
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) తదితర విద్యా సంస్థలలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 పరీక్షకు ఈసారీ ఆటంకాలు తప్పేలా లేవు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జేఈఈ పరీక్షలు ఈ ఏడాది కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడి కానుండడంతో మెయిన్స్ పరీక్షలు ఆ తరువాతే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతంలో జేఈఈ మెయిన్స్ ఏడాదికి ఒకేసారి నిర్వహించగా 2021 నుంచి 4 దశల్లో చేపడుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ ఇచ్చింది. కరోనా వల్ల ఆ పరీక్షలు అక్టోబర్ నాటికిగాని పూర్తికాలేదు. దీని ప్రభావంతో 2021 డిసెంబర్‌లో విడుదల కావలసిన 2022 జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ ఇప్పటివరకు రాలేదు. జనవరిలో విడుదల చేసి ఫిబ్రవరి నుంచి 4విడతల్లో పరీక్షలు నిర్వహించవచ్చని అందరూ భావించారు. అయితే.. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో జేఈఈ మొదటి దశ మార్చి ఆఖరులో నిర్వహించే అవకాశముందని భావిస్తున్నారు. ఆ తర్వాత ఏప్రిల్, మే, జూన్‌లలో మిగిలిన దశలను నిర్వహించి అనంతరం ‘అడ్వాన్స్’ను చేపట్టనున్నారు.
ఈసారి అభ్యర్థులు పెరిగే అవకాశం
జేఈఈకి అభ్యర్థుల సంఖ్య ఈసారి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రెండేళ్లుగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల పరీక్షలు అరకొరగా జరగ్గా అనేక రాష్ట్రాల్లో అసలు జరగలేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యార్థులందరినీ పాస్ చేశారు. సీబీఎస్‌ఈ కూడా కరోనా కారణంగా చదువులు దెబ్బతినడంతో మూల్యాంకనాన్ని సరళతరం చేసింది. ఆ సంస్థల్లోనూ 99 శాతం వరకు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితంగా ఈసారి జేఈఈకి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముంది.
అక్రమాలకు వీల్లేకుండా..
గత ఏడాది జరిగిన పరీక్షల్లో అక్రమాలు జరగడంతో సీబీఐ దర్యాప్తు.. కొందరు కోచింగ్ సెంటర్ల ప్రతినిధుల అరెస్టు.. 20 మంది విద్యార్థుల డిబార్ వంటి ఘటనలు తెలిసిందే. ఈసారి అటువంటి వాటికి తావులేకుండా ఎన్టీఏ పటిష్ట చర్యలు చేపడుతోంది. విద్యార్థులు నాలుగు విడతల్లో ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment