2025 జనవరి సెషన్‌కు 12లక్షల మంది దరఖాస్తు
జేఈఈ పరీక్షల్లో కీలక మార్పులు చేసిన ఏన్టీఏ
దేశంలోని 16 పట్టణాల్లో పరీక్షా కేంద్రాల తొలగింపు
ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్‌లలోను రద్దు
బహ్రెయిన్, జర్మనీ, ఇండోనేషియా, యూఏఈలలో ఏర్పాటు
ఏపీలోని 11 నగరాల్లో పరీక్షా కేంద్రాల తొలగింపు
సాక్షి, అమరావతి: దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షకు ఈ ఏడాది కూడా దరఖాస్తుల జోరు కొనసాగింది. జేఈఈ మెయిన్–2025 జవనరి సెషన్ కోసం సుమారు 12 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. జవనరి 22 నుంచి 31వరకు తొలి సెషన్, ఏప్రిల్ 1 నుంచి 8 వరకు రెండో సెషన్ పరీక్షలకు షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. విద్యార్థులు జనవరి 19 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం జనవరి సెషన్‌కు అక్టోబర్ 28 దరఖాస్తుల విండో ప్రారంభమైనా... మొదటి రెండు వారాల్లో కేవలం 5.10లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. కొత్త విధానాలు, అర్హత ప్రమాణాల మార్పులు విద్యార్థులను గందరగోళానికి గురిచేసినట్లు నిపుణులు చెబుతున్నారు. దరఖాస్తు సమయంలో కొన్ని పత్రాలు ప్రత్యేకంగా అప్‌లోడ్ చేయాల్సి రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అయినా చివరికి ఈ నెల 22వ తేదీన గడువు ముగిసే నాటికి 12లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. గత ఏడాది కంటే దరఖాస్తులు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తున్నప్పటికీ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్టీఏ ప్రకటించాల్సి ఉంది.
ఐచ్ఛిక ప్రశ్నలు, వయసు పరిమితి తొలగింపు..
కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన జేఈఈ మెయిన్ పరీక్షల్లో సెక్షన్–బీలోని ఐచ్ఛిక ప్రశ్నల విధానాన్ని ఎన్టీఏ తొలగించింది. ఇప్పుడు సెక్షన్–బీలోని ప్రతి సబ్జెక్టులో పది ప్రశ్నలకు బదులు ఐదు ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. మరోవైపు న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ పద్ధతిని తీసుకొచ్చింది. అంటే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల మాదిరిగానే ప్రతి తప్పు సమాధానానికి మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది. ఎన్టీఏ కొత్తగా వయోపరిమితిని సైతం సడలించింది. 12వ తరగతి విద్యా అర్హత కలిగిన ఎవరైనా ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
టై బ్రేక్ రూల్స్ మార్పు...
– జేఈఈ మెయిన్–2025లో ఒకే మార్కులు వచ్చినప్పుడు అభ్యర్థుల ర్యాంకుల టై బ్రేక్ రూల్స్‌ను ఎన్టీఏ సవరించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం పరీక్ష రాసేవారి వయసు, దరఖాస్తు సంఖ్యను ర్యాంకింగ్ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోరు.
– విద్యార్థులు ఒకే మొత్తం స్కోర్‌ను సాధిస్తే సబ్జెక్టులలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు.
– గణితంలో ఎక్కువ స్కోరు సాధించిన అభ్యర్థులు టై సమయంలో ఉన్నత ర్యాంక్ పొందుతారు.
– గణితంలోను ఒకే మార్కులు వచ్చినప్పుడు ఫిజిక్స్‌లో ఎక్కువ స్కోర్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ కూడా ఒకే మార్కులు సాధిస్తే కెమిస్ట్రీ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
– వీటి ద్వారా టై సమస్య కొలిక్కి రాకపోతే అన్ని సబ్జెక్ట్‌లలో సరైన సమాధానాలకు, సరికాని సమాధానాల నిష్పత్తి తక్కువగా ఉన్న అభ్యర్థులకు ఉన్నత ర్యాంక్ కేటాయిస్తారు. వీటిల్లోను నిష్పత్తి టై అయితే గణితం, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో వరుసగా సరికాని సమాధానాల నిష్పత్తులను గుర్తిస్తారు.
– ఈ అన్ని దశల తర్వాత కూడా టై మిగిలి ఉంటే అభ్యర్థులకు అదే ర్యాంక్ కేటాయిస్తారు.
దేశ, విదేశాల్లో తగ్గిన పరీక్ష కేంద్రాల నగరాలు..
దేశంలో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించే నగరాలను 300 నుంచి 284కి తగ్గించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పరీక్షను నిర్వహించే నగరాలను 24 నుంచి 14 కుదించారు. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్ వంటి దేశాల్లో ఎన్టీఏ పరీక్ష కేంద్రాలను తొలగించింది. కొత్తగా బహ్రెయిన్, జర్మనీ, ఇండోనేషియా, ఏయూఈలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 11 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను తొలగించడంతోపాటు మరికొన్ని నగరాల్లో సెంటర్లను తగ్గించారు. తెలంగాణాలో రెండు కొత్తగా రెండు నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ఏపీలో పరీక్షా కేంద్రాలు ఇవే...
అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం.
ఏపీలో పరీక్ష కేంద్రాలు తొలగించిన పట్టణాలు
అమలాపురం, బొబ్బిలి, చీరాల, గుత్తి, గుడ్లవల్లేరు, మదనపల్లె, మార్కాపురం, పుట్టపర్తి, పుత్తూరు, తాడిపత్రి, తిరువూరు.
Comments
Please login to add a commentAdd a comment