Omicron Variant: What You Need to Know, Masks Offer Protection Against All Variants - Sakshi
Sakshi News home page

Omicron Variant: అలసత్వం వద్దు... అప్రమత్తత ముద్దు

Published Wed, Dec 8 2021 12:45 PM | Last Updated on Wed, Dec 8 2021 1:03 PM

Omicron Variant: What You Need to Know, Masks Offer Protection Against All Variants - Sakshi

మొదటి, రెండో కరోనా వేవ్‌ నుంచి బయటపడ్డామని ఊరటగా ఉంటున్న సమయంలో మూడో వేవ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరి యంట్‌తో కరోనా విజృంభించడం, అక్కడ నుండి వివిధ దేశాలకు విచ్చేసిన ప్రయాణికుల ద్వారా విస్తరిస్తుండటంతో ఆందోళన మొదలయింది.  ఈ ప్రమాదకర వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాపించే రకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. పలు దేశాలలో గంటగంటకు  ఆంక్షలు పెరుగుతున్నాయి. 

పలు దేశాలను హడలెత్తిస్తున్న ఒమిక్రాన్‌ మనదేశంలోనూ అడుగుపెట్టింది. దీన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రిస్క్‌ దేశాలనుంచి వచ్చే వారందరికీ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను తప్పనిసరి చేశారు. పాజిటివ్‌ వచ్చిన వారిని ఆస్పత్రులకు తరలిస్తారు, నెగిటివ్‌ వచ్చిన వారిని కూడా వారం రోజుల పాటు హోమ్‌ క్వారంటైన్‌కు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ప్రారంభమైంది. ప్రజలందరూ తప్పకుండా రెండు డోసులు టీకా వేసుకోవాలని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి. (చదవండి: విద్యార్థులు బలిపశువులు కారాదు!)

తెలంగాణలో అర్హులైన వారిలో 90 శాతానికి పైగా మొదటి డోసు టీకా వేసుకున్నారని 47 శాతం మందికి పైగా రెండు డోసులు వేసుకున్నారని, ఇంకా 80 లక్షలకు పైగా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. 100% వ్యాక్సినేషన్‌ కోసం ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కానీ ప్రజలలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తుంది. అవసరం ఉన్నా లేకున్నా విచ్చలవిడిగా బయట తిరగడం, మాస్కులు ధరించకుండా, కనీసం భౌతిక దూరం పాటించకుండా, శానిటైజర్‌ల వాడకం కూడా పూర్తిగా తగ్గించి వేశారు. 85 శాతం నుంచి 90 శాతం  వరకు మాస్కులు ధరించకుండా, శానిటైజర్‌లు వాడకుండా  తిరుగుతున్నారు. షాపింగ్‌ మాల్స్‌లో, సినిమాహాల్లో, మార్కెట్లలో, రైల్వేస్టేషన్లు, బస్‌ స్టేషన్లు వంటి జన సమర్థం అధికంగా ఉండే బహిరంగ ప్రదేశాలలో కూడా మాస్కులు ధరించకుండా తిరుగుతున్నారు. (BR Ambedkar: అంబేడ్కర్‌ బాటలో తెలంగాణ)

అన్ని రకాల విద్యాసంస్థలు ప్రారంభమవడం, గురుకుల పాఠశాలలో కూడా భౌతిక తరగతులు నిర్వహిస్తుండటంతో అక్కడ అక్కడ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం మొదలయింది. ఖమ్మం జిల్లా వైరా గురుకులంలో 29 మందికి, రంగారెడ్డి జిల్లా ముత్తంగి లోని బాలికల గురుకులంలో 47 మంది విద్యార్థినిలకు, ఒక ఉపాధ్యాయురాలికి  వైరస్‌ సోకింది. ఇలా జగిత్యాల జిల్లా తాటి పెళ్లి గురుకుల పాఠశాలలో తొమ్మిది మందికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూలూరుపాడు లోని కస్తూరిబా గురుకులంలో ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌ శివారులోని టెక్‌ మహీంద్రా వర్సిటీలో 25 మంది విద్యార్థులకు వైరస్‌ అంటుకున్నది. బాలలు జాతి సంపద, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. వారికి అత్యంత ప్రాముఖ్యత నిచ్చి వారి అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించి పరిరక్షించవలసిన తరుణంలో, మౌలిక వసతుల కల్పన, కోవిడ్‌ నిబంధనలు పాటించకుండా గురుకులాలు ప్రారంభించడంతో విద్యార్థులు వైరస్‌ బారిన పడుతుండడం బాధాకరం.

కరోనా సమసిపోయింది అన్న ఆనందం క్షణాల్లోనే ఆవిరైపోతుంది. చాపకింద నీరులా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది.  ఇంత జరుగుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సంగతిని పట్టించుకోవడం లేదు.  మాస్కులు, శానిటైజర్ల కొనుగోలు తగ్గిపోయిందని, వ్యాపార వర్గాల ప్రయోజనాల కోసం మళ్లీ మూడవ దఫా వైరస్‌ విస్తరిస్తున్నదని, కార్పొరేటు పెత్తందార్లు, పెట్టుబడిదారుల లాబీయింగ్‌ వల్లనే కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రచారం జరుగుతున్నదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో నిజానిజాలు ఎలా ఉన్నా మాస్కుల వాడకం, శానిటైజర్లను ఉపయోగించడం తప్పకుండా కొనసాగించాలి. ఎట్టి పరిస్థితులలోనూ ప్రజలందరూ ఒక దగ్గరికి చేరకూడదు.

కనీస రక్షణ చర్యలు పాటించకుండా అలసత్వాన్ని ప్రదర్శిస్తే రాబోయే 1, 2 నెలలో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం  పొంచి ఉన్నది. అందుకని విధిగా మాస్కులు ధరించి,  శానిటైజర్‌లు ఉపయోగించి,  భౌతిక దూరం పాటించడం చాలా కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ప్రపంచ  దేశాలను గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ నుండి మానవాళిని కాపాడడానికి తక్షణమే కనీస రక్షణ  చర్యలు అవలంబించాలి. ప్రభుత్వాలు, పౌర సమాజం సంబంధిత కార్యనిర్వాహక శాఖలు దీన్ని ప్రతిష్టాత్మకంగా భావించి వైరస్‌ వ్యాప్తి నిరోధానికి  అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది...


- తండ సదానందం

వ్యాసకర్త టీపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు, మహబూబాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement