చిప్స్ ప్యాకెట్‌కూ చెవులుంటాయి!
న్యూయార్క్: రహస్యమైన విషయాలను మాట్లాడుకునేటప్పుడు.. గోడలకు చెవులుంటాయంటూ నక్కి ఉండేవారిని గూర్చి అంటుంటారు. మరి ఎవరూ నక్కి ఉండకపోయినా, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలూ లేకపోయినా మీరేం మాట్లాడుకున్నా తెలిసిపోతుంది! ఇక ముందు మీరు చిప్స్ తినేసి పక్కన పెట్టిన ఖాళీ ప్యాకెట్, మంచినీళ్ల గ్లాసు, పక్కనే ఉన్న ఒక మొక్క.. ఇలాంటివన్నీకూడా మీరేం మాట్లాడుకున్నారో చెప్పేస్తాయి. ఇందుకు తోడ్పడే అల్గారిథమ్ (ప్రోగ్రామ్)ను అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. సాధారణంగా ధ్వని తరంగాలు.. అన్నిరకాల వస్తువులలో స్వల్పస్థాయిలో ప్రకంపనాలను కలిగిస్తాయి. ధ్వనిలో హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఉండే ఈ ప్రకంపనాలు సాధారణ కంటికి కనిపించవు.
కానీ అత్యంత వేగంగా చిత్రీకరించే సామర్థ్యమున్న కెమెరాలతో.. ఆ ప్రకంపనాలను గుర్తించవచ్చు. వీటిని శాస్త్రవేత్తలు రూపొందించిన అల్గారిథమ్ సహాయంతో విశ్లేషిస్తే.. ఆ ధ్వని పునరుత్పత్తి అవుతుంది. దీనిని శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిర్ధారించారు కూడా. తొలుత వారు ఒక ధ్వని చేసి.. ఆ ధ్వనికి ఐదు మీటర్ల దూరంలో ఉన్న చిప్స్ ప్యాకెట్‌లో కలిగిన ప్రకంపనాలను చిత్రించారు. వాటిని ‘అల్గారిథమ్’తో విశ్లేషించి.. అదే ధ్వని తిరిగి ఉత్పత్తి చేయగలిగారు.