సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలు (జీఎఫ్‌టీఐ)లలో బీఈ/బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ పరీక్షల ఫైనల్ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) బుధవారం ప్రకటించింది. ప్రాథమిక ‘కీ’తో పోల్చితే అం దులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 11 ప్రశ్నలకు జవాబులు మారిపోగా 11 ప్రశ్నలను తొలగించినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. ఈ నెల 8 నుంచి 12 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రం నుంచి 70 వేల మంది సహా దేశవ్యాప్తంగా 8,74,469 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్లను ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ప్రాథమిక ‘కీ’ ప్రకటించి వాటిపై విద్యార్థుల అభ్యం తరాలను స్వీకరించింది. దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేకుండానే ఈ నెల 19న ఫలితాలను (విద్యార్థుల నార్మలైజేషన్ స్కోర్) ప్రకటించింది. అదే రోజు ఫైనల్ ‘కీ’ కూడా వెలువడుతుందని భావించినా ఎన్‌టీఏ దాన్ని బుధవారం ప్రకటించింది. ‘కీ’ని పరిశీలించిన జేఈఈ నిపుణులు ఉమాశంకర్ ప్రాథమిక ‘కీ’, ఫైనల్ ‘కీ’ మధ్య వ్యత్యాసం ఉందని అంచనా వేశారు. దీంతో 11 ప్రశ్నలను తొలగించడంతోపాటు మరో 11 ప్రశ్నలకు సంబంధించిన జవాబుల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. తొలగిం చిన 11 ప్రశ్నలకు ఆయా షిప్ట్‌లలో పరీక్షలకు హాజరైన విద్యార్థులకు మార్కులను కేటాయిం చినట్లు ఎన్‌టీఏ తెలిపింది.
అయితే 8 షిఫ్ట్‌లలో పరీక్షలు రాసిన విద్యార్థుల స్కోర్‌ను నార్మలైజేషన్ చేసి వారి పర్సంటైల్‌ను ఇటీవల ఎన్‌టీఏ ప్రకటించడం తెలిసిందే. దీనిలో భాగంగా 100 పర్సంటైల్‌లో సాధించిన వారు దేశవ్యాప్తంగా 15 మంది ఉన్నట్లు వెల్లడించింది. ఆ ఫలితాలను ఎన్‌టీఏ ఎలా వెల్లడించిందన్న విషయం లో అనుమానాలు నెలకొన్నాయి. ప్రాథమిక ‘కీ’పై ఇచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఫైనల్ ‘కీ’ని సిద్ధం చేసి ఫలి తాలను ప్రకటించిందా లేక వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే ఫలితాలను ప్రకటించిందా? అనే గందరగోళం నెలకొంది.
ఒకవేళ వాటిని పరిగణనలోకి తీసుకోకపోతే ఫైనల్ ‘కీ’ ప్రకారం 100 పర్సంటైల్‌లోకి వచ్చే తెలుగు విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల ప్రకటించిన 100 పర్సంటైల్ విద్యార్థుల్లో తెలుగువారు ఐదుగురు ఉండగా ఆ ఫలితాల్లో ఫైనల్ ‘కీ’ని పరిగణనలోకి తీసుకోకపోతే జరిగిన మార్పు లు, ఫైనల్ ‘కీ’మేరకు చూస్తే మరో 10 మంది వరకు తెలు గు విద్యార్థులు 100 పర్సంటైల్‌లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఇవీ వివిధ షిఫ్ట్‌లలో జవాబుల మార్పు, ప్రశ్నల తొలగింపు..
ఈ నెల 9న జరిగిన మొదటి షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నను తొలగించింది. కెమిస్ట్రీలో ఒక ప్రశ్నకు జవాబును మార్చింది. అలాగే మ్యాథ్స్‌లో ఒక ప్రశ్న కు జవాబును మార్పు చేసింది. అదే రోజు జరిగిన రెండో షిఫ్ట్‌లో ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నల జవాబులను మార్చింది.10వ తేదీన జరిగిన మొదటి షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది. కెమిస్ట్రీలో ఒక ప్రశ్నను తొలగించగా, మ్యాథ్స్ లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయడంతోపాటు ఒక ప్రశ్నను తొలగించింది. అదే రోజు జరిగిన రెండో షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది.
11వ తేదీన మొదటి షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలకు జవాబులను మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది. మ్యాథ్స్‌లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేసింది. అదేరోజు మధ్యాహ్నం జరిగిన రెండో షిప్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది. అలాగే మ్యాథ్స్‌లో ఒక ప్రశ్నను తొలగించింది.12వ తేదీన మొదటి షిఫ్ట్ పరీక్షలో కెమిస్ట్రీలో ఒక ప్రశ్నను తొలగించగా రెండో షిఫ్ట్‌లో ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలను తొలగించింది.
Comments
Please login to add a commentAdd a comment