ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఫీజుల మోత! | Fees sound in the IIT and NIT | Sakshi
Sakshi News home page

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఫీజుల మోత!

Published Sun, Dec 13 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఫీజుల మోత!

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఫీజుల మోత!

♦ ఐఐటీల్లో రూ. 1.45 లక్షలు, ఎన్‌ఐటీల్లో రూ. 95 వేలుగా ఖరారు?
♦ యూజీ కోర్సు ఫీజుల పెంపునకు కేంద్రం సూత్రప్రాయ నిర్ణయం
♦ కేబినెట్ నిర్ణయం తర్వాత అధికారిక ప్రకటన
♦ నాలుగేళ్లకోసారి ఫీజుల పెంపునకు నిర్ణయం
♦ ఫీజు పెంపు అధికారం విద్యా సంస్థలకే అప్పగింత
♦ ఈ సంస్థల్లో ప్రస్తుత ఫీజు వరుసగా రూ. 90 వేలు, రూ. 70 వేలు
 
 సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లలో ఫీజుల మోత మోగనుంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ఫీజులు పెంచాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఐఐటీ విద్యార్థులకు రూ. 1.45 లక్షలు (ప్రస్తుతం రూ. 90 వేలు), ఎన్‌ఐటీ విద్యార్థులకు రూ. 95 వేలు (ప్రస్తుతం రూ. 70 వేలు) ఫీజు ఖరారు చేసినట్లు అత్యున్నత అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే కేంద్ర కేబినెట్ నిర్ణయం తరువాతే ఫీజుల పెంపుపై అధికారిక ప్రకటన ఉంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. పెరిగిన ఫీజులు అమల్లోకి వస్తే నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ పూర్తి చేయడానికి ఎన్‌ఐటీల్లో రూ. 3.80 లక్షలు, ఐఐటీల్లో రూ. 5.80 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. పార్లమెంటు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో లేదా ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో పెరిగే ఫీజులకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.

 భారీగా ఫీజులు ప్రతిపాదించిన ఐఐటీ, ఎన్‌ఐటీలు
 ఏటా కొత్తగా ఎన్‌ఐటీ, ఐఐటీ విద్యా సంస్థలు ఏర్పాటవుతున్న దృష్ట్యా పెరిగిపోతున్న భారాన్ని కొంత మేర విద్యార్థుల నుంచి వసూలు చేయాలంటే ఫీజులు పెంచక తప్పదని కేంద్ర హెచ్‌ఆర్‌డీశాఖ భావించింది. దీనికి అనుగుణంగా దేశంలోని అన్ని ఎన్‌ఐటీలు, ఐఐటీలు ఫీజుల పెంపునకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పిం చాయి. అత్యధికంగా ఐఐటీ ఖరగ్‌పూర్ రూ. 3.25 లక్షలను ఫీజు ప్రతిపాదించగా అతి తక్కువగా ఐఐటీ గౌహతి రూ. 1.75 లక్షలుగా ప్రతిపాదించింది. ఎన్‌ఐటీలు రూ. 1.50 నుంచి రూ. 1.75 లక్షలు ఫీజుగా ఉంటే బాగుంటుందని ప్రతి పాదించాయి.

అయితే ఒకేసారి భారీగా ఫీజులు పెంచితే పేద, దిగువ మధ్య తరగతి విద్యార్థులు అత్యుత్తమ సాంకేతిక విద్యకు దూరమవుతారని కొన్ని ఐఐటీలకు చెందిన డీన్‌లు మానవ వనరుల మంత్రిత్వ శాఖకు సూచించారు. ప్రస్తుతం కేంద్రం ఈ సంస్థలకు వెచ్చిస్తున్న వ్యయం, విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజుకు తేడా చాలా ఉన్నప్పటికీ, దానిని సవరించడానికి ఒకేసారి రెట్టింపు చేసినా ఇబ్బందేనని, ఫీజులకు భయపడి అనేక మంది పేదలు జేఈఈ పరీక్షకు హాజరు కాకపోయే ప్రమాదం ఉందని ఐఐటీ బాంబేకి చెందిన సీనియర్ అధికారి తన నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఫీజులు కొంత మేరకే పెంచాలని హెచ్‌ఆర్‌డీశాఖ నిర్ణయించింది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు ఒకేసారి కాకుండా ప్రతి నాలుగేళ్లకోసారి 25 శాతం చొప్పున ఫీజులు పెంచడం ద్వారా వచ్చే రెండు దశాబ్దాల్లో వ్యయానికీ, ఫీజుల రాబడికి మధ్య తేడా లేకుండా చూడాలని కేంద్రం భావిస్తోంది.

 విదేశాలకు వలసలపై ఆందోళన
 ఐఐటీల్లో బీటెక్ డిగ్రీ పూర్తి చేసిన వారిలో 77 శాతం మంది (2014 బ్యాచ్) విదేశాలకు వెళ్లి అభ్యసిస్తున్నారు. ఏటా రూ. 12 లక్షలు అంతకంటే ఎక్కువ ప్యాకేజీతో ప్లేస్‌మెంట్లలో ఉద్యోగాలు పొందిన వారిలోనూ 63 శాతం మంది అమెరికాలో మాస్టర్ డిగ్రీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు చేసి నాణ్యమైన విద్యను అందించినా దేశానికి పెద్దగా ప్రయోజనం ఉండట్లేదని ఐఐటీలు భావిస్తున్నా యి. ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో డిగ్రీ పూర్తి చేసే విద్యార్థులు విదేశాల్లో లక్షల రూపాయలు ఫీజులు చెల్లిస్తున్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు రాయితీ ఇవ్వాలని ఐఐటీ కాన్పూర్ తన నివేది కలో పేర్కోంది.

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు 2010 నుంచి 60 శాతం కంటే ఎక్కువ మంది విదేశాలకు తరలి వెళ్తున్నారని, వారిలో అందరూ అక్కడే స్థిరపడుతున్నారని మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిశీలనలో వెల్లడైంది.ఈ ఏడాది విదేశాలకు వెళ్లి మాస్టర్ డిగ్రీ చేసే వారి సంఖ్య 80 శాతం దాటొచ్చని చెబుతున్నారు. 2010 నుంచి విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసిస్తున్న వారిలో అత్యధికులు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులే కావడం గమనార్హం. మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో డిగ్రీ పూర్తి చేసిన వారిలో విదేశాలకు వెళ్లి చదువుతున్న వారి సగటు 43%గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement