జూలూరుపాడు: ఖాళీ బిందెలతో రాస్తారోకో చేస్తున్న మహిళలు
జూలూరుపాడు : తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మహిళలు గుండెపుడి గ్రామంలో ఆందోళనకు దిగారు. గుండెపుడితండా ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకం పబ్లిక్ ట్యాప్‌ను ఓ వ్యక్తి పగలగొట్టి తీసివేయడంతో మూడు రోజుల నుంచి సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి సమస్య తలెత్తింది. దీంతో తండా ప్రజలకు తాగడానికి బిందెడు నీళ్లు దొరకపోవడంతో ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని మహిళలు భీష్మించుకొని కూర్చున్నారు. ఈఓపీఆర్‌డీ జగదీశ్వరరావు, ఏఎస్సై కృష్ణారావు, పోలీసు సిబ్బంది వచ్చి ఆందోళన విరమించాలని కోరినా మహిళలు అంగీకరించలేదు.
సర్పంచ్ రావాలి, తాగునీటి సమస్య పరిష్కరించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మండుటెండను సైతం మహిళలు లెక్క చేయకుండా రోడ్డుపై ధర్నా కొనసాగించారు. సమస్యను పరిష్కరిస్తానని సర్పంచ్ విజయనిర్మల హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. రాస్తారోకో సుమారు గంటకు పైగా జరగడంతో జూలూరుపాడు–చండ్రుగొండ మధ్య వాహనాల రాకపోకలు నిలిచి పోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
పాల్వంచలో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయింపు
పాల్వంచ : పట్టణంలోని తెలంగాణనగర్ కాలనీలో మంచినీరు రావడం లేదని, తక్షణం అధికారులు స్పందించి తాగునీరు అందించాలని కాలనీ మహిళలు ఆందోళన చేశారు. శుక్రవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ముందు మహిళలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లా డుతూ వేసవికాలంలో తాగునీరు లేక అల్లాడి పోతున్నామని, మున్సిపాలిటీ నుంచి పంపించే ట్యాంకర్లు ఒకరోజు వస్తే మరొక రోజు రావడం లేదన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల కోసం మంచినీటి పైపులైన్ల జాయింట్లు తొలగించారని, వీటిని నాలుగు నెలలుగా అమర్చక పోవడంతో మంచి ఎద్దడి ఏర్పడిందని అన్నారు. కార్యక్రమంలో కొంగ ఉమ, ఉస్సేన్‌బీ, రాధ, వెంకటరమణ, శకుంతల, మల్లిక పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment