సాక్షి, అమరావతి: జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్‌కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది. విద్యాసంస్థల సంఖ్య, సీట్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఈ పరీక్షలకు నమోదయ్యే విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగకపోవడం విశేషం. గత పదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది.
లక్ష నుంచి లక్షన్నర వరకు తగ్గుదల
2012లో 12.20 లక్షల మంది, 2014లో 13.56 లక్షల మంది అభ్యర్థులు మెయిన్‌కు నమోదుకాగా 2021లో ఆ సంఖ్య 10.48 లక్షలకు తగ్గిపోయింది. 2018 వరకు మెయిన్స్ పరీక్షను ఏడాదికి ఒకసారే నిర్వహించేవారు. ఈ విధానంవల్ల విద్యార్థులు అటు ఇంటర్ పరీక్షలు, ఆ తర్వాత మెయిన్ పరీక్షలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారు. పైగా ఈ సీట్ల సాధన కోసం అభ్యర్థులు లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకోవడంవల్ల ఏడాదిపాటు నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2019 నుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహించే విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ, 2021లో కరోనావల్ల నాలుగుసార్లు నిర్వహించారు. అయితే.. 2021లో మినహా అంతకు ముందు సంవత్సరాల్లో మెయిన్‌కు నమోదైన విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది.
2012లో 12.20 లక్షల మంది నమోదు కాగా.. 2013లో ఆ సంఖ్య 12.82 లక్షలకు పెరిగింది. 2014లో 13,56,805కు చేరింది. ఆ తర్వాత 2015 నుంచి విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తోంది. 2015లో 13.04,495 మందికి తగ్గగా 2016కు వచ్చేసరికి 11,94,938కి.. 2017లో 11,86,454 మందికి పడిపోయింది. కానీ, 2018లో మాత్రం 12.59 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ 2019నుంచి రెండుసార్లు నిర్వహించేలా జేఈఈ విధానాన్ని మార్చినప్పటికీ అభ్యర్థుల సంఖ్య పెరగకపోగా తగ్గడం విశేషం. 2019లో 9,35,741 మంది, 2020లో 9,21,261 మంది, 2021లో 10,48,012 మంది నమోదయ్యారు.
సీట్లు పెరిగినా పెరగని అభ్యర్థుల సంఖ్య
దేశంలో 2016 నాటికి మొత్తం ఐఐటీలు (23), ఎన్‌ఐటీలు (31), ఐఐఐటీలు (26), జీఎఫ్‌ఐటీ (18)లలో 28,000 సీట్లు ఉండగా అవి 2021 నాటికి 37,952కు పెరిగాయి. ఐఐటీలలో 2016–17లో 10,572 సీట్లు ఉండగా ప్రస్తుతం 16,053కు చేరాయి. పైగా ఐఐటీల్లో మహిళల సంఖ్యను పెంచేందుకు వారికోసం ఆయా సంస్థల్లో సూపర్ న్యూమరరీ కింద 20 శాతం మేర సీట్లు అదనంగా కేటాయిస్తోంది.
హాజరవుతున్న వారూ తగ్గుముఖం
మరోవైపు.. మెయిన్‌కు రిజిస్టర్ అవుతున్న వారి సంఖ్యతో పోలిస్తే పరీక్ష రాస్తున్న వారి సంఖ్య మరింత తక్కువగా ఉంటోంది. లక్ష మందికి పైగా హాజరవ్వడంలేదు.
► 2021లో నాలుగు సెషన్లలో జేఈఈ మెయిన్‌ను నిర్వహించగా దేశవ్యాప్తంగా మొత్తం 10,48,012 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 9,39,008 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
► 2020లో 9,21,261 మంది నమోదు చేసుకోగా 8,69,010 మంది హాజరయ్యారు.
► 2019లో 9,35,741 మందికి గాను 8,81,096 మంది రాశారు.
► 2018లో 12.59 లక్షల మంది నమోదు కాగా 10.50 లక్షల మందే పరీక్షకు హాజరయ్యారు.
► 2017లో 11,86,454 మందిలో 10.20 లక్షల మంది..
► 2016లో 11,94,938కి గాను 11 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు.
► ఇక 2015లో 13,04,495 మందికిగాను 12.34 లక్షల మంది రాశారు.
జేఈఈకి ప్రత్యేకంగా తర్ఫీదు కావలసి ఉండడం, ఐఐటీలు సహ ఇతర సంస్థలు ఎక్కడో దూరంగా ఉండడం, పైగా ఆయా సంస్థలలో ఫీజులను భరించే స్థోమత లేకపోవడంతో ఎక్కువమంది విద్యార్థులు స్థానికంగా ఉండే ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment