23న జేఈఈ మెయిన్ ర్యాంకుల ప్రకటన
- ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్ల
- కేటాయింపునకు షెడ్యూల్ విడుదల
- 24 నుంచి ఆప్షన్లు.. 30న తొలివిడత సీట్ల కేటాయింపు
- వె బ్‌సైట్‌లో వివరాలను వెల్లడించిన ఐఐటీ గువాహటి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను శనివారం ఐఐటీ గువాహటి ప్రకటించింది. ఈ నెల 23న జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకులను వెల్లడించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 24 నుంచి కళాశాలలను, కోర్సులను ఎంచుకునేందుకు ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం కానుంది. 30న తొలిరౌండ్ సీట్ల కేటాయింపు జరగనుంది. తొలిరౌండ్ లో సీటు ఆమోదం కోసం 4 లేదా ఐదు రోజులు గడువు ఇస్తారు. ఆపై ఒకరోజు తర్వాత రెండోరౌండ్ సీట్ల కేటాయింపు జరగనుంది. మొత్తం నాలుగు రౌండ్లలో సీట్ల కేటాయింపునకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. మొత్తం 22 ఐఐటీలు, ఒక ఐఎస్‌ఎం, 31 ఎన్‌ఐటీలు, 18 ఐఐఐటీలు, మరో 18 కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థ ల్లో ప్రవేశానికి సంయుక్త కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) నిర్ణయించిందని ఐఐటీ గువాహటి వెల్లడించింది.
షెడ్యూల్ ఇదీ..
జూన్ 23న: జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకుల ప్రకటన
24 నుంచి 28 వరకు: ఆప్షన్ల ప్రక్రియ
27న : సీట్ల కేటాయింపు నమూనా ప్రదర్శన
30న : తొలిరౌండ్ సీట్ల కేటాయింపు