![Andhra girl scores 100 in JEE Main](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/jee%20n.jpg.webp?itok=ccqRagOI)
జేఈఈ మెయిన్‌లో 100 స్కోర్ సాధించిన ఆంధ్రా అమ్మాయి
సాక్షి, అమరావతి: జాతీయ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ సెషన్–1 బీఈ/బీటెక్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని గుత్తికొండ సాయి మనోజ్ఞ 100 పర్సంటైల్ స్కోరుతో అదరగొట్టింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం ఈ ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులు 100 స్కోర్ సాధించగా, వారిలో మనోజ్ఞ ఒక్కరే మహిళ కావడం విశేషం.
రాజస్థాన్ నుంచి అత్యధికంగా ఐదుగురు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరు చొప్పున, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి ఒక్కొక్కరు 100 స్కోర్ సాధించారు. జనవరిలో ఐదు రోజులు నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్ వన్‌కు 13,11,544 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 12,58,136 (95.93శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 304 పట్టణాల్లోని 618 సెంటర్లలో పరీక్ష నిర్వహించినట్టు ఎన్టీఏ పేర్కొంది.
ఇందులో దేశం వెలుపల 15 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. 100 స్కోరు సాధించిన విద్యార్థుల్లో జనరల్ కేటగిరీ నుంచి 12 మంది టాపర్లుగా నిలిస్తే ఇందులో ఏపీకి చెందిన మనోజ్ఞ జనరల్ కేటగిరీతో పాటు మహిళల విభాగంలోనూ టాపర్‌గా నిలిచింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 99.99 పర్సంటైల్‌తో టాపర్‌గా నిలిచాడు.
ఓబీసీ విభాగంలో ఢిల్లీకి చెందిన దక్ష్ (100), ఎస్సీ విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రేయస్ లోహియా (100), ఎస్టీ విభాగంలో రాజస్థాన్‌కు చెందిన పార్థ్ (99.97), దివ్యాంగుల కోటాలో చత్తీస్‌గఢ్‌కు చెందిన అర్షల్ గుప్తా (99.95) టాపర్లుగా నిలిచారు. మాల్ ప్రాక్టీస్‌కు ప్రయత్నించిన 39 మంది విద్యార్థుల ఫలితాలను నిలిపివేసినట్లు ఎన్టీఏ తెలిపింది. ఏప్రిల్‌లో జరిగే రెండో సెషన్ పరీక్షల తర్వాత ఇప్పుడు విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోరును కూడా పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు విడుదల చేయనుంది.
300 మార్కులకు 295 కైవసం చేసుకున్న మనోజ్ఞ
గుంటూరు ఎడ్యుకేషన్: జేఈఈ మెయిన్ సెషన్–1 పరీక్షల్లో గుంటూరుకి చెందిన గుత్తికొండ సాయి మనోజ్ఞ 300 మార్కులకు 295 మార్కులు సాధించి విశేష ప్రతిభ చూపించింది. 100 పర్సంటైల్‌తో అఖిల భారతస్థాయిలో టాపర్‌గా నిలిచింది. మేథమెటిక్స్‌లో 100, కెమిస్ట్రీలో 100, ఫిజిక్స్‌లో 95 మార్కులు సాధించింది. గుత్తికొండ కిషోర్ చౌదరి, పద్మజ కుమార్తె అయిన సాయి మనోజ్ఞ టెన్త్ ఐసీఎస్ఈ సిలబస్‌లో చదివి 600 మార్కులకు గానూ 588 సాధించింది. జూనియర్ ఇంటర్‌లో 470 మార్కులకు 466 కైవసం చేసుకుంది.
తండ్రి కిషోర్ చౌదరి ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తుండగా, తల్లి పద్మజ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేటర్‌గా పని చేస్తున్నారు. ఏప్రిల్‌లో జరిగే జేఈఈ మెయిన్ రెండో సెషన్‌తో పాటు అడ్వాన్స్‌డ్‌కు మనోజ్ఞ సన్నద్ధమవుతోంది. అడ్వాన్స్‌డ్‌లో సాధించే ర్యాంకు ఆధారంగా ఐఐటీలో ఈసీఈ బ్రాంచ్‌లో చేరాలని భావిస్తోంది.
గుంటూరు భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీలో అధ్యాపకులు ఇచ్చిన ప్రణాళికను అనుసరిస్తూ సమయపాలనతో సన్నద్ధం కావడం ద్వారా 100 పర్సంటైల్ సాధించినట్లు మనోజ్ఞ తెలిపింది. తెనాలి వివేక జూనియర్ కాలేజి విద్యార్థి తూనుగుంట్ల వెంకట పవన్‌కుమార్ జేఈఈ మెయిన్ (సెషన్–1)లో 99.37 పర్సెంటైల్‌ను సాధించాడు.
100 స్కోర్ సాధించిన విద్యార్థులు
ఆయుష్ సింఘాల్ (రాజస్థాన్)
కుషాగ్ర గుప్తా (కర్ణాటక)
దక్ష్ (ఢిల్లీ)
హర్ష్ ఝా (ఢిల్లీ)
రజిత్ గుప్త (రాజస్థాన్)
శ్రేయస్ లోహియా (ఉత్తర ప్రదేశ్)
సాక్షం జిందాల్ (రాజస్థాన్)
సౌరవ్ (ఉత్తర ప్రదేశ్)
విషద్ జైన్ (మహారాష్ట్ర)
అర్నవ్ సింగ్ (రాజస్థాన్)
శివం వికాస్ తోహిని వాల్ (గుజరాత్)
గుత్తికొండ సాయి మనోజ్ఞ (ఆంధ్రప్రదేశ్)
ఓం ప్రకాష్ బహేరా (రాజస్థాన్)
బని బ్రాతా మజీ (తెలంగాణ)
Comments
Please login to add a commentAdd a comment