రాతి శిథిలం..అద్భుత తోరణం | Warangal NIT Engineers Rebuilts Ayinavolu Arcade | Sakshi
Sakshi News home page

రాతి శిథిలం..అద్భుత తోరణం

Published Thu, Mar 22 2018 1:24 AM | Last Updated on Thu, Mar 22 2018 1:24 AM

Warangal NIT Engineers Rebuilts Ayinavolu Arcade - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రెండేళ్ల క్రితం.. ముళ్ల పొదలు.. మట్టి దిబ్బలు.. వాటిలోంచి కొద్దిగా బయటకు కనిపిస్తున్న రాళ్లు.. తరచి చూస్తే రాతి శిల్పాలు.. మరికాస్త శోధిస్తే పురాతన తోరణం ఆనవాళ్లు. ఇప్పుడు.. ఠీవిగా, గంభీరంగా నిలుచున్న భారీ తోరణం. ఇంజనీరింగ్‌ నైపుణ్యంతో తిరిగి ప్రాణ ప్రతిష్ట పొందిన పురాతన సంపద. కాకతీయుల కంటే ముందునాటి ఈ తోరణం.. వరంగల్‌ సమీపంలోని చారిత్రక ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయం ముందు ఉంది. పురావస్తుశాఖ అధికారులు, వరంగల్‌ నిట్‌ ఇంజనీరింగ్‌ నిపుణులు ఈ తోరణాన్ని తిరిగి నిర్మించారు.

ఇనుప కడ్డీలతో.. 
తోరణం రెండు స్తంభాలు విరిగి ఉండటంతో ఇనుప కడ్డీలతో జోడించారు. రాతి ముక్కల్లో రంధ్రాలు చేసి.. వాటిలోకి ఇనుపకడ్డీలను దూర్చారు. రంధ్రాలను ఎరల్‌డైట్‌ మిశ్రమంతో నింపి.. రాతి ముక్కలను జోడించారు. కొన్ని రాతి ముక్కలు లభించకపోవడంతో.. అలాంటివి తెప్పించి కలిపారు. మొత్తంగా ఎక్కడా సిమెంటు వాడకుండా తోరణాన్ని పునరుద్ధరించడం గమనార్హం. 

ఓరుగల్లు తోరణాల కంటే కొంత చిన్నగా..
ఓరుగల్లు తోరణాలు 40 అడుగుల కంటే ఎత్తు ఉండగా.. ఐనవోలు తోరణాలు 30 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఓరుగల్లు తోరణాల పైభాగంలో రెండు చివరల్లో హంస ఆకృతి ఉండగా.. వీటిలో లేదు. వేలాడుతున్న కలశాల ఆకృతులు మాత్రం ఉన్నాయి. ఇక శిల్ప నైపుణ్యం, నగిషీలు కొంత తక్కువగా ఉన్నాయి. 

పురాతన ఆలయమిది
ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయ ప్రస్తావన క్రీస్తుశకం 1007 నాటి నుంచే ఉంది. పున్నాల శాసనంలో దీని ప్రస్తావన కనిపించింది. క్రీస్తుశకం 1118 నాటి విక్రమాదిత్య శాసనం, 1163 నాటి రుద్రదేవుడి శాసనం, 1369 నాటి రేచర్ల వెలమరాజు అనపోతనాయకుడి శాసనాల్లోనూ ఈ ఆలయ ప్రస్తావన ఉంది. అంటే ఆలయ నిర్మాణ సమయానికి కాస్త అటూఇటుగా ఈ తోరణాలు ఏర్పాటు చేసి ఉంటారని చరిత్రకారులు పేర్కొంటున్నారు.

ఓరుగల్లు తోరణాల కంటే ముందే..
వరంగల్‌ కోటలో ఆనాటి వైభవానికి సాక్ష్యంగా భాసిల్లుతున్న కాకతీయ తోరణాలు అందరికీ తెలిసినవే. అప్పట్లో అక్కడ పెద్ద శివాలయం ఉండేదని, దానికి నాలుగువైపులా ద్వారాలుగా తోరణాలు ఏర్పాటు చేశారని చారిత్రక ఆనవాళ్లు చెబుతున్నాయి. అదే తరహాలో అంతకన్నా వందేళ్ల ముందు అంటే క్రీస్తుశకం 1000వ సంవత్సరం సమయంలో.. ఐనవోలులో మల్లికార్జునస్వామి దేవాలయాన్ని నిర్మించినట్లు అంచనా. ఈ దేవాలయానికి తూర్పు, దక్షిణ, ఉత్తర దిశల్లో మూడు ద్వారాలున్నాయి. వాటికి ఎదురుగా తూర్పు, దక్షిణ దిశల్లో రెండు తోరణాలు ఉన్నాయి. ఉత్తర ద్వారంవైపు మాత్రం తోరణం లేదు. కానీ 2016లో స్థానికులు మట్టిదిబ్బలు, ముళ్ల పొదల్లో ఆ తోరణానికి సంబంధించిన శిథిలాలను గుర్తించారు. దానికి పునర్వైభవం తేవాలని నిర్ణయించిన పురావస్తుశాఖ సంచాలకురాలు విశాలాచ్చి.. వరంగల్‌ నిట్‌ మాజీ ప్రొఫెసర్‌ పాండురంగారావు, ప్రస్తుత ప్రొఫెసర్ల సహాయంతో తోరణాన్ని తిరిగి నిర్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement