
‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అని అందరికి తెలిసిందే. కానీ, గోల్డ్ ఓల్డ్‌గా ఎన్నటికీ మారదన్నట్లు మనిషికి వయసు పైబడినంత మాత్రాన సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఇదే విషయాన్ని నిజం చేస్తూ ఎంతోమంది వృద్ధులు లేటు వయసులోనూ వివిధ రంగాల్లో ఘన విజయాలు సాధిస్తున్నారు. అలాంటి వారిలో కేరళకు చెందిన వేంకటేష్ ప్రభు కూడా ఒకరు.
ప్రస్తుతం సింగపూర్‌లో స్థిరపడ్డ ప్రభు.. పదవీ విరమణ పొందిన తర్వాత అందరిలా ఇంట్లో ఖాళీగా కూర్చోవాలనుకోలేదు. అది గ్రహించిన అతడి కూతురు ఇచ్చిన సలహా మేరకు 58 ఏళ్ల వయసులో పరుగు ప్రారంభించాడు. ఇక అప్పటి నుంచి ప్రభు పరుగు ఆగలేదు. కేవలం 15 సంవత్సరాల్లోనే 50 మారథాన్‌లను పూర్తి చేశాడు.
73 ఏళ్ల వయసులోనూ ఆగకుండా 21 కిలోమీటర్లు పరుగెత్తి అందరినీ ఆశ్చర్యపరచాడు. అంతేకాదు, ఈ వయసులోనూ బాడీబిల్డర్‌లా బరువులెత్తగలడు. ప్రస్తుతం సొంతంగా ఓ ఫిట్‌నెస్ సెంటర్‌ని ప్రారంభించి, తనలాంటి ఎంతోమంది వయో వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు. ఇంతకీ, తన ఆరోగ్య రహస్యం ఏమిటని అడిగితే ‘ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూండటం, మంచి ఆహారం తీసుకోవడమే’ అంటాడు ఈ తాత.