
కాజీపేట అర్బన్: ప్రతి రంగంలోనూ సమాచార ప్రసారం, దాని భద్రత ఎంతో కీలకం. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీలతో ఈ సమాచారం హ్యాకర్ల చేతిలో పడుతోంది. హ్యాకర్లు ఆ సమాచారంతో తప్పుడు పనులకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో సురక్షితంగా సమాచారాన్ని ప్రసారం చేసేందుకు, తప్పుడు సమాచారాన్ని తొలగించి రక్షణ కల్పించేందుకు వీలయ్యే సరికొత్త అల్గారిథమ్‌ను వరంగల్ నిట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ సురేశ్‌బాబు పేర్ల అభివృద్ధి చేశారు.
‘మోడల్ టు ఎన్‌హాన్స్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్ ద ఫాల్ట్ టాలరెన్స్’అంశంపై పరిశోధన చేసి రూపొందించిన ఈ అల్గారిథమ్‌కు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు కూడా పొందినట్టు ఆయన వెల్లడించారు. గతంలో దేశంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ నెట్‌వర్క్‌లలో హ్యాకర్లు చొరబడి విద్యుత్ సరఫరాను స్తంభింప జేసిన ఘటనల నేపథ్యంలో ప్రత్యేక అల్గారిథమ్ రూపొందించినట్టు తెలిపారు.
అన్ని రంగాల్లో వినియోగించవచ్చు ‘‘పవర్‌గ్రిడ్, టెలీ కమ్యూనికేషన్స్‌తోపాటు అన్ని రంగాల్లో సమాచారాన్ని పూర్తి రక్షణతో ప్రసారం చేసేందుకు నేను రూపొందించిన అల్గారిథమ్‌ను వినియోగించవచ్చు. ఇది సమాచార ప్రసారంలో హ్యాకర్లను గుర్తించి ఆ సమాచారం అందుకోకుండా ఆపుతుంది. సరైన వ్యక్తులను గుర్తించి సమాచారాన్ని ప్రసారం చేసేందుకు తోడ్పడుతుంది..’’అని సురేశ్‌బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment