బ్రిక్ దేశాలతో ఒప్పందం
విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి
కొత్త పీహెచ్‌డీ కోర్సులకు అవకాశం
హన్మకొండ (వరంగల్) : వరంగల్‌లోని నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) మరో సువర్ణ అవకాశాన్ని దక్కించుకుంది. ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా వంటి దేశాలకు చెందిన ప్రఖ్యాత వర్సిటీలతో నిట్‌కు ఒప్పందం కుదిరింది. ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమాఖ్య బ్రిక్ (బ్రెజిల్, రష్యా, ఇండియ, ైచైనా, దక్షిణాఫ్రికా)ల మధ్య విద్యా సంబంధమైన అంశాల్లో నెట్‌వర్క్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని గతేడాది నిర్ణయించగా, బ్రిక్ దేశాల నెట్‌వర్క్ యూనివర్సిటీలో నిట్ వరంగల్ చోటు దక్కింది.
గత నెలలో రష్యాలో జరిగిన సమావేశంలో ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. బ్రిక్ నెట్‌వర్క్ వర్సిటీలో చోటు దక్కడం వల్ల నెట్‌వర్క్‌లో ఉన్న వర్సిటీల మధ్య కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంశాల్లో పరస్పరం సహకరించుకుంటాయి. అంతేకాకుండా నిట్ వరంగల్ వర్సిటీకి చెందిన విద్యార్థులు బ్రిక్ నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర వర్సిటీల్లో ఒక సెమిస్టర్ చదివేందుకు అర్హులు అవుతారు. ఇదే పద్ధతిలో బ్రిక్ సభ్యదేశాలకు చెందిన విద్యార్థులు నిట్ వరంగల్‌లో ఒక సెమిస్టర్ చదువుకోవచ్చు. విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర వర్సిటీలో బోధించవచ్చు. విదేశీ ప్రొఫెసర్లు నిట్ వర్సిటీలో ప్రత్యేక బోధన చేసేందుకు అనుమతి లభిస్తుంది. బ్రిక్ దేశాల ఆర్థిక ప్రగతికి ఆయా దేశాల్లోన్ని శాస్త్ర సాంకేతిక రంగాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. సరికొత్త ఆవిష్కరణలు, వినూత్న ఆలోచనలతో బ్రిక్ దేశాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి.
ఈ దేశాలకు చెందిన ప్రముఖ విద్యాసంస్థలకు మనదేశానికి చెందిన విద్యార్థులు, అధ్యాపకులను పంపడం వలన కొత్త విషయాలను స్వయంగా నేర్చుకునేందుకు వీలవుతుంది. కంప్యూటర్ సైన్స్‌తో పాటు పర్యావరణంలో మార్పు, నీటి వనరులు, కాలుష్య నియంత్రణ, ఆర్థికరంగం వంటి అంశాల్లోనూ కలిసికట్టుగా పని చేయాలని నిర్ణయించారు. ఈ అంశాల్లో పీహెచ్‌డీలతో పాటు షార్ట్‌టర్మ్, సర్టిఫికెట్ కోర్సులను నిట్ వరంగల్ విద్యార్థులు నెట్‌వర్క్ పరిధిలో విశ్వవిద్యాలయాల్లో చేయవచ్చు. నెట్‌వర్క్ పరిధిలో ఇతర దేశాల్లో కోర్సులు, సెమిస్టర్ చదివేందుకు ఎంపికైన విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సాయం లభిస్తుంది.