సాక్షి, అమరావతి: ఇటు మెయిన్ తుది ఫలితాలు రాలేదు కానీ.. అటు అడ్వాన్స్‌డ్ పరీక్షల రిజిస్ట్రేషన్లు మాత్రం అప్పుడే మొదలయ్యాయి. జేఈఈ మెయిన్ షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఎన్‌టీఏ విద్యార్ధులను గందరగోళానికి గురి చేస్తోంది. ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి జేఈఈ మెయిన్ 2022 తుది ఫలితాల వెల్లడిలో చోటు చేసుకుంటున్న జాప్యంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శనివారం నాటికే మెయిన్ రెండో సెషన్ ఫలితాలు వెలువడాల్సినా ఆదివారం రాత్రి వరకు కూడా విడుదల కాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు ఆగస్టు 7 నుంచి 11వ తేదీ వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల రిజిస్ట్రేషన్‌కు ముంబై ఐఐటీ షెడ్యూల్ జారీ చేయడమే కాకుండా పోర్టల్ అందుబాటులోకి తేవడం ఈ ఆందోళనను మరింత పెంచుతోంది. మెయిన్ తుది ఫలితాలపై స్పష్టమైన తేదీ, సమయాన్ని ప్రకటించాలని రెండు రోజులుగా విద్యార్థులు సామాజిక మాధ్యమాలు, ఎన్‌టీఏ హెల్ప్‌లైన్ కేంద్రాల ద్వారా విన్నవిస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఫైనల్ కీలో ఆరు ప్రశ్నలు డ్రాప్
శుక్రవారం రాత్రికే విడుదల కావాల్సిన జేఈఈ మెయిన్ 2వ సెషన్ పరీక్ష ఫైనల్ కీ ఆదివారం మధ్యాహ్నానికి కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేయలేదు. రెండో సెషన్ ఫైనల్ కీలో ఆరు ప్రశ్నలను ఎన్‌టీఏ డ్రాప్ చేసింది. ఆయా ప్రశ్నలకు ఒకటికి మించి సరైన సమాధానాలు ఉండడంతో వాటన్నిటినీ డ్రాప్ చేస్తున్నట్లు పేర్కొంది. అయితే తాము ఇచ్చిన సమాధానాల సంఖ్యకు, రెస్పాన్స్ షీట్లలోని సంఖ్యకు వ్యత్యాసం ఉండడంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై పలువురు ఎన్‌టీఏకు నేరుగా, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా విన్నపాలు పంపుతున్నారు.
సాంకేతిక కారణాలతో ఫలితాల విడుదలలో సమస్యలు నెలకొన్నట్లు కోచింగ్ సెంటర్ల ప్రతినిధులు పేర్కొంటున్నారు. కాగా మెయిన్స్ రెండో సెషన్ ప్రొవిజినల్ ఆన్సర్ కీని ఆగస్టు 3వ తేదీన ఎన్‌టీఏ విడుదల చేసింది. దీంతోపాటు విద్యార్థుల రికార్డెడ్ రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేసినా వాటిలోనూ పొరపాట్లు దొర్లాయంటున్నారు.
తొలిసెషన్ ప్రొవిజనల్ కీ తప్పుల తడక
జూన్‌లో నిర్వహించిన తొలిసెషన్‌కు సంబంధించిన ప్రాథమిక కీని ఎన్‌టీఏ జూలై 3వ తేదీన ప్రకటించింది. ఇందులో కొన్ని తేదీల్లో పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇచ్చిన కీ తప్పుల తడకగా ఉంది. ఒక విభాగం కీ వేరొక విభాగానికి జతచేయడంతో గందరగోళానికి గురయ్యారు. 130 నుంచి 200 మార్కులు వస్తాయనుకున్న విద్యార్థులకు 60 మార్కులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎన్‌టీఏకు విన్నపాలు వెల్లువెత్తాయి. అనంతరం ఎన్‌టీఏ ప్రాథమిక కీలో దొర్లిన పొరపాట్లను సవరించి మళ్లీ ప్రకటించింది.
అడ్వాన్స్‌డ్ షెడ్యూల్ జారీ
జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను ఆగస్టు 5 లేదా 6వ తేదీకల్లా ఎన్‌టీఏ విడుదల చేయాల్సి ఉంది. ఇందులో ఉత్తీర్ణులైన టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్సుకు అనుమతిస్తారు. జేఈఈ అడ్వాన్సుడ్‌కు ఆగస్టు 7 నుంచి 11వ తేదీవరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ పరీక్షల నిర్వహణ సంస్థ ఐఐటీ ముంబై షెడ్యూల్ జారీ చేయడమే కాకుండా ఆదివారం నుంచి వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ల పోర్టల్ కూడా అందుబాటులోకి తెచ్చింది.
మూడో విడతకు విన్నపాలు
మరికొందరైతే ఎన్‌టీఏ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ రెండు సెషన్ల సమయంలో వరదలు, వర్షాల వల్ల సరిగా రాయలేకపోయామని, పరీక్షలకు హాజరు కాలేకపోయామని అందువల్ల మరో సెషన్ పరీక్షలకు అవకాశమివ్వాలని అభ్యర్థిస్తున్నారు.
ఆదినుంచి అయోమయమే..
జేఈఈ మెయిన్స్ 2022 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను 2021 నవంబర్ – డిసెంబర్ నాటికే విడుదల చేయాలి. జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి అనంతరం నెల వ్యవధిలో పరీక్షలు చేపట్టాలి. కానీ ఎన్‌టీఏ మార్చి వరకు షెడ్యూల్, నోటిఫికేషన్‌పై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల పేరుతో షెడ్యూల్ ప్రకటించకుండా నాన్చింది. చివరకు మార్చి 1న నోటిఫికేషన్ ఇచ్చి అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది.
జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షలను నాలుగు సెషన్లలో నిర్వహించగా ఈదఫా రెండు సెషన్లకే పరిమితం చేసింది. గతంలో న్యూమరికల్ ప్రశ్నల విభాగంలో మైనస్ మార్కులు లేవు. ఈసారి మాత్రం అన్ని విభాగాలకూ మైనస్ మార్కులను ప్రకటించింది. తొలి సెషన్ పరీక్షల తేదీలపై ఆయా రాష్ట్రాల బోర్డుల పబ్లిక్ పరీక్షలను పరిగణలోకి తీసుకోకుండా ఏప్రిల్ 16 నుంచి 21వ తేదీ వరకు తొలిసెషన్, మే 24 నుంచి 29వ తేదీవరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది.
అయితే ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఇంటర్, ప్లస్ 2 తరగతుల పరీక్షలు అవే తేదీల్లో నిర్వహించేలా అప్పటికే షెడ్యూల్ విడుదలయ్యాయి. జేఈఈ పరీక్షలను కూడా అదే సమయంలో నిర్వహించేలా ఎన్‌టీఏ షెడ్యూల్ ఇవ్వడంతో ఆయా రాష్ట్రాలు తమ బోర్డుల పరీక్షా తేదీల్లో మార్పులు చేసుకున్నాయి. అలా బోర్డులు మార్పులు చేసిన తరువాత ఎన్‌టీఏ మళ్లీ జేఈఈ షెడ్యూల్‌ను సవరించి ఏప్రిల్ 21 నుంచి మే 4వ తేదీవరకు పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. దీంతో ఆయా ఇంటర్ బోర్డులు తమ పరీక్షల షెడ్యూళ్లను మళ్లీ మార్పు చేసుకోవాల్సి వచ్చింది.
ఇలా అవి మార్పులు చేశాక ఎన్‌టీఏ మూడోసారి మళ్లీ జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను మార్చింది. జూన్ 20 నుంచి 29 వరకు తొలి సెషన్, జూలై 21 నుంచి 30 వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఆ పరీక్షలను కూడా షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేదు. తొలిసెషన్‌ను జూన్ 24 నుంచి, రెండో సెషన్‌ను జులై 25 నుంచి చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment