రేపట్నుంచి జేఈఈ మెయిన్‌–2 | JEE Main-2 from 16th March | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి జేఈఈ మెయిన్‌–2

Published Mon, Mar 15 2021 5:26 AM | Last Updated on Mon, Mar 15 2021 5:26 AM

JEE Main-2 from 16th March - Sakshi

సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ రెండో విడత పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. రెండో విడత పరీక్షలకు 5 లక్షల మంది వరకు విద్యార్థులు రిజిస్టర్‌ అయ్యారు. జేఈఈ మెయిన్‌ను 2021 నుంచి నాలుగు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 4 రోజుల చొప్పున మేలో 5 రోజుల పాటు ఈ పరీక్షలను కంప్యూటరాధారితంగా నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గతంలో ప్రకటించింది.

ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు తొలి విడత పరీక్షలను నిర్వహించింది. ఆ సెషన్‌కు 6.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మార్చి సెషన్‌ను 15 నుంచి 18 వరకు నిర్వహించేందుకు తొలుత షెడ్యూల్‌ ఇచ్చారు. రెండో విడత పరీక్షలకు రిజిస్టర్‌ అయిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో మార్చి సెషన్‌ పరీక్షలను మూడు రోజులకు కుదించారు. 16 నుంచి 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఏపీ నుంచి 53 వేల మంది రెండో విడత పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్రంలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెంలలో పరీక్ష నిర్వహించనున్నారు.

కోవిడ్‌ నిబంధనలు పాటించాల్సిందే..
పరీక్షల నిర్వహణలో కోవిడ్‌–19 నియమాలను పాటించేలా ఎన్‌టీఏ చర్యలు చేపట్టింది. సిబ్బందితో పాటు పరీక్షలురాసే వారంతా తప్పనిసరిగా మాసు్కలు ధరించి రావాలి. సిబ్బందికి గ్లౌజ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలను శానిటైజేషన్‌ చేయిస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే వారు తమతో పాటు పారదర్శక బాటిళ్లలో ఉండే శానిటైజర్‌ తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నారు. అలాగే పారదర్శక బాటిళ్లతో మంచినీరు, పారదర్శకంగా ఉండే బాల్‌పెన్నులను కూడా అభ్యర్థులు తెచ్చుకోవచ్చు. సెల్‌ఫోన్లు, డిజిటల్‌ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. మొదటి సెషన్‌ ఉదయం 9 నుంచి 12 వరకు, రెండవ సెషన్‌ మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 7.30 నుంచి 8.30 గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. వారి అడ్మిట్‌ కార్డుతోపాటు ఫొటో ఐడెంటిటీ కార్డును తెచ్చుకోవాలి. పరీక్షలకు సంబంధించి రఫ్‌వర్కు చేయడానికి అవసరమైన పత్రాలను పరీక్ష కేంద్రాల్లోనే ఇస్తారు. వాటిని తిరిగి పరీక్ష పత్రాలతోపాటు ఇన్విజిలేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement