'పుర' పీఠాలపై గులాబీ జెండా | Telangana: Ruling TRS Sweeps Municipal Elections | Sakshi
Sakshi News home page

'పుర' పీఠాలపై గులాబీ జెండా

Published Tue, May 4 2021 1:28 AM | Last Updated on Tue, May 4 2021 4:39 AM

Telangana: Ruling TRS Sweeps Municipal Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరిగిన మినీ మున్సి‘పోల్స్‌’లో టీఆర్‌ఎస్‌ విజయ ఢంకా మోగించింది. గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు.. సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డులు గెలుచుకుని ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. అన్నిచోట్లా సగానికి పైగా వార్డులు గెలుచుకోవడం ద్వారా ఎక్స్‌అఫీషియో ఓట్ల అవసరం లేకుండానే.. మేయర్‌/ చైర్‌ పర్సన్‌ పదవులను చేజిక్కించుకోబోతోంది. మొత్తంగా ఏడు పురపాలికల్లో 248 వార్డులకు ఎన్నికలు జరిగితే.. 181 సీట్లను, ఇతర ఐదు పురపాలికల్లోని ఐదు ఖాళీ వార్డులకు జరిగిన ఎన్నికల్లో మరో మూడు సీట్లను గులాబీ పార్టీ దక్కించుకుంది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ కూడా పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాయి. మినీ మున్సి‘పోల్స్‌’కు ఈ నెల 30న పోలింగ్‌ జరగగా.. సోమవారం ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. 

ఓరుగల్లు కోటపై గులాబీ జెండా 
గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 66 వార్డులుండగా.. టీఆర్‌ఎస్‌ ఏకంగా 48 వార్డులను గెలుచుకుని విజయదుందుభి మోగించింది. బీజేపీ 10, కాంగ్రెస్‌ 4, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ 1, స్వతంత్రులు 3 వార్డులను గెలుచుకున్నారు. ఇక్కడ 2016లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 44 వార్డులు గెలవగా, కాంగ్రెస్‌ 4, బీజేపీ 1, సీపీఐ 1, స్వతంత్రులు 8 వార్డుల్లో గెలిచారు. ఈసారి టీఆర్‌ఎస్‌ 48 సీట్లు గెలుచుకుంది. బీజేపీ బలం పెంచుకోగా, కాంగ్రెస్‌ తన సీట్లను నిలుపుకొంది. ఇక గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ గుండు సుధారాణి పేరును పార్టీ అధిష్టానం ఇదివరకే ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 29వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన ఆమె త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని అంటున్నాయి. 

ఖమ్మంలోనూ హవా.. 
ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 60 వార్డులుండగా.. టీఆర్‌ఎస్‌ 57, మిత్రపక్షం సీపీఐ 3 డివిజన్లలో బరిలోకి దిగాయి. టీఆర్‌ఎస్‌ 43 డివిజన్లు, సీపీఐ రెండు డివిజన్లను కైవసం చేసున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులను గులాబీ పార్టీనే కైవసం చేసుకోనుంది. కాంగ్రెస్‌ 48 డివిజన్లలో పోటీ చేసి 10 డివిజన్లు.. సీపీఎం 9 డివిజన్లలో పోటీ చేసి రెండు డివిజన్లు గెలుచుకున్నాయి. ఇండిపెండెంట్లు 2 చోట్ల విజయం సాధించారు. ఏకంగా 47 డివిజన్లలో బరిలోకి దిగిన బీజేపీ.. కేవలం ఒక్క డివిజన్‌తోనే సరిపెట్టుకుంది. బీజేపీ పొత్తుతో పోటీ చేసిన జనసేన 6 డివిజన్లలో బరిలో నిలిచినా ఒక్కసీటూ గెలవలేదు. ఇక్కడ టీఆర్‌ఎస్‌లో మేయర్‌ పీఠం ఎవరికి దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 

మున్సిపాలిటీల్లోనూ  
తొలిసారి ఎన్నికలు జరిగిన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 27 వార్డుల్లో 23 టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు రెండు సీట్ల చొప్పున దక్కించుకున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు.. 13 చోట్ల టీఆర్‌ఎస్, ఆరు చోట్ల కాంగ్రెస్‌ గెలవగా బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మున్సిపాలిటీలోని 20 వార్డులకు టీఆర్‌ఎస్‌ 11 గెల్చుకోగా.. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మద్దతుదారులు (ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి పోటీచేసి) ఆరుగురు విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్‌ ఒకరు గెలుపొందారు. ఇండిపెండెంట్‌ అభ్యర్ధి కందాల భిక్షంరెడ్డి టీఆర్‌ఎస్‌ క్యాంపులోకి వెళ్లిపోవడంతో చైర్మన్‌ పీఠం టీఆర్‌ఎస్‌కే దక్కనుంది. 

జీహెచ్‌ఎంసీలోని లింగోజిగూడ డివిజన్‌లో కాంగ్రెస్‌ గెలుపు 
జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌ (18వ వార్డు)కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఆకుల అఖిల్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి 1,272 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మొత్తం 13,591 ఓట్లు పోలవగా.. కాంగ్రెస్‌కు 7,240 ఓట్లు, బీజేపీకి 5,968 ఓట్లు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ నుంచి గెలిచిన ఆకుల రమేశ్‌గౌడ్‌ (బీజేపీ) అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. రమేశ్‌గౌడ్‌ కుటుంబ సభ్యులు, బీజేపీ నేతల విజ్ఞప్తి మేరకు టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికలో పోటీకి దూరంగా ఉంది. 

ఆ ఐదింటిలో మూడు.. 
రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదు మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న ఐదు వార్డులకు కూడా సోమవారం ఫలితాలు వచ్చాయి. గజ్వేల్‌ మున్సిపాలిటీలోని 12వ వార్డును, నల్లగొండ మున్సిపాలిటీలోని 26వ వార్డు, బోధన్‌ మున్సిపాలిటీలోని 18వ వార్డును టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుచుకున్నారు. పరకాల మున్సిపాలిటీలోని 9వ వార్డును బీజేపీ, జీహెచ్‌ఎంసీలోని 18వ వార్డు (లింగోజిగూడ)ను కాంగ్రెస్‌ గెలుచుకున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement