లండన్: మన ప్రతి కదలికను స్మార్ట్‌వాచ్‌ల ద్వారా రికార్డు చేసే అత్యాధునిక సాంకేతికతో కూడిన అల్గారిథమ్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రోజువారీ జరిపే ప్రతి చర్యలను ఇది రికార్డు చేస్తుందని, తద్వారా రోజులో ఏ పనికి ఎంత సమయం కేటాయిస్తున్నామన్నది కచ్చితత్వంతో తెలుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న స్మార్ట్‌వాచ్‌ల ద్వారా కేవలం యోగ, పరిగెత్తడం వంటి కొన్ని ఎంపిక చేసిన ప్రత్యేక కార్యకలాపాలు మాత్రమే రికార్డు చేయొచ్చు.
అయితే తాము అభివృద్ధి చేసిన అల్గారిథమ్ ద్వారా దంతాలు శుభ్రపరుచుకోవడం, వంట చేయడం వంటి చిన్న చిన్న రోజువారీ ప్రతిచర్యలను సైతం కచ్చితత్వంతో రికార్డు చేయవచ్చని సస్సెక్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు. ‘మానవుడు రోజు వారీ చేసే చర్యలు అమితమైనవి. వాటన్నింటినీ రికార్డు చేయాలంటే ప్రస్తు తం ఉన్న స్మార్ట్‌వాచ్‌లకు సాధ్యపడదు. ఈ సమస్యను అధిగమించేందుకే ఈ అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశాం’ అని ప్రొఫెసర్ జోరేస్కి చెప్పారు.