minicipal chairman
-
థియేటర్ల తీరే వేరు..
మహబూబ్‌నగర్ రూరల్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంతో పాటు ముఖ్య పట్టణాల్లోని సినిమా థియేటర్లలో జరుగుతున్న తంతు తెలిసినా అధికారులు ఎందుకో కానీ ఇంతకాలం మామూలుగా తీసుకున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చూద్దాం అన్నట్లు వారు వ్యవహరించిన తీరుతో థియేటర్ల బాధ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉల్లాసం, ఉత్సాహం కోసం సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు పార్కింగ్ రుసుము వసూలు చేయడంతో పాటు తినుబండారాలను ధరలు పెంచి మరీ అమ్ముతుండడంతో ప్రేక్షకులు ఆవేదనకు లోనవుతున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ శుక్రవారం అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా కేంద్రంలోని పలు థియేటర్లలో మునిసిపల్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి పార్కింగ్ రుసుము వసూలు చేయొద్దని ఆదేశించడంతో పాటు తినుబండారాల అమ్మకాలను పరిశీలించారు. అయితే, ఎవరో ఫిర్యాదు చేస్తే తప్ప తనిఖీలు చేయడం కాకుండా తరచుగా పరిశీలించాలని ప్రేక్షకులు కోరుతున్నారు. ఎన్నో నిబంధనలు.. అన్నీ పక్కకే.... సినిమా థియేటర్లలో వాహనాలకు పార్కింగ్ చార్జీ వసూలు చేయొద్దని.. తినుబండారాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించడమే కాకుండా మలమూత్ర విసర్జన శాలలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే, థియేటర్ల బాధ్యులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంతో ప్రేక్షకులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సినిమా థియేటర్లలోకి అడుగుపెట్టింది మొదలు బయటకు వెళ్లే వరకు పలు రకాలుగా దోచుకుంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్కింగ్‌కు చార్జీ వసూలు చేయొద్దని.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు పలుమార్లు హెచ్చరికలు చేసినా జిల్లా కేంద్రంలోని థియేటర్లలో మాత్రం పరిస్థితి మారడం లేదు. ఇక తినుబండారాలపై ఎమ్మార్పీ ముద్రించి అదే ధరకు విక్రయించాల్సి ఉండగా తమకు ఇష్టమైన ధరలు నిర్ణయించి దోపిడీ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు ఇంతకాలం పట్టించుకోలేదు. రెండు శాఖల సంయుక్త ఆధ్వర్యాన.. మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ వెంకటేశం, మున్సిపల్ కమిషనర్ సురేందర్ సంయుక్త ఆధ్వర్యాన తమ సిబ్బందితో కలిసి శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు సినిమా థియేటర్లలో తనిఖీలు చేశారు. తినుబండారాలకు అధిక ధరలు తీసుకోవడం, పార్కింగ్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు గుర్తించి యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నియమ, నిబంధనలను విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేశం మాట్లాడుతూ సినిమా థియేటర్ల యజమానులు పార్కింగ్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. పార్కింగ్ చార్జీలు వసూలు చేయొద్దని, తినుబండారాలు ఎమ్మార్పీకే విక్రయించాలే తప్ప అధిక ధరలు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో గిర్దావర్ క్రాంతికుమార్‌గౌడ్, ఏసీపీ విద్యాసాగర్, పీపీఓ ప్రతాప్ తదితరులు ఉన్నారు. పార్కింగ్ రుసుము వసూలు చేయొద్దు : జేసీ మహబూబ్‌నగర్ న్యూటౌన్: సినిమా హాళ్లు, వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్ రుసుము వసూలు చేయొద్దని జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో శుక్రవారం రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాణిజ్య సంస్థలు, సినిమాహాళ్ల యాజమాన్యం నడుచుకుంటున్నాయా, లేదా అని తరచూ తనిఖీ చేయాలని సూచించారు. జిల్లాలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, జడ్చర్ల, భూత్పూర్, కోస్గి ప్రాంతాల్లో ఉన్న సినిమా హాళ్లలో పార్కింగ్ రుసుము తీసుకోకుండా చూడాలన్నారు. అలాగే, థియేటర్లలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఒక బోర్డును ఏర్పాటు చేసి రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల అధికారుల ఫోన్ నెంబర్లు పొందుపర్చేలా సూచనలు ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ క్రాంతి, డీఎస్పీ గిరిబాబు, ఆర్డీఓలు శ్రీనివాస్, శ్రీనివాసులు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న జేసీ వెంకట్రావు -
ఇక పరిషత్ పోరు..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులను మరో ఆర్నెల్లు కొనసాగిస్తుండడంతో వాయిదా పడ్డాయి. ఓ వైపు పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ సాగుతుండగా.. ఆ వెంటనే మండల, జిల్లా ప్రాదేశిక, పరిషత్‌లు, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి త్వరలోనే పరిషత్‌లు, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. బహుశా మే, జూన్‌లో నిర్వహించవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్‌లో పూర్తయితే ఆ వెంటనే మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన జిల్లా అధికారులు.. ఆ ఏర్పాట్లను కూడా పూర్తిచేయాలన్న ఆదేశాల మేరకు కసరత్తు ప్రారంభించారు. దీంతో రాజకీయ పార్టీల్లో స్థానిక సంస్థల హడావుడి మళ్లీ మొదలైంది. పరిషత్, మున్సిపల్ ఎన్నికలపై మొదలైన రాజకీయ సందడి ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో మళ్లీ స్థానిక ఎన్నికల చర్చ జోరందుకుంది. ఇటీవల మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 313 గ్రామ పంచాయతీలకు 208 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. 39 చోట్ల కాంగ్రెస్, 11 బీజేపీ, నాలుగు టీడీపీ, మూడు సీపీఐ మద్దతుదారులు గెలుచుకోగా.. 48 పంచాయతీల్లో స్వతంత్రులు, ఇతరులు పాగా వేశారు. ఇదే ఊపులో పార్టీ బ్యానర్‌పై జరిగే మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో పాగా వేయాలని టీఆర్ఎస్ నేతలు ఇప్పటినుంచే వ్యూహరచనలో పడ్డారు. 39 పంచాయతీలతోనే సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బలం పెంచుకోవాలన్న తపనతో ఉంది. అయితే పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి కలిసి పోటీ చేస్తుందా..? లేక కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐలు ఎవరికీవారుగా పోటీ చేస్తారా? అన్న అంశాలపై ఇంకా స్పష్టత లేదు. అన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఎవరికీవారుగా ఈ ఎన్నికల్లో ఆసక్తి చూపుతున్న అభ్యర్థులతోపాటు ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన వారికి మరోఛాన్స్ ఇచ్చి సానుభూతి పొందాలనే కొన్ని పార్టీలు యోచిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ఎన్నికల సంఘం మే, జూన్‌లో పరిషత్, పుర, నగరపాలక సంస్థల ఎన్నికల జరుపుతామని ప్రకటించడంతో ఆయా పార్టీలు మళ్లీ గెలుపుగుర్రాల వేటలో పడ్డాయి. జిల్లాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు? కొత్త మున్సిపాలిటీలకు ఈసారే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 817 మండల ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) స్థానాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా పూర్వ కరీంనగర్ నాలుగు జిల్లాలుగా విభజించబడింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా 57 పాత మండలాలు, కొత్తగా ఏర్పడిన 16 మండలాలు వెరసి మొత్తం 73 మండలాలు, 7 రెవెన్యూ డివిజన్లుగా ఆవిర్భవించింది. కొత్త జిల్లాల ఏర్పాటైన తొలి దసరా నుంచే జిల్లాలోని 73 మండలాలను మొత్తం ఏడు జిల్లాలకు విభజించారు. 16 మండలాలతో కరీంనగర్ జిల్లా మిగలగా.. 13 మండలాలతో సిరిసిల్ల, 18 మండలాలతో జగిత్యాల, 14 మండలాలతో పెద్దపల్లి జిల్లా ఏర్పాటయ్యాయి. ఇవిగాకుండా కొత్తగా ఏర్పడిన భూపాలపల్లి జిల్లాలోకి 5, సిద్దిపేటలోకి 4, వరంగల్ అర్బన్ జిల్లాలోకి 3 మండలాలను చేర్చారు. ఇక విభజన తర్వాత కరీంనగర్ జిల్లా 16 మండలాల్లో మొత్తం 180 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు మాత్రం 12 ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన ఇల్లందకుంట, గన్నేరువరం, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని గ్రామాల్లో కూడా ఈ ఎంపీటీసీ స్థానాలే ఉండనున్నాయి. అదేవిధంగా హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల నుంచి సిద్దిపేట, వరంగల్ అర్బన్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కలిసిన మండలాలను మినహాయిస్తే 12 మండలాలకే ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఉన్నారు. దీంతో పాత పద్ధతిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకే ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్ నగరపాలకసంస్థతో పాటు నగర పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారిన హుజూరాబాద్‌కు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీలకు ఈ సారి ఎన్నికలు జరుగుతాయని అధికారవర్గాల సమాచారం. -
లొంగిపోయిన చైర్పర్సన్ ఈశ్వరమ్మ
సూళ్లూరుపేట: నాటకీయ పరిణామాల మధ్య సూళ్లూరుపేట మున్సిపల్ చైర్పర్సన్ గరిక ఈశ్వరమ్మ మంగళవారం తెల్లవారుజామున సూళ్లూరుపేట పోలీసు స్టేషన్లో లొంగిపోయింది. ఈనెల 22వ తేదీ జిల్లా కో–ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ డి.సుధాభారతి ఈశ్వరమ్మ రూ.7,56,66,000 కోట్లు బ్యాంకులకు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడిందని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల నుంచి భర్తతో కలిసి తప్పించుకుని పరారైంది. ఎస్సై కె.ఇంద్రసేనా రెడ్డి, సీఐ కిషోర్‌బాబు రెండు బృందాలుగా ఏర్పడి వారంరోజుల నుంచి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. హోటల్లో దిగి.. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరుకు చెందిన ఓ లాయర్, పలువురు ముఖ్యమైన వ్యక్తులు నాలుగు కార్లలో వచ్చి సూళ్లూరుపేట పట్టణంలోని బైపాస్‌లో ఉన్న ఎంఆర్ గ్రాండ్ హోటల్ దిగారు. ఈశ్వరమ్మ వారితో సమాలోచనలు జరిపారు. అనంతరం లాయర్ సమక్షంలో భర్త ఈశ్వరయ్యతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈశ్వరమ్మ తమిళనాడులోని చెన్నై నగరానికి దూరంగా ఉన్న ఓ మారుమూల గ్రామంలో తలదాచుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా గాలింపు చర్యల్లో ఉన్న సీఐ, ఎస్సైకు పోలీసులు సమాచారం అందించడంతో చెన్నైకు దగ్గరలో ఉన్న ఎస్సై మాత్రం వెంటనే పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐ సాయంత్రానికి సూళ్లూరుపేటకు చేరుకున్నారు. తడ ఎస్సై దాసరి వెంకటేశ్వరరావు ఈశ్వరమ్మ, వనితలను నెల్లూరులోని ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఎదుట హాజరుపరిచారు. -
తాగునీటికి రోడ్డెక్కిన మహిళలు
జూలూరుపాడు : తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మహిళలు గుండెపుడి గ్రామంలో ఆందోళనకు దిగారు. గుండెపుడితండా ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకం పబ్లిక్ ట్యాప్‌ను ఓ వ్యక్తి పగలగొట్టి తీసివేయడంతో మూడు రోజుల నుంచి సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి సమస్య తలెత్తింది. దీంతో తండా ప్రజలకు తాగడానికి బిందెడు నీళ్లు దొరకపోవడంతో ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని మహిళలు భీష్మించుకొని కూర్చున్నారు. ఈఓపీఆర్డీ జగదీశ్వరరావు, ఏఎస్సై కృష్ణారావు, పోలీసు సిబ్బంది వచ్చి ఆందోళన విరమించాలని కోరినా మహిళలు అంగీకరించలేదు. సర్పంచ్ రావాలి, తాగునీటి సమస్య పరిష్కరించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మండుటెండను సైతం మహిళలు లెక్క చేయకుండా రోడ్డుపై ధర్నా కొనసాగించారు. సమస్యను పరిష్కరిస్తానని సర్పంచ్ విజయనిర్మల హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. రాస్తారోకో సుమారు గంటకు పైగా జరగడంతో జూలూరుపాడు–చండ్రుగొండ మధ్య వాహనాల రాకపోకలు నిలిచి పోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పాల్వంచలో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయింపు పాల్వంచ : పట్టణంలోని తెలంగాణనగర్ కాలనీలో మంచినీరు రావడం లేదని, తక్షణం అధికారులు స్పందించి తాగునీరు అందించాలని కాలనీ మహిళలు ఆందోళన చేశారు. శుక్రవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ముందు మహిళలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లా డుతూ వేసవికాలంలో తాగునీరు లేక అల్లాడి పోతున్నామని, మున్సిపాలిటీ నుంచి పంపించే ట్యాంకర్లు ఒకరోజు వస్తే మరొక రోజు రావడం లేదన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల కోసం మంచినీటి పైపులైన్ల జాయింట్లు తొలగించారని, వీటిని నాలుగు నెలలుగా అమర్చక పోవడంతో మంచి ఎద్దడి ఏర్పడిందని అన్నారు. కార్యక్రమంలో కొంగ ఉమ, ఉస్సేన్బీ, రాధ, వెంకటరమణ, శకుంతల, మల్లిక పాల్గొన్నారు. -
నిట్‌పై మాటా.. మాటా
జెడ్పీ చైర్మన్, తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ వాగ్వాదం గూడెం, ఏలూరు మద్ధతుదారులుగా తెలుగు తమ్ముళ్లు పదవి పోయినా ఫర్వాలేదు.. నిట్ గూడెంలోనే : బొలిశెట్టి తాడేపల్లిగూడెం: నిట్ జిల్లాలో తెలుగుదేశం నేతల మధ్య వైరానికి దారి తీస్తోంది. ఏలూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాలకు చెందిన నేతల మధ్య నిట్ నిప్పు పెట్టే సూచనలు కనపడుతున్నాయి. ఏలూరులో నిట్ ఏర్పాటుకు ఒక వర్గం, తాడేపల్లిగూడేనికి నిట్ తేవాలని మంత్రి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో ఒక వర్గం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏలూరులో నిట్ ఏర్పాటు కావడానికి టీడీపీ నాయకులు చేసిన ప్రయత్నాలు సఫలీకృతమవుతున్న తరుణంలో, మంత్రి మాణిక్యాలరావు ఢిల్లీ పర్యటనతో ఒక్కసారిగా వ్యవహారం మలుపు తీసుకుంది. ఢిల్లీ చేరిన మంత్రి మాణిక్యాలరావుకు కొందరు నిట్‌ను తాడేపల్లిగూడెం రాకుండా ఎలా అడ్డుకున్నారన్న విషయం తేటతెల్లమైంది. నిట్‌ను ఇక్కడకు తేవాలనే పట్టుదలతో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలవంతమయ్యే తరుణంలో ఆదివారం స్థానికంగా ఇక్కడ జరిగిన ఒక ప్రైవేటు ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు వెళ్లిన ఇద్దరు తెలుగుదేశం నేతల మధ్య నిట్ వేడి పుట్టించింది. ఫంక్షన్ జరిగిన కల్యాణ మండపం వద్ద జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య నిట్, విమానాశ్రయం వ్యవహారాలకు సంబంధించి దాదాపు 40 నిమిషాలపాటు మాటల యుద్ధం సాగింది. ఆ సమయంలో కొందరు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు అక్కడే ఉన్నారు. ఇక్కడ విమానాశ్రయ భూములు ఉండగా, నిట్ ఎందుకని, నిట్ ఏలూరులో ఏర్పాటు చేస్తే తప్పేంటని బాపిరాజు అనడంతో ఘర్షణ మొదలైంది. తాడేపల్లిగూడెం నిట్ రాకుండా కొందరికి డబ్బులు ఇచ్చి ఆపుతున్నట్టు మాకు తెలిసిందని బొలిశెట్టి అనగా మీరు తెలిసీ తెలియకుండా మాట్లాడకండి, డబ్బులిచ్చి ఆపేస్తే గూడెంకు నిట్ రాకుండా పోతుందా, నన్ను గూడెంకు నిట్ కావాలా, విమానాశ్రయం కావాలా అంటే విమానాశ్రయానికే ఓటు వేస్తానని బాపిరాజు అన్నారు. నేనైతే రెండూ రావాలని కోరుకుంటానని బొలిశెట్టి సమాధానం చెప్పడంతో పాటు, నిట్ ఇక్కడికి రాకుండా ఎవరు ఆపుతున్నారో నాకు తెలుసు, నేను మినిస్టర్ మాణిక్యాలరావు, బీజేపీ నేత వీర్రాజు గారితో కలిసి ఢిల్లీ వెళ్లాను. ఆ సమయంలో మంత్రి గంటా శ్రీనివాస్, ఎంపీ హరిబాబుగారు ఢిల్లీలో ఉన్నారు. నాకు జరుగుతున్న తతంగం తెలుసని బొలిశెట్టి అనడంతోపాటు బాబుగారికి ఏలూరులో నిట్ ఏర్పాటు చేయడమంటే ఆసక్తి ఉందేమోనని అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలా మాట్లాడండి. ఒంటెత్తు పోకడలతో నడిచే నాయకులు కూడా ప్రయాణం చేయకండి అని బాపిరాజు అనడంతో మాటామాటా పెరిగింది. దీంతో బాపిరాజు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వీరి వాగ్వాదాన్ని కొందరు రికార్డు చేసి పార్టీ నేతలకు వినిపించడంతో విషయం నియోజకవర్గమంతా వ్యాపించింది. దీనిపై మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్‌తో మాట్లాడగా.. తాడేపల్లిగూడెంకు నిట్ రావాలి. ఇక్కడి ప్రజలు నమ్మి మమ్మల్ని గెలిపించారు. నిట్ తేవడానికి మంత్రి మాణిక్యాలరావు కష్టపడుతున్నారు. వచ్చిన అవకాశం వదులుకునేది లేదు. అవసరమైతే పదవీ త్యాగానికైనా సిద్ధపడతా కాని గూడెంలో నిట్ ఏర్పాటు అవుతుంది. మంత్రి కృషి ఫలిస్తుంది ఎవరు అడ్డుపెట్టినా ఆగదు 24 గంటలు ఆగితే నిట్ ఎక్కడో తేలిపోతుందని అని చెప్పారు.