జేఈఈ కటాఫ్‌ మార్కులు పెరిగే చాన్స్ | Chance of increasing JEE cutoff marks | Sakshi
Sakshi News home page

జేఈఈ కటాఫ్‌ మార్కులు పెరిగే చాన్స్

Published Wed, Mar 3 2021 4:16 AM | Last Updated on Wed, Mar 3 2021 4:16 AM

Chance of increasing JEE cutoff marks - Sakshi

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి ఫిబ్రవరిలో నిర్వహించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌–2021 ప్రాథమిక ‘కీ’ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. దీనిని అనుసరించి జేఈఈ మెయిన్‌–2021లో కటాఫ్‌ మార్కులు గతంలో కన్నా స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 23నుంచి 26వ తేదీ వరకు కంప్యూటర్‌ ఆధారితంగా ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బీఈ, బీ.టెక్, బీ.ఆర్క్, బీ.ప్లానింగ్‌ కోర్సులకు సంబంధించి నిర్వహించిన ఈ పరీక్షలలో వచ్చిన ప్రశ్నల స్థాయిని అనుసరించి కోచింగ్‌ సెంటర్లు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి. ప్రాథమిక ‘కీ’ కూడా విడుదల కావడంతో కటాఫ్‌ మార్కులపై వేర్వేరు అంచనాలలో తలమునకలవుతున్నాయి.  

అన్ని సెషన్ల పరీక్షలు పూర్తయ్యాకే కటాఫ్‌పై స్పష్టత 
జేఈఈలో కటాఫ్‌ మార్కులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఐఐటీ విద్యాసంస్థల్లోకి ప్రవేశానికి ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధించేందుకు అవసరమైన కటాఫ్‌ మార్కులు. జేఈఈ మెయిన్‌లో అభ్యర్థులు సాధించిన స్కోరును అనుసరించి ఈ కటాఫ్‌ను నిర్ణయిస్తారు. రెండోది ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి జేఈఈ మెయిన్‌ స్కోరును అనుసరించి నిర్ణయించే కటాఫ్‌. ఈ నెల 7వ తేదీలోపు ప్రకటించే తుది ఫలితాలతో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కటాఫ్‌ను ఎన్‌టీఏ ప్రకటిస్తుంది. అయితే, ప్రస్తుతం నాలుగు సెషన్లలో ఫిబ్రవరి సెషన్‌ పరీక్షలలో అభ్యర్థులు సాధించే స్కోరును అనుసరించి మాత్రమే ఈ కటాఫ్,  పర్సంటైల్‌ అంచనాలు వేస్తున్నా మార్చి, ఏప్రిల్, మే సెషన్ల పరీక్షలు ముగిశాక కానీ తుది కటాఫ్‌ తేలదు.

అంతిమంగా మే సెషన్‌ ఫలితాల అనంతరమే దీనిపై ఒక స్పష్టత వస్తుందని అధ్యాపకులు పేర్కొంటున్నారు. ప్రతి సెషన్‌ పరీక్షలకు సంబంధించి తుది ఫలితాలతో పాటే వీటిని విడుదల చేస్తారు. జూన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించి ప్రవేశాల ప్రక్రియను చేపడతారు. ఈ సందర్భంగా అడ్మిషన్ల కటాఫ్‌ను జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ ప్రకటిస్తుంది.  విద్యాసంస్థల వారీగా ఓపెనింగ్, క్లోజింగ్‌ ర్యాంకులను అనుసరించి అడ్మిషన్ల కటాఫ్‌ మార్కులను ప్రవేశాల సమయంలో జోసా విడుదల చేయనుంది. మొత్తం అన్ని సెషన్ల పరీక్షలకు హాజరైన అభ్యర్థులు, అందుబాటులో ఉన్న సీట్లు, పరీక్షల్లో వచ్చే ప్రశ్నల కాఠిన్యత తదితరాలను అనుసరించి తుది కటాఫ్‌ తేలనుంది. ఫిబ్రవరి సెషన్‌కు 6,61,776 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 6,52,627 మంది పరీక్షలు రాశారు.   

ప్రాథమిక ‘కీ’ని అనుసరించి కటాఫ్‌ ఇలా 
ఈసారి కటాఫ్‌ గత ఏడాది జేఈఈ మెయిన్‌ కటాఫ్‌తో పోలిస్తే స్వల్పంగా పెరిగే అవకాçశం ఉందని కార్పొరేట్‌ విద్యాసంస్థ అధ్యాపకురాలు ఒకరు అభిప్రాయపడ్డారు. జనరల్‌ కటాఫ్‌ మార్కులు ఈసారి 90–95 శాతం వరకు ఉండవచ్చన్నారు. రిజర్వుడ్‌ కేటగిరీల్లో కూడా 60 నుంచి 70 శాతానికి పైగా మార్కుల స్కోరు సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 200 వరకు మార్కులు వచ్చే అభ్యర్థి 90–95  పర్సంటైల్‌ సాధించవచ్చన్నారు.  

జేఈఈ మెయిన్‌ వెబ్‌సైట్‌లో ప్రాథమిక కీ 
జేఈఈ మెయిన్‌–2021 ఫిబ్రవరి సెషన్‌ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని జేఈఈ మెయిన్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు ఎన్‌టీఏ పేర్కొంది. ఆన్సర్‌ ‘కీ’, ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల రెస్పాన్సు షీట్లను కూడా అందులో పొందుపరిచింది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను బుధవారం సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో పొందుపర్చవచ్చు. ఛాలెంజ్‌ చేసే ఒక్కొక్క ప్రశ్నకు రూ.200 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రుసుము చెల్లింపునకు బుధవారం సాయంత్రం 6 గంటల వరకు గడువు విధించారు.  

దరఖాస్తుల సమర్పణ, ఉపసంహరణకు అవకాశం 
మార్చి, ఏప్రిల్, మే సెషన్లకు సంబంధించిన జేఈఈ మెయిన్‌కు దరఖాస్తుల సమర్పణ, ఉపసంహరణకు ఎన్‌టీఏ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ సెషన్లకు  ఇంతకుముందు దరఖాస్తు చేసిన వారు ఉపసంహరించుకోవడానికి లేదా తమ దరఖాస్తులో ఏమైనా మార్పులుంటే చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. మార్చి సెషన్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకోదలచిన వారికి రిజిస్ట్రేషన్‌ గడువు ఈ నెల 6వ తేదీ వరకు ఇచ్చింది. మార్చి సెషన్‌కు సంబంధించిన పరీక్షలు 15, 16, 17, 18 తేదీల్లో జరుగుతాయి. దరఖాస్తులను ఈ నెల 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. రిజిస్టేషన్‌ ఫీజును 6వ తేదీ రాత్రి 11.50 గంటలలోపు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్, మే సెషన్లకు సంబంధించి కొత్త దరఖాస్తులు, రిజిస్టేషన్ల ఫీజు గడువును ఆ తరువాత తెలియచేయనున్నట్టు ఎన్‌టీఏ వివరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement