సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, అడ్వాన్స్‌డ్–2022 షెడ్యూల్‌పై విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జేఈఈ షెడ్యూల్‌ను పరీక్షకు ఆరు నెలల ముందుగా ప్రకటించడం ఆనవాయితీ. అయితే కరోనా, తదితర కారణాలతో గత కొన్నేళ్లుగా షెడ్యూల్ ప్రకటనలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్–2022ను ఎప్పుడు నిర్వహిస్తారు? ఎన్ని దశల్లో పరీక్షలుంటాయి? పరీక్ష విధానంలో మార్పులేమైనా ఉంటాయా? అనే సందేహాలు విద్యార్థుల్లో తలెత్తుతున్నాయి.
కరోనాతో అస్తవ్యస్తం..
2019 జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను 2018 జూలై 7న ప్రకటించారు. 2019 జనవరి, ఏప్రిల్‌ల్లో రెండు దశల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఇక 2020 పరీక్షల షెడ్యూల్‌ను 2019 ఆగస్టు 28న ప్రకటించారు. 2020 జనవరిలో మొదటి సెషన్ పరీక్షలు పూర్తి చేసినా.. రెండో సెషన్ ఏప్రిల్ పరీక్షలను కరోనా కారణంగా సెప్టెంబర్‌లో నిర్వహించారు. ఇక 2021 జేఈఈ షెడ్యూల్‌ను 2020 డిసెంబర్ 16న ప్రకటించారు. 2020లో కరోనా కారణంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం పూర్తి కాకపోవడంతో పలువురు అభ్యర్థులు జేఈఈ మెయిన్‌కు హాజరు కాలేకపోయారు.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 2021 జేఈఈ మెయిన్‌ను నాలుగు విడతల్లో.. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) షెడ్యూల్ ఇచ్చింది. ఫిబ్రవరి, మార్చి సెషన్ల పరీక్షలు యథాతథంగా జరిగినా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్, మే సెషన్ల పరీక్షలు ఆలస్యమయ్యాయి. ఈ పరీక్షలు సెప్టెంబర్ 2కి గాని పూర్తికాలేదు. గత మూడేళ్లూ పరీక్షల షెడ్యూల్‌ను డిసెంబర్ మధ్య నాటికే ప్రకటించారు. 2022 జేఈఈ మెయిన్ షెడ్యూల్ మాత్రం ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు.
ఈసారి కూడా నాలుగు విడతలు ఉంటాయా?
జేఈఈ మెయిన్‌ను రెండు విడతలకు బదులు 2021లో నాలుగు విడతల్లో నిర్వహించారు. 2022లో కూడా అదే విధానం ఉంటుందా? ఉండదా? అనే సందేహం వెంటాడుతోంది. నాలుగు విడతల వల్ల 2021లో ఐఐటీ అడ్మిషన్లు చాలా ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలో మార్పులు చేస్తారా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కరోనా కారణంగా ఆయా రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డుల పరీక్షలు ఆలస్యం కావడంతో ఇంటర్ మార్కుల వెయిటేజీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తొలగించింది.
ఈసారి కూడా ఇదే విధానం ఉంటుందా? లేదా అనేదానిపైనా విద్యార్థుల్లో సందేహాలు ఉన్నాయి. ఇలా అనేక అంశాలపై ఆధారపడి పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సి ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మాదిరిగా నాలుగు విడతల్లో జేఈఈ ఉంటే.. ముందు బోర్డు పరీక్షలకు సిద్ధమై తదుపరి జేఈఈకి సన్నద్ధం కావాలని యోచిస్తున్నారు.
జేఈఈ–2022 జాడేది?
Published Fri, Dec 24 2021 2:34 AM | Last Updated on Fri, Dec 24 2021 2:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment