థియేటర్ల తీరే వేరు.. | Don't Collected Parking Charges In Cinema Halls Mahabubnagar | Sakshi
Sakshi News home page

థియేటర్ల తీరే వేరు..

Published Sat, Feb 9 2019 7:45 AM | Last Updated on Sat, Feb 9 2019 7:45 AM

Don't Collected Parking Charges In Cinema Halls Mahabubnagar - Sakshi

స్టాల్‌లో ధరలు పరిశీలిస్తున్న మున్సిపల్‌ కమిషనర్, తహసీల్దార్‌

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంతో పాటు ముఖ్య పట్టణాల్లోని సినిమా థియేటర్లలో జరుగుతున్న తంతు తెలిసినా అధికారులు ఎందుకో కానీ ఇంతకాలం మామూలుగా తీసుకున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చూద్దాం అన్నట్లు వారు వ్యవహరించిన తీరుతో థియేటర్ల బాధ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉల్లాసం, ఉత్సాహం కోసం సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు పార్కింగ్‌ రుసుము వసూలు చేయడంతో పాటు తినుబండారాలను ధరలు పెంచి మరీ అమ్ముతుండడంతో ప్రేక్షకులు ఆవేదనకు లోనవుతున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ శుక్రవారం అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా కేంద్రంలోని పలు థియేటర్లలో మునిసిపల్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి పార్కింగ్‌ రుసుము వసూలు చేయొద్దని ఆదేశించడంతో పాటు తినుబండారాల అమ్మకాలను పరిశీలించారు. అయితే, ఎవరో ఫిర్యాదు చేస్తే తప్ప   తనిఖీలు చేయడం కాకుండా తరచుగా పరిశీలించాలని ప్రేక్షకులు కోరుతున్నారు.
 
ఎన్నో నిబంధనలు.. అన్నీ పక్కకే.... 
సినిమా థియేటర్లలో వాహనాలకు పార్కింగ్‌ చార్జీ వసూలు చేయొద్దని.. తినుబండారాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించడమే కాకుండా మలమూత్ర  విసర్జన శాలలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే, థియేటర్ల బాధ్యులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంతో ప్రేక్షకులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సినిమా థియేటర్లలోకి అడుగుపెట్టింది మొదలు బయటకు వెళ్లే వరకు పలు రకాలుగా దోచుకుంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్కింగ్‌కు చార్జీ వసూలు చేయొద్దని.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు పలుమార్లు హెచ్చరికలు చేసినా జిల్లా కేంద్రంలోని థియేటర్లలో మాత్రం పరిస్థితి మారడం లేదు. ఇక తినుబండారాలపై ఎమ్మార్పీ ముద్రించి అదే ధరకు విక్రయించాల్సి ఉండగా తమకు ఇష్టమైన ధరలు నిర్ణయించి దోపిడీ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు ఇంతకాలం పట్టించుకోలేదు.

రెండు శాఖల సంయుక్త ఆధ్వర్యాన.. 
మహబూబ్‌నగర్‌ అర్బన్‌ తహసీల్దార్‌ వెంకటేశం, మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌ సంయుక్త ఆధ్వర్యాన తమ సిబ్బందితో కలిసి శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు సినిమా థియేటర్లలో తనిఖీలు చేశారు. తినుబండారాలకు అధిక ధరలు తీసుకోవడం, పార్కింగ్‌ చార్జీలు వసూలు చేస్తున్నట్లు గుర్తించి యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నియమ, నిబంధనలను విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ వెంకటేశం మాట్లాడుతూ సినిమా థియేటర్ల యజమానులు పార్కింగ్‌ చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. పార్కింగ్‌ చార్జీలు వసూలు చేయొద్దని, తినుబండారాలు ఎమ్మార్పీకే విక్రయించాలే తప్ప అధిక ధరలు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో గిర్దావర్‌ క్రాంతికుమార్‌గౌడ్, ఏసీపీ విద్యాసాగర్, పీపీఓ ప్రతాప్‌ తదితరులు ఉన్నారు. 

పార్కింగ్‌ రుసుము వసూలు చేయొద్దు : జేసీ 

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: సినిమా హాళ్లు, వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్‌ రుసుము వసూలు చేయొద్దని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో శుక్రవారం రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాణిజ్య సంస్థలు, సినిమాహాళ్ల యాజమాన్యం నడుచుకుంటున్నాయా, లేదా అని తరచూ తనిఖీ చేయాలని సూచించారు. జిల్లాలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, జడ్చర్ల, భూత్పూర్, కోస్గి ప్రాంతాల్లో ఉన్న సినిమా హాళ్లలో పార్కింగ్‌ రుసుము తీసుకోకుండా చూడాలన్నారు. అలాగే, థియేటర్లలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఒక బోర్డును ఏర్పాటు చేసి రెవెన్యూ, పోలీస్, మున్సిపల్‌ శాఖల అధికారుల ఫోన్‌ నెంబర్లు పొందుపర్చేలా సూచనలు ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ క్రాంతి, డీఎస్పీ గిరిబాబు, ఆర్డీఓలు శ్రీనివాస్, శ్రీనివాసులు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న జేసీ వెంకట్రావు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement