
ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ఈసారీ వేర్వేరు పరీక్షలే!
జాతీయ స్థాయి విద్యాసంస్థలైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాలకు ఈసారి కూడా వేర్వేరు పరీక్షలు..
* ఇంటర్ మార్కులకు వెయిటేజీని మాత్రం ఎత్తివేసే అవకాశం?
* 2017 నుంచి ఒకే పరీక్ష, ఒకే ర్యాంకు, ఒకే కౌన్సెలింగ్ అమలు
* జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు వేర్వేరు వెబ్‌సైట్లు... 'అడ్వాన్స్‌డ్' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన గౌహతి ఐఐటీ
* త్వరలో జేఈఈ మెయిన్ వెబ్‌సైట్ ప్రారంభం
* వచ్చే వారంలో స్పష్టత.. వెంటనే నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యాసంస్థలైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాలకు ఈసారి కూడా వేర్వేరు పరీక్షలు, వేర్వేరు కౌన్సెలింగ్ జరగనున్నాయి. ఒకే పరీక్ష, ఒకే ర్యాంకు, ఒకే కౌన్సెలింగ్ విధానం వచ్చే ఏడాది (2017) నుంచే అమలుకానుంది. ఈ ఏడాదికి పాత విధానంలోనే వేర్వేరుగా పరీక్షలు నిర్వహించి, ప్రవేశాలు చేపట్టేందుకు ఎన్‌ఐటీ, ఐఐటీల ప్రవేశాల కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ మేరకు 2016లో ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహించే గౌహతి ఐఐటీ... దీనికోసం ప్రత్యేకంగా అధికారిక అడ్మిషన్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
ఐఐటీ ప్రవేశాలకు సంబంధించిన సాధారణ నిబంధనలు, ఫీజులు, పరీక్ష సమయం, ఇతర మార్గదర్శకాలను అందులో పొందుపరిచింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఏ అభ్యర్థి అయినా రెండుసార్లు మాత్రమే, అదికూడా వరుసగా రెండు సంవత్సరాల్లోనే హాజరుకావచ్చన్న విషయాన్ని స్పష్టం చేసింది. అలాగే ఎన్‌ఐటీల ప్రవేశాల ప్రక్రియను త్వరలోనే తెలియజేస్తామన్న సమాచారాన్ని కూడా ఈ వెబ్‌సైట్లో పొందుపరిచింది. కాగా జేఈఈ మెయిన్ తుది ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు ఇస్తున్న 40 శాతం వెయిటేజీని ఎత్తివేసే ప్రతిపాదనను మాత్రం ఈసారికి అమలుచేసే అవకాశం ఉందని ఐఐటీ డెరైక్టర్ ఒకరు వెల్లడించారు.
తప్పని ఇబ్బందులు..
ఐఐటీ, ఎన్‌ఐటీలకు వేర్వేరు పరీక్షల విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తల్లిదండ్రులు, విద్యార్థులపై ఒత్తిడి పెరిగిపోతోందనే వాదనలున్నాయి. దీనికితోడు ఆయా సంస్థలో సీట్లు మిగిలిపోతున్న నేపథ్యంలో ఒకే పరీక్ష విధానం అమల్లోకి తేవాలని కేంద్ర మానవ వనరుల శాఖ ప్రతిపాదించింది. దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో ఈ నెల 1న వరంగల్ నిట్‌లో జరిగిన ఎన్‌ఐటీల కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. దీంతోపాటు జేఈఈ మెయిన్ తుది ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ అవసరం లేదన్న అంశంపైనా చర్చ జరిగింది. ఈ రెండు అంశాలపై అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి, నవంబర్ మొదటివారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఈ నెల 6న ముంబైలో జరిగిన ఐఐటీల కౌన్సిల్ సమావేశం సందర్భంగా కూడా రెండు రకాల పరీక్షల విధానంపై చర్చించి.. ఐఐటీల డెరైక్టర్లతో నిపుణుల కమిటీని నియమించారు. అయితే ఈ రెండు కమిటీల నివేదికలు ఇంకా కేంద్రానికి అందలేదు. గడువు మేరకు వచ్చే వారంలో ఎన్‌ఐటీ, ఐఐటీల నిపుణుల కమిటీలు నివేదికలు అందజేసినా... కొత్త విధానాన్ని 2017లోనే అమలు చేసే అవకాశముంది.
ఏప్రిల్ 4న జేఈఈ మెయిన్.. మే 22న జేఈఈ అడ్వాన్స్‌డ్!
ఎన్‌ఐటీ, ఐఐటీ వర్గాల సమాచారం ప్రకారం 2016 ఏప్రిల్ 4 న జేఈఈ మెయిన్ పరీక్షను, మే 22న లేదా 24న అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జేఈఈ మెయిన్ నోటిఫికేషన్‌ను నవంబర్ మొదటివారంలో జారీ చేసే అవకాశం ఉంది. అప్పటి నుంచి డిసెంబర్ చివరివరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఏప్రిల్ 4న పరీక్ష నిర్వహించి జూలై మొదటి వారంలో ఫలితాలను వెల్లడించవచ్చు. అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలను జూన్ మూడో వారంలో ప్రకటించే అవకాశం ఉంది.