
వాషింగ్టన్: సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టారిఫ్‌ల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లకు మినహాయింపు ఇచ్చారు. దీంతో వినియోగదారులతో పాటు యాపిల్, శాంసంగ్ వంటి దిగ్గజ సంస్థలకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ గైడ్‌లెన్స్ జారీ చేసింది.
మరోవైపు.. అమెరికా, చైనా టారిఫ్ పోరు మరింత ముదిరిన సంగతి తెలిసిందే. చైనాపై మొత్తం సుంకాలు 145 శాతానికి చేరినట్టు అమెరికా ప్రకటించింది. ఆ మర్నాడే ఆ దేశంపై సుంకాలను 84 నుంచి 125 శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది. చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం నేటి(శనివారం) నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అమెరికా దుందుడుకు చర్యలను దీటుగా ఎదుర్కొంటామే తప్ప వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించింది.
భారత్ సహా ఇతర దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు ట్రంప్ తాత్కాలికంగా పక్కన పెట్టడం తెలిసిందే. చైనాపై మాత్రం సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. 20 శాతం ఫెంటానిల్ సుంకంతో కలిపి అది 145 శాతానికి చేరినట్టు వైట్‌హౌస్ స్పష్టతనిచ్చింది.