జేఈఈ మెయిన్ విద్యార్థులకు దరఖాస్తు కష్టాలు
ఆధార్ కార్డులో పేరుతో టెన్త్ సర్టిఫికెట్‌కు ముడి
రెండింటిలోను ఒకేలా ఉండాలని ఎన్‌టీఏ నిబంధన
ఆధార్ గుర్తింపు కార్డు మాత్రమేనని కేంద్రం చెప్పినా డోంట్‌కేర్
జేఈఈ మెయిన్–2025 మొదటి సెషన్ దరఖాస్తుకు 22 వరకు గడువు
ఆధార్ కార్డులో సవరణల కోసం ఇంటర్ విద్యార్థుల ప్రదక్షిణలు
ప్రభుత్వం నుంచి పొందే సేవలన్నింటినీ ఆధార్‌తో ముడిపెట్టడంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నత విద్య, ఉద్యోగ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలోను ఆధార్ కార్డునే పరిగణనలోకి తీసుకుంటుండడం అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. ఆధార్ కార్డును గుర్తింపు ధ్రువీకరణగా మాత్రమే చూడాలని కేంద్రం స్పష్టం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ఆధార్ సమస్య వేధిస్తోంది.
జనవరిలో జరగనున్న జేఈఈ మెయిన్–2025 మొదటి సెషన్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు గడువు ఈనెల 22న ముగియనుంది. దరఖాస్తు చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనలు విద్యార్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. ప్రధానంగా ఆధార్ కార్డులోను, టెన్త్ సర్టిఫికెట్‌లోను విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, చిరునామా ఒకే విధంగా ఉండాలనే నిబంధన చాలా ఇబ్బందిగా మారింది.
ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 20 వేలమందికిపైగా జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకుంటారు. ఆధార్‌కార్డు, టెన్త్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయగానే నేమ్స్ మిస్ మ్యాచ్ అని చూపిస్తోందని ఎక్కువశాతం మంది విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. –గుంటూరు ఎడ్యుకేషన్
ఆధార్ కేంద్రాల వద్ద ఆలస్యం
దీంతో జేఈఈ మెయిన్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు ఆధార్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఒక్క గుంటూరు నగరంలోనే వందలమంది విద్యార్థులు నెలరోజులుగా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. పేర్ల సవరణల కోసం ప్రయత్నిస్తున్నారు.
పేరులో తప్పుల సవరణ, బయోమెట్రిక్ నమోదు, చిరునామా మార్పు ఒకేసారి చేయడం కుదరదని, మరోసారి రావాలని ఆయా కేంద్రాల సిబ్బంది చెబుతుండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దరఖాస్తుకు గడువు సమీపిస్తుండటం వారిని కలవరపరుస్తోంది. ఆధార్‌కార్డులో సవరణలకు 15 రోజుల నుంచి నెలరోజుల సమయం పట్టడం కూడా ఇబ్బందిగా మారింది.
తగినన్నిఆధార్ కేంద్రాలేవి?
జేఈఈ మెయిన్‌తోపాటు ఇంటర్మీడియెట్, అపార్ నమోదు కోసం ఆధార్‌లో సవరణలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తగినన్ని ఆధార్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఎంపిక చేసిన బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనే ఉన్న ఆధార్ కేంద్రాలు ప్రస్తుతం కిటకిటలాడుతున్నాయి.
వివిధ జిల్లాల నుంచి వచ్చి గుంటూరులోని ప్రైవేటు జూనియర్ కళాశాలల హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆధార్ కార్డులో సవరణలు కోసం ఎక్కడో మారుమూల ఉన్న ఊర్ల నుంచి తల్లిదండ్రులు వచి్చ, పిల్లలను వెంటబెట్టుకుని ఆ«ధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.
రోజుల తరబడి ఇక్కడే ఉండాలంటే వారికి కష్టంగా ఉంటోంది. పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సిన విద్యార్థుల సమయం ఆధార్ కేంద్రాల వద్దే గడిచిపోతోంది. దీనికితోడు గుంటూరులో చంద్రమౌళీనగర్‌లోని పోస్టాఫీసులో ఉన్న ఆధార్ కేంద్రాన్ని ఇటీవల మూసేశారు. విద్యార్థుల కోసం ఆధార్ సవరణలకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన జిల్లా అధికారులు తరువాత పట్టించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment