార్థాలు సంప్రదాయ, నాన్–బయోడిగ్రేడబుల్ ప్యాకింగ్ కంటే ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తాయన్నారు. ప్యాక్ చేసిన పదార్థాలలో ఏవైనా వ్యాధి కారకాలు, పురుగు మందుల అవశేషాలు, అలర్జీ కారకాలు, రసాయనాలు ఉంటే సెన్సార్ల ద్వారా గుర్తించవచ్చన్నారు. ఆహార జీవిత కాలాన్ని పెంచేందుకు అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను ప్యాకింగ్‌లోని నానో సెన్సార్లు విడుదల చేస్తాయని, దీనివల్ల ఆహారం పారవేసే పరిస్థితి రాదని, ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని డాక్టర్ జగన్మోహన్రావు వివరించారు. నానో ప్యాకింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన పరిశోధన బృందాన్ని ఏపీ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సీఎస్పీ రావు అభినందించారు. -
ఈ మందుతో అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చెక్..!
సాక్షి, హైదరాబాద్: బ్లాక్ ఫంగస్‌కు చెక్ పెట్టే మందును ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బ్లాక్ ఫంగస్ మాత్రమే కాకుండా దాదాపు అన్ని రకాల ఫంగల్ (శిలీంధ్రం) ఇన్ఫెక్షన్ల చికిత్సలోనూ దీన్ని వాడొచ్చని, ఏదైనా ఫార్మా కంపెనీ ముందుకొస్తే ఈ మందు తయారీ సాంకేతికతను అందించేందుకు తాము సిద్ధమని ఐఐటీ హైదరాబాద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. బ్లాక్ ఫంగస్‌కు ప్రస్తుతం ఆంఫోటెరిసిన్–బి అనే ఇంజెక్షన్‌తో చికిత్స కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ మందు ఖరీదైనది మాత్రమే కాకుండా.. పలు దుష్ప్రభావాలూ ఉన్నాయి. గతంలో ఇదే మందును కాలా అజార్ వ్యాధి చికిత్సలోనూ ఉపయోగించారు. ఈ నేపథ్యంలో ఇంజెక్షన్ రూపంలో అందిస్తున్న ఆంఫోటెరిసిన్–బిపై రెండేళ్ల నుంచే ఐఐటీ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ సప్తర్షి మజుందార్, డాక్టర్ చంద్రశేఖర్ శర్మ, పీహెచ్డీ స్కాలర్లు మృణాళిని గాయ్ధనే, అనిందిత లాహాలు పరిశోధనలు చేస్తున్నారు. నానో టెక్నాలజీ సాయంతో... ఈ మందును నానోస్థాయి పోగులతో కలిపి ట్యాబ్లెట్ల రూపంలో తయారు చేయొచ్చని వీరంతా గుర్తించారు. ట్యాబ్లెట్ల రూపంలో ఆంఫోటెరిసిన్–బి తయారు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, అతితక్కువ మోతాదుల్లో ప్రభావవంతంగా మందు అందించవచ్చని, ఇంజెక్షన్ ద్వారా అందించేటప్పుడు మూత్రపిండాలపై ఎక్కువ భారం పడుతుండగా ట్యాబ్లెట్ల ద్వారా ఈ దుష్ప్రభావం తక్కువగా ఉంటుందని ప్రొఫెసర్ సప్తర్షి మజుందార్ తెలిపారు. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చినప్పుడు ఆంఫోటెరిసిన్– బి శరీరంలో చిన్నచిన్న గడ్డలు కట్టే అవకాశాలు ఉంటాయని, వీటిని శరీరం నుంచి తొలగించేందుకు మూత్రపిండాలు ఎక్కువ భారం మోయాల్సి వచ్చేదని ఆయన వివరించారు. జిలాటిన్ పదార్థంతో కలిపి తాము ఈ మందును తయారు చేశామని చెప్పారు. పెద్ద ఎత్తున ఉత్పత్తి అవసరం.. బ్లాక్‌ఫంగస్‌తో పాటు ఇతర శిలీంధ్ర సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ మాత్రలను పెద్ద ఎత్తున తయారు చేయడం అవసరమని అన్నారు. ఇంజెక్షన్ల మాదిరిగా ఈ ట్యాబ్లెట్లూ ఖరీదుగా మారకుండా ఉండేందుకు తాము ఈ టెక్నాలజీపై పేటెంట్ హక్కులేవీ పొందలేదని, కేవలం 60 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్‌తో ఆంఫోటెరిసిన్–బి మందు నెమ్మదిగా.. స్థిరంగా 8 గంటల పాటు శరీరానికి అందించవచ్చన్నారు. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ.200 వరకూ ఉండొచ్చని చెప్పారు. ఏదైనా ఫార్మా కంపెనీ ట్యాబ్లెట్ల తయారీకి పూనుకుంటే వాటి క్లినికల్ ట్రయల్స్‌కు మార్గం సుగమం అవుతుందని అన్నారు. -
ఈ మందు వాడితే కరోనా నుంచి నెలరోజుల రక్షణ!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునే లక్ష్యంతో ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు వినూత్నమైన ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చారు. వీటిని ఉపయోగించిన క్షణాల్లోనే 99.99 శాతం సూక్ష్మజీవులను నాశనం చేయడంతో పాటు దాదాపు నెల రోజుల పాటు రక్షణ కల్పించే నానోస్థాయి కోటింగ్ ఇచ్చే ప్రత్యేక ఉత్పత్తులను అభివృద్ధి చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ శుక్రవారం ఈ ప్రత్యేక ఉత్పత్తి శ్రేణి ‘డ్యురోకియా’ను ఆన్లైన్ పద్ధతిలో విడుదల చేశారు. బయో మెడికల్ ఇంజినీరింగ్ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్, ఈఫోకేర్ ఇన్నొవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడైన డాక్టర్ జోత్సేందు గిరి అభివృద్ధి చేసిన డ్యురోకియా ఉత్పత్తుల కనీస ధర రూ.189 మాత్రమే కావడం విశేషం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, 1 ఎంజీ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారంలపై ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చని డాక్టర్ జోత్సేందు తెలిపారు. దీర్ఘకాలం పాటు వైరస్ వంటి సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించే డ్యూరోకియాను ఆపరేషన్ థియేటర్లతో పాటు ఐసీయూల్లోనూ ఉపయోగించవచ్చని, నానోటెక్నాలజీ సాయంతో ఇలాంటి ఉత్పత్తిని తయారు చేయడం ఇదే తొలిసారని వివరించారు. నానోస్థాయి కోటింగ్ కారణంగా కరోనా వైరస్ వంటివి దాదాపు నెల రోజుల పాటు ఆయా ఉపరితలాలపై ఉండలేవని, తద్వారా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెప్పారు. డ్యూరోకియా ఉత్పత్తులను ఇప్పటికే దేశంలోని పలు ప్రభుత్వ పరిశోధనశాలల్లో విజయవంతంగా పరిక్షించామని తెలిపారు. కార్యక్రమంలో ఐఐటీ బోర్డ్ ఆఫ్ గవర్నెర్స్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, ఈఎస్ఐ మెడికల్ కాలేజీ వ్యవస్థాపక డీన్ ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు. చదవండి: ఇప్పుడు కూడా కార్పొరేట్ యాజమాన్యాల కక్కుర్తి..! -
నానో.. అన్నీ సాధ్యమే
గాల్లోని కార్బన్డయాక్సైడ్.. పెట్రోలు, డీజిల్‌గా మారిపోతే.. సముద్రపు ఉప్పునీరు చిటికెలో మంచినీరైపోతే.. మందుల ఫ్యాక్టరీ మొత్తం చిన్న పెట్టెలో ఇమిడిపోతే.. ఇవన్నీ అతి తక్కువ ఖర్చుతో ఏమాత్రం శ్రమ లేకుండా జరిగిపోతే.. అంతా బాగానే ఉందిగానీ ఇదంతా జరిగేపనేనా అనుకుంటున్నారా.. ఇంకొన్నేళ్లు ఆగండి.. నానో టెక్నాలజీతో జరిగే ఆ అద్భుతాలు చూసి ‘వావ్’.. అనక మానరు! ఒకప్పుడు అసాధ్యమనుకున్న పనులు ఇకపై చాలా సింపుల్‌గా జరుగుతాయని చెబుతోంది అమెరికా కంపెనీ మ్యాటర్‌షిఫ్ట్!. ఈ మధ్యే వీళ్లు కార్బన్ నానో ట్యూబ్‌లతో ఓ ఫిల్టర్ తయారు చేశారు. దీన్నిగాని వాడారంటే.. ఈ భూమ్మీద పరిష్కరించలేని సమస్య అంటూ ఉండదని చెబుతున్నారు. అబ్బో.. అంతగొప్పదా ఈ ఫిల్టర్.. అనుకుంటున్నారా? వివరంగా తెలుసుకోండి.. తర్వాత మీరే అంటారు.. ‘అబ్బో’ అని!! – సాక్షి హైదరాబాద్ ఏమిటీ కార్బన్ నానో ట్యూబ్! కార్బన్ నానో ట్యూబ్.. క్లుప్తంగా చెప్పుకుంటే అతి సూక్ష్మమైన గొట్టం. ఎంత సూక్ష్మమంటే.. వెంట్రుకలో యాభై వేల నానో ట్యూబ్‌లు ఇమిడిపోతాయి. వజ్రాల మాదిరి కార్బన్‌తో తయారవుతుంది కాబట్టి ఈ గొట్టాలు దృఢంగా ఉంటాయి. సూక్ష్మాతి సూక్ష్మం కాబట్టి వీటి ద్వారా నిర్దిష్ట పరిమాణంలోని అణువులే ప్రయాణించగలవు. ఇన్ని మంచి లక్షణాలున్నా ఈ ట్యూబ్‌ల తయారీలో ప్రధానమైన చిక్కుంది. భారీ సైజులో తయారు చేయడం చాలా కష్టం. అందుకే ఇప్పటివరకూ చాలా మంది శాస్త్రవేత్తలు పరిమిత స్థాయిలోనే తయారు చేసి.. వాటితో చేయగల అద్భుతాల గురించి చెబుతూ వచ్చారు. మ్యాటర్‌షిఫ్ట్ కంపెనీ మాత్రం ఈ ఇబ్బందులన్నీ అధిగమించింది. ఫలితంగా కార్బన్ నానో ట్యూబ్‌ల ఫిల్టర్లను భారీ సైజులో తయారు చేయడం మొదలుపెట్టింది. ఇళ్లల్లో నీటి శుద్ధి కోసం రివర్స్ ఆస్మాసిస్ ఫిల్టర్లు వాడుతూంటాం కదా.. కార్బన్ నానో ట్యూబ్ ఫిల్టర్లూ అచ్చం ఇలాగే ఉంటాయి. పిసరంత స్థలంలో కోట్లకు కోట్లు మ్యాటర్ షిఫ్ట్ తయారు చేస్తున్న ఫిల్టర్లలో ఎన్ని కార్బన్ నానో ట్యూబ్‌లు ఉంటాయో తెలుసా? ఒక్కో చదరపు మీటర్లో 250 లక్షల కోట్లు! కార్బన్ నానో ట్యూబ్‌లను మనకు కావల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ల ద్వారా ఉప్పు నీటిని మంచినీటిగా మార్చుకోవడం మొదలు ఎక్కడికక్కడ మందులు తయారు చేసుకోవడం వరకూ అనేక రకాల పనులకు వాడుకోవచ్చు. ఈ గొట్టాల చివర ఇతర పరమాణువులు అతికించి ఇతర ప్రయోజనాలూ పొందొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నానో టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మ్యాటర్ షిఫ్ట్ ఆవిష్కరణ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కార్బన్ నానో ట్యూబ్‌ల ఫిల్టర్లు అణుస్థాయిలో ఫ్యాక్టరీలుగా పనిచేస్తూ కొత్త, వినూత్న పదార్థాలను తయారు చేయగలవంటున్నారు. ఏమేం చేయొచ్చంటే.. కార్బన్ నానో ట్యూబ్ ఫిల్టర్లతో సాధ్యం కాని పనంటూ ఏదీ లేదని ముందే చెప్పుకున్నాం. ప్రస్తుతానికి మాత్రం గాల్లోంచి కార్బన్డయాక్సైడ్ పీల్చుకొని పెట్రోలు, డీజిల్ లాంటి ఇంధనాలుగా మార్చేందుకు మ్యాటర్షిఫ్ట్ట్ ప్రయత్నాలు మొదలెట్టింది. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే.. పీల్చుకున్న కార్బన్డయాక్సైడ్, ఇతర లవణాలను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో భవనాల నిర్మాణానికి పనికొచ్చే పదార్థాలుగా కూడా మార్చవచ్చు. ఆస్పత్రులు, ఇతర అవసరమైన ప్రదేశాల్లో గాల్లోంచే ఆక్సిజన్‌ను వేరుచేసి వాడుకునేందుకు వీలవుతుంది. భారీ లోహాలు, ప్రమాదకర రసాయనాలున్న మట్టినీ సులువుగా శుద్ధి చేయొచ్చు. ముఖ్యంగా అత్యంత చవకగా సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేయొచ్చు. ‘నిర్లవణీకరణ’ అనే ఈ ప్రక్రియ చవకగా జరిగితే ప్రపంచవ్యాప్తంగా అనేక వివాదాలు పరిష్కారమవుతాయని తెలిసిందే. ప్రస్తుత పద్ధతుల కంటే కనీసం 4 రెట్లు తక్కువ ఖర్చు నిర్లవణీకరణకు అవుతుందని అంచనా. చవకైన, మెరుగైన వైద్యానికి.. కార్బన్ నానో ట్యూబ్ ఫిల్టర్లను చవకైన, మెరుగైన వైద్యానికి ఉపయోగించుకోవచ్చు. యాంటీబాడీలను వేరు చేయడం మొదలు ఎక్కడికక్కడ మందుల తయారీకి వీటిని వాడుకోవచ్చు. ఒక్కో కార్బన్ నానో ట్యూబ్‌లో సూక్ష్మస్థాయిలో మందులు నింపి అవసరమైన చోటే విడుదలయ్యేలా చేయొచ్చు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న లిథియం అయాన్ బ్యాటరీలతో మరింత ఎక్కువ ప్రయోజనం పొందేందుకూ వీటిని వాడుకోవచ్చు. మనిషి ఇతర గ్రహాలపై జీవించాల్సి వస్తే అక్కడ కూడా ఈ టెక్నాలజీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
నానో దారి... బంగారు దారి!
వచ్చే నెల లండన్‌లో ఓ కార్ రేస్ జరగబోతోంది! ఫార్ములా –1 రేసు కాదండోయ్! అలాగని వింటేజీ కార్ల పోటీ అనుకునేరు అది కూడా కాదు. నానో కార్ల రేసు! ఓహో... టాటా కంపెనీ తయారు చేసే నానో కార్లకు సంబంధించిందనుకుంటూ ఉంటే మీరు మళ్లీ తప్పులో కాలేసినట్లే. ఇది అచ్చమైన నానో వాహనాల పోటీ. అర్థం కావడం లేదా? ఓకే... శాస్త్ర ప్రపంచంలో నానో మీటర్ అంటే ఎంతో తెలుసా మీకు. ఒక మీటర్లో వందకోట్లవ వంతు అన్నమాట. ఇంకోలా చెప్పాలంటే మన వెంట్రుకలో పదోవంతును నానోమీటర్ అంటారు. ఒక హైడ్రోజన్ అణువు దాదాపు 20 నానోమీటర్ల సైజు ఉంటుంది. ఇక వచ్చే నెల 28 – 29 తేదీల్లో ఫ్రాన్స్‌లోని టులూస్ ప్రాంతంలో జరగబోయేది ఈ స్థాయి వాహనాలతో పోటీనే. దాదాపు 36 గంటలపాటు జరిగే ఈ పోటీలో వంద నానోమీటర్ల సైజున్న వాహనాల్లాంటి అణువులు పోటీపడతాయి. అంతేనా! ఈ పోటీలను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు కూడా. ఇందుకోసం అత్యంత సూక్ష్మ వస్తువులను చూసేందుకు ఉపయోగించే టన్నలింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ను వాడుతున్నారు. ఇదంతా ఎందుకూ అన్న సంశయం వెంటాడుతూంటే... నానోటెక్నాలజీతో ఎన్నో ప్రయోజనాలున్న విషయం మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇంత సూక్ష్మస్థాయిలో అణువులను నియంత్రించడం అంత ఆషామాషీ ఏం కాదు. ఇందుకోసం శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి కొత్త కొత్త పద్ధతులను పరీక్షించేందుకే ఈ పోటీ. ఇంతకీ ఈ పోటీకి వాడే ట్రాక్ ఏమిటో తెలుసా? అచ్చమైన బంగారు ఉపరితలం. పోటీ నియమ నిబంధనలూ చాలా స్పష్టం. ఒక్కో కారు 20 నానోమీటర్ల దూరం ప్రయాణించాలి. 45 డిగ్రీల కోణంతో మలుపు తిరిగి మరో 30 నానోమీటర్లు మళ్లీ 45 డిగ్రీల మలుపు తిరిగి ఇంకో 20 నానోమీటర్ల ప్రయాణం... మొత్తమ్మీద వంద నానోమీటర్ల దూరం జరిగే పోటీ. ఈ పోటీలో మొత్తం నాలుగు బృందాలు పాల్గొంటాయి. ఒక్కో బృందానికి ఒక్కో బంగారు ఉపరితలం ఉంటుంది. మొత్తం 36 గంటల్లో వంద నానోమీటర్ల దూరాన్ని పూర్తి చేయాలి. బంగారు ఉపరితలాన్ని శుభ్రం చేసుకునేందుకు ఆరు గంటల సమయం ఇస్తారు. నానోస్థాయి వాహనాలను నియంత్రించేందుకు అత్యంత సూక్ష్మస్థాయి విద్యుత్ ప్రచోదనాలను ఉపయోగిస్తారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నానో టెక్నాలజీకి ఉజ్వల భవిష్యత్తు
ఏయూ క్యాంపస్: నానో టెక్నాలజీకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.ఎస్.అవధాని అన్నారు. మంగళవారం ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కళాశాలల సెంటర్ ఫర్ నానో టెక్నాలజీ నిర్వహించిన ‘నానో ఫ్యూయిడ్స్ అప్లికేషన్స్ ఫర్ హీట్ ట్రాన్స్ఫర్ అండ్ ఎనర్జీ సిస్టమ్స్, సిమ్యులేషన్ యూజింగ్ డీఎఫ్‌డీ’ సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు ప్రపంచ ప్రగతిని మార్చివేస్తున్నాయన్నారు. చిన్నపాటి ఆవిష్కరణలే ఎంతో పేరు తీసుకువస్తాయన్నారు. సదస్సు సమన్వయకర్త ఆచార్య కె.రాంజీ మాట్లాడుతూ నానో ఫ్లూయిడ్స్ అనువర్తనాలను వివరించారు. చైనా, జపాన్‌లు నూతన సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ముందుంటున్నాయన్నారు. మూడు రోజుల సదస్సు ముఖ్యాంశాలను వివరించారు. పాలకమండలి సభ్యుడు ఆచార్య జి.శశిభూషణరావు మాట్లాడుతూ స్టెల్త్ టెక్నాలజీ, సబ్మెరైన్లలో వినియోగిస్తున్న నూతన సాంకేతికతను వివరించారు. పాలక మండలి సభ్యులు ఆచార్య సురేష్ చిట్టినేని మాట్లాడుతూ నూతన ఆవిష్కరణల దిశగా పనిచేయడం ఎంతో అవసరమన్నారు. సాంకేతిక మార్పులు, ఆవిష్కరణలకు అవకాశం ఉన్న అంశాలను వివరించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ట్రిచి) ఆచార్యుడు సురేష్ మాట్లాడుతూ నానో ఫ్లూయిడ్స్‌కు రక్తం మంచి ఉదాహరణన్నారు. శరీర వ్యవస్థలను నానో సాంకేతికతతో అనుసంధానించి వివరించారు. శిక్షణ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతనిధులు పాల్గొన్నారు. -
కేన్సర్‌ను గుర్తించడం ఇక సులభం
వాషింగ్టన్: చాలా దేశాలను కలవరపెడుతోన్న కేన్సర్ మహమ్మారిని చిన్న రక్తపరీక్షతో గుర్తించవచ్చని అమెరికా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. చేతివేలి చివర నుంచి సేకరించిన రక్తాన్ని గ్రహించి అందులోని న్యూక్లిక్ యాసిడ్(ఆర్ఆర్ఎన్ఏ) అమరికను పరిశీలించడం ద్వారా కనుక్కొవచ్చని అమెరికాలోని వేక్‌ఫారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు చె బుతున్నారు. తాము అభివృద్ధి చేసిన నానో టెక్నాలజీ ద్వారా ఆర్ఆర్ఎన్ఏ అమరికను పరిశీలించి కేన్సర్ సహా ఇతర వ్యాధుల గుట్టును తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రారంభదశలో ఉన్న ఈ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేస్తామని అడమ్ హల్ అనే శాస్త్రవేత్త తెలిపారు. -
నానోకు ఏటా నిధులు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సామాజిక సమస్యల పరిష్కారంతో పాటు జీవన నాణ్యతను మెరుగు పరచే క్రమంలో నానోసైన్స్, నానోటెక్నాలజీలను ఏటా నిర్ణీత నిధులతో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భారత రత్న అవార్డు విజేత ప్రొఫెసర్ సీఎన్ఆర్. రావు సూచించారు. నానో అనేది పరమాణువు శాస్త్రీయ కొలమానమని, మనిషి శిరోజం కంటే 50 వేల వంతులు చిన్నదిగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక్కడి అశోకా హోటల్లో గురువారం ప్రారంభమైన ‘ఆరో బెంగళూరు ఇండియా నానో’లో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తు సైన్స్‌గా విభిన్న రంగాల్లో ప్రజలకు ప్రయోజనాలను అందించే సామర్థ్యం నానో టెక్నాలజీకి ఉందని తెలిపారు. నానో గొప్పదనాన్ని ఆయన వివరిస్తూ, ‘ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు నానో ముక్కును అభివృద్ధి పరిచారు. ఈ ముక్కు ద్వారా తుమ్మితే కేన్సర్ రోగిలోని కేన్సర్ అణువులు బయట పడతాయి’ అని వివరించారు. నానో పార్కు రాష్ర్టంలో నానా టెక్నాలజీ అభివృద్ధికి నానో పార్కును స్థాపించనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరు ఇండియా నానోను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ, నానో టెక్నాలజీ అభివృద్ధికి అవసరమైన ప్రాథమిక సదుపాయాలను కల్పిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన సీఎన్ఆర్. రావును ఇండియా నానో సైన్స్-2013 పురస్కారంతో సత్కరించారు. -
భారతీయ అమెరికన్ విద్యార్థికి ప్రతిష్టాత్మక అవార్డు
నానో టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేసిన భారతీయ అమెరికన్ విద్యార్థి సౌమిల్ బంధోపాధ్యాయ(18)కు ప్రతిష్టాత్మక స్మిత్సోనియన్ మ్యాగ జైన్ ‘అమెరికన్ ఇంజెన్యూటీ అవార్డు’ లభించింది. ఆటోమొబైల్స్ మొదలుకొని ఖగోళశాస్త్రం వరకూ ఎంతో ఉపయోగపడనున్న ‘ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ డిటెక్టర్’ను ఆవిష్కరించినందుకుగాను సౌమిల్‌కు ఈ అవార్డు దక్కింది. సౌమిల్తో సహా ఈ రెండో వార్షిక అమెరికన్ ఇంజెన్యూటీ అవార్డులకు 10 మంది ఎంపిక కాగా, వారికి గతనెలలో అవార్డుల ప్రదానం జరిగిందని ఈ మేరకు ‘స్మిత్సోనియన్ మ్యాగజైన్’ డిసెంబరు సంచికలో కథనం ప్రచురించింది. వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కుమారుడు, మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో మొదటేడాది గ్రాడ్యుయేట్ విద్యార్థి అయిన సౌమిల్ అతిపిన్న వయసులోనే విశేష తెలివితేటలు (ఇంజెన్యూటీ) కనపర్చాడని పత్రిక ప్రశంసించింది. కాగా పరారుణ కిరణ రేడియేషన్‌ను గుర్తించే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ డిటెక్టర్లు పనిచేయాలంటే వాటిని ఖరీదైన ద్రవ నైట్రోజన్ ట్యాంకులతో చల్లబర్చాల్సి ఉంటుంది. కానీ సౌమిల్ కనుగొన్న డిటెక్టర్ మాత్రం గది ఉష్ణోగ్రతతో పనిచేయడం వల్ల చాలా చౌకగానే అందుబాటులోకి రానుంది. పొగమంచు, చీకటిలో కార్లు, ఇతర వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టకుండా కూడా ఈ డిటెక్టర్ ఉపయోగపడనుండటంతో వాహన ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు వీలుకానుంది. మందుపాతరలను గుర్తించేందుకు, భూతాపోన్నతి పర్యవేక్షణకు, నక్షత్రాల జననాన్ని పరిశీలించేందుకూ ఇది ఉపయోగపడనుంది. శాస్త్రీయ పరిశోధనలకు, సైన్యానికి, ప్రజలకూ ఉపయోగపడే ఈ డిటెక్టర్‌పై అమెరికా ఆర్మీ సైతం ఆసక్తి వ్యక్తంచే యడం విశేషం.