నిట్‌పై మాటా.. మాటా | zp chairman and minicipal chairman fires on nit in thade palli gudem | Sakshi
Sakshi News home page

నిట్‌పై మాటా.. మాటా

Published Mon, Jun 22 2015 12:00 PM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM

నిట్‌పై మాటా.. మాటా

నిట్‌పై మాటా.. మాటా

జెడ్పీ చైర్మన్, తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ వాగ్వాదం
గూడెం, ఏలూరు మద్ధతుదారులుగా తెలుగు తమ్ముళ్లు
పదవి పోయినా ఫర్వాలేదు.. నిట్ గూడెంలోనే : బొలిశెట్టి

 
తాడేపల్లిగూడెం: నిట్ జిల్లాలో తెలుగుదేశం నేతల మధ్య వైరానికి దారి తీస్తోంది. ఏలూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాలకు చెందిన నేతల మధ్య నిట్ నిప్పు పెట్టే సూచనలు కనపడుతున్నాయి. ఏలూరులో నిట్ ఏర్పాటుకు ఒక వర్గం, తాడేపల్లిగూడేనికి నిట్ తేవాలని మంత్రి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో ఒక వర్గం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.  ఏలూరులో నిట్ ఏర్పాటు కావడానికి టీడీపీ నాయకులు చేసిన ప్రయత్నాలు సఫలీకృతమవుతున్న తరుణంలో, మంత్రి మాణిక్యాలరావు ఢిల్లీ పర్యటనతో ఒక్కసారిగా వ్యవహారం మలుపు తీసుకుంది. ఢిల్లీ చేరిన మంత్రి మాణిక్యాలరావుకు కొందరు నిట్‌ను తాడేపల్లిగూడెం రాకుండా ఎలా అడ్డుకున్నారన్న విషయం తేటతెల్లమైంది.

నిట్‌ను ఇక్కడకు తేవాలనే పట్టుదలతో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలవంతమయ్యే తరుణంలో ఆదివారం స్థానికంగా ఇక్కడ జరిగిన ఒక ప్రైవేటు ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు వెళ్లిన ఇద్దరు తెలుగుదేశం నేతల మధ్య నిట్ వేడి పుట్టించింది. ఫంక్షన్ జరిగిన కల్యాణ మండపం వద్ద జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య నిట్, విమానాశ్రయం వ్యవహారాలకు సంబంధించి దాదాపు 40 నిమిషాలపాటు మాటల యుద్ధం సాగింది. ఆ సమయంలో కొందరు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు అక్కడే ఉన్నారు. ఇక్కడ విమానాశ్రయ భూములు ఉండగా, నిట్ ఎందుకని, నిట్  ఏలూరులో ఏర్పాటు చేస్తే తప్పేంటని బాపిరాజు అనడంతో ఘర్షణ మొదలైంది.

తాడేపల్లిగూడెం నిట్ రాకుండా కొందరికి డబ్బులు ఇచ్చి ఆపుతున్నట్టు మాకు తెలిసిందని బొలిశెట్టి అనగా మీరు తెలిసీ తెలియకుండా మాట్లాడకండి, డబ్బులిచ్చి ఆపేస్తే గూడెంకు నిట్ రాకుండా పోతుందా, నన్ను గూడెంకు నిట్ కావాలా, విమానాశ్రయం కావాలా అంటే విమానాశ్రయానికే ఓటు వేస్తానని బాపిరాజు అన్నారు. నేనైతే రెండూ రావాలని కోరుకుంటానని బొలిశెట్టి సమాధానం చెప్పడంతో పాటు, నిట్ ఇక్కడికి రాకుండా ఎవరు ఆపుతున్నారో నాకు తెలుసు, నేను మినిస్టర్ మాణిక్యాలరావు, బీజేపీ నేత వీర్రాజు గారితో కలిసి ఢిల్లీ వెళ్లాను. ఆ సమయంలో మంత్రి గంటా శ్రీనివాస్, ఎంపీ హరిబాబుగారు ఢిల్లీలో ఉన్నారు. నాకు జరుగుతున్న తతంగం తెలుసని బొలిశెట్టి అనడంతోపాటు బాబుగారికి ఏలూరులో నిట్ ఏర్పాటు చేయడమంటే ఆసక్తి ఉందేమోనని అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలా మాట్లాడండి.

ఒంటెత్తు పోకడలతో నడిచే నాయకులు కూడా ప్రయాణం చేయకండి అని బాపిరాజు అనడంతో మాటామాటా పెరిగింది. దీంతో బాపిరాజు అక్కడి నుంచి వెళ్లిపోయారు.  వీరి వాగ్వాదాన్ని కొందరు రికార్డు చేసి పార్టీ నేతలకు వినిపించడంతో విషయం నియోజకవర్గమంతా వ్యాపించింది. దీనిపై మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్‌తో మాట్లాడగా.. తాడేపల్లిగూడెంకు నిట్ రావాలి. ఇక్కడి ప్రజలు నమ్మి మమ్మల్ని గెలిపించారు. నిట్ తేవడానికి మంత్రి మాణిక్యాలరావు కష్టపడుతున్నారు. వచ్చిన అవకాశం వదులుకునేది లేదు. అవసరమైతే పదవీ త్యాగానికైనా సిద్ధపడతా కాని గూడెంలో నిట్ ఏర్పాటు అవుతుంది. మంత్రి కృషి ఫలిస్తుంది ఎవరు అడ్డుపెట్టినా ఆగదు 24 గంటలు ఆగితే నిట్ ఎక్కడో తేలిపోతుందని అని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement