ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి కుండీలను వాడుతుంటాం. ఇంటి అందం కోసం కుండీలను ఏర్పాటు చేసుకున్నా, వాటిలోని మొక్కల ఆలనా పాలనా మనమే చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి మొక్కల ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటే, అవి ఎండిపోయి, చనిపోతాయి. మొక్కల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కనిపెట్టి, అందుకు అనుగుణంగా వాటి బాగోగులను చూసుకోవడం కష్టమే!
ఈ సమస్యను తొలగించడానికే అమెరికన్ కంపెనీ ‘స్మార్టీ ప్లాంట్’ సంస్థ కుండీల్లోని మొక్కల రక్షణ కోసం స్మార్ట్ సెన్సర్‌ను తయారుచేసింది. సెన్సర్ అమర్చిన ఈ స్మార్ట్ కుండీల్లోని మొక్కలకు సునాయాసంగా రక్షణ కల్పించవచ్చు. అవి నిత్యం పచ్చగా కళకళలాడేలా చూసుకోవచ్చు. ఈ కుండీల్లోని స్మార్ట్ సెన్సర్ యాప్ ద్వారా పనిచేస్తుంది. వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ, కుండీలోని మట్టిలోని తేమ, మొక్కల వేళ్లు, కాండంలోని పోషకాల పరిస్థితులను ఎప్పటికప్పుడు యాప్ ద్వారా సమాచారం అందిస్తుంది. దీని ధర 45 డాలర్లు (రూ.3,760) మాత్రమే!
పిల్లల కోసం ఫిట్‌నెస్ వాచీ..
రక్తపోటు, గుండె పనితీరు, శరీరంలో ఆక్సిజన్ స్థాయి వంటి వివరాలను చెప్పే స్మార్ట్ వాచీలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అవన్నీ పెద్దల కోసం రూపొందించినవి. అయితే, అమెరికన్ కంపెనీ ‘ఫిట్‌బిట్’ ప్రత్యేకంగా పిల్లల కోసం ‘ఏస్ ఎల్‌టీఈ’ పేరుతో ఈ ఫిట్‌నెస్ వాచీని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫిట్‌నెస్ ట్రాకింగ్ సెన్సర్లు పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తాయి.
ఆ సమాచారాన్ని యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తాయి. ఈ వాచీని ఫోన్‌లా కూడా ఉపయోగించుకునే వీలు ఉంది. ఇందులోని కమ్యూనికేషన్స్ టాబ్ ద్వారా అవసరమైప్పుడు కాల్స్ చేసుకోవడానికి, మెసేజ్‌లు పంపుకోవడానికి కూడా వీలవుతుంది. ఏడేళ్లకు పైబడిన వయసు గల పిల్లలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ‘ఫిట్‌బిట్’ కంపెనీ చెబుతోంది. దీని ధర 229 డాలర్లు (రూ.19,126) మాత్రమే!
నానోబాక్స్ మినీ డ్రమ్స్..
మృదంగం, తబలా, డ్రమ్స్ వంటి తాళ వాయిద్యాలు లేకుండా సంగీత కచేరీలు పరిపూర్ణం కావు. అయితే, ఈ పరికరాలు కొంచెం భారీగా ఉంటాయి. ఆక్టోపాడ్ వంటి ఎలక్ట్రిక్ డ్రమ్స్ అందుబాటులోకి వచ్చినా, అవి కూడా కొంచెం భారీగా ఉండేవి, స్థలాన్ని ఆక్రమించుకునేవే! అమెరికన్ సంగీత పరికరాల తయారీ సంస్థ ‘1010 మ్యూజిక్’ ఇటీవల డ్రమ్స్‌ను అరచేతిలో ఇమిడిపోయే పరిమాణానికి కుదించి, ‘నానోబాక్స్’ను అందుబాటులోకి తెచ్చింది.
‘రాజ్‌మాటాజ్’ పేరుతో రూపొందించిన ఈ మినీ డ్రమ్స్‌ను మిగిలి ఎలక్ట్రానిక్ సంగీత పరికరాల్లాగానే వాడుకోవచ్చు. ఈ ‘నానోబాక్స్’ పొడవు 3.75 అంగుళాలు, మందం 1.5 అంగుళాలు, వెడల్పు 3 అంగుళాలు. ఇందులోని 64 స్టెప్ సీక్వెన్సర్ ఔత్సాహికుల సాధనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ నానోబాక్స్‌కు ఉన్న టచ్‌స్క్రీన్ ద్వారా కోరుకున్న ధ్వనులను, శబ్దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీని ధర 399 డాలర్లు (రూ.33,327) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment