సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మార్పులు చేసింది. జనవరి 6 నుంచి 20 వరకు నిర్వహించాల్సిన పరీక్షలను జనవరి 8 నుంచి 12 వరకు నిర్వహిస్తామని ఎన్‌టీఏ ప్రకటించింది. పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసిన విద్యార్థులు తక్కువగా ఉండటంతో ఈ మేరకు మార్పులు చేసినట్లు తెలిపింది.
దేశవ్యాప్తంగా 273 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించేలా ఇదివరకే షెడ్యూల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి రెండు గంటల ముందునుంచే అనుమతిస్తారు. కచ్చితంగా గంట ముందుగా విద్యార్థులు కేంద్రంలోకి వెళ్లాల్సిందేనని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. ఇక హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని పేర్కొంది. ఇందుకోసం jeemain@inta@nic.in ఈ మెయిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. హాల్‌టికెట్ లేకుండా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment