Algorithm
-
హ్యాకర్ల కంట పడకుండా సమాచార ప్రసారం!
కాజీపేట అర్బన్: ప్రతి రంగంలోనూ సమాచార ప్రసారం, దాని భద్రత ఎంతో కీలకం. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీలతో ఈ సమాచారం హ్యాకర్ల చేతిలో పడుతోంది. హ్యాకర్లు ఆ సమాచారంతో తప్పుడు పనులకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆన్లైన్లో సురక్షితంగా సమాచారాన్ని ప్రసారం చేసేందుకు, తప్పుడు సమాచారాన్ని తొలగించి రక్షణ కల్పించేందుకు వీలయ్యే సరికొత్త అల్గారిథమ్‌ను వరంగల్ నిట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ సురేశ్‌బాబు పేర్ల అభివృద్ధి చేశారు. ‘మోడల్ టు ఎన్హాన్స్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్ ద ఫాల్ట్ టాలరెన్స్’అంశంపై పరిశోధన చేసి రూపొందించిన ఈ అల్గారిథమ్‌కు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు కూడా పొందినట్టు ఆయన వెల్లడించారు. గతంలో దేశంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ నెట్‌వర్క్‌లలో హ్యాకర్లు చొరబడి విద్యుత్ సరఫరాను స్తంభింప జేసిన ఘటనల నేపథ్యంలో ప్రత్యేక అల్గారిథమ్ రూపొందించినట్టు తెలిపారు. అన్ని రంగాల్లో వినియోగించవచ్చు ‘‘పవర్‌గ్రిడ్, టెలీ కమ్యూనికేషన్స్‌తోపాటు అన్ని రంగాల్లో సమాచారాన్ని పూర్తి రక్షణతో ప్రసారం చేసేందుకు నేను రూపొందించిన అల్గారిథమ్‌ను వినియోగించవచ్చు. ఇది సమాచార ప్రసారంలో హ్యాకర్లను గుర్తించి ఆ సమాచారం అందుకోకుండా ఆపుతుంది. సరైన వ్యక్తులను గుర్తించి సమాచారాన్ని ప్రసారం చేసేందుకు తోడ్పడుతుంది..’’అని సురేశ్‌బాబు తెలిపారు. -
ప్రతి కదలికపై నజర్!
లండన్: మన ప్రతి కదలికను స్మార్ట్‌వాచ్‌ల ద్వారా రికార్డు చేసే అత్యాధునిక సాంకేతికతో కూడిన అల్గారిథమ్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రోజువారీ జరిపే ప్రతి చర్యలను ఇది రికార్డు చేస్తుందని, తద్వారా రోజులో ఏ పనికి ఎంత సమయం కేటాయిస్తున్నామన్నది కచ్చితత్వంతో తెలుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న స్మార్ట్‌వాచ్‌ల ద్వారా కేవలం యోగ, పరిగెత్తడం వంటి కొన్ని ఎంపిక చేసిన ప్రత్యేక కార్యకలాపాలు మాత్రమే రికార్డు చేయొచ్చు. అయితే తాము అభివృద్ధి చేసిన అల్గారిథమ్ ద్వారా దంతాలు శుభ్రపరుచుకోవడం, వంట చేయడం వంటి చిన్న చిన్న రోజువారీ ప్రతిచర్యలను సైతం కచ్చితత్వంతో రికార్డు చేయవచ్చని సస్సెక్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు. ‘మానవుడు రోజు వారీ చేసే చర్యలు అమితమైనవి. వాటన్నింటినీ రికార్డు చేయాలంటే ప్రస్తు తం ఉన్న స్మార్ట్‌వాచ్‌లకు సాధ్యపడదు. ఈ సమస్యను అధిగమించేందుకే ఈ అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశాం’ అని ప్రొఫెసర్ జోరేస్కి చెప్పారు. -
చిప్స్ ప్యాకెట్‌కూ చెవులుంటాయి!
న్యూయార్క్: రహస్యమైన విషయాలను మాట్లాడుకునేటప్పుడు.. గోడలకు చెవులుంటాయంటూ నక్కి ఉండేవారిని గూర్చి అంటుంటారు. మరి ఎవరూ నక్కి ఉండకపోయినా, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలూ లేకపోయినా మీరేం మాట్లాడుకున్నా తెలిసిపోతుంది! ఇక ముందు మీరు చిప్స్ తినేసి పక్కన పెట్టిన ఖాళీ ప్యాకెట్, మంచినీళ్ల గ్లాసు, పక్కనే ఉన్న ఒక మొక్క.. ఇలాంటివన్నీకూడా మీరేం మాట్లాడుకున్నారో చెప్పేస్తాయి. ఇందుకు తోడ్పడే అల్గారిథమ్ (ప్రోగ్రామ్)ను అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. సాధారణంగా ధ్వని తరంగాలు.. అన్నిరకాల వస్తువులలో స్వల్పస్థాయిలో ప్రకంపనాలను కలిగిస్తాయి. ధ్వనిలో హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఉండే ఈ ప్రకంపనాలు సాధారణ కంటికి కనిపించవు. కానీ అత్యంత వేగంగా చిత్రీకరించే సామర్థ్యమున్న కెమెరాలతో.. ఆ ప్రకంపనాలను గుర్తించవచ్చు. వీటిని శాస్త్రవేత్తలు రూపొందించిన అల్గారిథమ్ సహాయంతో విశ్లేషిస్తే.. ఆ ధ్వని పునరుత్పత్తి అవుతుంది. దీనిని శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిర్ధారించారు కూడా. తొలుత వారు ఒక ధ్వని చేసి.. ఆ ధ్వనికి ఐదు మీటర్ల దూరంలో ఉన్న చిప్స్ ప్యాకెట్లో కలిగిన ప్రకంపనాలను చిత్రించారు. వాటిని ‘అల్గారిథమ్’తో విశ్లేషించి.. అదే ధ్వని తిరిగి ఉత్పత్తి చేయగలిగారు.