సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో సీట్ల భర్తీకి నిర్వ హించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్సు–2020కు గతంలో కన్నా తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారి నుంచి మెరిట్‌లో ఉన్న 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్సు రాసేందుకు అవకాశం కల్పించారు. అయితే శుక్రవారం రాత్రి గడువు ముగిసే సమయానికి 64 శాతం మందే అంటే.. 1.60 లక్షల అభ్యర్థులు అడ్వాన్సుకు దరఖాస్తు చేశారు. 2019 జేఈఈ మెయిన్ నుంచి అడ్వాన్సుకు 2.45 లక్షల మందిని అర్హులుగా గుర్తించి అనుమతివ్వగా 1.75 లక్షల మంది దరఖాస్తు చేశారు. జేఈఈ అడ్వాన్సులో మంచి స్కోరు సాధిస్తే ఇష్టమైన ఐఐటీలో చేరేందుకు అవకాశం ఉన్నా కూడా 90 వేల మంది పరీక్షకు దూరంగా ఉండటం విశేషం.
► జేఈఈ మెయిన్ పరీక్షల ఫలితాలను ఈనెల 11వ తేదీన ప్రకటించారు. 12 నుంచి 18 వరకు జేఈఈ అడ్వాన్సుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
► జేఈఈ అడ్వాన్సును ఈసారి ఐఐటీ న్యూఢిల్లీ నిర్వహిస్తోంది. 27వ తేదీన ఉదయం పేపర్1, మధ్యాహ్నం పేపర్2 పరీక్ష ఉంటుంది. ఫలితాలు అక్టోబర్ 5 న ప్రకటిస్తారు. ఆరో తేదీ నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ప్రవేశాల ప్రక్రియను ప్రారంభిస్తుంది. ప్రవేశాల షెడ్యూల్‌ను జోసా ఇప్పటికే ప్రకటించింది
► కోవిడ్–19 నేపథ్యంలో ఈఏడాది జేఈఈ అడ్వాన్సు పరీక్షను నిర్వహించే నగరాలు, కేంద్రాల సంఖ్యను పెంచారు. గతేడాది 164 నగరాల్లోని 600 కేంద్రాల్లో నిర్వహించగా, ఈసారి 222 నగరాలు, 1,150 సెంటర్లకు పెంచారు.
► ఈసారి జేఈఈ మెయిన్ కటాఫ్ శాతం ఓపెన్ కేటగిరీలో తప్ప తక్కిన అన్ని కేట గిరీల్లో తగ్గింది. అయినా కోవిడ్ పరిస్థితులు, పరీక్ష సన్నద్ధతకు ఆటంకాల నేపథ్యంలో అడ్వాన్స్‌కు దరఖాస్తులు తగ్గాయని విశ్లేషకులు చెబుతున్నారు. జేఈఈ మెయిన్ ర్యాంకుతో ఎన్‌ఐటీ, ఐఐఐటీల్లో లేదా ఇతర ఎంట్రెన్సు టెస్టుల ద్వారా దగ్గరలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరవచ్చన్న అభిప్రాయంతో అడ్వాన్సుకు దరఖాస్తు చేసి ఉండకపోవచ్చని వివరించారు.
ఎన్‌టీఏ ప్రకటించిన వివరాల ప్రకారం కేటగిరీల వారీగా జేఈఈ మెయిన్–2020 కటాఫ్ ఇలా ఉంది..
► కామన్ ర్యాంక్ జాబితా (సీఆర్‌ఎల్): 90.3765335
► జనరల్–ఈడబ్ల్యూఎస్: 70.2435518
► ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ): 72.8887969
► షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ): 50.1760245
► షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ): 39.0696101
► పిడబ్ల్యూడి: 0.0618524
జేఈఈ అడ్వాన్సుకు తగ్గిన దరఖాస్తులు
Published Sun, Sep 20 2020 4:11 AM | Last Updated on Sun, Sep 20 2020 4:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment