
ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీకి చేయూత
అమెరికాకు చెందిన అప్లయిడ్ మెటీరియల్స్ సంస్థకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ట్రిపుల్ ఐటీ, ఎన్‌ఐటీ సంస్థలను పరిశోధనల్లో భాగస్వాములను చేసుకోవాలని అమెరికాలోని ప్రముఖ కంపెనీ అప్లయిడ్ మెటీరియల్స్‌ను పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. (సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమకు అవసరమయ్యే పరికరాలు, సేవలు, సాఫ్ట్‌వేర్‌ను ఈ సంస్థ సరఫరా చేస్తుంది.) అమెరికా పర్యటనలో భాగంగా కేటీఆర్ శుక్రవారం పలు ఎలక్ట్రానిక్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా అప్లయిడ్ మెటీరియల్స్ సంస్థ సీనియర్ అధికారులతో మాట్లాడుతూ వారిని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. తెలంగాణ నుంచి వెళ్లి అప్లయిడ్ మెటీరియల్స్ సంస్థకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న ఓంకారం నల్లమాసును కేటీఆర్ అభినందించారు. అలాగే ఆ సంస్థ జనరల్ పార్ట్‌నర్‌గా ఉన్న కిట్టూ కొల్లూరి మెదక్ జిల్లావాసి అని తెలిసి అభినందనలు తెలిపారు. అనంతరం బే ఏరియాలో ఎన్నారైలతో ఏర్పాటు చేసిన ములాఖత్‌కు కేటీఆర్ హాజరయ్యారు.
వాటర్‌గ్రిడ్‌పై ఆరా: ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనుల పురోగతిపై అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం ప్రకటించిన విధంగా మూడేళ్లలోపే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఇన్‌టేక్ వెల్స్ నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా స్థాయిలో పనుల సమీక్షకు కలెక్టర్ల ఆధ్వర్యంలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.