jee mains results
-
జేఈఈ మెయిన్ ఫలితాలపై ఉత్కంఠ
సాక్షి, అమరావతి: ఇటు మెయిన్ తుది ఫలితాలు రాలేదు కానీ.. అటు అడ్వాన్స్డ్ పరీక్షల రిజిస్ట్రేషన్లు మాత్రం అప్పుడే మొదలయ్యాయి. జేఈఈ మెయిన్ షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఎన్టీఏ విద్యార్ధులను గందరగోళానికి గురి చేస్తోంది. ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి జేఈఈ మెయిన్ 2022 తుది ఫలితాల వెల్లడిలో చోటు చేసుకుంటున్న జాప్యంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శనివారం నాటికే మెయిన్ రెండో సెషన్ ఫలితాలు వెలువడాల్సినా ఆదివారం రాత్రి వరకు కూడా విడుదల కాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆగస్టు 7 నుంచి 11వ తేదీ వరకు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల రిజిస్ట్రేషన్‌కు ముంబై ఐఐటీ షెడ్యూల్ జారీ చేయడమే కాకుండా పోర్టల్ అందుబాటులోకి తేవడం ఈ ఆందోళనను మరింత పెంచుతోంది. మెయిన్ తుది ఫలితాలపై స్పష్టమైన తేదీ, సమయాన్ని ప్రకటించాలని రెండు రోజులుగా విద్యార్థులు సామాజిక మాధ్యమాలు, ఎన్టీఏ హెల్ప్‌లైన్ కేంద్రాల ద్వారా విన్నవిస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ కీలో ఆరు ప్రశ్నలు డ్రాప్ శుక్రవారం రాత్రికే విడుదల కావాల్సిన జేఈఈ మెయిన్ 2వ సెషన్ పరీక్ష ఫైనల్ కీ ఆదివారం మధ్యాహ్నానికి కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేయలేదు. రెండో సెషన్ ఫైనల్ కీలో ఆరు ప్రశ్నలను ఎన్టీఏ డ్రాప్ చేసింది. ఆయా ప్రశ్నలకు ఒకటికి మించి సరైన సమాధానాలు ఉండడంతో వాటన్నిటినీ డ్రాప్ చేస్తున్నట్లు పేర్కొంది. అయితే తాము ఇచ్చిన సమాధానాల సంఖ్యకు, రెస్పాన్స్ షీట్లలోని సంఖ్యకు వ్యత్యాసం ఉండడంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై పలువురు ఎన్టీఏకు నేరుగా, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా విన్నపాలు పంపుతున్నారు. సాంకేతిక కారణాలతో ఫలితాల విడుదలలో సమస్యలు నెలకొన్నట్లు కోచింగ్ సెంటర్ల ప్రతినిధులు పేర్కొంటున్నారు. కాగా మెయిన్స్ రెండో సెషన్ ప్రొవిజినల్ ఆన్సర్ కీని ఆగస్టు 3వ తేదీన ఎన్టీఏ విడుదల చేసింది. దీంతోపాటు విద్యార్థుల రికార్డెడ్ రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేసినా వాటిలోనూ పొరపాట్లు దొర్లాయంటున్నారు. తొలిసెషన్ ప్రొవిజనల్ కీ తప్పుల తడక జూన్‌లో నిర్వహించిన తొలిసెషన్‌కు సంబంధించిన ప్రాథమిక కీని ఎన్టీఏ జూలై 3వ తేదీన ప్రకటించింది. ఇందులో కొన్ని తేదీల్లో పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇచ్చిన కీ తప్పుల తడకగా ఉంది. ఒక విభాగం కీ వేరొక విభాగానికి జతచేయడంతో గందరగోళానికి గురయ్యారు. 130 నుంచి 200 మార్కులు వస్తాయనుకున్న విద్యార్థులకు 60 మార్కులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎన్టీఏకు విన్నపాలు వెల్లువెత్తాయి. అనంతరం ఎన్టీఏ ప్రాథమిక కీలో దొర్లిన పొరపాట్లను సవరించి మళ్లీ ప్రకటించింది. అడ్వాన్స్డ్ షెడ్యూల్ జారీ జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను ఆగస్టు 5 లేదా 6వ తేదీకల్లా ఎన్టీఏ విడుదల చేయాల్సి ఉంది. ఇందులో ఉత్తీర్ణులైన టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్సుకు అనుమతిస్తారు. జేఈఈ అడ్వాన్సుడ్‌కు ఆగస్టు 7 నుంచి 11వ తేదీవరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ పరీక్షల నిర్వహణ సంస్థ ఐఐటీ ముంబై షెడ్యూల్ జారీ చేయడమే కాకుండా ఆదివారం నుంచి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ల పోర్టల్ కూడా అందుబాటులోకి తెచ్చింది. మూడో విడతకు విన్నపాలు మరికొందరైతే ఎన్టీఏ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ రెండు సెషన్ల సమయంలో వరదలు, వర్షాల వల్ల సరిగా రాయలేకపోయామని, పరీక్షలకు హాజరు కాలేకపోయామని అందువల్ల మరో సెషన్ పరీక్షలకు అవకాశమివ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఆదినుంచి అయోమయమే.. జేఈఈ మెయిన్స్ 2022 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను 2021 నవంబర్ – డిసెంబర్ నాటికే విడుదల చేయాలి. జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి అనంతరం నెల వ్యవధిలో పరీక్షలు చేపట్టాలి. కానీ ఎన్టీఏ మార్చి వరకు షెడ్యూల్, నోటిఫికేషన్‌పై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల పేరుతో షెడ్యూల్ ప్రకటించకుండా నాన్చింది. చివరకు మార్చి 1న నోటిఫికేషన్ ఇచ్చి అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షలను నాలుగు సెషన్లలో నిర్వహించగా ఈదఫా రెండు సెషన్లకే పరిమితం చేసింది. గతంలో న్యూమరికల్ ప్రశ్నల విభాగంలో మైనస్ మార్కులు లేవు. ఈసారి మాత్రం అన్ని విభాగాలకూ మైనస్ మార్కులను ప్రకటించింది. తొలి సెషన్ పరీక్షల తేదీలపై ఆయా రాష్ట్రాల బోర్డుల పబ్లిక్ పరీక్షలను పరిగణలోకి తీసుకోకుండా ఏప్రిల్ 16 నుంచి 21వ తేదీ వరకు తొలిసెషన్, మే 24 నుంచి 29వ తేదీవరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. అయితే ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఇంటర్, ప్లస్ 2 తరగతుల పరీక్షలు అవే తేదీల్లో నిర్వహించేలా అప్పటికే షెడ్యూల్ విడుదలయ్యాయి. జేఈఈ పరీక్షలను కూడా అదే సమయంలో నిర్వహించేలా ఎన్టీఏ షెడ్యూల్ ఇవ్వడంతో ఆయా రాష్ట్రాలు తమ బోర్డుల పరీక్షా తేదీల్లో మార్పులు చేసుకున్నాయి. అలా బోర్డులు మార్పులు చేసిన తరువాత ఎన్టీఏ మళ్లీ జేఈఈ షెడ్యూల్‌ను సవరించి ఏప్రిల్ 21 నుంచి మే 4వ తేదీవరకు పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. దీంతో ఆయా ఇంటర్ బోర్డులు తమ పరీక్షల షెడ్యూళ్లను మళ్లీ మార్పు చేసుకోవాల్సి వచ్చింది. ఇలా అవి మార్పులు చేశాక ఎన్టీఏ మూడోసారి మళ్లీ జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను మార్చింది. జూన్ 20 నుంచి 29 వరకు తొలి సెషన్, జూలై 21 నుంచి 30 వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఆ పరీక్షలను కూడా షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేదు. తొలిసెషన్ను జూన్ 24 నుంచి, రెండో సెషన్‌ను జులై 25 నుంచి చేపట్టింది. -
జేఈఈ మెయిన్ తొలి విడత.. మనోళ్లే టాపర్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు సహా ఇతర జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు జరిగిన జేఈఈ మెయిన్– 2022 మొదటి విడత ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు విద్యార్థులతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు టాపర్ల జాబితాలో నిలిచారు. రాష్ట్రానికి చెందిన జాస్తి యశ్వంత్ వీవీఎస్, అనికెత్ చటోపాధ్యాయ, ధీరజ్ కురుకుండ, రూపేష్ బియానీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొయ్యన సుహాస్, పెనికలపాటి రవికిషోర్, పోలిశెట్టి కార్తికేయ నూటికి నూరు ఎన్టీఏ స్కోర్ సాధించారు. హరియాణా, జార్ఖండ్, పంజాబ్, అస్సాం, రాజస్తాన్, కర్ణాటక, యూపీకి చెందిన ఒక్కో విద్యార్థి కూడా టాపర్లు గా ఎంపికయ్యారు. మొత్తం 14 మంది విద్యార్థులు టాప్ స్కోర్ సాధించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆదివారం అర్ధరాత్రి దాటాక విడుదల చేసిన ఫలితాల్లో పేర్కొంది. అన్ని కేటగిరీల్లోనూ... అన్ని కేటగిరీల్లోనూ తెలంగాణ, ఏపీ విద్యార్థులు ముందు వరుసలో నిలిచారు. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కోటాలో ఏపీ విద్యార్థి పి.రవి కిషోర్ టాపర్‌గా నిలవగా ఎస్సీ విభాగంలో ఏపీ విద్యార్థి డి. జాన్ జోసెఫ్ 99.99 పర్సంటైల్‌తో మొదటి స్థానంలో సాధించాడు. ఓబీసీ కోటాలో 99.99 పర్సంటైల్‌తో ఏపీ విద్యార్థి సనపాల జస్వంత్ ఐదవ స్థానంలో నిలిచాడు. అలాగే అమ్మాయిల విభాగంలో ఏపీ విద్యార్థినులు టాప్–10లో 5 స్థానాలు సాధించారు. పేపర్ కఠినంగా ఉన్నా... జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష జూన్ 24 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా 588 కేంద్రాల్లో జరిగింది. ఈ పరీక్షకు 8,72,432 మంది దరఖాస్తు చేసుకోగా 7.69 లక్షల మంది పరీక్ష రాశారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షన్నర మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి కారణంగా గత రెండేళ్లపాటు నాలుగు విడతలుగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ను ఈసారి కరోనా తీవ్రత తగ్గడంతో రెండు విడతలుగా జరుగుతోంది. తొలి విడత ఫలితాలు విడుదలవగా రెండో విడత పరీక్ష ఈ నెల 24 నుంచి 30 వరకు జరగనుంది. గత రెండేళ్లుగా సరైన తర్ఫీదు లేకపోవడం, రాష్ట్రాల ఇంటర్ బోర్డులు సిలబస్‌ను 70 శాతానికి కుదించినా, ఎన్టీఏ మాత్రం ఈ వెసులుబాటు ఇవ్వకపోవడంతో ఈసారి పరీక్ష కొంత కఠినంగానే ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ తొలి విడతలో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని గణితశాస్త్ర నిపుణుడు ఎంఎన్ రావు తెలిపారు. తొలి విడత మెయిన్స్ రాయలేకపోయిన వారు లేదా తొలి విడతలో వచ్చిన తమ స్కోర్‌ను మెరుగుపరుచుకోవాలనుకొనే విద్యార్థులు రెండో విడత జేఈఈ మెయిన్స్ రాసుకోవచ్చు. రెండు విడతల పరీక్ష పూర్తయ్యాకే ఎన్టీఏ ర్యాంకులు విడుదల చేయనుంది. సత్తా చాటిన ఎస్సీ, బీసీ గురుకుల విద్యార్థులు... జేఈఈ మెయిన్స్ మొదటి విడత ఫిలితాల్లో రాష్ట్రంలోని ఎస్సీ, బీసీ గురుకుల సొసైటీ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. మొత్తం 581 మంది ఎస్సీ గురుకుల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ రాయగా వారిలో 35 మంది విద్యార్థులు 90 పర్సంటైల్ సాధించినట్లు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెజారిటీ విద్యార్థులకు 40 కంటే ఎక్కువ పర్సంటైల్ వచ్చిందన్నారు. మరోవైపు మొత్తం 60 మంది బీసీ గురుకుల విద్యార్థులు ఈ పరీక్ష రాయగా 23 మంది అర్హులయ్యారు. భరత్‌కుమార్ అనే విద్యార్థి 92.01 పర్సంటైల్ సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, అధ్యాపకులను బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు అభినందించారు. కాగా, జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్‌కు చెందిన గజవాడ శ్రీనివాస్–శ్రీదేవి దంపతుల ఇద్దరు కుమారుల్లో ఒకడైన భరత్ 99.764 పర్సంటైల్ సాధించాడు. ఎన్టీఏ స్కోర్ అంటే... ఈ పరీక్షలో విద్యార్థులకు ప్రకటించిన ఎన్టీఏ స్కోర్, వారికి వచ్చిన మార్కుల శాతం రెండూ ఒకటి కావని ఓ ఎన్టీఏ ఉన్నతాధికారి తెలిపారు. ఒక విడతలో పరీక్ష రాసిన విద్యార్థులందరి సాపేక్ష ప్రతిభా ప్రదర్శన ఆధారంగా స్కోర్ కేటాయిస్తామని... ఇందుకోసం విద్యార్థులు సాధించే మార్కులను 100 నుంచి 0 మధ్య ఉండే స్కేల్‌కు అనుగుణంగా మారుస్తామని చెప్పారు. -
జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సోమవారం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ పేపర్-1 ఫలితాలను, ఆల్ ఇండియా ర్యాంకులను విడుదల చేసింది. తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. విజయవాడకు చెందిన సూరజ్ కృష్ణ ఫస్ట్ ర్యాంకు, విశాఖకు చెందిన హేమంత్‌కు రెండో ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఇక హైదరాబాద్ కు గట్టు మైత్రేయకు ఐదో వచ్చింది. జేఈఈ మెయిన్స్-2018 ఫలితాల వివరాలను jeemain.nic.inలో చూసుకోవచ్చు. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ పరీక్షలకు దేశవ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1.50 లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. మెయిన్స్ కటాఫ్ ద్వారా 2.24 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు అర్హత సాధిస్తారు. వచ్చే నెల 20న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు జరుగుతాయి. సీబీఎస్ఈ బోర్డు సైతం జేఈఈ మెయిన్ 2018 ఫలితాలను cbseresults.nic.in, results.nic.in వెబ్సైట్ల ద్వారా విడుదల చేయనుంది. మెయిన్స్ పేపర్-2 ఫలితాలను వచ్చే నెల 31న సీబీఎస్ఈ విడుదల చేయనుంది. తగ్గుతున్న ఆసక్తి 2015–16 విద్యా సంవత్సరంలో 12.93 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ రాసేందుకు దరఖాస్తు చేసుకోగా, 2018–19లో 11.35 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం ఇందుకు ఉదాహరణ. ఏదో పరీక్ష రాద్దామనే ఉద్దేశంతో కాకుండా సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే విద్యార్థులే దరఖాస్తు చేసుకుంటున్నారని, దరఖాస్తులు తగ్గడానికి అదే కారణమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఇక ప్రవేశాల విషయానికి వస్తే.. నాలుగేళ్ల కిందటి పరిస్థితితో పోల్చితే కొంత మెరుగైనా ఇంకా సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఇంకా మిగులే.. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. గతంలో కంటే సీట్ల మిగులు అధికంగా ఉంటోంది. జేఈఈ మెయిన్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగించడం, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు ఇంటర్ మార్కులు 75% (ఎస్సీ, ఎస్టీలకు 65%) ఉంటే చాలన్న సడలింపు ఇచ్చినా సీట్ల మిగులు తగ్గడం లేదు. సీట్ల మిగులు ఉండకుండా చూసేందుకు మూడేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం వెయిటేజీ తొలగింపు, సడలింపులు వంటి చర్యలు చేపట్టడంతోపాటు ఏడు విడతలుగా ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. అయినప్పటికీ మార్పు రావడం లేదు. 2014–15 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో కేవలం 3 సీట్లు మిగిలిపోగా, 2017–18లో 121 సీట్లు మిగిలిపోయాయి. అడ్వాన్స్‌డ్‌కు అర్హుల సంఖ్య పెంచినా.. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నా పరిస్థితి అలానే ఉంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారిలో టాప్ 1.5 లక్షల మంది విద్యార్థులను గతంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా తీసుకునేవారు. క్రమంగా దాన్ని టాప్ 2 లక్షలకు, టాప్ 2.2 లక్షలకు, ప్రస్తుతం టాప్ 2.24 లక్షలకు పెంచింది. అయినా సీట్ల మిగులు పెరుగుతోంది. అయితే కాన్పూర్, హైదరాబాద్ ఐఐటీల్లో మాత్రం నాలుగేళ్లుగా ఒక్కసీటు కూడా మిగలకపోవడం విశేషం. -
జేఈఈ మెయిన్స్- 2015 ఫలితాల విడుదల
దేశవ్యాప్తంగా ఉన్న పలు ఐఐటీలలో ప్రవేశం కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)- మెయిన్స్ ఫలితాలను సీబీఎస్ఈ సోమవారం సాయంత్రం విడుదల చేసింది. www.cbseresults.nic.in వెబ్సైట్లో ఈ ఫలితాలను ఉంచారు. కేవలం స్కోరు కార్డు మాత్రమే సోమవారం నాడు అందులో ఇస్తున్నారు. ఈ ఏడాది సుమారు 13 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాశారు. వాళ్లలో అర్హత సాధించినవారు మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు రాయడానికి వీలుంటుంది. వాటిలో కూడా మంచి ర్యాంకులు సాధిస్తేనే ఐఐటీలలో ప్రవేశం దక్కుతుంది. ఒకవేళ అడ్వాన్స్డ్ పరీక్షలో మంచి ర్యాంకు రాకుండా.. మెయిన్స్‌లో మాత్రం తగు ర్యాంకు వస్తే వారికి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లలో ప్రవేశం వస్తుంది.