ఇక పరిషత్‌ పోరు..!  | ZP Chairman Elections Telangana | Sakshi
Sakshi News home page

ఇక పరిషత్‌ పోరు..! 

Published Mon, Feb 4 2019 9:54 AM | Last Updated on Mon, Feb 4 2019 9:54 AM

ZP Chairman Elections Telangana - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులను మరో ఆర్నెల్లు కొనసాగిస్తుండడంతో వాయిదా పడ్డాయి. ఓ వైపు పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియ సాగుతుండగా.. ఆ వెంటనే మండల, జిల్లా ప్రాదేశిక, పరిషత్‌లు, మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి త్వరలోనే పరిషత్‌లు, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. బహుశా మే, జూన్‌లో నిర్వహించవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్నికలు ఏప్రిల్‌లో పూర్తయితే ఆ వెంటనే మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పార్లమెంట్‌ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన జిల్లా అధికారులు.. ఆ ఏర్పాట్లను కూడా పూర్తిచేయాలన్న ఆదేశాల మేరకు కసరత్తు ప్రారంభించారు. దీంతో రాజకీయ పార్టీల్లో స్థానిక సంస్థల హడావుడి మళ్లీ మొదలైంది.

పరిషత్, మున్సిపల్‌ ఎన్నికలపై మొదలైన రాజకీయ సందడి
ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో మళ్లీ స్థానిక ఎన్నికల చర్చ జోరందుకుంది. ఇటీవల మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 313 గ్రామ పంచాయతీలకు 208 పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు విజయం సాధించారు. 39 చోట్ల కాంగ్రెస్, 11 బీజేపీ, నాలుగు టీడీపీ, మూడు సీపీఐ మద్దతుదారులు గెలుచుకోగా.. 48 పంచాయతీల్లో స్వతంత్రులు, ఇతరులు పాగా వేశారు. ఇదే ఊపులో పార్టీ బ్యానర్‌పై జరిగే మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో పాగా వేయాలని టీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పటినుంచే వ్యూహరచనలో పడ్డారు.

39 పంచాయతీలతోనే సరిపెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో బలం పెంచుకోవాలన్న తపనతో ఉంది. అయితే పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి కలిసి పోటీ చేస్తుందా..? లేక కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐలు ఎవరికీవారుగా పోటీ చేస్తారా? అన్న అంశాలపై ఇంకా స్పష్టత లేదు. అన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఎవరికీవారుగా ఈ ఎన్నికల్లో ఆసక్తి చూపుతున్న అభ్యర్థులతోపాటు ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన వారికి మరోఛాన్స్‌ ఇచ్చి సానుభూతి పొందాలనే కొన్ని పార్టీలు యోచిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ఎన్నికల సంఘం మే, జూన్‌లో పరిషత్, పుర, నగరపాలక సంస్థల ఎన్నికల జరుపుతామని ప్రకటించడంతో ఆయా పార్టీలు మళ్లీ గెలుపుగుర్రాల వేటలో పడ్డాయి.

జిల్లాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు? కొత్త మున్సిపాలిటీలకు ఈసారే..
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మొత్తం 817 మండల ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) స్థానాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా పూర్వ కరీంనగర్‌ నాలుగు జిల్లాలుగా విభజించబడింది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లా 57 పాత మండలాలు, కొత్తగా ఏర్పడిన 16 మండలాలు వెరసి మొత్తం 73 మండలాలు, 7 రెవెన్యూ డివిజన్లుగా ఆవిర్భవించింది. కొత్త జిల్లాల ఏర్పాటైన తొలి దసరా నుంచే జిల్లాలోని 73 మండలాలను మొత్తం ఏడు జిల్లాలకు విభజించారు. 16 మండలాలతో కరీంనగర్‌ జిల్లా మిగలగా.. 13 మండలాలతో సిరిసిల్ల, 18 మండలాలతో జగిత్యాల, 14 మండలాలతో పెద్దపల్లి జిల్లా ఏర్పాటయ్యాయి. ఇవిగాకుండా కొత్తగా ఏర్పడిన భూపాలపల్లి జిల్లాలోకి 5, సిద్దిపేటలోకి 4, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోకి 3 మండలాలను చేర్చారు. ఇక విభజన తర్వాత కరీంనగర్‌ జిల్లా 16 మండలాల్లో మొత్తం 180 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.

ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు మాత్రం 12 ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన ఇల్లందకుంట, గన్నేరువరం, కొత్తపల్లి, కరీంనగర్‌ రూరల్‌ మండలాల్లోని గ్రామాల్లో కూడా ఈ ఎంపీటీసీ స్థానాలే ఉండనున్నాయి. అదేవిధంగా హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల నుంచి సిద్దిపేట, వరంగల్‌ అర్బన్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కలిసిన మండలాలను మినహాయిస్తే 12 మండలాలకే ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఉన్నారు. దీంతో పాత పద్ధతిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడితే ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకే ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్‌ నగరపాలకసంస్థతో పాటు నగర పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారిన హుజూరాబాద్‌కు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీలకు ఈ సారి ఎన్నికలు జరుగుతాయని అధికారవర్గాల సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement