అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం అని ఒక సినిమా పాట ఉంది. అదెంత నిజమో ఆరోగ్యమే ఆనందం అనడం కూడా అంతే నిజం. ఇంకా చెప్పాలంటే అందంగా ఉండేవాళ్లు ఆరోగ్యంగా ఉంటారో లేదో చెప్పలేం కానీ, ఆరోగ్యంగా ఉండేవాళ్లు మాత్రం ఆటోమాటిగ్గానే అందంగా కనిపిస్తారు. అందం మన శరీర ఆకృతి మీద ఆధారపడితే, ఆకృతి అనేది శరీర పోషణ మీద, ఆహారపు అలవాట్లమీద, జీవన శైలి మీదా ఆధారపడి ఉంటుంది. శరీర పోషణ మీద తగిన శ్రద్ధ చూపిస్తూ, క్రమబద్ధం గా వ్యాయామాలు చేస్తూ ఉంటే ఎప్పుడూ అందంగా ఆరోగ్యంగా యవ్వనంగా కనిపిస్తారు. అదెలాగో చూద్దాం.
ఆహారం విషయంలో... శరీరాకృతి విషయంలో క్రమశిక్షణను పాటిస్తే దీర్ఘకాలం పాటు ఎవరికి వాళ్లు మేలు చేసుకున్న వాళ్ళవుతారు. ముందు నుంచి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. జబ్బులేమీ జోలికిరావు. మీరు ఏమి తింటున్నారు, ఎలా జీవిస్తున్నారు అన్నదాని మీద మీరు ఎలా కనిపిస్తున్నారు, ఎలా ఫీలవుతున్నారనేది ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా వుంటే ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు.
మీ శరీరపు బ్యాటరీని రీఛార్జ్ చేయటానికి, మీ కండరాలలో శక్తిని పెంపొందించటానికి, జబ్బుల్నుంచి దూరంగా ఉండటానికి పెద్దగా కష్టపడిపోవాల్సిన పనేం లేదు. కొద్దిపాటి ఆరోగ్య సూత్రాల్ని పాటిస్తే చాలు. అవేంటో చూద్దామా?
తీసుకునే ఆహారంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవటం, ఎక్సర్‌సైజుల్ని చేయటానికి సమయాన్ని కేటాయించటం, జీవితపు వొత్తిడిల నుంచి రిలాక్స్ కావటానికి ప్రయత్నించటం వంటివి చాలు.
ఆరోగ్యంగా తినాలి..
మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి కొవ్వు కూడా అవసరమే. అయితే మనలో చాలామంది శరీరానికి అవసరమైన దానికంటే 30 శాతం కొవ్వును అధికంగా కలిగి ఉంటున్నారని ఒక అంచనా. అలాంటి హెచ్చుతగ్గుల్ని నివారించటం కోసం ఆహారంలో సమతుల్యాన్ని పాటించటం చాలా అవసరం. ఇందుకోసం...
– రోజూ మీరు తీసుకునే కాయగూరల్లో, ఆకుకూరల్లో వైవిధ్యాన్ని పాటించాలి.
– కాఫీ, టీ వంటి వాటి విషయంలో మితాన్ని పాటించడం.
– తాగ గలిగినన్ని మంచినీళ్ళను తాగాలి.
– రోజుకు 900 కాలరీల లోపుగల ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యత..
శరీరం తగినంత ఫిట్‌నెస్‌లో ఉంటే అనారోగ్యం తొందరగా దరిచేరదు. బాడీ అలా ఫిట్‌నెస్‌తో ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. ఎక్సర్‌సైజుల మూలంగా గుండె కండరాలు బలపడతాయి. శరీరంలో రక్తసరఫరా సాఫీగా జరుగుతుంది. రక్తంలో కొలెస్టరాల్ తగ్గుతుంది. శరీరం బరువు ఉండాల్సిన రీతిలో ఉంటుంది.
ఇవన్నీ టెన్షన్ తగ్గించే అంశాలు. ఎక్సర్‌సైజులంటే – నడక, సైకిలింగ్, ఈత మొదలైనవి ఏవైనా సరే. దీనిని మాత్రం ్రపోగ్రామును నిదానంగాప్రారంభించాలి. క్రమ క్రమంగా పెంచుకుంటూ పోవాలి. అంతే తప్ప తొందరపడిప్రారంభంలోనే అతిగా చేయకూడదు.
పోషకవిలువలు..
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే 13 ముఖ్య విటమిన్లు, 25 ఖనిజ లవణాలు మనం తీసుకునే ఆహారంలో తగు పరిమాణంలోలభించాలి కాబట్టి సమీకృత ఆహారాన్ని తీసుకోవాలి.
ధూమపానం, మద్యపానాలకు స్వస్తి.. పొగ తాగేవాళ్ళకు, మద్యం సేవించే వాళ్లకు గుండెజబ్బులు, కిడ్నీ వ్యాధులు రావటానికి రెట్టింపు అవకాశాలున్నాయి కాబట్టి ఈ రెండు అలవాట్లూ ఉన్న వాళ్లు వాటిని మానుకోవటం మంచిది.ప్రారంభంలో కొంచెం కష్టం కావచ్చు గాని గట్టిగా సంకల్పించుకుంటే అసంభవం మాత్రం కాదు కదా...
మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి..
రోజుకి అరగంట కాలాన్ని మనస్సు ప్రశాంత పరచుకోవటానికి కేటాయించాలి. మంచి పుస్తకాన్ని చదవటం, ధ్యానం, సంగీతం వినడం వంటి వాటి ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. గతంలో జరిగిన తప్పులు, పొరపాట్లు, అపజయాల గురించి ఆలోచించకుండా భవిష్యత్తుపట్ల ఆశావహ దృక్పథంతో వర్తమానంలో జీవించాలి.
శరీరం చెప్పేది వినాలి..
ఆఖరుగా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం చెప్పే దానిని వినాలి. శరీరం ఏ ఇబ్బందికి గురవుతున్నా – అంటే అస్వస్థతలకు గురవుతున్నా మనకు కొన్ని సూచనలను అందిస్తుంది. జ్వరం, నొప్పి, దగ్గు, వాంతులు, విరోచనాలు, ఇలాంటి లక్షణాల ద్వారా శరీరంఅనారోగ్య సూచనలను వెలువరిస్తుంటుంది. అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు శరీరాన్ని కండిషన్‌లోకి తెచ్చుకోవడం ఎవరికి వారు అనుసరించి తీరాల్సిన కర్తవ్యం.
Comments
Please login to add a commentAdd a comment