ఆ నగరంలో కూడా మత్తు మహమ్మారి..!
► చాప కింద నీరులా విస్తరిస్తున్న కల్చర్
►ఆరు దాటితే ఆరుబయటే పలువురు విద్యార్థులు
►తతంగం అంతా ఆన్‌లైన్‌లోనే..
►‘దాసా’ విధానంతో మహమ్మారి బారిన..!
►ల్యాప్‌టాప్‌లో వినియోగదారులు, విక్రయదారుల చిట్టా..
►పరారీలో ఉన్న ఆ ఐదుగురు ఎవరో..
►కూపీ లాగుతున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
కాజీపేట అర్బన్:
కాజీపేటలోని జాతీయ సాంకేతిక కళాశాల (నిట్)లో డ్రగ్స్ కల్చర్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. పాశ్చాత్య పోకడలకు అలవాటు పడిన విద్యార్థులు సిగరెట్ నుంచి డ్రగ్స్‌కు వాడే స్థాయికి ఎదిగారు. హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చెందుతున్న నగరాన్ని అంతే స్పీడ్‌గా మత్తు మహమ్మారి ముంచెత్తుతోంది. ప్రధానంగా దేశంలోనే ప్రతిష్టాత్మక కళాశాలగా పేరుగాంచిన నిట్‌లో డ్రగ్స్ రాకెట్ పంజా విసురుతోంది. కళాశాలకు చెందిన 2012 బ్యాచ్ విద్యార్థులు గుర్రం ద్వీజి, ఎడ్ల రమేష్ డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ దాడిలో వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో విద్యార్థులను కళాశాలకు పంపేందు కు వారి తల్లిదండ్రులు జంకుతున్నారు.
శీలావతి టు ఎల్ ఏ డీఎల్ డ్రగ్స్..
నిట్ విద్యార్థులు ఫ్యాషన్ అంటూ అలవాటు చేసుకున్న సిగరెట్ నుంచి క్రమక్రమంగా డ్రగ్స్‌కు బానిసవుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు సాయంత్రం ఆరు దాటిందంటే ఆరు బయటే ప్రత్యక్షమవుతున్నారు. కాజీ పేట దర్గా వంద ఫీట్ల రోడ్డులోని పాన్‌షాప్‌లలో గంజాయి సిగరెట్లతో గుప్పుగుప్పు మంటూ అర్ధరాత్రి వరకూ ఎంజాయ్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పోలీసులకు నైట్ పెట్రోలింగ్‌లో పలువురు చిక్కిన సంఘటనలు ఉన్నట్లు వినికిడి. నిట్ విద్యార్థుల్లో కొందరు ఏకంగా రిజ్లా పేపర్‌ను కొనుగోలు చేసి.. శీలావతి అనే గంజాయి వేసి సిగరెట్ రూపంలోకి మార్చి వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో గంజాయి మత్తుతో సరిపెట్టుకోలేని విద్యార్థులు డ్రగ్స్ వైపునకు అడుగులు వేస్తున్నారు.
ల్యాప్‌టాప్‌లో దాగి ఉన్న చిట్టా..
నిట్‌లో లై యాసిడ్ డీ తైలమైడ్ డ్రగ్స్‌తో పట్టుబడ్డ గుర్రం ద్వీజి, ఎడ్ల రమేష్ నుంచి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నా రు. డార్క్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో గోవా నుంచి నగరానికి తెప్పిం చికుంటున్నారని.. నిట్‌లో కోడ్ భాషల్లో వాటి విక్రయాలు కొనసాగిస్తున్నట్లు ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన టాస్క్‌ఫోర్స్ అధికారులు ల్యాప్‌టాప్‌లో దాగి ఉన్న చిట్టాను అన్వేషిస్తున్నారు. నగరంలో ఎంత మందికి విక్రయాలు కొనసాగిస్తున్నారనే సమాచారంపై ఆరాతీస్తున్నారు. దీంతోపాటు డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్న వారిలో పరారీలో ఉన్న ఆ ఐదుగురు ఎవరనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
దాసాతో గోస..
నిట్ కళాశాలలో సుమారు 6,700 మంది విద్యార్థులు వివిధ ఇంజనీరింగ్, ఎంబీఏ, పీహెచ్‌డీ స్కాలర్స్ ఉన్నారు. వీరితోపాటు డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్ అబ్రాడ్ (దాసా) పేరిట ప్రతి ఏడాది విదేశాలకు చెందిన 120 మంది విద్యార్థులకు నిట్‌లో అవకాశం కల్పిస్తున్నారు. వీరిలో చా లా శాతం మంది విద్యార్థులు మత్తుమందులకు అలవాటు పడి ఇతరుల కు అలవాటు చేస్తున్నట్లు సమాచా రం. దాసా విద్యార్థుల హాస్టల్ రూం లలో మద్యం బాటిళ్లు ఉన్నా.. కళా శాల అధికారులు, సిబ్బంది పట్టించుకున్న దాఖలాలు లేవని పలువురు చెబుతుండడం గమనార్హం.
కొరవడిన నిఘా..
నిట్‌లో భద్రతా సిబ్బంది కేవలం ప్రధాన గేట్ వద్దే హల్‌చల్ చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతి లేనిదే ఇతరులను లోనికి రానివ్వకుండా మాత్రమే భద్రత చేపడుతున్నారు. హాస్టళ్లలో గానీ.. విద్యార్థుల క్లాస్‌రూంలలో గానీ ఎటువంటి నిఘా ఏర్పాటు చేయకపోవడంతో డ్రగ్స్ కల్చర్ విస్తరిస్తోంది.